Book of Leviticus Telugu – లేవీయ కాండము వివరణ

లేవీయ కాండము వివరణ.

Book of Leviticus Telugu 

ఉపోద్ఘాతము : బైబిలులోని అతి ప్రాముఖ్యమైన గ్రంథాలలో లేవీయ కాండము ఒకటి. పంచగ్రంథాలు, లేక ధర్మశాస్త్రం అని పిలువబడుతున్న విభాగములో ఇది మూడవ పుస్తకం. ఆధ్యాత్మికంగా, వ్యక్తుల హృదయాలలో ఈ పుస్తకంలోని సందేశాన్ని నింపగలిగితే భిన్నబోధలు, సిద్ధాంతాలు, తత్త్వాలన్నీ ఇట్టే రూపుమాసిపోతాయి.

గ్రంథకర్త : ఈ గ్రంథాన్ని వ్రాసినవాడు మోషే. ఈ గ్రంథం ఆరంభం నుండి అంతంవరకు కూడ, సీనాయి కొండ వద్ద ఉన్నప్పుడు ఇవ్వబడిన సూచనలున్నాయి.

ఉద్దేశం : నిర్గమ కాండము ప్రత్యక్షగుడార నిర్మాణంతో ముగించబడింది. ఆ గుడారములోని ఆరాధనకు సంబంధించిన విషయాలు అనగా, బలులు, ఆరాధన క్రమం, శుద్ధీకరణాచారాలు, సమాజ కూటాలు, పండుగలు మరియు నియామక దినాలను గూర్చిన సూచనలు హెచ్చరికలు ఇవ్వడానికి లేవీయకాండము వ్రాయబడింది.

ముఖ్య సందేశం : ఈ గ్రంథంలో రెండు ముఖ్యసందేశాలున్నాయి.

దేవుని వద్దకు వెళ్ళడానికి బలులే మార్గము (లేవీ 17:11) : ఈ గ్రంథంలో ప్రాయశ్చిత్తం అనే మాట 45 సార్లు ప్రస్తావించబడింది. దీనిని బట్టి చూస్తే ఈ బలులన్నీ మానవుని పాపాన్ని కప్నినవి తప్ప అవి పూర్తిగా తీసివేయబడలేదు.

శుద్ధీకరణ ప్రక్రియ ద్వారానే దేవునితో మన నడక సాధ్యమౌతుంది (లేవీ 20:26). కనుకఈ గ్రంథంలో పరిశుద్ధత అనే మాట 87 సార్లు ప్రస్తావించబడింది.

రక్తం చిందించబడుట ద్వారానే పాపికి దేవుని వద్ద ప్రవేశం లభిస్తుంది.  (హెబ్రీ 9:25, 26) క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడినవారు, దేవుణ్ణి ఆరాధించాలి మరియు సంతోషంగా జీవించాలంటే, పరిశుద్ధంగా జీవించాలి. (హెబ్రీ 13:20,21). ఈ గ్రంథంలోని సారాంశమంతా ఇదే. 

గ్రంథ విశిష్టత : ఈ గ్రంథం పేరు అందలి అంశాల్ని సూచిస్తున్నది. అనగా ప్రత్యక్ష గుడారములో యాజకులుగా లేవీయుల సేవను ఇది వివరిస్తున్నది. ఆదికాండము మనిషి పతనాన్ని గూర్చి, నిర్గమ కాండము పాపియైన మనిషి విమోచనను గూర్చి, లేవీయ కాండము విమోచించబడినవారు దేవుణ్ణి ఆరాధించాల్సిన విధానమును గూర్చి చెప్తున్నది.

నిర్గమ కాండము పాపక్షమాపణను గూర్చి చెప్తుంది. లేవీయ కాండము పరిశుద్ధతను గూర్చి చెప్తుంది. నిర్గమ కాండము దేవుడు మనిషితో వ్యవహరించిన విధానాన్ని చెప్తుంది. లేవీయ కాండము మనిషి దేవునితో వ్యవహరించాల్సిన విధానాన్ని బోధిస్తుంది. నిర్గమ కాండము క్రీస్తును రక్షకునిగా చూపిస్తున్నది. లేవీయ కాండము ఆయనను పరిశుద్ధపరచే వానిగా చూపిస్తున్నది. నిర్గమ కాండములో దేవుడు కొండపైనుండి మాట్లాడాడు. లేవీయ కాండములో ప్రత్యక్ష గుడారము నుండి మాట్లాడాడు. 

ఈ గ్రంధంలోని బలులన్నీ యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి గనుక ఇది “పాప పరిహార గ్రంథము” అని కూడ పిలువబడుతున్నది. 

ఇది, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులకు మత సంబంధంగా శిక్షణనిచ్చేందుకు దేవుడు ఇచ్చిన చిత్రపటాల పుస్తకం అని చెప్పవచ్చును. ఇందలి ప్రతి చిత్రము యేసు క్రీస్తు చేయబోయే కార్యాన్నే సూచిస్తున్నాయి. 

ఈ పుస్తకం ఆత్మతో పాటు శరీర శుద్ధిని గూర్చి నొక్కిచెప్తున్నది. అందును బట్టి యూదులు ఆరోగ్యవంతులుగా మరియు దీర్ఘ కాలం జీవించగలిగారు. ప్రస్తుతం కూడ యూదులు ఆరోగ్యవంతంగా ఉండడానికి కారణం ఈ భౌతిక నియమాలే. 

అంశాల వారిగా సంగ్రహ సమీక్ష :

ప్రత్యక్ష గుడారములో ఆరాధన – బలులు :

లేవీయకాండము మొదటి ఏడు అధ్యాయాలలో ఐదు ప్రాముఖ్యమైన బలులను గూర్చి వాటి విధులను గూర్చి వ్రాయబడింది. దేవుని ప్రజలు దేవుని వద్దకు చేరడానికి మరియు ఆయనను ఆరాధించడానికి బలులు ఒక అవకాశంగా కల్పించబడ్డాయి. విమోచించబడిన ఇశ్రాయేలీయులు బలుల ద్వారా దేవుణ్ణి చేరగలిగారు, ప్రత్యేకించబడుట ద్వారా దేవునితో నడువగలిగారు. ప్రతి ఒక్కరి హృదయంలో అపరాధ భావం ఉంటుంది. దానిని పోగొట్టుకొని క్షమాపణ పొందాలని ప్రయత్నం చేస్తారు. లేవీయ కాండము వివరణ

ఈ బలులన్నీ ఒక పద్ధతి కొరకే కాదుగాని కల్వరిలో చేయబోయే పరిపూర్ణ బలిని చూపిస్తున్నాయి. దేవుని గొట్టెపిల్లను చూపిస్తున్నాయి. (యోహా 1:29). బలులను అర్పించడం వలన పాపము క్షమించబడుతుంది కాని, దానికి పరిహారం చెల్లించబడాలి. (రోమా 6:23) రక్తం చిందించబడకుండ, పాపమునకు పరిహారము చెల్లించబడకుండ దేవునికి పాపికి మధ్య సంబంధం ఉండదు. (హెబ్రీ 9:22). బలుల ద్వారా పాపము యొక్క భయంకరత్వాన్ని అర్థం చేసికోవాలని దేవుని ఉద్దేశం. 

