వ్యాఖ్యాన శాస్త్రం part 1
వ్యాఖ్యాన శాస్త్రం 1
ఉపోద్ఘాతము-:
‘Hermeneutics’ .అనే పదము Hermeneia అనే గ్రీకు భాషావర్గము నుండి వచ్చినది. దీని భావము – వ్యాఖ్యానించుట (Interpretation), వివరించుట (Explanation). ఒక వాక్య భాగమును సరియైన విధముగను మరియు తప్పులు లేకుండునట్లును (ఖచ్చితముగా) వ్యాఖ్యానించు నిమిత్తము ఆ వాక్యభాగమునకు అన్వయింపజేయవలసిన పద్ధతులు, మెళకువలు, ప్రమాణాలు సూత్రాలను నిర్థిష్టపర్చు (లేక) నిర్ణయించు శాస్త్రమే వ్యాఖ్యాన శాస్త్రము”. ఇది స్వరూప స్వభావానికి సైద్ధాంతిక మైనదిగా కన్పించును.
A) “A Tool in His Hand” – వ్యాఖ్యాన శాస్త్రము మనుష్యుని చేతిలో ఓ సాధనము. దేవుని వాక్యమును నిర్దుష్టమైనప్రమాణాలకూ, సత్యానికీ అనుగుణంగా వినియోగించవలెను. చేతిలోని సాధనం కదా అని ఎలాపడితే అలా వినియోగించకూడదు. (Handling Accurately God’s Word).
దేవుడు లిఖితరూపకమైన ఆయన నాక్యమును ఎందుకు ప్రత్యక్షపరచాడు ?
“ఓ పెద్ద చిత్ర రూపం” (The Big Picture) – “దేవుని నుండి నీకు దేవుని వాక్యము యొక్క ఆచరణాత్మక (లేక) అభ్యాస సంబంధమైన లక్ష్యము (లేక) ఉద్దేశ్యము.
“సమయోచితముగా జీవితాలను మార్చే అన్వయం కొరకైన అనంతమైన సూత్రాలను మనం తీసుకొనుటకుగాను చరిత్రరూపకమైన కాలంలో దేవుడు వాక్యరూపకమైన సత్యాన్ని ఇచ్చాడు.”
B) వ్యాఖ్యాన శాస్త్రము యొక్క ఆవశ్యకత :
1) దేవుని వాక్యాన్ని ఎవరికిష్టమొచ్చిన (లేక) అనుకూలించిన (లేక) నచ్చిన రీతిలో వ్యాఖ్యానిస్తున్న ఈ రోజుల్లో దేవుని వాక్యసత్యానికి కట్టుబడి వ్యాఖ్యానించవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది. మనము జీవిస్తున్న ఈ కాలం చాలా విపరీతమైన పోకడతో నున్నది. మనకు కేవలము నాలుగు ముక్కలు ఉంటే / తింటే చాలదు గాని ఘనాహారం అవసరం. పాలసీసాలు పట్టుకొని తిరగడం కాదు గాని నమిలే (లేక) నెమరువేయు / ధ్యానించు కళను నేర్చుకోవలసి యున్నది.
2) ఒకప్పుడు క్రైస్తవ్యము పరిశుద్ధత కొరకైన, గట్టిపని కొరకైన, ఉన్నతస్థాయి ఆలోచన కొరకైన, పటిష్టమైన బైబిలు పఠనం కొరకైన గంభీర బూరధ్వని పిలుపులా ఉండెడిది. కానీ, ఇప్పుడు సరియైన పునాది లేని రాజీధోరణితో, సరియైన పట్టులేకుండా ఉన్నది. కాబట్టి ఇలాంటి దినాల్లో ఉంటున్న మనం వ్యాఖ్యానించుట కవసరమైన సూత్రములను, నియమములను జాగ్రత్తగా గమనించవలెను, సాటించవలెను.
