లోకాశ – శరీరాశ
Best Sunday School Story Telugu
“లోకాశ” అనే ఊరిలో “శరీరాశ” అనే ఒకతను ఉండేవాడు. ఆ ఊళ్ళో ఇతడే బీదవాడు. జీవితములో ఏనాటికైనా పైకి రావాలి అనే కోరిక అతణ్ణి వేధిస్తూ ఉండేది. ఇతరులను చూసినప్పుడెల్లా కొంచెం అసూయతో రగిలిపోయేవాడు. ఎందుకంటే – వీరికి నాకంటే ఎక్కువ ధనం ఉంది. పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్టుమెంట్లు, మంచి పేరు, పరపతి ఉంది. వీరందరిని నేను మించిపోవాలి, లేదా వీరిలో ఒకడిగానైన మిగిలిపోవాలి అంటూ నిత్యం తలపోసుకుంటూ ఉండేవాడు.
అప్పట్నించి శరీరాశ అదే దిశగా ప్రయత్నాలు సాగించాడు. తన యవ్వన కాలము నుంచి బాగా కష్టపడి పనిచేసేవాడు. సంపాదనే తన ఏకైక ధ్యేయంగా పెట్టుకొని వ్యాపారం చేసి తను కోరినట్టే అనతి కాలంలోనే ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. ఆ వూరి నడిబొడ్డులో పెద్ద అపార్టుమెంటూ, ఆ వూరికి ఉత్తర దిక్కులో పది ఎకరాల పొలమూ, చూస్తేనే ఈర్ష్యపడదగినంత అందమైన భార్యనూ, ముగ్గురు పిల్లలనూ, వేరే నగరంలో రెండు మూడు బిల్డింగులను సంపాదించాడు. అప్పటికే నలభై ఐదు సంవత్సరాలు నిండిపోయాయి శరీరాశ గారికి, అంగరంగ వైభవంగా అత్యాధునిక సౌకర్యాలతో కట్టించిన ఓ పెద్ద భవనాన్ని అతిరధమహారధులతో గృహ ప్రవేశం చేయించాడు. అందరును దానిని చూసి, ఔరా అని ఆశ్చర్యపోయారు. వచ్చిన బంధు బలగం, స్నేహిత ఆప్త శ్రేయోభిలాషులు అందరును తన గొప్పతనాన్ని గూర్చి మాట్లాడుకోవడం శరీరాశకు ఎక్కడలేని ఆనందాన్ని కల్గించింది. లోలోపలే మురిసి ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.
ఆ సాయంకాలం శరీరాశ భార్య “జీవపు డంబం” గారు తన స్నేహితులతో ఆ రోజు జరిగిన కార్యక్రమాలను గూర్చి గొప్పగా మాట్లాడుతోంది ఫోన్లో. “స్వనీతి స్వప్రియ మరియు స్వార్థము” అనే ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా “లోక భోగం యవ్వనేచ్ఛ, కామకుమారి” అనే పేరుగల ఫ్రెండ్స్తో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ప్రక్కగదిలో.
ఆ రోజు ఎక్కువగా కష్టపడిన శరీరాశకు అలసట ఎక్కువైపోయింది. కాస్తంత నడుము వాల్చి అవతలి గదిలో విశ్రాంతి తీసుకోవాలని అనిపించి నిద్రకు ఉపక్రమించాడు. అంతలో మెల్లనైన ఒక స్వరం తన చెవిలో వినిపించింది. త్రుళ్లిపడి లేచి అటు ఇటు చూడసాగాడు. ఎవరూ కనిపించకపోయేసరికి మళ్లీ కళ్లు మూసాడు. మరల అదే స్వరం -“నేను ఉండలేను, వెళ్లిపోతున్నా” అని వినిపించింది.
ఈ సారి భయంతో “ఎవరది?” అన్నాడు శరీరాశ.
“నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా” అంటూ ప్రతిధ్వనించింది ఆ స్వరం.
“అయ్యో, నీవు వెళ్లిపోతే నేనేమైపోతాను? నీవు లేక నేను ఉండలేను కదా! నీవు ఉంటేనే నాకు జీవితం. నీవు లేని నేను మృతం. వద్దు ప్లీజ్ నీవు వెళ్లొద్దు. నా జీవితమంతా నీ కోసమే కష్టపడ్డాను. ఈ భవనాన్ని చూడు! ఇవన్నీ నీ కోసమే కదా! నాలోనే ఉండిపో! ప్రతీది నీవు అనుభవించొచ్చు” అన్నాడు కంగారుగా శరీరాశ.
