Numbers – సంఖ్యాకాండము వివరణ – Bible Books

సంఖ్యాకాండము వివరణ.

Numbers

ఉపోద్ఘాతము : సంఖ్యాకాండము అనే పేరు అంకగణితము అని అర్థమిచ్చే “అరిత్మియ్” అనే గ్రీకు పదము నుండి సంగ్రహించబడింది. సంఖ్యాకాండములోని జనసంఖ్యలను బట్టి ఈ గ్రంథానికి ఆ పేరు పెట్టబడింది. నిర్గమకాండంలో వదలివేయబడిన చరిత్ర సంఖ్యాకాండములో కొనసాగించబడింది. పంచకాండములలో ఇది నాల్గవ పుస్తకము.

గ్రంథకర్త : మోషే.

సందర్భము : ఐగుప్తు దాస్యం నుండి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యానికిచేరుకుని దేవుని ఆజ్ఞప్రకారం అక్కడ ప్రత్యక్ష గుడారమును నిర్మించారు. ఆ ప్రత్యక్షపు గుడారములో నుండి దేవుడు కొన్ని ప్రత్యేక నియమనిబంధనలను ఇచ్చిన తరువాత వారి ప్రయాణం కొనసాగింపును గూర్చి ఈ గ్రంథంలో వ్రాయబడింది. నిర్గమకాండములో ఒక సంవత్సరము ప్రయాణం (నిర్గ 40:17) లేవీయకాండంలో ఒక నెల ప్రయాణం (సంఖ్యా 1:1) ద్వితీయోపదేశకాండములో 2 నెలల ప్రయాణ వివరాలున్నాయి. మిగతా 38 సంవత్సరాల 7 నెలల ప్రయాణ వివరాలన్నీ సంఖ్యాకాండములోనే ఉన్నాయి.

ముఖ్యాంశము : దేవుని ప్రజల క్రమశిక్షణ.

సంఖ్యాకాండము విశిష్ఠత: ఇశ్రాయేలు జనాంగము దేవుని సేవించడానికే విమోచించబడ్డారు. వాగ్దానదేశానికి అరణ్యముగుండా ప్రయాణమై వెళ్తూ ఉండగా దేవుడు వారిని క్రమశిక్షణలోనికి తీసికొనిరావడానికి అనేక పరిస్థితులను అనుమతించాడు. రక్షించబడిన విశ్వాసులను గూర్చి కూడ దేవుని ఉద్దేశం అదే. మనందరం ఆయనను సేవించాలి. అందుకు అర్హమైనవారిగా ఉండాలంటే ఈ గ్రంథములోని విషయాలను మనం క్షుణ్ణంగా పఠించాలి. అర్థం చేసికోవాలి. మనందరం ఈ లోకములో యాత్రికులము మరియు పరదేశులము. గనుక ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రయాణ విధానం, ఈనాడు మనకు ఒక మార్గదర్శినిగా ఉండగలదు. అందుకే అపొస్తలుడైన పౌలు ఈ విధంగా వ్రాసాడు.

“ఏలయనగా ఓర్పువలనను, లేఖనముల వలని ఆదరణ వలనను, మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగునిమిత్తము వ్రాయబడియున్నవి”. (రోమా 15:4). 

పంచకాండాలలో ప్రారంభ పుస్తకమైన ఆదికాండములో, ఇశ్రాయేలు జాతి ఆరంభం ఉన్నది. అది ఒక కుటుంబముగా ఆరంభమైనది. నిర్గమకాండములో ఈ కుటుంబము ఒక జాతిగా విస్తరించింది. లేవీయకాండములో విమోచించబడిన ఈజాతి ప్రజలు దేవునితో ఎలా నడచుకోవాలో నేర్పించబడింది. సంఖ్యాకాండములో ఈ ప్రజలు దేవుని సేవించడానికి సిద్ధపరచబడడం చూస్తాము. ఈ జాతి నుండి లోకాన్ని రక్షించబోయే మెస్సీయా రావాలన్నదే దేవుని సంకల్పం. కనుక ఈ జాతి విషయం దేవుడు చాల శ్రద్ధవహించాడు. సంఖ్యాకాండములోని, ఆ కాలం నాటి అనేక శక్తివంతమైన దేశాలు ఈ భూమ్మీద ప్రస్తుతం లేకున్నా, దేవుడు అన్ని తరాలలో నుండి ఇశ్రాయేలు జాతి శేషాన్ని తనకోసం నిలుపుకొన్నాడు. ఈ గ్రంథంలోని ప్రముఖ వ్యక్తులు; మోషే, అహరోను, మిర్యాము, యెహోషువ మరియు కాలేబు. ఈ గ్రంథములో యేసు క్రీస్తును పైకెత్తబడినవానిగా చూస్తాము.  సంఖ్యాకాండము వివరణ

అంశాలవారిగా సంగ్రహ సమీక్ష :

సంఖ్యాకాండములోని సంఘటనలు, ఇశ్రాయేలు చరిత్ర ప్రకారం మూడు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చును. 

1.ఐగుప్తునుండి బయటికి వచ్చిన తరమును సిద్ధము చేయుట (1-10 అధ్యాయాలు).

2.ఐగుప్తునుండి వచ్చినవారి విశ్వాసవైఫల్యత. (11-21 అధ్యాయాలు).