3) రోమా. 10:13-15 – ప్రార్థన చేస్తే రక్షించబడతాడు. ప్రార్ధన చేయాలంటే విశ్వసించాలి. విశ్వసించాలి అంటే దేవుని వాక్యం వినాలి. వాక్యము వినాలి అంటే వాక్యము చెప్పేవారుండాలి. వాక్యము చెప్పేవారుండాలంటే పంపించేవారుండాలి. పంపించేవాడు దేవుడు ఉండనే ఉన్నాడు. కానీ, చెప్పేవారు సరిగా చెప్పినపుడే దేవుని కార్యం జరుగుతుంది. అందుకు వ్యాఖ్యాన శాస్త్రం ఎంతో అవసరం.–
4) అపో.కా. 8:30-35 ఈ భాగములో నపుంసకునికి సువార్తికుడైన ఫిలిప్పు యెషయా గ్రంథ భాగాన్ని వ్యాఖ్యానించి (వివరించి) సువార్తను వినిపించాడు. అప్పటి వరకు నపుంసకుడు చదువుచున్నాడు గాని గ్రహించలేక పోయాడు. చదువుచున్నదానికి సరియైన వివరణ అవసరమైనది. అది జరిగినప్పుడు దేవుని కార్యం ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్తి కావడానికి ‘ అవకాశమేర్పడినది.
5) దేవుని వాక్యాన్ని ఖచ్చితమైన / సరియైన / సమగ్రమైన రీతిలో అర్థం చేసుకొని అందరికి అర్థమయ్యేలా బోధించడం ఎంతో అవసరం.
6) దైవిక సంబంధమైన విషయములను విశిష్టమైనవిగాను, శ్రేష్టమైనవిగాను గుర్తించి, వాటిని సామాన్య మానవుడు సహితము అర్థం చేస్కొనే రీతిగా బోధించటం ఎంతో అవసరం. ఆ విధముగా చేసినప్పుడు సరిగా లేని, భిన్నమైన పద్ధతులను విడనాడటానికి, పారద్రోలడాన్కి దోహదమగును.
7) సరియైన రీతిలో వాక్యాన్ని విభజించి బోధించుట క్రైస్తవ ఉపదేశకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని వాక్యము మానవులకివ్వబడిన నిర్దిష్టమైన మార్పులేని దేవుని వర్తమానమై యుంటే దాన్ని ఉపదేశించువాడు ఎంత ఖచ్చితముగా ఉండాలో, దానిని ఎంత సరిగా విభజించి అందించాలో గుర్తించవలెను గదా!
c.) వ్యాఖ్యాన కర్తయొక్క కర్తవ్యం (The Task)
“వర్తమానము యొక్క ఖచ్చితమైన అర్థభావములను గ్రంథకర్త, మొదటి వినువరుల మరియు చదువరుల యొద్దనుండి గ్రహించి (లేక) కనుగొని వాటిని జాగ్రత్తగా నేటి వినుపరులు మరియు చదువరులకు అందించుట”. ఇంకొక మాటలో చెప్పాలంటే వ్యాఖ్యాన కర్త మధ్యవర్తిలాంటివాడు. అతడు వర్తమానం ఇచ్చిన గ్రంథకర్త యొక్క, ఆ వర్తమానం ఎవరికివ్వబడెనో. వారి యొక్క పూర్వాపరాలను క్షుణ్ణంగా అధ్యాయనం చేయవలెను.
D) బైబిలు వ్యాఖ్యాన సూత్రాలను నేర్చుకొనేముందు మనము గమనించవలసిన కొన్ని ముఖ్య విషయాలు.
“ ప్రతి ఒక్కరు వారివారి సొంత ధోరణిలో దేవుని వాక్యమును వివరిస్తారనో” (లేక) ” మతము మరియు రాజకీయములు అనే రెండింటి విషయాలలో ప్రజలు ఏకాభిప్రాయానికి రాలేరు” అని మనం తరచుగా వింటాం. ఈ అభిప్రాయాలే నిజమైతే క్రైస్తవ్యమే అర్థరహితం, బైబిలు మనకిచ్చే వర్తమానమంటూ ఏమీ ఉండదు. ఒక వ్యక్తి తానేది చెప్పాలనుకొంటున్నాడో దానిని బైబిలు చెప్పేదిగా చూపిస్తే బైబిలు అతనికేమాత్రం మార్గదర్శకాన్ని ఇవ్వలేదు. అలాంటి స్థితిలో బైబిలు కేవలం అతని భావాలను బలపరచటానికిగాను అతని చేతిలో యున్న ఆయుధం మాత్రమే అవుతుంది, కానీ, బైబిలు ఆ ఉద్దేశ్యంతో వ్రాయబడలేదు.