“అనుభవించాలా… ఎలా? నీకు డయాబెటిస్ కాబట్టి తియ్యని పదార్థాలు తినలేను. బి.పి. ఉంది కాబట్టి కారంపై ప్రేమను చంపుకున్నాను. ఇష్టమైంది కదాని ఏ పదార్థమునైనను తినలేను – ఎందుకంటే నీ జీర్ణాశయం మందగించింది. నీ బాడీ మొత్తం తల నుంచి పాదాల దాకా రోగాల పుట్ట. అడుగు తీసి అడుగు వేయటానికీ నీవెంత ఆయాసపడతావో మనిద్దరికీ తెలుసు. ఇలాంటి నీలో నేను ఎలా ఉండగలను? నువ్వే చెప్పు. నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాస స్థలం. నా యింటికి ఉన్న తొమ్మిది ద్వారాలకు అన్నీ సమస్యలే. ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంటిలో ఎవరైనా నివసిస్తారా? నాకు రక్షణ లేదు… సుఖమూ లేదు. నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం?
అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు – డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటనుండి నన్నసలు నీవు పట్టించుకోలేదు, నిద్రపోనియ్యలేదు. నాకు విశ్రాంతి లేకుండా చేసేశావు. ప్రతి క్షణం ఇతరులతో పోటీపడి నాలో అసూయ నింపేశావు. ఇంకొకన్ని వెనక్కి తోసెయ్యటానికీ నాతో కుట్రలు చేయించావు. పగతో, ఈర్ష్యతో నన్ను ఎలా రగిలిపోయేలా చేశావో నీకు గుర్తుండే వుంటుంది. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా ఇంతసేపు నీతో నేను వాదించి నాకేంటి లాభం?… నేను వెళ్తున్నా” అంటూ వెళ్లింది ఆత్మ.
పిల్లలూ అర్థమైంది కదా స్టోరీ! పేరు, డబ్బు, జ్ఞానం, వస్తు వాహనాలు సంపాదించడమే జీవిత పరమార్థం కాదు. దేవుడు మనకిచ్చిన శరీరము ఎ) దేవునికి అది నివాస స్థలము. దేహము దేవుడిచ్చిన ఆలయమని వాక్యములో రాయబడింది. దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తగినంత విశ్రాంతి నివ్వాలి. దీనితో మనం అసహ్యమైన పాడు పనులు చేయించి శాపానికి గురిచెయ్యకూడదు.
మన పెద్దలు – ఆరోగ్యమే మహా భాగ్యము అని చెబుతారు కదా! ఎన్ని భాగ్యాలు అనుభవించాలన్నా, మనకు ఆరోగ్య భాగ్యము ఉంటేనే మనం అనుభవించగలిగేది! మన యేసయ్య రేపటిని గూర్చిన చింత వదిలిపెట్టమన్నాడు. రేపు ఎలానో… ఏం జరుగుతుందో… ఏం చెయ్యాలో అని ఈ రోజునుంచే ఆలోచించడం ప్రారంభిస్తే రేపు అనేది విషాదకరంగా మారిపోతుంది.
కొంతమంది మంచి వయస్సులో ఉన్నప్పుడు తమ క్షేమాన్ని మరచి సంపాదన సంపాదన అంటూ కష్టపడి డబ్బు సంపాదిస్తారు. అయితే ఇప్పుడు కష్టపడి సంపాదించిన దానిని రేపు రోగాలు బాగుచేయించుకొనుటకు ఖర్చుపెడతారు. అదేమన్నా లాభమా చెప్పండి!
మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి! ఆనందించడానికి కష్టపడాలి! ఇతరులకు సాయం చెయ్యడానికి కష్టపడాలి! దేవునికియ్యడానికి కష్టపడాలి! అంతే కాని… మనం పోయిన తర్వాత ఈ లోకమందు లేని లైఫ్ గూర్చి కష్టపడటంలో అర్థమేముంది??
Best Sunday School Story Telugu
66 పుస్తకాల వివరణ .. click here





