Ezekiel Explanation Telugu
యెహెఙ్కేలు గ్రంథ వివరణ.
యెహెజ్కేలు అను మాటకు “యెహోవా బలపరచువాడు” అని అర్థం. ఈ గ్రంథాన్ని ప్రవక్తయైన యెహెజ్కేలు వ్రాసాడని క్రీ.పూ. 2వ శతాబ్ద ప్రారంభంలోనే అందరూ అంగీకరించారు. ఇతని తండ్రి బూజీ. వృత్తిరీత్యా ఇతడు యాజకుడు (యెహెజ్కేలు 1:3). అయితే చెరలో నున్న ఇశ్రాయేలీయుల మధ్య ప్రవచించడానికి దేవునిచే ఏర్పరచబడ్డాడు. ఇతడు వివాహితుడు.
ఇతడు క్రీ.పూ. 597వ సంవత్సరం యెహోయాకీను రాజుతో పాటూ బబులోను చెరలోకి వెళ్లాడు (2 రాజులు 24:14). ఆ తర్వాత 5 సంవత్సరాలకు ప్రవక్తగా పేరుపొందాడు. బహుశ అప్పుడు అతని వయస్సు 30 ఏండ్లు ఉండవచ్చును. యూఫ్రటీస్ నది నుండి ప్రవహించే కెబారు నదివద్ద చెరలోనున్న ఇశ్రాయేలీయుల మధ్య ఇతని పరిచర్య కొనసాగింది.
ఈ ప్రదేశం బబులోను పట్టణానికి చాలా మైళ్ళ దూరంలో వుంది. హెబ్రీయుల చరిత్రలోకెల్లా అతిక్లిష్టమైన, గాఢాంధకారమయమైన పరిస్థితులలో అసాధారణమైన సందేశాన్ని అందించడానికి యెహెజ్కేలు పిలువబడ్డాడు. యూదులు బబులోను చెరకు 3 దశలుగా వెళ్లడం జరిగింది.
- క్రీ.పూ. 605 సం॥ దానియేలూ మరికొందరు కొనిపోబడ్డారు.
- క్రీ.పూ. 597 సం॥ రాజైన యెహోయాకీను, యెహెజ్కేలు ఇంకా అనేకులుచెరదీసుకొని పోబడ్డారు.
- క్రీ.పూ. 586 సం॥ చివరిగా యూదా చివరి రాజైన సిద్కియా కొనిపోబడ్డాడు.
అప్పుడు యెరూషలేము పట్టణం మరియు మందిరం సమూల నాశనం చేయబడింది (2రాజులు 25:1-7). యిర్మీయా, యెహెజ్కేలు మరియు దానియేలు సమకాలికులు. ప్రతి ఒక్కరు ప్రత్యేక గుంపు మధ్య పరిచర్య చేయడానికి పిలువబడ్డారు. యిర్మీయా యెరూషలేములో మిగిలిన శేషము మధ్య పరిచర్య చేసాడు. దానియేలు బబులోను దేశంలోని రాజమందిరంలో పరిచర్య చేసాడు. యెహెజ్కేలు కెబారు నదీ తీరంలో చెరలో నున్న వారి మధ్య ప్రవచించాడు. యెహెఙ్కేలు గ్రంథ వివరణ
యెషయా, యిర్మీయా మరియు యెహెజ్కేలును “త్రిత్వపు ప్రవక్తలు” అని పండితులు పిలుస్తారు. ఎందుకంటే – యెషయా దేవుని కుమారుడైన మెస్సీయాను గూర్చి ప్రాధాన్యతనిచ్చాడు. యిర్మీయా – తండ్రియైన దేవుణ్ణి గూర్చి ప్రాధాన్యత నిచ్చాడు మరియు యెహెజ్కేలు – ఆత్మను గూర్చి ప్రాధాన్యతనిచ్చాడు. ఆత్మ అతని మీదకి మరియు అతనిలోకి వచ్చినట్లు, అతన్ని ఎత్తుకొనిపోయినట్లు… కష్టతరమైన అతని పరిచర్యలో అతనికి అనేక విధాల సహాయపడినట్లు పలుమార్లు యెహెజ్కేలు ప్రస్తావించాడు. కాబట్టి యెహెజ్కేలును “ఆత్మ ప్రవక్త” అని కూడా పిలుస్తారు.