3.కనానుకు వెళ్ళే తరమును సిద్ధము చేయుట (22-36 అధ్యాయాలు). 

సంఖ్యాకాండములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన బిరుదు “యెహోవా సేనలు”. ఈ గ్రంథములో అనేకచోట్ల ఇశ్రాయేలు ప్రజలకు బదులు సేనలు లేక సైన్యము అనే మాట వాడబడడం గమనార్హం. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులకు యుద్ధం చేయడం తెలియదు కనుక ఒకవేళ వారు భయపడి వెనక్కి పారిపోతారేమోనని దేవుడు వారిని చుట్టుదారిని నడిపించాడు . (నిర్గ 13:17). 

ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరిన 3వ నెల ఆరంభంలో సీనాయికి వచ్చారు. వారి ప్రయాణంలో 2వ సం॥ 2వ నెల వరకు అనగా 11 నెలలు అక్కడే ఉన్నారు. సీనాయి వద్ద 3 గొప్ప సంఘటనలు జరిగాయి. 

1) అక్కడే ధర్మశాస్త్రము ఇవ్వబడుట ద్వారా మానవులకు దేవునితో సహవాసం  యొక్క ఆవశ్యకత తెలియజేయబడింది. 

2) అయితే బంగారు దూడను చేసికొనుట ద్వారా ఆ సహవాసం భంగపరచబడింది.

3) ప్రత్యక్షగుడార నిర్మాణం ద్వారా ఆ సహవాసం పునరుద్ధరించబడింది. 

  ఇశ్రాయేలీయుల మధ్య ప్రత్యక్షగుడార నిర్మాణం జరిగిన తరువాత, అంటే దేవుని నివాసం వారి మధ్య ఏర్పడిన తరువాత దేవుడు తన వ్యూహాన్ని మారుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనం చేసికొనేప్పుడు వారు చేయవలసిన యుద్ధాల కోసం దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు. 

వాస్తవంగా ఇశ్రాయేలీయులను నేరుగా వాగ్దాన దేశానికి తీసికొని వెళ్ళాలని దేవుని సంకల్పం. కాని కాదేషు వద్ద వారు చేసిన తిరుగుబాటును బట్టి 40 దినముల ప్రయాణం 40 సంవత్సరాల వరకు కొనసాగించబడింది. 

1.) ఐగుప్తునుండి బయటికి వచ్చిన తరమును సిద్ధము చేయుట (1-10 అధ్యాయాలు).

     1.)దేవుని సేనల సమీకరణ (1-4 అధ్యా) :

ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని జయించి స్వాధీనం చేసికొనేందుకు రాజైన దేవుడు స్వయంగా సిద్ధపరచిన వ్యూహామే ఈ మొదటి నాలుగు అధ్యాయాలు. ఈ యుద్ధంలో సర్వాధికారి అయిన దేవుడే స్వయంగా నడిపించాడు. 

మొదటి అధ్యాయంలో దేవుని ఆజ్ఞప్రకారం, మోషే అహరోనులు 20 సంవత్సరాలకు పైబడిన పురుషులందరినీ లెక్కించి సమాజ సంఖ్యను వ్రాయించారు. దీనిని బట్టి, దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి ప్రశస్తమైనవాడేనని అర్థమౌతున్నది. 

రెండవ అధ్యాయంలో ప్రత్యక్షగుడారం చుట్టు 12 గోత్రాలు ఉండవలసిన స్థానములను గూర్చి చెప్పబడింది. ఈ వ్యూహాన్ని మనం జాగ్రత్తగా అర్థంచేసికోవాలి. నాలుగు దిక్కులలో ఉన్న ఈ ఇశ్రాయేలు వ్యూహము, నాలుగు సువార్తలలోని యేసు వ్యక్తిత్వానికి మరియు యెహెజ్కేలు ప్రవక్త తన దర్శనంలో చూసిన నాలుగు రూపాలకు సంబంధం ఉంది. 

ప్రత్యక్ష గుడారము తూర్పు దిక్కు యూదా, ఇశ్శాఖారు, జెబూలూను గోత్రాలు నిలవాలి. వారికి నాయకత్వం వహించే యూదా గోత్రికుల సింహపు గుర్తుగల ధ్వజం, యెహేజ్కేలు దర్శనంలోని సింహపు రూపానికి, మరియు మత్తయి సువార్తలో రాజుగా చూపించడిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. 

ప్రత్యక్ష గుడారానికి పశ్చిమదిశన ఎఫ్రాయీము, మనషే, బెన్యామీను గోత్రాలు దిగాలి. వారికి నాయకత్వం వహించే ఎఫ్రాయిమీయులు దూడ గుర్తుగల ధ్వజం యెహెజ్కేలు దర్శనంలోని దూడరూపానికి మరియు మార్కు సువార్తలో సేవకునిగా చూపించబడిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. 

ప్రత్యక్ష గుడారానికి దక్షిణాన రూబేను, షిమ్యోను, గాదు గోత్రాలు దిగాలి. వీరికి నాయకత్వం వహించే రూబేను గోత్రికుల మనుష్య రూపముగల ధ్వజం, యెహెజ్కేలు దర్శనంలోని మానవ రూపానికి మరియు లూకా సువార్తలో మనుష్య కుమారునిగా చూపించబడిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. 