ఈ బలులను వాటి ప్రాముఖ్యతను బట్టి రెండు వర్గాలుగా విభజించవచ్చును. 

దేవునితో తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించుకొనే బలులు (పాప ప్రాయశ్చిత్తార్ధబలిమరియు అపరాధ పరిహారార్ధబలి). 

దేవునితో సంబంధాన్ని కాపాడుకొనే బలులు (దహనబలి, నైవేద్యం, సమాధాన బలి సంఖ్యాకాండము 19వ అధ్యాయంలోని ఎఱ్ఱపెయ్య భస్మం కూడ ఈ కోవకే చెందినది.

దహన బలి (1:1-17): ప్రాచీన కాలం నుండి మనిషికి తెలిసిన బలి ఇదొక్కటే. హేబెలు,-నోవహు, అబ్రాహాము అర్పించిన బలులు దహన బలులే. ఈ బలిని బట్టి, ప్రత్యక్ష గుడారములోని ఇత్తడి బలిపీఠము దహన బలి పీఠము అని పిలువబడింది. ఇది ప్రధానమైనది గనుక మొదట వ్రాయబడింది. ఈ బలిని అర్పించే విధానం లేవీ 1:1-4 లో దాని ఆచారమును గూర్చి 1:5-16లో, కారణము 1:17లో తెలియజేయబడింది. ఇది స్వచ్ఛందంగా, సమర్పణతో ఇచ్చేది. 

ఒక వ్యక్తి మొదట తనను తాను, దేవునికి, అప్పగించుకోనంత వరకు దేవునితో జీవితాన్ని ప్రారంభించలేడు. అందుకే ఇది మొదట ప్రస్తావించబడింది. సమర్పించుకోవడం మానవుని వంతు ప్రతిష్ఠించుట దేవుని వంతు. మనం మనస్ఫూర్తిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకొంటే, ఆయన తన పని కొరకు మనల్ని ప్రతిష్ఠిస్తాడు. దహనబలి క్రీస్తు సమర్పణను, ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుంది. (ఎఫె 5:2). 

నైవేద్యం (2:1-16) : ఇది క్రీస్తు పరిపూర్ణ మానవత్వాన్ని సూచించే అనుదిన భక్తి ధ్యానమునకు సంబంధించిన అర్పణ. ప్రతి దినం మనల్ని మనం మరియు మనకున్న వాటిని ఆయనకు అర్పించాలి.

నైవేద్యం, పరిపూర్ణమైన మానవునిగా యేసు సౌశీల్యాన్ని వర్ణిస్తుంది. సన్నని పిండి క్రీస్తు సమర్పణను, నలుగగొట్టబడుటను సూచిస్తున్నది. దానిపై నూనె పోయబడాలి. నూనె యేసు ప్రభువు జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాన్ని సూచిస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు (లూకా 1:35). బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు (మత్త 3:16,17) పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు (మార్కు 1:12) ఆత్మతో బోధించాడు, అద్భుతాలు చేసాడు. (మత్త 12:22). పరిపూర్ణ మానవత్వం గల క్రీస్తుకే పరిశుద్ధాత్మ నడిపింపు, నింపుదల అవసరమైతే, మనకు మరి ఎక్కువ అవసరం కదా! సాంబ్రాణి కూడ నలుగగొట్టబడాలి. అది నలుగగొట్టబడి, పూర్తిగా కరిగిపోయినప్పుడే సువాసన నిస్తుంది. యేసు క్రీస్తులో దేవుడు ఇష్టపడింది ఈ లక్షణాన్నే. దేవుడు ఆలాంటి ఇంపైన సువాసనను ఆఘ్రాణించడానికి ఇష్టపడతాడు. (2:9) యేసు ప్రభువు దేవునికి ఇష్టమైన పనులనే చేసాడు. (యోహా 8:29). మన జీవితాలు దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. 

ఈ నైవేద్యము పులిసిపొంగిన దానితో చేయకూడదు. పులిసినది చెడుకు గుర్తు. క్రీస్తులో ఏ పాపము, లేక చెడుతనము లేదు. నైవేద్యంలో తేనెపోయకూడదు. తేనె స్వాభావికంగా తియ్యగా ఉంటుంది గాని, ఇది పులిపిండిలాగే పొంగజేస్తుంది. హృదయంలో అసూయ, పగ, ద్వేషం ఉంచుకొని పైకి తేనెపూసినట్లు మాట్లాడడం, ఆత్మీయ అతిశయం లేక ఉప్పొంగుట ఆత్మీయంగా ప్రమాదకరమైనవి. ఆలాంటి జీవితాలు ఇంపైన సువాసనగా ఉండలేవు. నైవేద్యంలో తప్పనిసరిగా ఉప్పును చేర్చాలి. ఉప్పు చెడిపోకుండ నిలువ ఉంచుతుంది. ఇది పులుపుకు వ్యతిరేకమైనది. ఉప్పు, అర్పించినవానికి మరియు దేవునికి మధ్య నమ్మకత్వానికి గుర్తు. ఆయన నమ్మకమైన వాడే. (ప్రక 19:11). ఆయనపట్ల నమ్మకంగా ఉన్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి. క్రీస్తు పరిమళవాసనగా ఉండునట్లు తన్నుతాను అర్పించుకొన్నట్లే మనము కూడ అర్పించుకోవాలి. (ఎఫె 5:2; రోమా 12:1, 2) నైవేద్యమును గూర్చిన విధి లేవీ 6:14-23 లో వ్రాయబడింది. 

సమాధానబలి (3:1-17) : ఈ బలి దేవునితో విశ్వాసుల సహవాసాన్ని గూర్చి మరియు క్రీస్తే దేవునికి మరియు మానవులకు మధ్య సమాధాన కర్త అని సూచిస్తున్నది ఈ బలి క్రీస్తు మానవులందరిని సిలువలో దేవునితో సమాధానపరిచిన కార్యమును గూర్చి (కొల 1:20- 22) చెప్పడం లేదు, ఈ సమాధానం విశ్వాసులందరి ఐక్యతను గూర్చినది (ఎఫె 2:13 -20).