ఈ రోజుల్లో కొందరు ఉపదేశకుల విషయాని కొస్తే, వారు చెప్పదలచుకొన్న (లేక) తాము రుద్దదలచుకొన్న మాటలకు బైబిలును ఆధారంగా చేసుకొంటున్నారు. ఇదెంతో విచారకరం. దేవుని పక్షముగా నిలబడుటయే ఓ ఆధిక్యత కాగా ఆయన మాటలు వినిపించుట మరింత ఆధిక్యతయై యున్నది. దీనిని మన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించడం దురదృష్టకరం., దేవుని తీర్పుకు యోగ్యం. దేవుని వాక్యము నేర్పించే సత్యాలకు మన అనుభవాలను జోడించి చెప్పాలే గాని, మన అనుభవాల వెలుగులో దేవుని వాక్యాన్ని జోడించి చెప్పరాదు.
ప్రతి వ్యక్తి జీవితము తాను కలిగియున్న ఆలోచనలను ఆధారం చేసుకొని ముందుకు సాగును. (ఉదా :- ఒక వ్యక్తి ఓ స్థలానికి వెళ్ళి దేన్నైనా సాధించుకురావాలని సంకల్పిస్తే దానికి తగినట్టుగా కొన్ని విషయాలను ముందుగానే ఊహించును.) అదే విధముగా వ్యాఖ్యానకర్త తాను దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించుటకు సమాయత్తమయ్యే ముందు కలిగియుండవలసిన కొన్ని ప్రాథమిక ఆలోచనలు గమనిదాము.
1) దేవుని వాక్యం అధికార పూర్వకమైనదని విశ్వసించాలి. దేవునిచే ఇది ఆదేశించబడింది. మనుష్యుల చమత్కారపు, చాతుర్యపు మాటలతో కూడినది కాదనే ఆలోచన మొదట మనకుండాలి.
2) దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించే సూత్రాలు, పద్ధతులు బైబిలులోనే పొందుపర్చబడి యున్నాయని, వాటినెప్పుడైతే సరిగా అర్థం చేసుకొని అన్వయించుదుమో అప్పుడే ఎంచుకొన్న భాగానికి సరియైన భావం కలుగునని విశ్వసించాలి.
3) గ్రంథకర్త యొక్క అర్ధ, భావములను కనుగొనుటయే వ్యాఖ్యాన కర్త యొక్క ప్రథమ కర్తవ్యం అని ఎరిగి యుండాలి.
4) దేవుని వాక్యాన్ని సరిగా విభజించి చదువుట, గ్రహించుట ప్రతి క్రైస్తవుని యొక్క విధియని తెలుసుకోవాలి.
5) భాష ఆత్మీయ సత్యములను అందించగలదని (Communicate చేయునని) మనము ఎరిగియుండాలి.
- అది ఏ భాషలో వ్రాయబడెనో ఆ భాషాపదము ను అధ్యయనం చేయుట అవసరము. ఉదా :మార్కు 4:39లో యేసు సముద్రాన్ని “నిశ్శబ్దమై ఊరుకొండుమని గద్దించాడు. కానీ, అక్కడ వాడబడిన గ్రీకు పదం యొక్క అర్థం “నీ మూతికి చిక్కం పెట్టుకో”.
- మనము కలిగియున్న మరియు అలవర్చుకొన్న భాష ఎంతో ప్రాముఖ్యం. ఆత్మీయ సత్యాలను అందించుటకుభాష చక్కని మార్గం వేస్తుంది.