ప్రత్యక్ష గుడారానికి ఉత్తరాన దాను, ఆషేరు, నఫ్తాలి గోత్రాలు దిగాలి. వీరికి నాయకత్వం వహించే దాను గోత్రికుల పక్షిరాజు గుర్తుగల ధ్వజం యెహెజ్కేలు దర్శనంలోని పక్షిరాజు రూపానికి మరియు యోహాను సువార్తలో దేవుని కుమారునిగ చూపించబడిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. 

యేసుక్రీస్తు ఈ లోకంలో అవతరించి పాపంతోను సాతానుతోను చేయబోయే యుద్ధాన్ని గూర్చి కొన్ని వందల సంవత్సరాలకు ముందే అనగా సంఖ్యాకాండములో ఇశ్రాయేలు సైన్యాలను అమర్చిన తీరులో చూపించబడింది. అది సర్వజ్ఞానియైన దేవుని శక్తి ప్రత్యేకత. 

ఈ నాలుగు అధ్యాయాలలో మనం గమనించాల్సిన మరో విషయం ఏమంటే లేవీ గోత్రానికి చెందినవారు ఈ జనసంఖ్యలో లెక్కించబడలేదు. వీరిని దేవుడు ప్రత్యక్షగుడారానికి సంబంధించిన పనుల కోసం ప్రత్యేకించుకున్నాడు (3:11,12). వారిని నాలుగు గుంపులుగా విభజించి ప్రత్యక్ష గుడారానికి నాలుగు వైపుల స్థలాలను కేటాయించి, నాలుగు రకాల బాధ్యతలు అప్పగించాడు. 

2. యుద్ధ సన్నాహాలు – దేవుని ఆజ్ఞలు (5:9 – 9:23) :

      A.) అపవిత్రతను గూర్చిన విధులు. (5:1-31) :

 ఈ అధ్యాయం మొదటి నాలుగు వచనాలలో కుష్ఠురోగులను, స్రావముగలవారిని, శవమును ముట్టి అపవిత్రులైనవారిని పాళెము వెలుపలికి పంపించాలన్న ఆజ్ఞ ఇవ్వబడింది. మనము కూడ మన ఆత్మీయ పోరాటములో ముందుకు సాగాలి అంటే ప్రతి విధమైన దుర్నీతి నుండి, అపవిత్రత నుండి వేరుగా జీవించాలి. 

ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన రెండవ ఆజ్ఞ పొరుగు వానికి చెల్లించవలసిన సొమ్ము విషయంలో నిర్దోషులై ఉండాలి (5:5-10) పొరుగువాని యెడల అపరాధం చేస్తే దేవుని యెడల చేసినట్లే. వారికి నష్టపరిహారం చెల్లించాలి. మూడవ ఆజ్ఞ వ్యభిచారానికి సంబంధించినది. (5:11-31). ఇది వ్యభిచార నిర్మూలన కొరకు ఇవ్వబడిన ఆజ్ఞ.

B) నాజీరు విధులు (6:1-27) : నాజీర్ అనే హెన్రీ మాటకు “ప్రత్యేకించుట” అని అర్థం దేవుని కొరకు ప్రత్యేకించుకున్న స్త్రీగాని, పురుషుడుగాని నాజీరు అని పిలువబడేవారు. జీవితాంతము, లేక కొంత కాలము వరకు నాజీరుగా ఉండవచ్చును అయితే ఆ నిర్ణయ కాలము వరకు వారు ఎంతో జాగ్రత్తగా తమ వ్రతాన్ని కొనసాగించాలి.

C) నాయకుల స్వేచ్ఛార్పణలు – యాజక ప్రతిష్ఠ (7:1-8:26) : దేవుని సేవకు ప్రతి ఒక్కరు ఇవ్వడం అవసరం అని ఈ భాగం బోధిస్తున్నది. బలిపీఠమును ప్రతిష్టించేందుకు ఒక్కొక్క గోత్రపు పెద్ద, ఒక్కొక్క రోజు ప్రతిష్టార్పణలు తీసికొని రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు గోత్రాల పెద్దలు అర్పించిన పాప పరిహారార్ధ బలులు దేవుని సన్నిధిలో తమ్మును తాము సరిచేసికొని తెచ్చినవి. అలాగే దేవుడు వారికి చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతతో సమాధాన బలులు తెచ్చారు.

8వ అధ్యాయంలోని దీప వృక్షం క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా ఉంది. దీప వృక్షములోని ఏడు దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలి, వాటి వెలుగు అవతలివైపున ఉన్న సముఖపు రొట్టెల బల్ల మీద పడుతూ ఉండాలి. లోకానికి వెలుగుగా ఉన్న ప్రతి విశ్వాసి వెలిగించబడిన కొద్దీ ప్రభువు సన్నిధికి, ఆయన బల్లకు చేరువకావాలి. 8:6-26లో లేవీయులు సేవకై సిద్ధపడాల్సిన విధానం వ్రాయబడింది. లేవీయులు మొదట తమ్మును తాము శుద్ధిచేసికొన్న తరువాత ఇశ్రాయేలీయులందరూ వారి మీద తమ చేతులుంచి వారిని దేవునికి సజీవయాగముగా సమర్పించాలి. ఈనాడు యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ యాజకులే (I పేతు 2:9). ప్రతి విశ్వాసి తన శరీరాన్ని దేవునికి సజీవయాగంగా సమర్పించాలి. (రోమా 12:1).  సంఖ్యాకాండము వివరణ

D) పస్కా ఆచరణ. (9:1-4) : ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరకముందు రాత్రి మొదటి పస్కాను ఆచరించారు. రెండవ పస్కా సీనాయి నుండి బయలుదేరక ముందు ఆచరించాలని ఆజ్ఞాపించబడ్డారు.