సమాధాన బలికి మరియు దహనబలికి పోలికలున్నా కొన్ని వ్యత్యాసాలు కూడ ఉన్నాయి.క్రీస్తు మానవులందరి స్థానంలో అనగా స్త్రీపురుషులందరి స్థానంలో ఉండి, వారిని దేవుని చెంతకు చేర్చాడు గనుక సమాధాన బలికొరకు మగపశువునైనా ఆడ పశువునైనా అర్పించవచ్చును. దహనబలిలాగ కాక కొన్నిభాగాలు మాత్రమే బలిపీఠం మీద వహించాలి. బోర, తొడ యాజకులకు ఆహారం (7:31-34). మిగిలినదంతా ఆ అర్పణ తెచ్చిన వ్యక్తి తినాలి. ఈ భోజనం కేవలం శరీర పోషణకే కాదు గాని, ఇది క్రీస్తుతోను, తండ్రియైన దేవునితోను సహవాసానికి గుర్తుగా ఉన్నది. (మత్త 26:26; లూకా 22:14-19; Iకొరి 10:16,17; 1 యోహా 1:3; ప్రక 3:20). కనుక సమాధాన బలిని, సహవాస బలి అని కూడ అనవచ్చును. ఇది దేవునితోను, క్రీస్తునందలి విశ్వాసులతో గల సంతోష సహవాసానికి గుర్తు. దహనబలిని గూర్చిన విధి 7:11-38 లో వ్రాయబడింది.

పాప పరిహారార్ధబలి (4:1-35): మొదటి మూడు బలులను అర్పించేవాడు ఒక ఆరాధికునిగా దేవుని వద్దకు వస్తాడు. పాప పరిహారార్ధబలిని అర్పించేవాడు, తన పాపాల విషయం ఒప్పించబడి పాపిగా దేవుని వద్దకు వస్తాడు. మొదటి మూడు బలులు ఇంపైన సువాసనగా ఉన్నాయి. కాని ఇది సువాసన లేని బలి. ఇంపైన సువాసన క్రీస్తు స్వభావాన్ని సూచిస్తుంది. మనిషి పాపి, మనిషి పాప నైజము దేవునికి ఇంపైనది కాదు. పాప పరిహారార్ధబలి, మరియు అపరాధ పరిహారార్ధబలి యేసు క్రీస్తు సిలువ కార్యాన్ని సూచిస్తున్నాయి.

ఈ బలిని గూర్చి మిగతా బలులకన్న ఎక్కువ వచనాలు, అనగా 35 వచనాలు వ్రాయబడ్డాయి. ఆదాము మొదలుకొని ధర్మశాస్త్రము ఇవ్వబడేంత వరకు దహన బలి ప్రస్తావన తప్ప, పాపపరిహారార్థ బలి ప్రస్తావన లేదు. ధర్మశాస్త్రము ఇవ్వబడక ముందు నుండే మనిషి పాపి, కాని ధర్మశాస్త్రము పాపము అంటే ఏంటో తెలియజేసింది. కనుక పాపిగా గుర్తించబడిన వ్యక్తి ఈ బలిని అర్పించాలని నియమించబడింది. ఈ బలి ఇశ్రాయేలీయుల పండుగలన్నిటిలో అర్పించబడింది. దహనబలి మరియు పాపపరిహార్థ బలి పశువు ఒకే స్థలంలో చంపబడినా రెండూ ఒక దాని కొకటి భిన్నమైనవి. దహన బలి దేవుని ఉన్నత పరిశుద్ధ ప్రమాణము కోరిన దానిని నెరవేరుస్తుంది. పాప పరిహార్ధబలి మనిషి అగత్య అవసరతను (పాప ప్రాయశ్చిత్తమును) తీరుస్తుంది. దహన బలిలో క్రీస్తు మనోహత్వాన్ని చూస్తాము. పాప పరిహారార్ధబలిలో ఆయన పొందిన తృణీకారాన్ని కోల్పోయిన సురూపాన్ని (యెష 53:2,3) చూస్తాము. దహన బలి స్వచ్ఛందంగా అర్పించాల్సినది. పాప పరిహారార్థ బలి ఆజ్ఞను బట్టి అర్పించాల్సినది.  లేవీయ కాండము వివరణ

ఈ అధ్యాయంలో నాలుగు రకాల వ్యక్తుల పాపాలను గూర్చి వ్రాయబడింది. యాజకులు (4:3-12) సమాజము (4:13-21) నాయకులు (4:22-26) సామాన్యులు (4:27-30) వీరంతా తెలియక చేసిన పాపాలను గూర్చే ఇక్కడ కనిపిస్తున్నది (6:1-4). దీనిని బట్టి, తెలియక చేసిన పాపాలు కూడా పాపాలని, వాటికి కూడ ప్రాయశ్చిత్తం జరగాలి అని అర్థమౌతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే. మరో విధంగా చెప్పాలంటే మనిషి పాపములోనే పుట్టాడు. ప్రతి మనిషిలో జన్మతాః పాపనైజం ఉన్నది. యేసు క్రీస్తు అందరు చేసిన, అన్ని పాపాల కొరకు చనిపోయాడు. ఒక్క పాపానికి తప్ప (మత్త 12:31,32) పాపాలన్నిటికి క్షమాపణ ఉన్నది. అయితే మనిషి తాను పాపినని గ్రహించి, ఒప్పుకొన్నప్పుడే పాపక్షమాపణ లభిస్తుంది. దేవుడు మనల్ని చూసినట్లు మనల్ని మనం చూచుకొంటేనేగాని మన పాప స్థితిని గ్రహించలేము. (హెబ్రీ 13:12) మన పాపాల కోసం గవిని వెలుపట శ్రమ పొందిన (లేవీ 4:12) ప్రభువు ప్రేమకు ప్రతిస్పందించిన వారందరికి రక్షణ ఉచితంగా అందుబాటులో ఉన్నది. అయితే బుద్ధి పూర్వకంగా ఆయనను తృణీకరించిన వారికి రక్షణ లేదు. (హెబ్రీ 10:26,27). 

యాజకుడు ఆత్మీయ నాయకుడు (4:3:12) అతడు తప్పుచేస్తే సమాజమంతా తప్పుచేసే అవకాశం ఉంది. సంఘకాపరులుగా, బోధకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, గాయనీగాయకులుగా, ఆదివారపు బడి అధ్యాపకులుగా ఉన్నవారిపై గొప్ప ఆత్మీయ బాధ్యత ఉన్నది. ఇక సమాజము విషయానికొస్తే, ప్రతి వ్యక్తికితన వ్యక్తిగత బాధ్యత మరియు సామాజిక బాధ్యత కూడ అప్పగించబడింది. దేవుడు జాతులకు తీర్పుతీరుస్తాడు. అధిపతి (4:22-26), ప్రజల నిమిత్తం దేవునిచే నియమించబడినవాడు. అతడు దేవునికి బాధ్యునిగా ఉండాలి. 