యెహెజ్కేలూ, దానియేలూ, యోహానూ ఈ ముగ్గురిని ప్రత్యక్షీకరణ ప్రవక్తలుగా పిలిచారు. ఎందుకంటే, ఈ ముగ్గురు కూడా చెరలో ఉన్నప్పుడే దేవుని ప్రత్యక్షతలు పొంది వాటిని గూర్చి రాశారు. కాబట్టి వీరు రాసిన గ్రంథాలను “ప్రత్యక్షీకరణ గ్రంథాలు” అంటారు.
యెహెజ్కేలు రాసిన గ్రంథం దానియేలు ప్రవచన గ్రంథం వంటిది. దీనిని ఒక మార్మిక గ్రంథం అని అనవచ్చు. అర్థం చేసుకోవడానికి ఇది చాలా కష్ట సాధ్యంగా ఉంటుంది. అలంకారిక భాష ఎక్కువగా వాడబడింది. అయినప్పటికీ ఇందులోని బోధలు అనేకం స్పష్టంగా అత్యంత విలువైనవిగా ఉన్నాయి. యెహెఙ్కేలు గ్రంథ వివరణ
“దేవుడైన యెహోవా” అని 200 సార్లు; “యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు” అని 120 సార్లు; “యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుట” దాదాపు 49సార్లు; “ఆత్మ” అను పదము 25 సార్లు ఈ గ్రంథంలో రాయబడింది.
యెహెజ్కేలు రెండు విధాలుగా పరిచర్య చేసాడు.
మొదటిది – చెరలోని వారికి తమ పాపమును బట్టి కలిగే నాశనమును గూర్చి జ్ఞాపకము చేసాడు. యెరూషలేము నాశనమౌతుందని, శత్రు దేశాలకు తీర్పు తీర్చబడుతుందని చెప్పాడు. ఈ సంగతులు యెహెజ్కేలు గ్రంథం 1 నుంచి 32 అధ్యాయాలలో చాలా వివరంగా రాయబడ్డాయి.
రెండవది – దేవుడు వారికి భవిష్యత్తులో ఇవ్వబోయే ఆశీర్వాదాలను గూర్చి మరియు మందిరం యొక్క పునరుద్ధరణను గూర్చి చెప్పాడు. ఈ విషయాలు 33వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు చెప్పబడ్డాయి. యెషయా “దేవుని రక్షణ”ను గూర్చి; యిర్మీయా “దేవుని తీర్పు”ను గూర్చి; దానియేలు “దేవుని రాజ్యాన్ని” గూర్చి; యెహెజ్కేలు “దేవుని మహిమ” ను గూర్చి ప్రవచించారు.
యెహెజ్కేలు అబద్ద ప్రవక్తలనూ, వారు ప్రజలలో కలిగించిన బూటకపు నిరీక్షణను ఎదుర్కోవలసి వచ్చింది. పాపమూ దాని వినాశనంతో కూడిన దినాలలో ప్రజలలో ఉత్పన్నమైన విభేదాలూ నిరాశ నిస్పృహలను బట్టి వారు అతని సందేశాన్ని పెడచెవిని బెట్టారు. కనుక యెహెజ్కేలు తానే ఉపమానార్థంతో అభినయం చేయడం ప్రారంభించాడు. దేవుని చేతిలో పాత్రధారి అయ్యాడు. ప్రజలు అతని మాటలను వినలేదు గనుక తన చేష్టల ద్వారా వారిని ఆకర్షించాడు. ఇశ్రాయేలును గూర్చి దేవుడు చెప్పిన వాటన్నింటికీ ఇతడు సూచనగా ఉన్నాడు. “యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలుసుకొందురు” (యెహెజ్కేలు 24:24). ఈ బోధనా విధానాన్ని బట్టి అతడు “అభినయ ప్రవక్త”గా లేక “సంజ్ఞల ప్రవక్త”గా పిలువబడ్డాడు. యెహెఙ్కేలు గ్రంథ వివరణ
యెహెజ్కేలు నాటకీయంగా ప్రదర్శించిన సాదృశ్యాలు ఈ గ్రంథంలో మీ దృష్టికి తేవాలని ఆశిస్తున్నాం.