E) సేనలు సాగాల్సిన విధానం (10:1-36): ఇశ్రాయేలు సైన్యం ముందుకు సాగడానికి,బూరలు ఊదడం ద్వారా సంకేతం ఇవ్వబడాలి. సమాజాన్ని పిలవడానికి, సేనలను తర్లించడానికి అహరోను కుమారులైన యాజకులు ఈ బూరలను ఊదాలి. వాటిని ఊదాల్సిన విధానం 10:1-10 లో వ్రాయబడింది. ఆ విధంగా దేవుడు తన సైన్యాన్ని ప్రయాణానికి సిద్ధపరచిన తరువాత, వారు ఐగుప్తును విడిచిన రెండవ సంవత్సరం రెండవ నెల 20వ తేదీన దేవుని మేఘము ప్రత్యక్షపు గుడారం మీద నుండి కదిలింది. మేఘం కదలిక ప్రకారం ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు సాగాయి. దాదాపు 25 లక్షల మంది ప్రజలు, వారిలో 6 లక్షల మంది వీరులు, మధ్యలో ప్రత్యక్ష గుడారం, గుడారం మీద మేఘం. ఎంత గంభీరమైన దృశ్యం!

మేఘం పైకిలేచి ముందుకు కదిలినప్పడెల్లా వారు ముందుకు సాగారు. మేఘం ఆగినప్పుడు వారు కూడా ఆగారు. దేవుడే వారి మధ్య నివాసముంటూ సైన్యాధిపతిగా తన సైన్యాన్ని నడిపిస్తున్నాడు. దేవుని నాయకత్వంలో ముందుకు సాగిన రోజున ఇజ్రాయేలీయుల హృదయాలు ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయాయి. మోషే, అహరోను, 70 మంది పెద్దలు సంతోషగానాలు చేసారు. మందసము సాగినప్పుడు మోషే “యెహోవా లెమ్ము” అని దేవుని స్తుతించాడు. మందసము నిలిచినప్పుడు “యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్ము” అని దేవుని ఆహ్వానించాడు. 

2.ఇశ్రాయేలీయుల విశ్వాస వైఫల్యత (11-12 అధ్యా).

    అ) ప్రజల ప్రతిఘటన – దేవుని తీర్పు 

1.) అలసట వలన సణుగుట (11:1-3) : సీనాయి అరణ్యం నుండి ఆనందంగా సాగినప్రయాణం ఉత్సాహం మూడురోజులకే అంతమైంది. ప్రయాణ అలసటను బట్టి ప్రజలుసణిగారు. దాంతో దేవుని కోపం వారిపై రగులుకొన్నది. దేవుని అగ్ని వారి గుడారాలను దహించనారంభించింది. జనులు మోషేకు మొరపెట్టారు, మోషే దేవునికి మొరపెట్టాడు.

2.) ఆహారాన్ని గూర్చి సణుగుట (11:4-35) : ఈ సారి ప్రజలు ఆహారాన్ని గూర్చి సణిగారు మాంసాహారాన్ని గూర్చి ఏడుస్తున్నారు. గతంలో దేవుడు వారి కోసం పూరేళ్ళను పంపించిన సంగతి మరచిపోయారు. వారితో పాటు ఐగుప్తునుండి వచ్చిన మిశ్రత జనమే దీనికంతా కారణం. (11:4; నిర్గ 12:38). వీరితో కలిసి ఇశ్రాయేలీయులు కూడ ఏడ్వనారంభించారు. మోషే వారితో విసిగిపోయి వారితో వాదించలేనని, వారి భారాన్ని మోయలేనని దయచేసి నా ప్రాణాన్ని తీసికోమని మొఱపెట్టాడు. దేవుడు మోషేను ధైర్య పరచి, అతనికి సహాయకులుగా 70 మంది పెద్దలకు ఏర్పాటుచేసాడు. ప్రజలు ఆహారాన్ని గూర్చి దేవునితో విరోధంగా మాట్లాడిన దానిని బట్టి దేవుని కోపం వారిపై రగిలింది. మాంసాహారం కోసం ఏడ్చినవారంతా అక్కడ నశించిపోయారు. (11:33,34) దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి పొందనందువల్ల కలిగే పర్యవసానం ఈలాగే ఉంటుంది. కొన్ని పర్యాయాలు మనం పట్టుదలతో మనం కోరినదే కావాలని దేవుణ్ణి విసిగిస్తే దేవుడు తనకు ఇష్టం లేకున్నా మనకు దానిని ఇస్తాడు. కాని దాని వలన మనకు నష్టమే జరుగుతుంది. (కీర్త 106:15).