అపరాధ పరిహారార్థ బలి (5:1-3) : అపరాధ పరిహారార్ధబలి ద్వారా, మనిషి ఇతరుల పట్ల చేసిన పాపాన్ని గూర్చి కూడ దేవుడు శ్రద్ధ వహిస్తాడని తెలియజేయబడుతున్నది. అపరాధం అన్నది పాపము నుండే వస్తుంది. మనిషి చేసే పాపము అతనికి దేవునికి మధ్యగల సంబంధంపైననే కాక, ఇతరులతో గల సంబంధంపై కూడ ప్రభావం చూపిస్తుంది. అందుకే తప్పిపోయిన కుమారుడు “తండ్రీ నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని” అని తండ్రితో అన్నాడు. అపరాధ పరిహారార్ధబలి పాపము చేసిన వ్యక్తి మనస్సాక్షిని శుద్ధిచేసి, ఎవరిపట్ల తప్పుచేసాడో వారి విషయం కూడ సరిచేసికోడానికి సహాయపడుతుంది. దీని ద్వారా నష్టము చేసినవారు, నష్టపోయిన వారు కూడ మేలుపొందుతారు.

ఈ విధంగా ఇతరుల పట్ల చేసిన పాపానికి వ్యక్తిగతంగా పాపపరిహారార్ధబలితో పాటు, ఎవరి పట్ల తప్పు చేసాడో ఆ నష్టమును చెల్లించాలి. (6:4-6). తెలియక చేసిన ప్రత్యేక తప్పులు (5:1-13) ప్రత్యేకించి చెప్పబడనివి, తెలియక చేసినవి (5:14-19) బుద్ధిపూర్వకంగా చేసిన ప్రత్యేక తప్పులను (6:1-7) గూర్చి ఈ భాగంలో వ్రాయబడింది. 

యాజకులు (8-10 అధ్యా) :

ఈ భాగములో యాజకుల ప్రతిష్ఠ (8 అధ్యా) యాజకుల పరిచర్య (9 అధ్యా) యాజకుల నిర్భంధాలను (10 అధ్యా) గూర్చి వివరించబడ్డాయి. ప్రత్యక్ష గుడారములో సేవచేసే యాజకులు ప్రత్యేకముగా దేవునిచే ఏర్పరచబడినారు. ఏ మనిషేగాని నేరుగా దేవుని వద్దకు వెళ్ళలేడు. వారి పక్షంగా యాజకులే బల్యర్పణల ద్వారా దేవుని వద్దకు వెళ్ళాలి. ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రజలు ఇచ్చే దశమ భాగాలతో వారు బ్రతకాలి. ఇది దేవుని ఏర్పాటు. ఈ పవిత్ర పరిచర్య నిమిత్తం యాజకులు అభిషేకించబడాలి. (8:1-36). 

ప్రధాన యాజకుని అభిషేకంలో ఓ ప్రత్యేకతను గమనించాలి. ఇతర యాజకులకు, బలి జంతువును వధించిన తరువాత, ఆ రక్తాన్ని పూసిన తరువాత నూనెతో అభిషేకించ బడ్డారు. కాని యేసు క్రీస్తుకు గుర్తుగా ఉన్న ప్రధాన యాజకుడైన అహరోను, బలి అర్పించకముందే నూనెతో మాత్రమే అభిషేకించబడ్డాడు. మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ఇతరులకోసం తనను తాను బలిగా అర్పించుకోక ముందే ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. అహరోను తలమీద తైలము పోయబడడం యేసు పొందిన ఈ ఆత్మాభిషేకాన్ని సూచిస్తున్నది (యోహా 3:34). అహరోను కాక మిగతా యాజకులందరు క్రొత్త నిబంధన కాలంలోని విశ్వాసులకు సూచనగా ఉన్నారు. 1 పేతు 2:5, 9) వీరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడక ముందు, క్రీస్తు రక్తం ద్వారా శుద్ధులు కావాలి. యాజకులు కాని లేవీయులు, మందిర పరిచర్య విషయంలోను, సంగీతం విషయంలోను సహాయం చేసేవారు. లేవీయ కాండము వివరణ

ఎంతో ఉత్సాహంగా, దైవికంగా ప్రారంభించబడిన ఈ యాజకత్వపు పరిచర్య ప్రారంభంలోనే అహరోను కుమారులైన నాదాబు, అబీహులను బట్టి అపశృతి పలికింది. (10:1-5), 10:6-15 లో యాజకులను గూర్చిన నియమాలు, విధులు ఉన్నాయి. 

ఈ యాజకులకున్న నిషేధాలు తేలీయకాండము 21, 22వ అధ్యాయాలలో వివరంగా వ్రాయబడింది. 

III.అనుదిన జీవితంలో పరిశుద్ధత (11-22 అధ్యా) : 

దేవుడు తన పిల్లల ఆరోగ్యమును గూర్చి, పరిశుద్ధత గూర్చి మరియు వారి ప్రవర్తనను గూర్చి శ్రద్ధకలిగియున్నాడు. ముఖ్యంగా 11-15 అధ్యాయాలలో “అపవిత్రము” అనే మాట 100 కంటె ఎక్కువ సార్లు కనిపిస్తుంది. ఏవైతే అపవిత్రముగా ఎంచబడ్డాయో అవి వాస్తవంగా అపవిత్రమైనవి కావచ్చును లేక ఆత్మీయ అపవిత్రతను సూచించేవి కావచ్చును. ఇవన్నీ మనిషిని కల్మషం చేస్తాయి. 

11వ అధ్యాయంలోని ఆహార నియమాలు ఆరోగ్యకరమైనవి. అంతేకాకుండ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇతర జనాలకంటే ప్రత్యేకమైన వారుగా ఉండాలన్నదే దేవుని సంకల్పం. (నిర్గ 19:5,6; ద్వితీ 7:6; 14:2). తన రహస్య సత్యాలను తెలియజేయడానికి, లోకరక్షకుణ్ణి పంపించడానికి వారిని ఎన్నుకొన్నాడు. వారిని ప్రత్యేకించడానికి వారి ఆహారనియమాలను ప్రత్యేకించాడు. తినకూడని పదార్థాలు, అపవిత్రమైన ఆలోచనలు మొదలైన ఆధ్యాత్మిక అపవిత్రతను సూచిస్తున్నాయి. ఈ అపవిత్ర జీవులు క్రొత్తనిబంధనలో అపవిత్రమైనవిగా ఎంచబడలేదు. (అపొ. కా 10:9-16; 1 కొరి 10:25, 26; 1 తిమో 4:3-5). దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించడానికి వాటిని ఉదాహరణలుగా వాడుకొన్నాడు. వాటికి సంబంధించిన అంతరార్థాలను వారికి నేర్పించిన తరువాత ఇక వాటికి సంబంధించిన ఆదేశాలను రద్దు చేసాడన్న మాట. 

