ద చర్చ్ ఆఫ్ సేటన్ !
Unmasking the Church of Satan
“రెండు రకములుగా మనం మోసపోవచ్చును. ఒకటి నిజము కాని దాన్ని నమ్మడం, రెండవది నిజమును నమ్మకపోవడం!” అని సోరెన్ కిర్క్షా గార్డ్ వ్రాసాడు. ప్రస్తుతపు పరిస్థితి ఈ ప్రకటనతో చక్కగా సరిపోతుంది. నిజమైన ప్రేమగల దేవుని యందు విశ్వాసముంచి ఆయనను ఆరాధించుట కన్నా, అబద్ధికుడును, ఆత్మల వినాశకుడునైన అపవాది లేక సాతాను నందు విశ్వసించి వానిని ఆరాధించే వారి సంఖ్య ప్రపంచమంతట పెరుగుతోంది! “సేటనిసమ్” (Satanism) క్రొత్త మతంగా కొంగొత్త హంగులతో అనేకులను దాని మత్తులోనికి లాగుతోంది. ఎక్కువ శాతం యువత సేటనిసమ్ వైపు ఆకర్షించబడుతోంది. “లోకమంతటిలో దుష్టుడు” గా పేరుగాంచి చిన్నతనంలోనే (ప్రకటన గ్రంథము 13) వ అధ్యాయములోని దుష్ట మృగంతో పోల్చబడిన అలిస్టర్ క్రౌలీ ఇంగ్లాండులో బ్లాక్ మ్యాజిషియన్గా, సేటనిస్ట్ గా గుర్తించబడ్డాడు. “నీ చిత్తము చేసుకో” అను నినాదముతో సాతాను సిద్దాంతమును ప్రచారం చేసాడు. కామవికార చేష్టలతో మత్తు పదార్థములతో మాంత్రిక శక్తులతో కూడిన జీవితం అతనిది. ‘ఇచ్చ కలిగి, పంచేంద్రియాల తుచ్చ కోర్కెలను తీర్చుకోవాలని’ శాసించాడు. రాక్ అండ్ రోల్ తారలు సేటనిస్ట్లుగా మారుటకు నరబలులను అర్పించుటకు క్రౌలీ కారకుడు.
అమెరికాలో ఆన్లైన్ సాండర్ లావే మొదటిసారి 1966లో శాన్ ప్రాన్సిస్కోలో “ద చర్చ్ ఆఫ్ స్టేటన్” స్థాపించాడు. సాతాను ఆరాధన జరిపించుటకై తాను ప్రధాన యాజకుడయ్యాడు. “ద సేటానిక్ బైబిల్” అని సాతాను పేరిట అబద్దములను, అవాంఛనీయమైన వాటిని పొందుపరచి బైబిల్గా చేసాడు. దాదాపు 10 లక్షలకు పైగా సేటానిక్ బైబిల్స్ ముద్రించబడ్డాయి. ఇతర భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. సాతాను పేరిట విచ్చలవిడి కార్యకలాపాలను జరపడం వీరి ముఖ్య ఉద్దేశ్యం! మొదట రహస్యంగా జరిగిన సాతాను ఆరాధనలు ఇప్పుడు బహిరంగముగా, నిర్భయంగా జరుగుతున్నాయి. భారతదేశంలో పలు పట్టణాలలో సేటన్ చర్చీలు మొదలయ్యాయి! సేటనిస్ట్లు తమను తాము బలపరచుకునే ప్రయత్నంలో ఉన్నారు. సేటనిసమ్ క్రూరమైన స్వార్ధపు మతము. మానవుడు పూర్తిగా స్వార్థపరుడు మరియు హింసాత్మక జీవి అను దానిపై ఆధారపడినది. కేవలం గెలుపు కొరకు పోరాడే వారే లోకాన్ని పాలిస్తారన్నది వారి వాదన. “సాతాను మా వ్యక్తిగత రక్షకుడు. శారీరక మరియు లౌకిక అవసరతలు తీర్చువాడు” అని ఆంటన్ లావే వ్రాసాడు. సేటనిసమ్లో సాతానును ఆరాధించుట మరియు బ్లాక్ మ్యూజిక్ ఆచరించుట ప్రధాన లక్ష్యాలు. సేటనిసమ్ క్రైస్తవ సంఘము మరియు దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది. “నీ ఇష్టమొచ్చినది చేసుకో” అను సూత్రముతో స్వంత ఆరాధనను పెంపొందిస్తోంది. సేటనిసమ్ మైండ్ కంట్రోల్ మరియు భయము ద్వారా బానిసత్వంలోనికి తీసుకెళు తుంది. జంతుబలి, రక్తపూజలు, సెక్స్, డ్రగ్స్ మరియు కొన్నిసార్లు నరబలి లేక హత్యలతో కూడుకున్నది. అమెరికాలో సేటనిస్ట్లు అనేక హత్యలు చేసారు. ఈ మద్య ఓ జర్మన్ దంపతులు తమ స్నేహితుడిని తమ ఇంటికి పిలిచి అక్కడ అతని 66 సార్లు కత్తితో పొడిచి చంపి పైశాచికంగా ప్రవర్తించారు. కొందరు మనుష్య రక్తమును త్రాగే వాంపైర్స్ గా మారిపోయారు. సేటనిస్ట్ ల్లో కూడ వివిధ రకాలు వున్నారు. మామూలుగా వుండే వారి నుండి బాగా పిచ్చి ముదిరిన వారి వరకు కనబడతారు.
