మార్కు సువార్త వివరణ
Gospel of Mark Explanation In Telugu
మార్కు సువార్తను మార్కు వ్రాసాడు అనడానికి సువార్తలో ప్రత్యేకంగా ఎలాంటి ఆధారాలు లేవు కాని ఆది సంఘము మార్కు యోహానే ఈ సువార్తను వ్రాశాడని ఏకగ్రీవంగా అంగీకరించిరి.
ఎవరీ మార్కు?
ఈయన మార్కు యోహాను అని కూడా పిలువబడ్డారు. (అపో.కా 12:25) ఇతడు బర్నబా యొక్క సహోదరుడు (కొల. 4:10). యెరుషలేములో తన తల్లియైన మరియతో కలిసి మొదటి తరము వారైన క్రైస్తవుల మధ్య పెరిగాడు. పేతురును చెరసాలలో బంధించినప్పుడు విడుదల నిమిత్తం ప్రార్ధించుట కొరకు సంఘము కూడుకొన్నది వీరి గృహమునకు ఈ విధంగా వీరి గృహిణిలు ప్రార్ధించుట ఆది సంఘముతో ఎంతో అనుబంధం ఉంది. పౌలు, బర్నబా యెరుషలేము నుండి అంతియొకయకు తిరిగి వచ్చినప్పుడు వారితో కూడా ఉన్నాడు. అతడు వారికి ఉపచారము పరిచర్య చేయుచుండెను (అపొ.కా. 13:5). కాని అపొ.కా. 13:13 ప్రకారం మార్కు పంపూలియలోవున్న పెర్గేలో పౌలును విడిచిపెట్టి యెరుషలేముకు తిరిగి వచ్చాడు. ఈ కారణంచేత పౌలు నిరాశ చెంది తన రెండవ మిషనరీ ప్రయాణంలో మార్కును తనతోకూడా వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళుటకు యిష్టపడలేదు, దీని ఫలితంగా పౌలు: బర్నబాలు వేరైపోయారు (అపొ.కా. 15:36-41). బర్నబా మార్కును వెంటబెట్టుకుని కుట్రకు వెళ్ళెను. ఆ తరువాత మార్కును గురించి మనకు ఎక్కువగా తెలియదు కాని కొలస్సి 4:10, ఫిలేమోను 2తిమోతి 4:11లలో చూస్తే పౌలు మార్కు కలిసి పరిచర్య కొనసాగించినట్లు మనకు తెలుస్తుంది.
బహుశా మార్కు పంపూలియాలో పౌలును విడిచి యెరుషలేముకు వచ్చినప్పుడు పేతురును కలసి ఉండవచ్చు ఆ రీతిగా వారిద్దరికి. సన్నిహిత సంబంధం ఏర్పడియుండవచ్చు. బహుశ అందువలననే 1పేతు. 5:13లో పేతురు మార్కును నా కుమారుడు అని సంబోధించాడు.
పేతురు ద్వారా మార్కు క్రీస్తును గురించి అనేక విషయాలు తెలుసుకొని ఈ సువార్త వ్రాసాడు అని అనేకుల అభిప్రాయం. ఇతడు కూడా యేసు మరణ పునరుత్థానములను గూర్చిన సాక్షులలో ఒకడని పలువురి అభిప్రాయం.
వ్రాయబడిన కాలము : సువార్తలన్నిటిలో ఇదియే మొదటిగా వ్రాయబడినది. మత్తయి, లూకాలు దీనిని ఆధారం చేసుకొని తమ సువార్తలను వ్రాశారు. యెరుషలేములోని దేవాలయం పతనంకాకమునుపే ఇది వ్రాయబడింది. ఆది సంఘ చరిత్రకారుడైన పాపియ (క్రీ.శ. 130) మరియు యితర సంఘ పితరుల అభిప్రాయం ప్రకారం ఈ సువార్త క్రీ.శ. 60-65 సం॥ల మధ్య రోమా పట్టణములో వ్రాయబడినది.