- యెరూషలేము పట్టణపు రూపాన్ని చిత్రించుట – యెహెజ్కేలు 4:1-3.
పట్టణం ముట్టడి వేయబడినట్లు, దాని యెదుట బురుజులను కట్టినట్లు, దిబ్బవేసినట్లు, దాని చుట్టూ ఉన్న ప్రాకారాలను కూలగొట్టు యంత్రాలున్నట్లు చిత్రించాలి. అతనికీ మరియు పట్టణానికీ మధ్య ఇనుపరేకులను గోడగా నిలబెట్టాలి. ఈ గోడ ఛేదింపశక్యముగాని బబులోను సైన్యాన్ని సూచిస్తోంది. దానిని తప్పించు కోవడం అసాధ్యమని ఈ సాదృశ్యం తెలియజేయబడింది.
- ఒకే ప్రక్కన పండుకొనుట – యెహెజ్కేలు 4:4-6.
390 రోజులు ఇశ్రాయేలు వారి దోషాన్ని భరిస్తూ ఎడమ ప్రక్కన; 40 రోజులు యూదా వారి దోషాన్ని భరిస్తూ కుడిప్రక్కన పండుకోవాలి. సంవత్సరమునకు ఒక దినం చొప్పున 430 రోజులు అలా పండుకోవాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలో ఉన్నకాలం కూడా 430 సంవత్సరాలే (నిర్గమ 12:40,41). బహుశ అలాంటి అనుభవమే ఈ చెరకాలంలోను ఉండవచ్చు. అయితే ఉత్తర రాజ్యము అధికంగా దాసత్వాన్ని అనుభవిస్తుందని ఈ నాటకీయ ప్రదర్శనను బట్టి తెలుస్తోంది. యెహెజ్కేలు అలా పండుకున్న దినాలన్నీ తూనిక చొప్పున భోజనం చేయాలి. కొలత ప్రకారం నీళ్ళు తాగాలి. గోధుమలు, యవలు, కాయ ధాన్యాలు, చోళ్లు, సజ్జలు, తెల్లజీలకర్రతో రొట్టెలు చేసి గోమలంతో కాల్చుకొని తినాలి. ఈ సాదృశ్యం -యెరూషలేములో రాబోతున్న ఆహార కొరతను సూచిస్తోంది (యెహెజ్కేలు 4:9-17).
- తల వెంట్రుకలను, గడ్డమును క్షౌరము చేసికొనుట – యెహెజ్కేలు 5:1-4,
యెహెజ్కేలు తన తలను, గడ్డమును క్షౌరము చేసుకొని, ఆ వెంట్రుకలను తూచి మూడు భాగములుగా చెయ్యాలని దేవుడు అతణ్ణి ఆదేశించాడు. పట్టణము ముట్టడి చేసిన దినాలు సంపూర్ణమైనప్పుడు, ఆ వెంట్రుకలలో ఒక భాగాన్ని (1/3 వంతు) పట్టణంలో కాల్చి, రెండవ భాగాన్ని తీసి ఖడ్గము చేత హతము చేయురీతిగా చుట్టూ విసిరికొట్టి, మిగిలిన భాగాన్ని గాలికి ఎగిరిపోనివ్వాలి. అయితే తీసి అగ్నిలో వాటిలో కొన్నింటిని తీసికొని చెంగున కట్టుకోవాలి. అందులో కొన్ని వేసి కాల్చాలి. ఇది వారికి కరువు ద్వారా, ఖడ్గము ద్వారా మరియు చెదరగొట్టబడుట ద్వారా కలిగే శిక్షకు సాదృశ్యంగా వుంది (యెహెజ్కేలు 5:12).