E) దైవ గ్రంథాన్ని సరియైన విధానంలో అధ్యయనం చేయుటకు గుర్తుంచుకోవలసిన నాలుగు ప్రముఖ విషయాలు
1) పరిశీలన (Observation) ఇందు బైబిలు విద్యార్థి యొక్క పాత్ర అపరాధ పరిశోధకుని (Detective) పాత్ర విషయ పరిశీలన అతని బాధ్యత. పరిశోధకునికి ప్రతి చిన్న విషయము ప్రాముఖ్యమైనదే. అయితే దేనికెంత ప్రాధాన్యత నివ్వాలి. అనేది తరువాతి విషయం. దేవుని వాక్యాన్ని మనము అధ్యయనం చేసేటప్పుడు మనకు ఏ విషయము అప్రాముఖ్యమైనది కాదు. ‘పరిశీలన’ అంటే ఏమిటి? ‘ఏదైన సత్యాన్ని (లేక) సంభవాన్ని గమనించి, గుర్తించి వ్రాసే ప్రక్రియయే పరిశీలన’. పరిశీలనలో తప్పులు లేకుండుట యనేది ఎంతో ప్రాముఖ్యం (Accuracy is important). దీనికి సాధన మరియు ఏకాగ్రత / కేంద్రీ కరణ శక్తి (Practice and Concentration) ఎంతో అవసరం. అన్నిటి కంటే పైగా మనం పరిశుద్ధాత్ముని సహాయాన్ని మన దృష్టిలో ఉంచుకోవాలి. మనం పరిశీలించిన ప్రతిదానిని మరింత ఆలోచన కొరకు, ఇతరమైన వాటితో పోల్చుట కొరకు ఒక పేపరు తీసుకొని దానిపై వ్రాసిపెట్టుకోవాలి ఇలా రికార్డు చేసిపెట్టుట ద్వారా మన మనస్సు మరిన్నింటిని పరిశీలించటానికి సిద్ధము (Free) గా ఉండును.
- పరిశీలనకు అవసరమైన విషయములు
i) ప్రార్థనా పూర్వకముగా పరిశుద్ధాత్మపై ఆధారపడవలయును (యోహా. 14:26; 16:13). మన తెలివి తేటలపైకాదు.
ii) సరియైన మనోవైఖరి అవసరం అనగా సరియైన ఆలోచనలతో లేఖనాలను పరిశీలించుట.
iii) పరిశీలన చేయాలన్న ఆలోచన (లేక) కోరిక మరియు చిత్తము అవసరము.
iv) ‘నేర్చుకోవాలి’, ‘తెలుసుకోవాలి’ అనే పట్టుదల / నిశ్చయత అవసరం. నేర్చుకోవడం అనేది అంత తేలికైనదే మీకాదు. అందుకు ఎంతో శ్రద్ధ మరియు క్రమశిక్షణ అవసరం. అప్పుడే అనేక విషయాలు తెలుసుకోగలం.
v) పరిశీలనకు సహనం ఎంతో అవసరం. బైబిలు సంబంధిత జ్ఞానమును పొందుకోవడానికి ఓర్పు ప్రాముఖ్యం .. దాని కొరకు మనం కొంత సమయాన్ని వెచ్చించాలి. నేర్చుకొనే విధానంలో (Learning Process) అడ్డదారులు (Short Cuts) ఏమీ లేవు. ఒక వేళ అడ్డదారులు ఉంటే అవి ఇరుకున (Short circuit) పడవేస్తాయి. ఈ అడ్డదారులు మనలను అబద్ధ బోధల వైపు తీసుకు వెళ్తాయేగాని సర్వసత్యములో నికి నడిపించవు. మనం చేసే దానికి వచ్చే ఫలితం (Product) ఎంత ప్రాముఖ్యమో, మనమెళ్ళే దారి (Process) కూడా అంతే ప్రాముఖ్యము.
vi) పరిశీలనకు శ్రద్ధతో కూడిన రికార్డు ఎంతో అవసరం. పరిశీలించినది శ్రద్ధగా వ్రాసియుంచినట్లయితే అది.ఎంతయో ఉపయోగపడును.
vii) పరిశీలనలో జాగరూకత / మెళకువ ఎంతో అవసరం. ఈ పరిశీలన అధ్యయనంలో మొదటి మెట్టే. ఇంకా చేయవలసిన పనులు (వ్యాఖ్యానం, సమన్వయం, అన్వయం) ఉన్నాయి. ఈ పరిశీలనకే సమయమంతా ఖర్చుచేస్తే మిగతా పనులు మరుగున పడును. ఇచ్చోట మూడు విషయాలు గమనించాలి.