3.అసూయ వలన సణుగుడు (12:1-16) : ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మోషే, అహరోనులపై సణిగారు. 12వ అధ్యాయంలో అహరోను మిర్యాములే మోషేకు వ్యతిరేకంగా సణిగారు (12:1-3). ఈ సణుగుడు అనే పాపం ప్రజలలో నుండి, నాయకులలోనికి కూడ ప్రాకడానికి కారణం మిర్యాము. అహరోను ఆమెను గద్దించడానికి బదులుగా ఆమెతో ఏకీభవించాడు. వీరిద్దరు మోషేపై సణగడానికి అసలు కారణం అసూయ (12:2). దైవసేవకుల మీద అసూయపడడం వారిని కించపరచి మాట్లాడడం దేవుని దృష్టిలో భయంకరమైన నేరం. దేవుడు వారిని ప్రత్యక్ష గుడారములోనికి పిలిచి మాట్లాడాడు. మిర్యాము కుష్ఠురోగానికి గురి అయింది. ఆమెను బట్టి ఇశ్రాయేలు ప్రజలు హజేరోతులోనే 7 రోజులు ఆగి పోవలసి వచ్చింది. ఒక్కరి పాపమైనా, కొన్ని పర్యాయాలు, సంఘమంతటికి, సమాజమంతటికి నష్టాన్ని కలుగజేస్తుంది. జాగ్రత్త!

4. పిరికితనం వలన సణుగుడు (13:1-14:10) : మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి ఒక్కొక్క పెద్దను కనాను దేశాన్ని వేగుచూసేందుకు పంపించాడు. (13:17 – 20 ). ఆ 12 మంది 40 రోజులు కనాను దేశంలో సంచిరించి ఆ దేశం నుండి ద్రాక్షగెల, దానిమ్మ పండ్లు, అంజూరపు పండ్లు తీసికొని తిరిగి కాదేషుకు వచ్చారు.

12 మందిలో 10 మంది “ఆ జనులు మనకంటె బలవంతులు, మనము వారి మీదికి పోజాలము” అని ప్రజలకు అవిశ్వాసాన్ని, పిరికితనాన్ని నూరిపోసారు. అయితే కాలేబు, యెహోషువ మాత్రం దేవుని శక్తితో కనానుదేశ ప్రజలను జయించడం సాధ్యమే అని చెప్పారు. కాని అవిశ్వాసం, సణిగే స్వభావం గల ప్రజలు దేవునిపై, ఆయన వాగ్ధానాలపై ఆధారపడే పరిస్థితిలో లేరు. ఐగుప్తుకు తిరిగి వెళ్ళాలని తీర్మానించుకొన్నారు. ప్రియ పాఠకులారా! విశ్వాసయాత్రలో మీకు ఎదురయ్యే పరిస్థితులలో భయపడి వెనక్కి చూస్తున్నారా? గతంలో మీ పట్ల మీ అద్భుతాలు చేసే దేవుడు ప్రస్తుత పరిస్థితులలో కూడా సమస్తము సాధ్యపరచగలడు. సంఖ్యాకాండము వివరణ

5.దేవుని తీర్పు (14:11-15:41) : ఇశ్రాయేలీయుల హృదయాలలో ఎంత తిరుగుబాటుతనంఉందంటే, “యెహోవా మీద తిరుగబడకుడి, కానాను ప్రజలకు భయపడకుడి, యెహోవా మనకు తోడైయున్నాడు.”అని ధైర్యం చెప్పబోయిన యెహోషువ కాలేబులను రాళ్ళతో కొట్టి చంపాలని ఆలోచించారు. (14:9) దేవుని కోపం మరోసారి ఇశ్రాయేలుపై రగులుకొన్నది. తెగులుతో వారిని నాశనంచేసి మోషే వంశం నుండి మరొక జనాంగాన్ని లేవనెత్తాలని దేవుడు సంకల్పించాడు (14:11,12) మోహే దేవునికి మొఱపెట్టాడు (14:13-19). దేవుడు వారిని నాశనం చేయలేదుగాని వారిని శిక్షించాడు. ఇశ్రాయేలు పెద్దలు కనానులో సంచరించిన 40 దినాలకు, దినానికి ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతారని ఆజ్ఞాపించాడు. ప్రజలకు తప్పుసమాచారం అందించి నిరుత్సాహపరచిన 10 మంది పెద్దలు తెగులు చేత మరణించారు. (14:36,37). ఇప్పుడు వారు మరో రకమైన పాపం చేసారు. దేవుడు వారిని అరణ్యంలో సంచరించాలని ఆజ్ఞాపిస్తే, వారు కనానుకు వెళ్తామన్నారు. మోషే హెచ్చరికను నిర్లక్ష్యం చేసి అమాలేకీయుల మీదికి యుద్ధానికి వెళ్లి చిత్తుగా ఓడిపోయారు. దేవుడు మనల్ని శిక్షంచినప్పుడు మనల్ని మనం దేవుని కృపా హస్తాలకు అప్పగించుకోవడం ఉత్తమం.

సంఖ్యాకాండము మొదటి అధ్యాయాలలో ఆర్భాటంగా ఆరంభమైన ఇశ్రాయేలు యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. 

15వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు కనాను చేరిన తరువాత అర్పించాల్సిన అర్పణలను గూర్చి, వారి వస్త్రధారణను గూర్చి (15:37-41) వివరించాడు. అంటే దేవుని మనస్సు 40 సంవత్సరాలు ముందుకు అనగా భవిష్యత్తులోనికి వెళ్ళింది.