అపవిత్రమైన వాటిని ముట్టుకోవడం కూడ నిషేధించబడింది. (11:26-38) అలా అపవిత్రమైనవారు శుద్ధిచేసికోవాలి. అందుకు ఏకైక సాధనం బట్టలు ఉతుక్కోవడం (11:24,25). నీరు దేవుని వాక్యానికి సంకేతం. మనం పరిశుద్దులుగా ఉండాలంటే వాక్యమనే ఉదకస్నానం చేయాలి. (కీర్త 119:9; యోహా 15:3; ఎఫె 5:25-27). 

12వ అధ్యాయం ప్రసూతి స్త్రీ శుద్ధిని గూర్చినది. దీనిని కూడ దేవుడు చిహ్నాల మూలంగా సూచిస్తున్నాడు. బిడ్డను కన్న ప్రతి స్త్రీ, స్వాభావికంగా పుట్టిన ప్రతి బిడ్డ పాపులే. వీరికి ప్రాయశ్చిత్తం జరగాలి. యేసు తల్లి, మరియు కూడ ఆయన పుట్టిననప్పుడు ఈ బలిని అర్పించింది. అయితే అది ఆయన కోసం కాదు. ఆయన పాపంలేకుండ పుట్టాడు. కేవలం తనకోసమే ఆమె అర్పించింది. (లూకా 1:34,35). 

13,14 లో కుష్ఠు వ్యాధిని గూర్చిన నియమాలు మరియు శుద్ధీకరణను గూర్చి వ్రాయబడింది. హీబ్రూ పదం “చారయత్” అన్న మాటకు చర్మవ్యాధి, చర్మంలో అంటు వ్యాధి, లేక బూజు అని అర్ధం. ఈ హీబ్రూ పదం “దెబ్బతీయుట” అనే అర్థమిచ్చే పదము నుండి వచ్చింది. కనుక ఈ వ్యాధి పాపాలకు ప్రతిఫలంగా దేవుడు కొట్టిన దెబ్బ, లేక ఆయన శిక్ష అని ఆనాటి ప్రజల నమ్మకం. కొన్ని సందర్భాలలో ఇది నిజమే. (సంఖ్యా 12:10-15; 1రాజు 5:27). ఈ అధ్యాయాలలో కనిపించే రోగ లక్షణాలను పరిశీలించి చూస్తే అది ఈ రోజుల్లో కనిపించే కుష్ఠు వ్యాధి కాదని అర్థమౌతుంది. ఏది ఏమైనా ఇక్కడ వర్ణించిన వ్యాధి, పాపాన్ని సూచించడానికి సరిగ్గా సరిపోతుంది. (యెష 1:6). ఈ వ్యాధి సోకిన వారిని పాళెం వెలుపల ఉంచేవాడు (13:46). 

4:12,19 ప్రకారం ఈ వ్యాధి నుండి స్వస్థత పొందిన వ్యక్తి అపరాధపరిహారర్థబలిని, పాపపరిహార్థ బలిని అర్పించాలి. కుష్ఠువ్యాధిగ్రస్థుడు గాని, మరే భయంకరమైన వ్యాధిగ్రస్థుడుగాని పాపి అని కాదు. యోబు జీవితం ద్వారా దీనిని తెలిసికోవచ్చును. ఈ వ్యాధి ఏ గుణాన్ని సూచిస్తున్నదో ఆ గుణం మనందరికీ ఉన్నది. మనందరం స్వాభావికంగాను, క్రియల మూలంగాను పాపులం. (రోమా 3:9,23). కుష్ఠురోగి శుద్ధికోసం ఆర్పించే బలులు, క్రీస్తు పాపులందరికోసం అర్పించుకోవడానికి సూచనగా ఉన్నాయి. పాపిని దేవుని దృష్టిలో పవిత్రునిగా చేయడంలో క్రీస్తు మరణం మరియు పునరుత్థానం రెండూ అవసరమే (రోమా 4:25). ఈ రెండింటిని ఒకే పక్షిలో సూచించడం వీలుకాదు. కనుక శుద్ధి చేసికొనే వ్యక్తి రెండు పక్షులను అర్పించాలి. ఒక పక్షి చంపబడాలి, రెండవ పక్షి చంపిన దాని రక్తంలో ముంచి స్వేచ్ఛగా వదిలేయబడాలి. విశ్వాసికి కూడ పవిత్రపరచే విధానంలో కొన్ని విధులు ఉన్నాయి. (యెష 1:16; రోమా 6:11-13; 1కొరి 7:1; గల 5:16; ఎఫెసీ 4:22 -32; కొల 3:1-10; 1 యోహా 1:9).  లేవీయ కాండము వివరణ

16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్తార్ధ దినమును గూర్చి 17వ అధ్యాయములో పవిత్ర జీవిత విధానాన్ని గూర్చి 18వ అధ్యాయంలో వివాహము మరియు లైంగిక సంబంధాలను గూర్చి నిషేధాలున్నాయి. 19వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించుటను గూర్చి, పొరుగువారి పట్ల ప్రవర్తించాల్సిన విధానమును గూర్చి వ్రాయబడి ఉన్నది. ఈ అధ్యాయం ధర్మశాస్త్రము ద్వారా దేవుడు కోరే పరిశ్రుతను గూర్చి చెప్తుంది. 19:1-8లో దేవునితో మనిషి సంబంధాన్ని గూర్చి, 19:9,10లో పేదలతో; 19:11-18లో పొరుగువారితో మనిషి సంబంధాన్ని గూర్చి; 19:19-37లో జీవితంలోని వివిధ పరిస్థితులలో మనిషి సంబంధాన్ని గూర్చి వివరించబడింది. 

పరిశుద్ధ విశ్రాంతి దినాలు (23 అధ్యా) :

లేవీయకాండము మొదటి భాగములో అర్పణలు మరియు అర్పించేవారిని గూర్చి వ్రాయబడింది. చివరి భాగములో పండుగలు మరియు వాటిని ఆచరించే వారిని గూర్చి వ్రాయబడింది. 

బలులు దేవుని ప్రజలను ‘సరిచేసికొనమని” చెప్తున్నాయి. పండుగలు “సరిగా జీవించమని చెప్తున్నాయి”. 