- -అనవసరమైన వివరాల కోసం పోవద్దు.
- – పరిశీలనతో ఆపివేయవద్దు.
- – ప్రతీ దానికీ సమానమైన విలువను ఇవ్వద్దు. ఏది అవసరమో, ఏది అవసరము కాదో కనుగొనాలి. అన్నిటి విలువ ఒకటిగా ఉండదు.
b.పరిశీలనలో మనం కలుసుకొనవలసిన ఆరుగురు మిత్రులు.
i) ఎవరు? (Who) – మనం చదువుచున్న భాగంలో ఎవరున్నారు? అని పరిశీలించాలి. ఉదా : 1థెస్స. 1వ అధ్యాయం. తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, పౌలు, సిల్వాను, తిమోతి, థెస్సలోనీయ సంఘం, మాసిదోనియ, అకయవారు. మేము, మీరు, మన, మా..
ii) ఏమిటి? (What) – ఏమి జరిగినది ? ఏమి చెప్పబడినది? ఏ ఆలోచనలు వ్యక్తం చేయబడ్డాయి? ఫలితాలు ఏమిటి? అని ప్రశ్నించాలి. ఉదా : మొదట ఏమిజరిగింది? పౌలు సువార్త ప్రకటించాడు, తరువాత థెస్సలో నీకయులు రక్షించబడ్డారు. వారు మాసిదోనియ, అకయ ప్రాంతాల వారికి తమ విశ్వాసమును వెల్లడి పరిచారు. ఆ ప్రాంతాల వారు కూడా ప్రభువునందు బలపడ్డారు.
iii) ఎక్కడ? (Where:) – ఎక్కడ జరిగింది? ఆ పట్టణం ఏ ప్రాంతంలో ఉంది? అనేది ప్రశ్నించాలి (Geographical Background తెలుసు కోవాలి). ఉదా : థెస్సలోనిక మాసిదోనియా ప్రాంతంలో ఉన్నది. ముఖ్యంగా ఈ విషయాలు, భౌగోళిక పటాలు, డిక్షనరీలనుండి గమనించవలసి యుంటుంది.
iv) ఎప్పుడు? (When) – ఇది ఎప్పుడు జరిగింది? అని ప్రశ్నించాలి. ఉదా : పౌలు ఎప్పుడీ పట్టణానికి వచ్చాడు? పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ పట్టణానికి వచ్చాడు. ఎప్పుడు వ్రాసాడు? అని కూడా అడిగి తెలుసు కోవాలి. ఈ విషయాలకు చరిత్ర మనకు ఉపయోగపడును.
v) ఎందుకు? (Why) – ఇదెందుకు జరిగింది? ఇలా ఎందుకు మాట్లాడుచున్నాడు? ఉద్దేశ్యం ఏమిటి? ఏమైనా కారణాలున్నాయా? దీని కోసం ఇతర లేఖనాలను కూడా పరిశీలించాలి. ఉదా : అపొ.కా. 17,18 అధ్యాయములు చూడాలి. పౌలు కొంత శ్రమపడి ఈ ప్రాంతంలో పరిచర్య చేసిన తరువాత తిమోతిని పంపించాడు. తిమోతి వెళ్ళివచ్చి వారిని గూర్చి మంచి రిపోర్టునిచ్చాడు. దానిని బట్టి పౌలు మరొక సారి దేవుని స్తుతించి, వారిని బలపరచటానికి ఈ పత్రిక వ్రాసాడు. యేసుక్రీస్తు పునరుత్థానం గూర్చి తెలుపుచు, రెండవ రాకడకు సిద్ధపడుమని వ్రాసాడు.
vi) ఎలా? (How) – ఈ విషయాలను వారెలా చేయగలిగారు? పరిస్థితులను, సంగతులను ఎలా సాధించారు? వాటి సాధన కొరకు ఎలాంటి పద్ధతులను వినియో గించారు? అని ప్రశ్నించాలి. ఉదా : విశ్వాసమును వృద్ధి నొందించుకొనుట ద్వారా వారు సంగతులను సాధించారు.