- దేశాంతరము పోవువానివలె సామాగ్రిని మూటకట్టుకొని వెళ్ళుట యెహెజ్కేలు 12:1.
ఇశ్రాయేలీయులు ద్రోహులై కన్నులుండి చూడనివారు, చెవులుండి వినని వారు గనుక వారు చూస్తూ వుండగా యెహెజ్కేలు తన సామాగ్రిని మూటకట్టుకుని గోడకు కన్నము వేసి దానిగుండా బయలుదేరాలి. మూటను భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా ముఖాన్ని కప్పుకోవాలి. నీవు ఏమి చేస్తున్నావని ఇశ్రాయేలీయులు అడిగితే, నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినట్లే మీకు జరుగుతుంది. మీరు చెరలోనికి పోయి దేశాంతర నివాసులు అవుతారని చెప్పాలి. వారిలో ప్రధానుడైనవాడు అనగా రాజైన సిద్కియా ఎలా పట్టబడి, బబులోనులో చనిపోతాడో చెప్పబడింది (12:12 – 14; 2 రాజులు 25: 1 – 7 చదవండి) యెరూషలేము నివాసులు ఆ సమయంలో చింతతో భోజనం చేస్తారని యెహెజ్కేలు సాదృశ్యంగా చేసి చూపించాడు (12:17 -20). యెహెఙ్కేలు గ్రంథ వివరణ
- ఒకే దేశమునుండి రెండు మార్గాలు వచ్చునట్లు చిత్రించుట – యెహెజ్కేలు21:18-23.
బబులోను రాజు ఖడ్గము ఈ రెండు మార్గాల నుంచి వస్తుందని చూపించడానికి ఖడ్గం చేతనున్న హస్తరూపాన్ని, పట్టణపు వీధికొనను గీయాలి. ఖడ్గం నుంచి అమ్మోనీయుల పట్టణమైన రబ్బాకు ఒక మార్గాన్ని, యూదా దేశంలోని యెరూషలేమునకు ఒక మార్గాన్ని గీయాలి. ఈ రెండు పట్టణాలు క్రీ.పూ. 593లో నెబుకద్నెజరుపై తిరుగుబాటు చేసాయి. అతడు రెండు మార్గాల మధ్య నిలుచుండి శకునం చూసినప్పుడు, యెరూషలేమును మొదట ముట్టడి వేయాలని వచ్చింది.
6. కుండను గూర్చిన సాదృశ్యం – యెహెజ్కేలు 24:1-14.
కుండలో నీళ్లుపోసి పొయ్యిమీద పెట్టాలి. మందలో శ్రేష్టమైన గొర్రెలను వధించి వాటి మాంసములో మంచి ముక్కలనన్నిటిని ఎముకలతో సహా అందులో వేయాలి. మాంసమంతా ఊడిపోయేంతగా బాగా ఉడికించి చారు చిక్కగా దింపాలి. ఆ కుండకు అంటిన మష్టు అంతా పోయి వేడియై మెరుగు పట్టు వరకు పొయ్యిమీదనే ఉంచాలి. దేవుని తీర్పు అనే అగ్ని యెరూషలేములోను అందులోని గొప్పవారిని సహితం పూర్తిగా నాశనం చేస్తుందని ఈ సాదృశ్యం తెలుపుతుంది. అందుకు కారణం వారి వారి అపవిత్ర ప్రవర్తనే. దేవుడు పరిశుద్దుడు. దహించు అగ్ని గనుక తన నామమును ధరించి అపవిత్రతకు అప్పగించుకొన్నవారి విషయం తప్పక కఠిన చర్య తీసుకుంటాడు.
- కన్నులకు ఇంపైనది తీసివేయబడుట యెహెజ్కేలు 24:15-27.