మార్కు సువార్త వ్రాయడానికి గల ఉద్దేశ్యము : క్రీ.శ. 60వ సం॥ కాలమందు రోమా చక్రవర్తిగా ఉన్న నీరో రోమా పట్టణములో క్రైస్తవులను దారుణంగా హింసింది చంపించాడు. ఈ కాలంలోనే పేతురు, పౌలులు కూడా హతసాక్షులైనారు. జరుగుతున్న దారుణ మారణ కాండను గుర్తించినవాడై స్పందిస్తూ సాక్ష్యాత్తూ యేసుక్రీస్తే మన నిమిత్తం శ్రమనొంది,మరణించి తిరిగి లేచారనే వాస్తవాన్ని వారికి గుర్తు చేస్తూ, ధైర్యపర్చుటకు, అవసరమైతే సువార్త నిమిత్తం ప్రాణత్యాగానికైనా సిద్ధపడమని ప్రోత్సహించుటకు వ్రాసాడు (1:12-13; 3:22, 30, 8:34-38; 10:34,35; 45; 13:8,11,13).
మార్కు సువార్తలోని సారాంశము :
మొదటి భాగము : దేవుని రాజ్యము : మార్కు 1:14లో యేసు చేసిన బోధనంతటిని క్లుప్తంగా దేవుని రాజ్యమును గురించిన బోధ అని సువార్తతో ఆ రాజ్యమునకు సంబంధమున్నట్లు మార్కు పేర్కొన్నాడు. మత్తయి దీనినే ‘పరలోక రాజ్యముగా’ 55సార్లు తన సువార్తలో పేర్కొనగా ఆ మార్కు కేవలం 15సార్లు మాత్రమే ప్రస్తావించాడు. యూదులకు దేవుని రాజ్యము ఒక గొప్ప నిరీక్షణ. వారి దృష్టిలో ఆ రాజ్యము తమ శత్రువులను అంతమొందించేదిగాను, తమను దేవుని ప్రజలుగా ఋజువు చేయునదిగాను భావించారు. ఈ రాజ్యము గురించి మార్కు వ్రాసిన మరికొన్ని విషయములు :
- * దేవుని రాజ్యము సమీపించియున్నది (1:15)
- * యేసు వచ్చారు గనుక దేవుని రాజ్యము వచ్చేయున్నది (11:10)
- * ఆ రాజ్యము యొక్క పూర్తి ప్రత్యక్షత ఇప్పటికే ఆరంభమయ్యింది (4:26,30)
- * ఆరాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము (10:24), ప్రవేశించాలంటే కఠిన నిర్ణయము అవసరమౌతాయి (9:47) అయితే ప్రవేశ ద్వారము తెరిచేయున్నది. సమస్తమును విడిచి యేసును వెంబడించు వారే దానిలోనికి ప్రవేశించెదరు (10:15, 21).
రెండవ భాగము : యేసు మరణము : ఈ సువార్త యూదామత నాయకులకు యేసుకు మధ్య ఏర్పడిన వివాదములతో ఆరంభమయ్యింది (మార్కు 1:22). యేసు అధికారముతో చేసిన కార్యములను ‘దేవ దూషణ’ గా పరిశయ్యులు తలంచారు (2:6). యేసు పాపులతో కలిసి భోజనం చేయడం (2:15-17), ఉపవాసం పాటించుట (2:18-22), సబ్బాతును ఆచరించటం (2:23-28), రోగులను స్వస్థపరచడం వంటివాటికి క్రొత్త నిర్వచనాలివ్వడం పరిశయ్యులు, హేరోదీయులకు మింగుడు పడని విషయం. గనుక వెంటనే ఆయనను హతమార్చడానికి జతకట్టి ఆలోచన చేసిరి (3:6). సమస్య అంతటితో ఆగిపోలేదు. యెరుషలేము నుండి వచ్చిన శాస్త్రులు యేసును బయెర్జెబూలు పట్టిన వాడని నిందించారు, అబద్ధ ప్రవక్తయని దూషించారు. వ్యతిరేకత యెరుషలేము నుండి వచ్చినప్పటికిని యేసు ఆపట్టణానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అందుకు అనేకులు ఆశ్చర్యపడ్డారు శిష్యులు విస్మయమొందారు (10:32).