F. మనం ప్రశ్నించి తెలుసుకోవలసిన మరికొన్ని విషయాలు :
i. మనం తీసుకొన్న లేఖన భాగం ఎలాంటి రూపం (Structure) కలిగియున్నది? అని పరిశీలించాలి. దేవుడు ఏమి చెప్పాడనేది ఎంత ప్రాముఖ్యమో ఆయనెలా చెప్పాడనేది అంతే ప్రాముఖ్యం. ప్రశ్నలు – జవాబుల రూపంలో వ్రాయబడిందా? పద్యరూపంలో వ్రాయబడిందా? గద్యరూపంలో వ్రాయబడిందా? కథా రూపంలో వ్రాయబడిందా? సంభాషణా రూపంలో వ్రాయబడిందా? ఉపమాన రూపంలో వ్రాయబడిందా? ఆజ్ఞ రూపంలో ఇవ్వబడినదా? అనే విషయాలను ఆలోచించి పరిశీలన చేయాలి. ఉదా : యోబు, సామెతలు – పద్యరూపంలోను, హబక్కూకు – సంభాషణ రూపంలోను, మలాకీ – ప్రశ్న, జవాబులు (లేక) Reasoning రూపంలోను, ఫిలేమోను కథారూపంలోను వ్రాయబడినవి.
ii). .. మనం తీసుకొన్న లేఖన భాగంలోని పోలికలు, వ్యత్యాసములు కూడా పరిశీలించి చూడాలి. ఉదా : అకయవారు ప్రభువునం గీకరించిరి. మాసిదోనియా వారు ప్రభువునంగీకరించిరి.-ఇది పోలిక. అపొస్తలులు ప్రభువును పోలినడుచుకొన్న రీతిగానే సంఘస్థులు కూడా ప్రభువును పోలి నడుచుకొనుచున్నారు. ఇది కూడా పోలికే..
విగ్రహములను పూజించువారు, విగ్రహములను విడిచిపెట్టినవారు (1:10). ఇది వ్యత్యాసం. అలాగే- హెబ్రీపత్రికలో యేసుప్రభు శ్రేష్టత్వం గూర్చి తెలియజేస్తూ ఎన్నో పోలికలు, వ్యత్యాసాలను చూపించే విషయాలు వ్రాయబడ్డాయి. పాత నిబంధనలోని లేఖనాలు క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉంటాయి. వాటి మధ్యలోని పోలికలు వ్యత్యాసాలు గమనించుట ద్వారా కూడా మనమెన్నో గమనించగలం.
iii) మన అభిప్రాయాన్ని మార్చుకొనుటకు ఇష్టపడాలి. మనం పరిశోధన చేస్తున్నప్పుడు చాల విషయాలు బయటపడతాయి. కొన్ని విషయాల్లో అప్పటికే మనం కలిగియున్న అభిప్రాయాలను మార్చుకొనవలసి వుంటుంది. ముఖ్యంగా మనం దేవుని వాక్యాన్ని చూచేటప్పుడు ముందుగానే కొన్ని అభిప్రాయాలు (Preconceived Ideas) కలిగియుండుట మంచిది కాదు. ఉదా : 1థెస్స 2:14-16 చదివితే, యూదులు దేవుని దాసులను చంపినవారుగాను, దుష్టులుగాను, దేవుని పనికి వ్యతిరేకులు గాను కనబడతారు. కానీ, వాస్తవానికి యూదులు ఎంతో ఉన్నతమైనవారు. వారున్నూ ఎంతో భక్తిపరులు. మరి ఎందుకు అలా చేసారంటే, వారు అతిగా ప్రేమించే తమ నుతానికి కలిగే విఘాతమును సహించలేక సువార్తను అడ్డగించారు. ఇక్కడ పౌలు ఉద్ధేశ్యం వారి మీద నెపమెయ్యాలని కాదు. తాము యూదులనుండి శ్రమలు పొంది ఎలానడిచారో, ఎలా విశ్వాసాభివృద్ధి సాధించారో తెలియజేస్తూ, మీరు కూడా మావలెనె మీ సొంత దేశస్థుల వలన శ్రమలు పొంది క్రీస్తులో నిలబడ్డారని . వారిని బలపరచటానికి పౌలు వ్రాసాడు. కానీ, మనము ముందుగానే యూదుల గూర్చి ప్రతికూల అభిప్రాయము ఏర్పరచుకొని చదివితే ఈ భావమంతా అర్థంకాదు. అందుచేత మనము బైబిలు దగ్గరకు వెళ్ళేటప్పుడు మనము అప్పటికే కొన్ని అభిప్రాయములను ఏర్పరచుకొని వెళ్ళకూడదు.