విశ్రాంతి దినాలు మరియు పండుగలన్నీ మొత్తం తొమ్మిది. మొదటి మూడు దేవుని సృష్టికార్యాన్ని, తరువాతి ఆరు దేవుని విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేస్తాయి. దేవుడు తన ప్రజల విషయంలో కోరేదానినంతటిని సూచించేందుకు ఒకే పండుగ లేక ఒక నియామక కాలం చాలదు. ఈ పండుగలన్నీ వారి, భూత, భవిష్యత్ వర్తమానాలలోని మహత్తర సంఘటవలన సంబంధించినవి. వీటన్నిటిలో ఆత్మీయ పరమార్థాలున్నాయి. ఇవి క్రొత్తనిబంధనలోని ఆత్మీయ విషయాలను, క్రీస్తును గూర్చిన మరియు విశ్వాసులను గూర్చిన విషయాలను బయలుపరుస్తున్నాయి. 

దేవుని సృష్టికార్యమును జ్ఞాపకం చేసే విశ్రాంతి దినాలు :

వారాంతపు విశ్రాంతి దినం (లేవీ 23:1-3; నిర్గ 20:8-11) :

సంవత్సరమంతా ప్రతివారము ఏడవ దినమును విశ్రాంతి దినముగా పరిగణించాలి. ఇది పూర్తి చేయబడిన సృష్టికార్యమును సూచిస్తున్నది. (ఆది 2:3) క్రొత్త నిబంధనలో, పూర్తి చేయబడిన విమోచన కార్యమును బట్టి (నూతన సృష్టిగా మార్చేపని పూర్తి చేయబడింది- ఎఫె 2:10) విశ్వసించినవారు ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారు. పాత నిబంధన కాలములో 7వ దినమున సమాజముగా కూడుకొని దేవుణ్ణి అరాధించారు. క్రొత్త నిబంధన క్రైస్తవులు క్రీస్తు పునరుత్థాన దినాన అనగా వారములో మొదటి రోజు ఆయనను ఆరాధిస్తున్నారు. క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా ఈ నియామక కాలాలన్నీ నెరవేర్చబడ్డాయి.

ఏడవ సంవత్సరపు విశ్రాంతి. (లేవీ 25:2-7; నిర్గ 23:10,11).

50వ సంవత్సరపు విశ్రాంతి (లేవీ 25:8-16).

ప్రతి యాభయవ ఏట వచ్చే విడుదల కాలము గూర్చి ఈ అధ్యాయములో 14 సార్లు వ్రాసి ఉన్నది. ఈ విడుదల సంవత్సరంలో జరిగే వ్యవహారాలివి. 

A) ప్రతి ఒక్కరూ, తన కుటుంబ ఆస్తిని, పిత్రార్జితాన్ని మళ్ళీ పొందాలి. (25:10). ఆ ఆస్తిఅతని స్వాధీనం కావాలి. (25:28; 27:24).

B) అది భూమికి విశ్రాంతి సంవత్సరం. (25:11) దానిని పవిత్రమైన సంవత్సరంగా ఎంచాలి.(25:12).

C) ఇశ్రాయేలు వారందరికి విడుదల కలిగిందని ప్రకటించాలి (25:10,39,40) అంటే ఆ సంవత్సరం హస్తగతమైన ఆస్తులన్నిటిని తిరిగి ఎవరివి వారు తీసికోవాలి. ఇతరుల ఆధీనంలో ఉన్నవారందరికి స్వేచ్ఛలభించాలి. ఇది అన్నిటి కుదురుబాటు కాలానికి గుర్తు (అపొ 3:19 – 21). ఇది సృష్టి మరియు దేవుని ప్రజలు, మగ్గుతున్న దాస్యము నుండి పొందే విముక్తికి(రోమా 8:19-23) మరియు దేవుడు వాగ్ధానం చేసిన గొప్ప విశ్రాంతి కాలానికి సూచనగా ఉన్నది. (హెబ్రీ 4:9). అదే యెహోవా హితవత్సరము (యెష 61:1, 2; లూకా 4:19) ఆ దినమున చెరలోనున్న వారికి విడుదల ప్రకటించబడుతుంది. అది దేవుని ప్రతిదండనదినము. 

దేవుని విమోచన కార్యమును జ్ఞాపకము చేసే పండుగలు :

పస్కా (23:4-8) : ఈ పండుగ యేసుక్రీస్తు సిలువ కార్యానికి సూచనగా ఉన్నది. ఆయన పస్కాపండుగ రోజే చనిపోయాడు (మత్త26:17-20). ఇది వసంతకాలంలో వస్తుంది. యూదుల కాలమానము ప్రకారము మొదటి నెల 14వ తేదీన మొదలై 7 రోజులు కొనసాగుతుంది. ఇశ్రాయేలీయులు 7 రోజుల పాటు ఈ పండుగను ఆచరిస్తూ పొంగని రొట్టెలు తినేవారు. క్రీస్తు మనందర్నీ పాపదాస్యం నుండి విమోచించడానికి మన పస్కా పశువుగా బలి అయ్యాడు. (1 కొరి 5:7). యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించినవారి జీవితంలో పులిసినదేది ఉండకూడదు.

ప్రథమ ఫలముల పండుగ (23:9-14) : ఇది విశ్రాంతి దినమునకు మరుసటి దినమున (ఆదివారం) ఆచరించాలి. అంటే పస్కా మొదటినెల 14వ రోజున జరుగుతుంది. దానికి మూడో రోజున అనగా 16వ రోజున ప్రథమ ఫలాల పండుగ జరుగుతుంది. ఈ పండుగ మూడవ దినమున పునరుత్థానుడైన యేసుకు సూచనగా ఉన్నది. (Iకొరి 15:23).

పెంతెకొస్తు పండుగ (23:15-21): పెంతెకొస్తు అంటే 50వ అని అర్థం. ఇది ప్రథమ ఫలముల పండుగ సరిగ్గా 50 రోజులకు వస్తుంది. ఈ పండుగ కూడ దాదాపు ప్రథమ ఫలాల పండుగలాంటిదే (17వ) ఈ పండుగ రోజున యెహోవాకు క్రొత్త నైవేద్యాన్ని అర్పించాలి (16వ). యేసు ప్రభువు సజీవంగా లేచిన 50 రోజులకు, పరిశుద్ధాత్మ ఆయన కొరకు కనిపెడుతున్న శిష్యులపైకి దిగి వచ్చాడు. (అపొ 2:1). ఇది ఒక క్రొత్త ఆరంభం, క్రొత్త నిబంధన శకం. కృప కాలం ఆరంభమైనది దీనితోనే. ఈ పండుగ సమయంలో పులిసిన పిండితో రొట్టెను చెయ్యాలి. (17వ) విశ్వాసులు, రక్షించబడ్డాక పరిపూర్ణంగా పరిశుద్ధులు కారు, వారిలో ఇంకా కొంత చెడుగు (పాత స్వభావం లేక శరీరస్వభావం) ఉంటుంది అనడానికి ఇది సూచనగా ఉన్నది. ఆత్మానుసారంగా జీవించుట ద్వారా ఈ స్వభావాన్ని జయించవచ్చును. (గల 5:16).