ఈ విధంగా యేసుపట్ల వ్యతిరేకత అన్నివైపులా విస్తరించింది, ఆయన తన మరణమును గురించి తరచూ శిష్యులకు గుర్తు చేశారు. చివరికి తనను అప్పగింపబోవువాడు తన శిష్యులలో ఒకడని చెప్పి ఆశ్చర్యపరిచారు. అయితే తుదకు తన మరణ సమయానికి తనను ఒంటరిని చేసి పారిపోయిన శిష్యులకు, దురాశతో తనను అమ్మిన యూదాకు తేడా ఏమిలేదన్నట్లు చూపారు.
అందరి పాపక్షమాపణ కొరకు ఒకరు మరణించాల్సి వున్నారు ఆయనే ‘దేవుని కుమారుడైన క్రీస్తు యేసు మరణించిన వెంటనే అక్కడ నిలిచివున్న శతాధిపతి “ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడు” అని పలికిన పలుకులు దాని ఋజువు (15:39).
మూడవ భాగము : శిష్యత్వపు వెల :
మార్కు అపొస్తలులలో వున్న బలహీనతల పట్ల సానుభూతి చూపుతూ శిష్యత్వములోగల ఇబ్బందులను సవాళ్ళను గురించి చక్కగా విశదపరిచారు.
“అంతట ఆయన తన శిష్యులకు జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును….” 8:34-35. సంభవించబోయే మరణమును గురించి ప్రకటించిన వెనువెంటనే ఈ పిలుపునిచ్చారు. తన శిష్యులు కూడా ఇలాంటి అనుభవమునే పొందవలసియున్నారు. ఉపేక్షించుకోవడమనగా ఏమిటో 10:17-23లలో మార్కు వివరంగా చూపారు. ఆ సమయంలోనే పేతురు తనను సమర్ధించుకొంటూ పల్కిన మాటలకు (10:28) క్రీస్తు స్పందనను 10:29-31లలో చూడగలం. Gospel of
క్రీస్తు శిష్యులు జీవించిన కాలంలో గృహములకు, కుటుంబములకు విలువనిచ్చే సంస్కృతి వారిది యూదులు తమ స్వాస్థ్యమును దేవుని . ద్వారా పొంతితిమనే నమ్మికగలవారు, గనుక ఎట్టి పరిస్థితులలోను దాని అమ్ముట గాని ఇచ్చివేయుటగాని చేయకూడదనేది వారి భావన. అయినప్పటికి తన నిమిత్తము వాటన్నిటికి వెన్నుచూపి తన యొద్దకు రావాలని యేసును పిలిచారు. విడిచిపెట్టిన దానికంటే హెచ్చుగా వారు పొందుదురన్న వాగ్ధానం కూడా చేశారు. అంతేకాదు వారు హింసలు పొందవలసియున్నదని కూడా ముందే చెప్పారు. దానికి సుముఖత చూపిన వారే ఆయనను వెంబడించడానికి ధైర్యంతో ముందుకు వచ్చారు.
మార్కు సువార్తలో కనిపించే పేతురు :
ఈ స్వల్ప సువార్తలో పేతురు అనే మాట 23 సార్లు వాడబడింది. యేసు శిష్యులందరిలోకెల్లా పేతురుకు, మార్కుకు అధిక ప్రాధాన్యత నిచ్చారు. ముఖ్యంగా నాలుగు చోట్ల పేతురుయొక్క స్పందనను ప్రత్యేకంగా చెప్పుకోగలం.
- యేసు తనకు సంభవించబోవు మరణమును గురించి శిష్యులతో పంచుకొనుచుండగా విపరీతంగా స్పందించిన పేతురు యేసుక్రీస్తు నుండి గద్దింపునుపొందాల్సి వచ్చింది (8:33).
- యేసు రూపాంతర అనుభవమును తిలకించిన పేతురు ముగ్ధుడై ఆ స్థలములోనే స్థిరపడి పోవాలనే కుతూహలపడడం ఆయన లో వున్న బలహీనతకుఅద్దం పడుతుంది (9:5-8).
- గెత్పెమనె తోటలో పేతురు, యాకోబు, యోహానులు ప్రార్ధన మాని నిద్రించిరి యేసు వారిని రెండవసారి మేల్కొలిపినప్పుడు “ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు”. ఈ సత్యం కేవలం ఈ సువార్తలోనే చూడగలం (14:40).