2) వ్యాఖ్యానము (Interpretation) – ఇందు Bible విద్యార్థి వహించవలసిన పాత్ర ‘ఒక అభిప్రాయానికి రావటం’ (లేక) ‘నిర్ణయమునకు వచ్చువాడు’ (Decision Maker). దీనిలో మనం వేయవలసిన ప్రశ్నలు – దీని అర్థం ఏమిటి? అవి ఎవరికివ్వబడ్డాయో ఆ విషయాలు ఆనాటి ప్రజలకు ఏ భావాలు కలిగించాయి? ఇది ఏవిధంగా పనిచేస్తుంది? గ్రంథకర్త » తెలియజేయాలనుకొంటున్న ముఖ్యమైన ఆలోచన ఏమిటి? మున్నగునవి మనమెంచుకొన్న భాగము యొక్క అర్థాన్ని గ్రహించి, దాన్ని స్పష్టముగా వివరించు ప్రక్రియయే ‘వ్యాఖ్యానం’. గ్రంథకర్త అతని కాలంలో నున్న ప్రజలకు అందించిన విషయాల వెలుగులో దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించవలెను.
- దీనిలో ముఖ్యంగా మూడు విషయాలను నేర్చుకోవలసియున్నాము.
ఉద్ధేశ్యము – గ్రంథకర్త ఎందుకు ఈ అంశాన్ని తీసుకొస్తున్నాడు? (లేక) ఈ అంశాన్ని గూర్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? అనే విషయాన్ని మనం మొదటిగా నిర్ణయించవలసియున్నాం. గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యాన్ని మనం గ్రహించవలెను. లేఖనాలు ఊరకనే / ఉద్దేశ్య రహితముగా వ్రాయబడినవి కావు. అవి అన్నియు ప్రత్యేక ఉద్దేశ్యములతో వ్రాయబడినవే. (రోమా 15:4; 1 కొరింథీ. 10:11). కాబట్టి మనం ఆ భాగము వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని కనుగొనవలసియున్నాము. వ్యాఖ్యానికి మొదటి మెట్టు ఈ ఉద్దేశ్యం.
ఉదా : i) గలతీ పత్రికను పౌలు వ్రాయుటలో గల ఉద్దేశ్యము : పౌలు గలతీయ ప్రాంతములో సువార్త ప్రకటించి, సంఘములు స్థాపించిన తరువాత ఆ ప్రాంతములో కొందరు యూదులు వెళ్ళి ధర్మశాస్త్రము వలననే మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడతాడని, రక్షణ పరిపూర్తికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అవసరమనే దురుపదేశమును చేసారు. అందువలన ఆ బోధలను త్రిప్పికొట్టి అక్కడి విశ్వాసులలో ధర్మశాస్త్రము వలనను గాక విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడగలరన్న పునరుద్ఘాటన చేయాలనే ఉద్దేశ్యముతో పౌలు ఈ పత్రికను వ్రాసాడు.
ii) యోహాను తన సువార్తను వ్రాయుటలో గల ఉద్దేశ్యము : యేసు ‘దేవుని కుమారుడైన క్రీస్తు’ అని లోకానికివిశదపరచాలని వ్రాసాడు (యోహా 20:31).