ఈ సాదృశ్యాన్ని ఇశ్రాయేలీయులకు చూపించడానికి యెహెజ్కేలు తన భార్యను కోల్పోవలసి వచ్చింది. తన భార్య హఠాత్తు మరణాన్ని గూర్చి అతడు ఏడ్వవద్దని, శిరోభూషణాలు తలమీద నుంచి తీయవద్దని (2సమూయేలు 15:30), పాద రక్షలు విడువవద్దని (యెషయా 20: 2) ఆజ్ఞాపించబడ్డాడు. ఇదంతా ఇశ్రాయేలీయుల కుమారులకు, కుమార్తెలకు జరుగబోయే దానిని గూర్చి సూచింపబడింది (24:21-25). యాజకుడు తన సమీప బంధువుల నిమిత్తం అంగలార్చవచ్చును (లేవీయ 21:1-3). అయితే యెహెజ్కేలు అందుకు అనుమతింపబడలేదు. ఎవరైనా చనిపోయినప్పుడు వారి స్నేహితులు ఆ కుటుంబస్తులకు భోజనం వండి పంపించేవారు (ద్వితీ. 26:14, యిర్మీయా 16:7, హోషేయ 9:4). ఆ భోజనాన్ని కూడా అతడు తినవద్దని దేవుడు చెప్పాడు.
తన భార్య కొన్ని గంటలలో చనిపోబోతున్నదని తెలిసి కూడా యెహెజ్కేలు దేవుని మాటకు లోబడి తన పరిచర్యను కొనసాగించాడు. ఉదయం ప్రజలకు ప్రకటించాడు. సాయంత్రం అతని భార్య చనిపోయింది. మరునాడు ఉదయం దేవుడు చెప్పినట్లు చేసాడు (యెహెజ్కేలు 24:18). యెహెజ్కేలుకు విధింపబడిన కఠిన నియమాలు ఏ ప్రవక్తకు గాని, ఏ యాజకునికి గాని విధించబడలేదు. అయినా యెహెజ్కేలు దేవుని కొరకు అన్నీ భరించాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుటకు తన జీవితాన్నే ఫణంగా పెట్టాడు.
ఈ గ్రంథము నందలి మూల పదము యెహోవా మహిమ అని పైన మనం చెప్పుకున్నాం కదా! చెరలోని యూదుల మధ్య కొందరు అబద్ధ ప్రవక్తలు లేచి యెరూషలేము నాశనము చేయబడదు, త్వరలోనే వారందరు స్వదేశానికి తిరిగి వెళ్తారు అని ప్రకటించుచుండగా యిర్మీయా వారికొక లేఖ రాసాడు (యిర్మీయా 29:3). యిర్మీయా లేఖ ప్రకారము యెహెజ్కేలు వారిని హెచ్చరించాడు. యెరూషలేమునకు తిరిగి వెళ్లుదమని ఆశపడుటకంటే వారు హృదయపూర్వకముగా దేవుని యొద్దకు మళ్లుకోవాలని, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన దేవునికి సంతోషం కలుగునని ప్రకటించాడు. యెహెఙ్కేలు గ్రంథ వివరణ
యెహెజ్కేలు ప్రవచనాలలో కొన్నింటిని మనం యోహాను దర్శనాలలో చూడగలం!