6. కోరహు పాపము, దేవుని ఉగ్రత (16:1-50) : దేవుని మీద, దేవునిచేత ఏర్పాటు చేయబడిన నాయకుని మీద సణిగి ఇశ్రాయేలీయులు ఎంతో నష్టపోయినా తిరుగుబాటు స్వభావం తగ్గలేదు. ఈసారి ప్రత్యక్షపు గుడారపు సేవకొరకు ప్రత్యేకించబడిన లేవీవంశస్తులలో కోరహు, దాతాను, అబీరాము ఓను అనే దుష్ట చతుష్టయం నాయకత్వంలో మోషే అహరోనులకు విరోధంగా లేచారు. వీరికి దేవుడు అప్పగించిన పని అల్పమైనదిగా కనిపించింది (16:9).

దేవుడిచ్చిన పరిచర్యతో తృప్తిపడక పదవులకోసం ఆర్రులు చాచేవారికి సంఘాలలో సంస్థలలో తిరుగుబాటు లేవదీసే వారికి ఈ మాటలు ఒక హెచ్చరికగా ఉండాలి. ఈ నలుగరు నాయకులు పక్షం వహించి ధూపార్తులను చేత పట్టుకొని అహరోనుకు పోటీగా ప్రత్యక్షగుడారాన్ని సమీపించిన 250 మంది మీదికి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. (16:32 – 35). తిరుగుబాటు చేసిన వారిని భూమి మ్రింగివేసింది. జరిగిన దానిని చూచి ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడకపోగా, “మీరు యెహోవా ప్రజలను చంపారు” అని మోషే అహరోనుల మీద సణగడం ప్రారంభించారు. మరోసారి దేవుని కోసం రగిలి తెగులు వారి పాళాన్ని చుట్టు ముట్టింది. అహరోను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. అప్పటికే  14,700 మంది మరణించారు (16:49). 

7. యాజకత్వపు విశిష్టతలు, శుద్ధీకరణ పద్ధతులు (17:1-19:22) : తిరిగి ఎవరేగాని యాజకత్వాన్ని గూర్చి ప్రశ్నించకుండ దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాల పెద్దల పేర్లు వ్రాసిన 12 కర్రలు సాక్ష్యపు మందసానికి ఎదురుగా ఉంచాలని ఆజ్ఞాపించాడు. (17:7,8). ఉదయానికల్లా అహరోను కర్ర చిగురించింది. ఈ విధంగా అహరోను యాజకత్వం స్థిరపరచబడింది.

పాత నిబంధన కాలంలోవలె తప్ప జరిగిన వెంటనే దేవుని తీర్పు వస్తే ఈనాటి సంఘాలు ఏమౌతాయో ఊహించండి. దేవుడు మన పట్ల మన సంఘాల పట్ల దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు. కాని ఒక దినాన దేవుడు తన సంఘానికి తీర్పు తీర్చబోతున్నాడు. (I కొరి 3:10-15). 

18వ అధ్యాయంలో లేవీయుల పోషణను గూర్చి, 19వ అధ్యాయంలో శవాన్ని ముట్టడం వలన అపవిత్రులైనవారి శుద్ధీకరణను గూర్చి వ్రాయబడింది. 

8.సీను అరణ్యం నుండి మోయాబు మైదానం వరకు (20:1-21:35) : ఇశ్రాయేలీయులుదాదాపు 38 సంవత్సరాలు సీను అరణ్యంలో సంచారం చేసాక మరలా కనానువైపు కదిలారు (20 అధ్యా) వారి ప్రయాణ దినాలు, ఐగుప్తునుండి బయలుదేరిన నాటినుండి సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు ఒక సంవత్సరం 50 దినాలు (10:11) సంఖ్యాకాండం 21వ అధ్యాయం నుండి ద్వితీయోపదేశకాండ చివరి వరకు ఒక సంవత్సరం. మిగతా 38 సం||ల ప్రయాణమంతా సంఖ్యాకాండము 11-20 అధ్యాయాలలోనే వ్రాయబడింది. ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటికి తీసివేయడానికి 40 రోజులు పట్టింది. కాని వారి హృదయాలలో నుండి ఐగుప్తును తీసివేయడానికి 40 సంవత్సరాలు పట్టింది.

మనము దేవుని పరిపూర్ణ ఉద్దేశాలను మార్గాలను నిర్లక్ష్యం చేస్తే అవి శాశ్వతంగా 

తీసివేయబడతాయి. ఆయన తన కృపను బట్టి మనల్ని మళ్ళీ నడిపించినా, మొదటి ఆశీర్వాదాలను పొగొట్టుకొంటాము. 

9. మోషే పొరపాటు (20:10-12) : ఇశ్రాయేలీయుల సణుగులతో విసిగిపోయిన మోషే బండతో మాట్లాడేందుకు బదులు తన కర్రతో బండను కొట్టి దేవుని దృష్టిలో పాపం చేసినవాడయ్యాడు. తొందరపడి మాట్లాడాడు (కీర్త 106:32-33) కనుక మోషే, అహరోనులు కనానులో ప్రవేశింపలేదు. దేవుని శిక్షావిధి తీవ్రత పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమౌతున్నాయి. ఒకటి, ఏది మంచిదో, ఏదికాదో మనము దేవునికి చెప్పలేము. రెండవది, దేవుడు సామాన్య ప్రజలకంటే నాయకులకు అధిక ప్రామాణికతలను నియమించాడు.