- అన్నిటికంటే మించి తను యేసును ఎరుగనని బొంకుచూ తనను తాను శపించుకొంటూ, ఒట్టు పెట్టుకున్నాడు పేతురు. రెండవ మారు కోడికూతకుఖంగుతిని ఏడ్చారు (14:71-72).
మార్కు వాడిన లాటిన్ పదాలు : క్రొత్త నిబంధన గ్రంధమంతయు గ్రీకు భాషలో వ్రాయబడినప్పటికిని ఎలాంటి వివరణ ఇవ్వకుండా వాడిన లాటిన్ భాషా పదములే ఈ సువార్త యొక్క ప్రత్యేకతను చాటుతున్నాయి.
- సేన (5:9) (Legion)
- ప్రేతోర్యము (Praetorium) (15:16) గ్రీకు భాషలోని రాజగృహము (Palace) ను వివరించడానికి ఈ పదమును వాడారు.
- బంట్రౌతు (Executioner) (6:27) : ఇది మిలటరీ పోలీసుల పరిభాష,
- కాసు (Penny) (12:42) : ఇది కేవలము రోమా రాజ్యములో మాత్రమే వాడుకలో వున్న నాణెము.
యేసు వాడిన అరామిక భాషా పదములు
- తలీతాకుమీ 5:41
- ఎప్పతా 7:34
- ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ 15:34
మార్కు సువార్తయందలి ముఖ్య విషయాలు :
- ఇది క్రియల సువార్త : ఎందుకనగా యేసు చేసిన 19 అద్భుత కార్యములు దీనిలో వ్రాయబడినవి గాని చెప్పిన ఉపమానములు కేవలం 9 మాత్రమే కనిపిస్తాయి.
- ఇది రక్షణ సువార్త : ఎందుకనగా వెంటనే, తక్షణమే అనుమాటలు 42 చోట్ల కనిపిస్తాయి. తద్వారా యేసుక్రీస్తు విరామములేని సేవకునిగా చూపించబడ్డారు.
- ఇది నిర్మొహమాట సువార్త: ఎందుకనగా జరిగినది జరిగినట్లుగా మార్కు వ్రాశారు. యేసు శిష్యుల మతిమరుపును 8:14; అవగాహనాలేమి 24:13; తర్క గుణాన్ని 9:10; పిరికితనాన్ని 9:32 ఇలా ఇంకెన్నో బలహీనతలను వ్రాశారు. యేసు కొన్ని సందర్భరములలో వారిని నిందించిన విషయాలను కూడా దాచలేదు.
- ఇది క్లుప్త సువార్త : సువార్తలన్నిటిలోకెల్ల చాలా చిన్నది గాని బహు శక్తివంతమైనది.
- ఇది అన్యుల సువార్త : యేసుక్రీస్తు నందున్న దైవమానవ స్వభావాన్ని స్పష్టంగాను, వివరముగాను అన్యులు గ్రహించగలిగే రీతిలో వర్ణించారు మార్కు 1:41; 6:34; 4:38; 6:31; 7:34; 9:7; 5:7.
మార్కు సువార్తలో యేసుక్రీస్తు : యేసు చురుకైన, కనికరము, విధేయత కలిగిన పరిచారకునిగా తన బోధల ద్వారా, స్వస్థతల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా తుదకు మరణ పునరుత్థానముల ద్వారా ప్రజల భౌతిక, ఆధ్యాత్మిక అవసరతలను తీర్చిన వానిగా వర్ణించబడ్డారు. క్రీస్తు జీవితంలోని చివరి 8 దినములలో జరిగిన సంఘటనలే ఈ సువార్తలో 40% స్థానాన్ని ఆక్రమించాయి.
మార్కు సువార్త విభజన
- క్రీస్తు సేవ (Service of Christ) 1:1-10:45
- క్రీస్తు త్యాగము (Sacrifice of Christ) 10:46 – 15:47
- క్రీస్తు విజయము (Success of Christ) 16:1-20
ప్రత్యక్ష గుడారం .. click here