- నాలుగు ముఖములుగల జీవి (యెహెజ్కేలు 1వ అధ్యాయం; ప్రకటన 4వఅధ్యాయం)
- గోగు, మాగోగు (యెహెజ్కేలు 38వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయం)
- 3. పుస్తకం భుజించుట (యెహెజ్కేలు 3వ అధ్యాయం; ప్రకటన 10వఅధ్యాయం)
- నూతన యెరూషలేము (యెహెజ్కేలు 40-48వ అధ్యాయాలు; ప్రకటన21వ అధ్యాయం)
- జీవజల నది (యెహెజ్కేలు 47వ అధ్యాయం; ప్రకటన 22వ అధ్యాయం)
యెహెజ్కేలు ఒక యాజక కుటుంబం నుంచి వచ్చాడు (1:3). అతడి మొదటి 25 సంవత్సరాలు యెరూషలేములోనే గడిచాయి. క్రీ.పూ. 597లో బబులోనుకు చెరగా కొనిపోబడిన కాలంలో అతడు యాజక ధర్మం జరిగించడానికి అవసరమైన శిక్షణలో ఉన్నాడు. సుమారు 5 సంవత్సరాల తర్వాత 30 ఏండ్ల వయస్సులో (1:2-3) యెహెజ్కేలుకు ప్రవచన పరిచర్యకు పిలుపు వచ్చింది. తర్వాత కనీసం 22 సంవత్సరాల పాటు (29:17) ఎంతో నమ్మకంగా అతడు ఈ పరిచర్య జరిగించాడు. దానియేలు చెరగొనిపోయినప్పుడు యెహెజ్కేలు వయస్సు 17 సంవత్సరాలు. యెహెజ్కేలు, దానియేలు ఇద్దరూ కూడా యిర్మీయా ప్రవక్త కాలంలోనే యువ ప్రవక్తలుగా ఉండి అతనిచే ప్రభావితులయ్యారు (దానియేలు 9:2తో పోల్చండి). యెహెజ్కేలు బబులోను చేరినప్పటికే దానియేలు అసామాన్యమైన ప్రవచన జ్ఞానం కలిగిన వ్యక్తిగా అక్కడ గుర్తింపు పొందాడు. తన గ్రంథంలో యెహెజ్కేలు దానియేలును గూర్చి 3 సార్లు పేర్కొన్నాడు (14:14,20; 28:3). యెహెఙ్కేలు గ్రంథ వివరణ
దానియేలు వలె కాక యెహెజ్కేలు వివాహం చేసుకొని (24:15-18) కేబారు నదీతీరాన ఇతడు యూదా ప్రవాసులతో కలిసి ఒక సామాన్య పౌరునిగా నివసించాడు. (1:1; 3:15,24; కీర్తన 137:1లతో పోల్చండి). యెహెజ్కేలు గ్రంథం అమరిక చక్కగా వుంది. దానిలోని 48 అధ్యాయాలను సహజంగా 4 భాగాలుగా విభజింపవచ్చు. 1 నుంచి 3 అధ్యాయాలు మొదటి భాగం – దేవుని మహిమ, ఆయన యొక్క సింహాసనం గురించి యెహెజ్కేలు చూసిన బలవత్తరమైన దర్శనం (1వ అధ్యాయం), దేవుడు ప్రవక్తను ప్రవచన పరిచర్యకై నియమించడం గురించి వివరిస్తున్నది (2,3 అధ్యాయాలు). ఈ గ్రంథంలో చెప్పిన ప్రకారం ప్రవచనాలన్నీ యెహెజ్కేలు పేరుతోనే జరిగినట్లు చూస్తాం (1:2; 24:24). ఈ గ్రంథమంతటా కనిపించే “నేను” అనే సర్వనామం, శైలి, భాషలోని ఏకత్వం ఇవన్నీ యెహెజ్కేలు ఒక్కడే దీనిని పూర్తిగా రచించాడని తెలుపుతున్నాయి. అతడి ప్రవచనాలకు స్పష్టమైన కాలనిర్ణయం చేయవచ్చు. ఎందుకంటే అవన్నీ ఒక క్రమంలో (1:1-2; 8:1; 20:1; 24:1; 26:1; 29:1,17; 30:20; 31:1; 32: 1,17; 33:21; 40:1 ఒకదాని తర్వాత ఒకటి రాసి వున్నాయి. అతని పరిచర్య క్రీ.పూ. 593 జూలై నెలలో ప్రారంభమైంది. గ్రంథస్తం చేయబడిన చివరి ప్రవచనం క్రీ.పూ. 571 ఏప్రిల్లో వచ్చింది.