శృంగధ్వనుల పండుగ (23:23-25): ఇది పెంతెకొస్తు తరువాత సుమారు నాలుగు నెలలకు అనగా 7వ నెల ఆరంభంలో వస్తుంది. అంటే ఇది సంపూర్ణ కాలపరిమితికి గుర్తు. అంటే సంఘకాలం అంతంలో నెరవేరాలి. బైబిలులో బూరలు ఊదడానికి అనేకమైన అర్ధాలున్నాయి. యుద్ధానికి (సంఖ్యా 10:9; యిర్మీ 4:19) ప్రజలను సమకూర్చిముందుకుసాగడానికి, (సంఖ్యా 10:1-8) దేవుని మహిమ, ప్రభావం వెల్లడి కావడానికి (నిర్గ 19:16) భక్తిహీనుల ఓటమికి (యెహో 6:13-16) ఇశ్రాయేలీయుల పండుగలను ప్రకటించడానికి (సంఖ్యా 10:10; IIది. వృ. 29:27) సూచనగా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఈ పండుగల నెరవేర్చు ప్రకారం శృంగధ్వనుల పండుగ సంఘ కాలాంతములో రావాలన్నమాట. దీని ప్రకారం మనకు అంతిమ యుద్ధ ధ్వని వినిపించాలి; దేవుని ప్రజల సమకూర్చుబడాలి, రాజు ప్రత్యక్ష్యం కావాలి; దేవుని మహిమా ప్రభావాలు వెల్లడి కావాలి, భక్తిహీనుల ఓటమి కావాలి; దేవుని ప్రజలకు మహోత్సవం జరగాలి. ఇవన్నీ క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం యుగాంతంలో జరగబోయేవి (ప్రక 16:12-16; మత్త 24:30; ప్రక 19:11-16; 19:17; 20:6). కనుక ఈ పండుగ సంఘము ఎత్తబడుట (1 థెస్స 4:13 – 18) మరియు క్రీస్తు రెండవ రాకడకు సూచనగా ఉన్నది.  లేవీయ కాండము వివరణ

ప్రాయశ్చిత్తార్థ దినము (23:26-32): ఇది కూడ 7వ నెలలోనే వస్తుంది. బహుశా ఇశ్రాయేలు జాతి యుగాంతంలో పశ్చాత్తాపపడే సమయమును గూర్చి ఇది సూచనగా చెప్పబడి ఉండవచ్చును.

శృంగధ్వనుల పండుగ (23:23-25) : ఇది జెకర్యా 12:10-13:1 లోను, రోమా 11:25-27 లో కూడ వ్రాసి ఉన్నది. ఆ రోజున ఇశ్రాయేలీయులు ప్రాయశ్చిత్తమునొంది, అంతవరకు తాము నిరాకరించిన అభిషిక్తుడైన క్రీస్తును, స్వీకరించి ఆయనలో విశ్రాంతినిపొందుతారు.

పర్ణశాలల పండుగ (23:33-43) : ఈ పండుగ, ఇశ్రాయేలీయులకు, ఐగుప్తును, అక్కడ వారి దాస్యాన్ని స్మరణకు తెస్తుంది. (42,43వ) అంతేగాక ఇది యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు వెయ్యేండ్లు జరిగించబోయే పరిపాలనను కూడ సూచిస్తున్నది. (జెక 12:10-14; 14:4-9). ఇది యుగాంతంలో జరిగే సంఘటన (జెక 14:16) ఈ పండుగను ఏడు రోజులు చెయ్యాలి. ఏడు అంటే పరిపూర్ణకాలము. (24:2; నిర్గ 27:20,21).

వాగ్ధాన భూమికి సంబంధించిన విధులు మరియు ఆశీర్వాదాలు :

లేవీయకాండము 24:1-9 వరకు దీపస్తంభము మరియు సన్నిధి రొట్టెల బల్ల విషయంతీసికోవలసి జాగ్రత్తను గూర్చి వ్రాయబడింది.

24:10-16లో దేవదూషణకు కలిగే శిక్షను గూర్చి వ్రాయబడి ఉన్నది. దేవదూషణ ఘోర పాపం. తన పేరును పవిత్రంగా ఎంచనివారిని, ఆ పేరును అనవసరంగా ఉచ్ఛరించేవారిని దేవుడు దండిస్తాడు (నిర్గ 20:7; 22:28; లేవీ 19:12; ద్వితీ. 5:11; 28:58). ఇది మరణదండనకు తగిన పాపం కాబట్టే దేవుడు మరణ దండన విధించాడు. ధర్మశాస్త్రం క్రింద మరణదండన విధించబడే పాపాలన్నీ నిర్గమకాండము 21:36లో వ్రాయబడ్డాయి.

లేవీయకాండము 24:20 లోని చట్టం ఇశ్రాయేలు జాతినంతటిని శాసించే చట్టం (నిర్గ 21:23; ద్వితీ 19:21). ఇది సంపూర్ణ న్యాయం. ఈ చట్టాన్ని అమలుపరచాల్సింది నాయకులు, న్యాయాధిపతులే గాని ప్రజలు కాదు. 

భూమిని గూర్చిన నియమం (23:23): భూమి అంతా దేవునిదే, అయితే కనాను దేశం ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయనకు స్వంతం. (నిర్గ 19:5; ద్వితీ 11:12; I ది. వృ. 7:20). ఇశ్రాయేలు వారు ఆ దేశంలో దేవునికి అతిథులుగా, ఆయన ఆస్తి నిర్వాహకులుగా ఉన్నారు. భూమి అంతా దేవుని స్వంతమని ఎంతమంది గ్రహించగలుగుతారు ? ప్రపంచ చరిత్రలో భూభాగాలకోసం, దేశాల మధ్య వ్యక్తుల మధ్య యుద్ధాలు, పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. లేవీయ కాండము వివరణ

సమీపబంధువు (25:24-31) ఈ భాగంలోని సమీప బంధువు క్రీస్తుకు సూచనగా ఉన్నాడు. తన ప్రజల విమోచకుడు ఆయనే. ఆయన వారి కోసం వెల చెల్లించాడు. వారు ఆయన స్వంతమైపోయారు. (కొరి 6:19; 19,20; 7:23; రోమా 14:8; అపొ 20:28; 1 పేతు 1:18; ప్రక 5:9). ఆయన మానవునిగా పుట్టి మనిషికి సమీపబంధువు అయ్యాడు (యోహా 1:1, 14; హెబ్రీ 2:11,14) సిలువ కార్యం ద్వారా మనిషికి విమోచకుడయ్యాడు.

