విలియం కేరీ
William Carey Missionary Biography in Telugu
విలియం కేరీ తన చిన్నతనంలోనే ‘సాహసం తన జీవిత విధానం కావాల’ని ఆశించాడు! ఒకరోజు ఎత్తైన చెట్టు మీద నుండి క్రింద పడి, తన పడక గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఓ పక్షి గూడు అందుకోవాలని అంత పాటుపడ్డాడు! నిరుత్సాహపడడం ఎరుగని ఈ బాలుడు; గాయం తగిలినా, చెట్టు పైకి ప్రాకిపోయి, ఆ గూడు చేరు కొన్నాడు. దాని ద్వారా తన చేతిలో ఉన్న పనిని ఎంత కృత నిశ్చయంతో చేసే వ్యక్తి ఇతడో అర్ధమవుతుంది! ఈ ఉదంతం అతడి పరిచర్య అంతటికి ఒక తార్కాణం! అతని చిన్ననాటి ‘హీరో’, భారత దేశం కనుక్కోవాలని పయనం కట్టి, అమెరికా రేవుల్లో చేరిన కొలంబస్!
విలియం కేరీ 1761లో పుట్టాడు. తన 12వ యేట బడిలో నుండి వైదొలగి, 14వ యేట చెప్పులు కుట్టేవాని వద్ద పనికి కుదిరాడు. దైవికమైన తల్లిదండ్రులు జాగ్రత్తగా మలుచుకున్న ఈ యువకుడి జీవితం; ఇప్పుడు చెడ్డ సహవాసానికి అలవాటయ్యింది. కాని తనతోపాటు పనిచేస్తున్న వార్డ్ అనే యువకుని మాదిరి జీవితం ఇతనిని ఆకట్టుకొంది! అది ఎప్పుడూ తన హృదయాన్ని గుచ్చుతూ ఉండేది! ఓసారి ఆ దుకాణపు డబ్బుపెట్టెలో నుండి ఓ నాణేన్ని దొంగిలించి, ఎంతో మానసిక వ్యధతో కృంగిపోయాడు. ఆ తరువాత అతని పాస్టర్ అతనిని క్రీస్తు చెంతకు నడిపించాడు. అది కేరీ జీవితంలో ఓ మైలురాయి!
అతడి చేతులు చెప్పులు కుడుతూ ఉండగా, అతడి కన్నులు తన యెదుటనే ఉంచుకొన్న గ్రంథంలోని ప్రతి వరుసను చదువుతూ ఉండేవి! అలా అనన్య సామాన్య కృషి చేసి; లాటిన్, గ్రీకు, ఫ్రెంచి, ఇటాలియన్, డచ్ మొదలైన భాషలన్నింటినీ నేర్చుకొన్నాడు. హెబ్రీ భాష నేర్చుకోవడానికి అతడు అప్పుడప్పుడు 15 కి.మీ. నడిచేవాడు. ఆ రోజుల్లో దక్షిణాది దీవుల విషయం, అక్కడ సువార్త వినకుండా నశించిపోతున్న వేలాది ప్రజల విషయం విన్నప్పుడు; అతడు ఎంతో భారంతో ప్రార్ధించడం మొదలు పెట్టాడు.
అతడు ఓ ప్రపంచ పటాన్ని తాను పనిచేసే బల్ల ముందు గోడ మీద అతికించి; అందని ఆయా దేశాలన్నింటి కోసం పనిచేస్తూనే, ప్రార్థిస్తూ ఉండేవాడు! ఆ ప్రపంచ పటం ముందు ప్రతి దినం మూడు మారులు మోకరించి, సువార్త అందని ప్రతి దేశం కోసం ప్రార్థించేవాడు! అలా కేరీ మోకరించినప్పుడెల్లా అతని కళ్ళ నుండి వెచ్చని భాష్ప బిందువులు రాలుతూ ఉండేవి! అతడి హృదయాన్ని బ్రద్దలు కొట్టిన బాధగా ఉన్నట్టు తెలిపే బిందువులు అవి!
అప్పుడు విలియం కేరీ సువార్త అందని ప్రాంతాల కోసమైన భారం తండ్రియైన దేవుని వద్ద నుండి పొందాడు. దూరప్రాంతాలకు సువార్తను మోసుకెళ్ళే భారం, సవాలు అతడు అందుకొన్నాడు. సిలువను మోసుకొని, క్రీస్తును వెంబడించ వలసిన ఘడియ, సువార్త అందక నశిస్తున్న ప్రజల కోసం తన ప్రాణం ధారపోయ వలసిన ఘడియ ఆసన్నమైనదని కేరీ గుర్తించాడు!