III) హెబ్రీ పత్రిక 1,2 అధ్యాయములు చదివితే- అక్కడ గ్రంథకర్త మొదట నుండి యేసును, దూతలను. పోల్చుచున్నాడు. దేవుడు దూతలద్వారా తన వర్తమానాన్ని ప్రజలకు పంపించాడు.-కాని దూతల ద్వారా దేవుడు పంపించిన వర్తమానము కంటే యేసు క్రీస్తు ద్వారా పంపిన వర్తమానము శ్రేష్టమైనది. అనగా యేసుక్రీస్తు అన్ని విధాల దూతల కంటే శ్రేష్టుడు అని చూపించటానికి గ్రంథకర్త ప్రయత్నిస్తున్నాడు. ఆ ఉద్దేశ్యాన్ని ” మనము గమనించాలి.
iv) నిర్గమకాండంలో ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణాన్ని మనం పరిశీలిస్తే వారు సుమారు నాలుగు దినాలలో పూర్తి చేయవలసిన కనాను దేశ ప్రయాణాన్ని నలభై సంవత్సరములు సీనాయి అరణ్య ప్రాంతాలలో సంచరించి చేరినట్లు కనబడును. దేవుడు ఎందుకు వారిని అన్నిదినాల పాటు అక్కడక్కడే సంచరింపజేసాడు? అందులకు గల ఉద్దేశ్యాలను మనం గ్రహించాలి.
b. ముఖ్యమైన ఆలోచన (Key Thought, Theme, Big Idea) – మన మెంచుకొన్న భాగము యొక్క, గ్రంథకర్త యొక్క సారాంశము, ఆలోచన ఏమిటి? అన్న విషయాన్ని ఒక వాక్యరూపములో పెట్టాలి. అది సాధ్యమైనంత సింపుల్గా ఉండుట ఎంతో అవసరం. ఎంత పెద్ద వాక్యమైతే అంత అయోమయంగా ఉండును.
ఉదా : i) పేతు. 2వ అధ్యాయ మంతటిని చదివినపుడు మనకు కలిగే ముఖ్యమైన ఆలోచన – క్రీస్తు నిమిత్తం విశ్వాసులు విరుద్ధ భావాలు (శతృధోరణి) కలిగిన ఈ లోకంలో శ్రమ పొందుచు క్రీస్తు మాదిరిని చూపించాలి (19వ).
ii) హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు విశ్వాస వీరులు కనబడతారు. అట్టి వారిలో రాహాబు చేర్చబడినట్లుగా గమనించగలం (31వ). ఎందుకు చేర్చబడినది? అని ఆలోచన చేస్తే – దేవున్ని గూర్చి తనకు తెలిసినది కొద్దిపాటే అయినప్పటికీ దేవుని కొరకు కొంత త్యాగం చేయ తెగించెను.
c. ప్రవాహము (Flow) – గ్రంథకర్త తాను చేరాలనుకొన్న గమ్యాన్ని ఎలా చేరుతున్నాడు? తాను చెప్పదలచుకొన్న దానిని ఎలా చెప్తున్నాడు? తన ముఖ్యాంశాన్ని ఎలా చూపిస్తున్నాడు? వాద ప్రతివాదనల రూపంలోనా? కథారూపంలోనా?, సంభాషణారూపంలోనా?, పాయింట్స్ వారీగానా? (లేక) మాదిరి ద్వారానా? అనే విషయాన్ని గమనించాలి.
ఉదా : ‘ ప్రార్థన’ అనే అంశాన్ని గూర్చి యోహాను ఎలా చెప్తున్నాడు? (లేక) ‘ విశ్వాసము’ గూర్చి యేసు తన శిష్యులకు నేర్పించాలను కొన్నాడు. దాని నెలా నేర్పిస్తున్నాడు? దాని నెలా కొనసాగించాడు? గ్రంథకర్త తన భావాన్ని, తన లక్ష్యాన్ని చదువరులకు, వినువరులకు ఎలా నేర్పిస్తున్నాడు?
రచయిత : పాస్టర్.M.Prasad Garu
బైబిల్ ప్రశ్నలు – సమాధానాల కోసం .. click here
బ్రదర్ ప్రసంగశాస్రం ను pdf download చేసుకోవచ్చా.