10.సణుగులు-సర్పకాటు (21:5-9) : ఇశ్రాయేలీయులు దేవుని నడిపింపును, ఆయన శక్తిని (21:1-4) మరచిపోయి మరోసారి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు వారి మధ్యకు తాపకరమైన సర్పాలను పంపించాడు. మోషే వారి కోసం ప్రార్థించి దేవుని ఆజ్ఞ ప్రకారం ఇత్తడి సర్పాన్ని చేయించి దానిని స్తంభం మీద వ్రేలాడదీశాడు (21:9). సర్పకాటుకు గురైన వారిలో ఆ ఇత్తడి సర్పమును చూసిన ప్రతి ఒక్కరు స్వస్థత పొందారు. ఈ ఇత్తడి సర్పం, మనందరి పాపాల కొరకు సిలువలో వ్రేలాడిన క్రీస్తుకు సాదృశ్యం. (యోహా 3:15). తరువాత దేవుని నడిపింపు ప్రకారం ఇశ్రాయేలీయులు యొర్దాను ఇవతల ఉన్న రాజులను ఓడించి వారి పట్టణాలన్నిటిని స్వాధీనం చేసికొన్నారు. అలా యొర్దాను నది వద్దకు చేరారు.

III. కనానుకు వెళ్ళే తరమును సిద్దము చేయుట.

1. బాలాకు రాజు-బిలాము ప్రవక్త (22:1-25:17) : ఇశ్రాయేలీయులు యొర్దాను ఇవతల ఉన్న అరాదు, సీహోను, బాషాను ఓగు రాజుల్ని జయించి, యొర్దాను ఒడ్డున ఉన్న మోయాబు మైదానములో దిగారు. ఆ కాలంలో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. అతడు ఇశ్రాయేలీయును గూర్చి విన్నాడు గనుక వారిని శపించడానికి బిలాము అనే ప్రవక్తను పిలిపించాడు (22:5,6). దేవుడు బిలాముతో “నీవు ఆ ప్రజలతో వెళ్ళకూడదు ఇశ్రాయేలీయులను శపించకూడదు” అని ఆజ్ఞాపించాడు. కనుక బిలాము తనవద్దకు వచ్చిన వారిని త్రిప్పిపంపించి వేశాడు కాని బాలాకు మరలా తన ప్రధానులను పంపించాడు. బిలాము రాజు ఇచ్చే బహుమానాలవైపు మొగ్గుచూపించాడు. అందుచేత దేవుడు “నేను చెప్పినది మాత్రమే నీవు పలకాలి” అని ఆజ్ఞాపించాడు. బిలాము దేవుని హెచ్చరికను త్రోసి పుచ్చినందువలన దేవుని దూత బిలాము మార్గములో అడ్డుగా నిలిచి మరోసారి బిలామును హెచ్చరించాడు. (22:28). సంఖ్యాకాండము 23, 24 అధ్యాయాలలో బిలాము 7 సార్లు పలికినట్లు ఉన్నది. (23:7-10; 18-24; 24:2-9; 15-19; 20; 21-22; 23- 24) కాని అందులో 4 పర్యాయాలు ఇశ్రాయేలీయులను దీవించాడు, 3 సార్లు ఇశ్రాయేలీయుల శత్రువులను శపించాడు. బిలాము వారిని శపించాలని బాలకు రాజు శతవిధాల ప్రయత్నించినా, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఒక్క శాపవచనం కూడ పలుకలేకపోయాడు. పైగా యేసుక్రీస్తును గూర్చి ప్రవచించాడు (24:17). 

అయితే బిలాము ఇశ్రాయేలీయులను పాపము చేయడానికి ప్రేరేపించమని బాలాకుకు సలహా ఇచ్చాడు. (ప్రక 2:14) బిలాము సలహామేరకు బాలాకు మోయాబు స్త్రీలను వారిమీదికి పురికొల్పి వారు పాపం చేయడానికి పురికొల్పాడు (25:1-3) ఈ సందర్భంలో ఫీనెహాసు దేవుని పరిశుద్ధత విషయం రోషంతో చేసిన కార్యాన్ని బట్టి దేవుడు అతనితో ఒకనిబంధన చేసాడు (25-6-13). లేఖనాలు బిలాము త్రోవ, బిలాము తప్పు, మరియు బిలాము బోధను వేరు వేరుగా స్పష్టంగా వివరిస్తున్నాయి. బిలాము త్రోవ (II పేతు 2:15:16) అంటే దురాశ. బిలాము తప్పు (యూదా 11వ) ఏమనగా దేవుని నీతిని నిర్లక్ష్యం చేయుట. బిలాము బోధ (ప్రక 2:14) ఏమనగా విగ్రహాలకు బలి ఇచ్చినది తినడానికి, మోయాబీయులతో వ్యభిచారం చేయడానికి ఇశ్రాయేలీయులను ప్రోత్సహించుట. సంఖ్యాకాండము వివరణ

2. క్రొత్తతరం-క్రొత్తజనసంఖ్య- క్రొత్త నాయకుని నియామకం (26:1-27:23) :సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో మరోసారి ఇశ్రాయేలీయుల జనసంఖ్య వ్రాయబడింది. మొదటి లెక్కలోనివారిలో యెహోషువ కాలేబులు తప్ప మరెవ్వరూ రెండవ లెక్కలో లేరు. వారందరూ అరణ్యంలో నశించిపోయారు. 26:63-65 లోని వారంతా కొత్తతరం. వారి సంఖ్య మొత్తం 6,01,730. 