సేటనిస్టులు క్రైస్తవ విలువలను మరియు సంఘము యొక్క పరిశుద్ధ క్రమములను హేళన చేస్తారు మరియు అపవిత్రపరుస్తారు. ఉదాహరణకు ప్రభువు నేర్పిన ప్రార్థనను వెనుక నుండి చేయడం, మధ్యలో దేవదూషణ పదాలను కలపడం వారికి మామూలే. ప్రభువు బల్లలో పాత్రను జంతువు లేక మనుష్య రక్తంతో, మూత్రం లేక మరో దానితో నింపి తమ నీచ ప్రవృత్తిని చూపిస్తారు. అదే ప్రకారం రొట్టె స్థానంలో అపవిత్రమైన పదార్థాలను వాడతారు. “బ్లాక్ మాస్” అను పేరుగల ఈ కార్యక్రమం అవాంఛనీయమైనది. సాతాను పేరిట నగ్న బాప్తిస్మాలు, నిబంధనలు జరిపిస్తారు.
క్రైస్తవ్యంపై దాడి చేస్తూ దాని ఆచారాలనే కాక క్రైస్తవ సిద్ధాంతాలను కూడ విడిచి పెట్టలేదు. అంతా పూర్తిగా క్రైస్తవ్యానికి భిన్నంగా, పోటీగా జరుగుతోంది. క్రైస్తవ్యంలో వినయం మరియు నిస్వార్థము గుణలక్షణాలైతే సేటనిసమ్ గర్వము మరియు దురాశ కోరదగిన లక్షణాలు. క్రైస్తవులు మంచిది అను దాన్ని సేటనిస్ట్లు చెడ్డదని అంటారు. నిజానికి క్రైస్తవ కుటుంబాలు మరియు సంఘాలు పతనమవ్వాలని సేటనిస్ట్లు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. నీ పూర్ణ హృదయముతో నీ శత్రువులను ద్వేషించు, ఒకవేళ ఎవడైనా నిన్ను ఒక చెంపపై కొడితే నీవు వాని చెంప పగులగొట్టు అని నేర్పుతారు! జీవితాన్ని గొప్ప విందులా మజా చేసుకోవాలి. మరణం ముగింపు కనుక ఇక్కడ ఇప్పుడే నీ జీవితాన్ని అనుభవించు అని బోధిస్తారు.
యౌవన సేటనిస్ట్లు, బలవంతులు సాతానుతో పరిపాలిస్తారని నమ్ముతారు. వారు సేటనిసమ్ పూర్తిగా మునిగిన తరువాత సాతానుతో నిబంధన చేస్తారు. సాతానుకు తమ ఆత్మలను అమ్ముకుంటారు. భవిష్యత్తులో ఫలాన తేదిన తాము ఆత్మహత్య చేసుకుంటామని తమ నిర్ణయాన్ని తెలుపుతారు. సాతానుకు తమను తాము మరణము ద్వారా సమర్పించుకుంటే, తరువాత జీవితంలో వారు సాతానుతో పాటు తిరిగి వచ్చి బలవంతులై యేలుతారన్నది వారి విశ్వాసం! ఈ మధ్య జరిగిన ఓ సర్వేలో తేలిన విషయం రోజుకు పద్నాలుగురు యౌవనస్తులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు! సేటనిసమ్లో కొన్ని రహస్యాలుగానే కొనసాగుతాయి. సేటనిస్ట్లు వ్యక్తిగత క్రియలకు, ఆచారాలకు, ఇతర విషయాలకు సంబంధించి ఒక డయరి వ్రాసుకుంటారు. కోడ్ భాషలో ఎవరికి అర్థం కాకుండా వుండుటకు వ్రాసుకుంటారు. శరీరాలపై మేక తల, తలక్రిందులుగా వుండే సిలువ, పెంటగ్రామ్, మానవ పుర్రె, నల్ల గులాబి, స్వస్తికా మొదలగు పచ్చబొట్లు పొడిపించుకుంటారు.
సేటనిసమ్ ఒక వికారమైన వ్యవస్థ. ఎందరో అమాయకులు ఈ ఊబిలో దిగబడ్డారు. కొందరు అంతా తెలిసి, కొందరు ఏమి తెలియక దీనికి బలైపోతున్నారు. సాతాను పరలోకంలో ఆరాధింపబడకపోయినా ఇహలోకంలో పలు రకాలుగా ఆరాధింపబడుతున్నాడు. సేటనిస్ట్ల కొరకు ప్రార్థించాల్సిన అవసరత వుంది. దేవుని కృప ఎక్కడికైనా వెళ్ళగలదు. ఎవరినైనా చేరగలదు. ఎట్టి పాపినైన కనికరించగలదు. కట్లుత్రెంచి విడిపించగలదు. ఎందరో సేటనిస్ట్లు క్రీస్తు కృప చేత విడిపింపబడి నేడు క్రైస్తవ విశ్వాసులుగా మరియు సేవకులుగా ఉన్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసి, వారి కొరకు నీవు పట్టుదలతో ప్రార్థించగలవా? వారు నీకు తారసపడితే ప్రభువు పేరిట వారికి సువార్త అందించగలవా? వారి కొరకు కనీసం ఒక రోజైన ఉపవాసముండి దేవుని సన్మిధిలో విజ్ఞాపన చేయగలవా? నీవు ఈ విధముగా చేయగలిగితే వీరి విషయం గొప్ప వ్యత్యాసం కలిగించిన వ్యక్తివి అవుతావు.
ప్రత్యక్ష గుడారం కొరకు.. click here