రెండవ భాగంలో – 4 నుంచి 24వ అధ్యాయం వరకు ఉన్నాయి. యూదా, యెరూషలేముల నిరంతరమైన తిరుగుబాటు, భ్రష్టత్వాలను బట్టి వారిపైకి రాబోతున్న అనివార్యమైన శిక్షను గూర్చి తీక్షణమైన, నిరీక్షణ లేని సందేశం ఉంది. యెరూషలేము యొక్క చివరి 7 సంవత్సరాలలో, అంటే క్రీ.పూ. 593 నుంచి 586 వరకు రాబోయే తీర్పును తప్పించుకొంటామని ఎలాంటి అబద్ధపు ఆశలు పెట్టుకోవద్దని యెరూషలేములోని యూదులను, బబులోను చెరలోనున్న వారిని యెహెజ్కేలు హెచ్చరించాడు.
యెరూషలేము గత పాపాలు, ప్రస్తుత పాపాలు దానిపైకి రాబోతున్న వినాశనాన్ని అనివార్యం చేసాయి. ఈ వినాశనాన్ని గురించిన ప్రవచనాన్ని యెహెజ్కేలు అనేక రకాలైన దర్శనాలు, ఉపమానాలు, అలంకారికమైన క్రియల ద్వారా అందించాడు.
25 నుండి 32వ అధ్యాయం వరకు గల భాగాన్ని మూడవ భాగముగా మనం లెక్కించవచ్చు. యూదాపై వచ్చిన విపత్తును చూచి సంతోషిస్తున్న అన్య రాజ్యాలపై రాబోతున్న తీర్పును గురించి ప్రవచనాలున్నాయి. తూరు గురించి ఉన్న అతి దీర్ఘమైన ప్రవచనం (28:11-19) తూరు రాజు వర్ణన వెనుకనున్న సాతాను వాస్తవికమైన వర్ణన సూచన ప్రాయంగా కనిపిస్తుంది.
33వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకున్న భాగం భాగముగా చెప్పుకోవచ్చు ప్రవక్త సందేశంలో ఒక మార్పు కనిపిస్తుంది. విచారకరమైన శిక్షనుంచి మరలి ఆదరణ, భవిష్యత్తు నిరీక్షణ దానిలో కనిపిస్తున్నాయి (యెషయా 40-66 అధ్యాయాలతో పోల్చండి). యెరూషలేము పతనమైన తరువాత భవిష్యత్తులో దేవుడను గ్రహించే పునరుద్ధరణను గూర్చి ప్రవచిస్తూ, అప్పుడు దేవుడు వారికి నిజమైన కాపరిగా ఉంటాడని (34వ అధ్యాయం), వారికి నూతన హృదయాన్ని, నూతన ఆత్మను (36వ అధ్యాయం) ఇస్తాడని చెప్పాడు. ఈ సందర్భంలోనే యెహెజ్కేలుకు ఎండిన ఎముకల లోయలో వ్రచనానుసారంగా సజీవులై నిలిచిన గొప్ప దర్శనం కల్గింది. అంతిమంగా జరిగే పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ రాజ్యాల పునరుద్ధరణ వర్ణనతో ఈ గ్రంథం ముగుస్తుంది. యెహెఙ్కేలు గ్రంథ వివరణ
33 నుంచి 48 అధ్యాయాల్లోని సందేశం అంతా కొత్త నిబంధనలో కనిపించిన విధంగా భవిష్యత్తులో దేవుడు జరిగించే విమోచన కార్యం గురించి రాసి వుంది. అది ఇశ్రాయేలు తమ వాగ్దాన దేశానికి భౌతికంగా సమకూర్చబడడం గురించి మాత్రమే కాక దేవుని మహిమ, ప్రభావాలకు సంబంధించి సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉండే ఆత్మీయ ఇశ్రాయేలును గూర్చి, ఇతర రాజ్యాల గురించిన దేవుని ఏర్పాటు మొదలైన భవిష్యత్ పునరుద్ధరణలను గూర్చి కూడా చెబుతుంది. కొత్త నిబంధన మెస్సీయ గురించి – యెహెజ్కేలు గ్రంథంలోని ప్రాముఖ్యమైన వాక్య భాగాలు యివి – 17:22-24; 21:26 – 27; 34:23-24; 36:16-38; 37:1-28.
For bible question and answers…..click here