‘ఓ యువకుడా, కూర్చో! దేవుడు తన వైపుకు ప్రజలను మళ్ళించాలనుకొంటే, నీ సహాయం లేకుండానే చేయగలడు’ అంటూ మొరిగినట్టుగా అరిచాడో వృద్ధుడైన పాస్టర్! ఆ నిలబడ్డ యువకుడు, విలియం కేరీ! అతడు ఓ కూటములో నిలుచుండి; సువార్తను మోసుకెళ్ళవలసిన భారం, బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంటుందని చెప్పి నందుకు ఆ జవాబు! కొందరు కేరీ యొక్క సామాన్యమైన జీవితం, సువార్త ప్రకటన పరిచర్యలో అతడికి దోహదకారిగా ఉండదేమో అనుకొన్నారు! కాని, కేరీ మాత్రం తాను చెప్పులు తయారుచేసినా, బాగుచేసినా; అది కేవలం జీవనోపాధియే గాని, అతని నిజమైన పని దేవుని రాజ్య నిర్మాణం అని దృఢంగా నమ్మాడు!
అతడు నిశ్చలంగా ‘దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులే నిరీక్షించండి, దేవుని కోసం గొప్ప కార్యాలే చేయండి’ అంటూ బయల్దేరాడు! 1793, జూన్ 13న 32 యేండ్ల విలియం కేరీ, అతడి భార్య, నలుగురు పిల్లలతో ఇంగ్లాండ్ నుండి పయనమయ్యారు. 4 నెలలు కఠినమైన ప్రయాణం చేసి, కలకత్తా చేరుకొన్నారు. ఈ ప్రయాణంలో బెంగాలీ భాష ఎంత చక్కగా నేర్చుకొన్నాడంటే, కలకత్తాలో అడుగుపెట్టాక అనర్గళంగా బెంగాలీ మాట్లాడగలుగుతున్నాడు, సువార్త పంచుకో ‘ గలుగుతున్నాడు కూడా! అలాగే హిందూస్థానీ, పార్సీ, మరాఠీ, సంస్కృతం కూడా నేర్చుకొన్నాడు.
కేరీ భారత దేశంలో గడిపిన మొదటి సంవత్సరంలోనే, అతడి అయిదేళ్ళ > కుమారుడు పీటర్ను పోగొట్టుకొన్నాడు. ఎవరూ ఆ మృత దేహాన్ని పాతిపెట్టడానికై గుంట త్రవ్వడానికి ముందుకు రాకపోగా; కేరీ వ్యాధిగ్రస్థుడుగా ఉన్నా, వేదనలో ఉన్నా; అతడే గుంట త్రవ్వి, కుమారుని మృత దేహాన్ని పాతిపెట్టాడు. జీవనోపాధికై అతడు పనిచేస్తున్న ఇండిగో కంపెనీ నష్టాన్ని బట్టి మూసివేయబడింది. కేరీ తన బ్రతుకుదెరువు కూడా పోగొట్టుకొన్నాడు.
ఓ అగ్ని ప్రమాదంలో బైబిల్, ఇతర క్రైస్తవ సాహిత్యం ముద్రించ డానికై కేరీ స్థాపించిన ముద్రణా లయం ధ్వంసమైపోయింది. అయినా కేరీ ముందుకు సాగిపోయాడు. 7 సంవత్సరాలు శ్రమించిన తరువాత కృష్ణపాల్ అనే ఓ హిందూ మేదరి మారుమనస్సు పొందాడు. 1798లో ఇంకో నలుగురు మిషనెరీలు అతనిని చేరాక, కేరీ సెరంపూర్ను అతడి ముఖ్య స్థావరంగా మార్చుకొన్నాడు. 1800 సంవత్సరంలో కేరీ, అతడి తోటి మిషనెరీలు కలిసి ‘సెరంపూర్ కాలేజి’ ప్రారంభించారు. ఈనాటికీ ఈ కాలేజి ఒక్కటే, మన దేశంలో ప్రభుత్వంచే ఆమోదించ బడిన వేదాంత విద్యా డిగ్రీలను అందిస్తున్న కళాశాల!
కేరీ శ్రమించిన 22 సంవత్సరాల్లో 26 సంఘాలు స్థాపించబడ్డాయి! తన మరణానికి ముందు క్రొత్త నిబంధనను 40 భాషల్లోనికి అనువదించాడు. పూర్తి బైబిల్ను 20 భాషల్లోనికి అనువదించాడు. సతీసహగమనం అన్న దురాచారాన్ని తీవ్రంగా నిరసించి, ఎదిరించాడు. దానికి వ్యతిరేకంగా చట్టం కూడా చేయబడింది. ప్రభుత్వం కేరీ కోరికను మన్నించి, శిశువులను గంగా నదిలో పడేయటాన్ని నిషేధించింది!
ఈ గొప్ప మిషనెరీ భారత దేశంలో 41 సంవత్సరాలు నివ సించాడు. ఒక్కసారి కూడా తిరిగి ఇంగ్లాండు వెళ్ళలేదు. తన 74వ యేట కన్ను మూసి, భారత భూమిలో పాతిపెట్టబడ్డాడు. ఈయనను ‘భారత దేశపు మిషనెరీ ఉద్యమానికి పితా మహుడు’ అనటంలో ఆశ్చర్యం ఉందా?
For More Stories…..Click Here