విడుదల వెల చెల్లించి ఆస్తిని విడిపించే విధానం రూతు గ్రంథంలో చక్కగా ఉదాహరించబడింది. (రూతు 2:1,20; 3:12,13; 4:4 – 10,13).

దాసులను గూర్చిన విధి (25:35-46). దేవుడు వెల ఇచ్చి విడిపించినవారు ఆయన సొత్తు. వారిని ఆవిధంగానే గుర్తించాలి. సునాద సంవత్సరమున వారు విడుదల పొందవచ్చును (25:40,41) క్రొత్త నిబంధన ప్రకారం యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన యజమాని మరియు దాసుడు సహోదరులుగా, సహవిశ్వాసులుగా ఎంచబడ్డారు. బాధ్యతల విషయం దాసుడు దాసుడే. ఒక విశ్వాసిగా క్రీస్తును బట్టి యజమానికి లోబడాలి. యజమాని క్రీస్తును బట్టి దాసుని పట్ల ప్రవర్తించాలి. అయితే ఇద్దరూ క్రీస్తుకు దాసులేనని గుర్తించాలి.

(ఎఫె 6:5-9; కొల 3:22-25). 

ఆశీర్వాదాలు (26 అధ్యా): లేవీయకాండము 26వ అధ్యాయములో దేవుని ప్రజల కొరకుదేవుడు సంకల్పించిన ఆశీర్వాదాలున్నాయి. ఈ దీవెనలను గురించి అత్యంత ఆశ్చర్యకరమైన వాగ్ధానాలున్నాయి. అయితే ఇవన్నీ, దేవుని ప్రజలు ఆయన చట్టాలను అనుసరిస్తూ ఆయనకు లోబడి ఉంటేనే వారికి లభిస్తాయి. (ద్వితీ 7:12-26; 11:13-15; 28:1-14). సృష్టి, వాతావరణం అన్నీ దేవుని వశంలోనే ఉన్నాయి. కాని మనిషి అవిధేయత వాటి క్రమాన్ని తప్పేలా చేస్తున్నది. వర్షం కురవకపోవడం అవిధేయతకు ఒక శిక్ష. (26:4; ద్వితీ 11:14; 28:12). దేవునికి విధేయత చూపితే కొరత అంటూ ఎప్పుడూ ఉండదు. మానవులకు సమృద్ధి జీవము ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. 26:14లో అవిధేయత వల్ల వచ్చేభయంకరమైన శిక్షలు వివరించబడ్డాయి. (ద్వితీ 28:15 – 68; యెహో 23:15). దేవునికి లోబడకపోతే ఏమి జరుగుతుందో దేవుడు ముందే హెచ్చరించినప్పటికిని, ఇశ్రాయేలు ప్రజలు చెవిని బెట్టలేదు. ఈ శిక్షలన్నీ అక్షరాలా వారికి సంభవించాయి. (ద్వితీ 28:65) దేవుడు ప్రేమ స్వరూపి, గాని ఆయన న్యాయవంతుడు పవిత్రుడు కూడ. పవిత్రతకు, నీతి న్యాయాలకు వ్యతిరేకమైనదేదైనా, ఆయనకు అసహ్యం. లేవీయ కాండము వివరణ

ఇశ్రాయేలీయులు విధేయులై తమ పాపాలను ఒప్పుకొంటె దేవుడు కరుణిస్తాడు. (26:40 -44) యెషయా 1:18; 55:7; మికా 7:18; లూకా 24:46, 47; I యెహాను 1:9 పోల్చిచూడండి 26:41లోని “సున్నతి లేని హృదయాలు” అంటే దేవుని కృప మూలంగా నూతనం కాని హృదయాలు. (ద్వితీ 10:16; 30:6; యిర్మీ 4:4; అపొ.కా 7:51). దేవుడు తన మాటను, తానిచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తాడని జ్ఞాపకం చేయబడింది. (26:42-45) మనుష్యులు తమ మాట మీద నిలబడక పోయినా, దేవుడు మాత్రం తప్పకుండా తన మాటను నెరవేరుస్తాడు. 

మ్రొక్కుబడులు మరియు అర్పణలు (27 అధ్యా) : ఈ అధ్యాయంలో వ్యక్తిగత మ్రొక్కుబడులు, సమర్పణ మరియు కుటుంబము (27:3-8) అతడు అర్పించు పశువులు (9-13) పిత్రార్జితము (14-15) లేక పొలమును (16-25) గూర్చిన నియమాలున్నాయి. అపవిత్రమైన జంతువును, నిర్ణయించిన వెలలో అయిదవ వంతు కలిపి విడిపించి దాని యజమాని వద్ద ఉంచుకోవచ్చు. (27:13) ఆలాగే గృహాలు కూడ (27:15), జంతువులలో తొలిపిల్ల దేవునిదే కనుక దానిని ప్రతిష్ఠించకూడదు. (27:26; నిర్గ 13:2,12) భూధాన్యములలోనేమి, ఫలవృక్షములలోనేమి భూఫలాలన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము. (27:30-33). ఈ భాగమంతా కూడ దేవునికి ఇచ్చుటను గూర్చే వివరిస్తుంది. సమస్తము దేవుని వశములోనే ఉన్నాయి. ఆయనకు ఏమి కొదువలేదు. కాని ఆయన ద్వారా సమస్తమును పొందిన మనము. ఆయన పట్ల మన ప్రేమను, కృతజ్ఞతను, మరియు సమర్పణను వెల్లడిచేయడానికే ఆయనకు ఇవ్వాలి. బలవంతముగాకాక స్వచ్ఛందంగా ఇవ్వాలి. మన కొరకు తన కుమారుణ్ణి కూడ ఇవ్వడానికి వెనుకాడని దేవునికి మనము ఎంత ఇచ్చినా ఇంకా ఋణస్తులమే. మన జీవితాలనే ఆయనకు సమర్పించుకొని, ఈ భూమి మీద జీవించినంత కాలం ఆయన మనకిచ్చినవాటన్నిటిని బట్టి ఆయనను ఘనపరచి, మహిమపరచే కృపను ప్రభువు మనకందరికీ దయచేయను గాక!  లేవీయ కాండము వివరణ


ప్రసంగ శాస్త్రం కొరకు… Click Here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!