దేవుడు మోషే మరణాన్ని గూర్చి ముందుగానే బయలుపర్చాడు. (27:12, 13) అతడు అబారీము కొండ ఎక్కి కనాను దేశాన్ని చూచేందుకు అనుమతించబడ్డాడు. మోషే తరువాత నాయకత్వం వహించేందుకు యెహోషువ ఏర్పాటు చేయబడ్డాడు. దేవుడే అతణ్ణి నియమించాడు. కనుకనే నాయకత్వానికి ఏలోటు రాకుండ యెహోషువ వారిని విజయవంతంగా కనానులోనికి నడిపించగలిగాడు. 

3.పండుగలు-అర్పణలు (28:1-30:16) : ఈ భాగంలో ఇశ్రాయేలీయులు ఆచరించాల్సిన పండుగలను గూర్చి మరోసారి ప్రస్తావించబడింది. ఇవన్నీ లేవీయకాండం 23వ అధ్యాయంలో చెప్పబడినా, వీరంతా కొత్తతరము గనుక మళ్ళీ చెప్పాల్సివచ్చింది. మ్రొక్కుబడులను గూర్చి (30:2) ప్రత్యేక హెచ్చరికలు ఇచ్చాడు. మ్రొక్కుబడిని తప్పక నెరవేర్చాలన్నదే ఈ అధ్యాయంలోని సారాంశం.

4.కనాను స్వాధీనానికి సన్నాహాలు (31:1-36:13) : ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోడానికి కారకులైన మిద్యానీయులను నాశనం చేయమన్న దేవుని ఆజ్ఞ ప్రకారం, ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రం నుండి 1000 మంది చొప్పున ఫీనెహాసు నాయకత్వంతోయుద్ధం చేసారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు యొర్దాను అవతలి దేశాన్ని వాగ్ధానం చేసాడు కాని రూబేను, గాదు గోత్రాలకు విస్తారమైన మందలున్నందువలన యొర్దాను ఇవతలనే స్థిరపడాలన్న కోరికను వ్యక్తం చేసారు (32:5,6). మోషే చెప్పిన మాటలకు వారు సమ్మతించి, తమ కుటుంబాలను, మందలను యొర్దానుకు ఇవతల ఉంచి, మిగతా గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వబడేంతవరకు వారితో కలసి యుద్ధం చేయడానికి ఒప్పుకొన్నారు. (32:25-27) వీరితో పాటు మనప్నే అర్ధ భాగం కూడ యొర్దానుకు ఇవతల స్థిరపడ్డారు(32:33). 

33వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యాత్ర అంతా చక్కగా వివరించబడింది. 40 ఏండ్ల యాత్రలో వారు 40 మజిలీలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ అధ్యాయం చివరి భాగంలో దేవుడు చెప్పిన మాటలు గమనార్హమైనవి. 

34వ అధ్యాయంలో, దేవుడు అబ్రాహాము మొదలుకొని మోషే వరకు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశపు సరిహద్దులను గూర్చి ఆదేశాన్ని పంచి పెట్టాల్సిన ప్రధానుల పేర్లు కూడ వివరించాడు. రూబేను, గాదు, మరియు మనష్నే అర్థగోత్రంవారు యొర్దాను నది ఇవతలి స్థలాలు పొందారు గనుక మిగిలిన 912 గోత్రాలకు నది అవతలి స్థలాలు పంచిపెట్టబడ్డాయి. వారు ఆ దేశాన్ని జయించకముందే దేవుడు అన్ని వివరాలు వారికి తెలియజేసాడంటే అందులో దేవుని విశ్వాస్యత కనిపిస్తుంది దేవుడు మాట తప్పనివాడు. ఇశ్రాయేలీయులు ఎన్నో సార్లు దేవునికి దూరమయ్యారు, ఆయనను శోధించారు గాని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. తాను చేసిన నిబంధనను మార్చలేదు. వారికి తన కృపను చూపాడు. అందుకే వారు లయముకాలేదు (మలాకీ 3:6). మనము మన పాపాలను బట్టి నశించి పోలేదు అంటే ఇది దేవుని కృపయే (విలా 3:22). అట్టి కృపగల దేవుని యెదుట నిర్దోషంగా జీవించడమే మన కర్తవ్యం. 

35వ అధ్యాయంలో లేవీయులకు దేవుడు ఏర్పాటు చేసిన 48 పట్టణాలను గూర్చి, వీటిలో ఏర్పాటు చేయబడిన 6 ఆశ్రయపురాలను గూర్చి వ్రాయబడింది. మూడు ఆశ్రయపురాలు యొర్దాను ఇవతలి ప్రక్కన, మరో మూడు యొర్దాను అవతలి ప్రక్కన ఉన్నాయి. వీటిని గూర్చి ద్వితీ 19:1-11; యోహో 20:1-16లో వివరించబడింది. ఆశ్రయ పురాలను గూర్చి మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం- పొరపాటున హత్య చేసినవాడు ఈ పురాలలోనికి పారిపోయి తీర్పు జరిగేంత వరకు తన్నుతాను రక్షించుకోవచ్చు (35:12). కాని కావాలని ముందుగానే పథకం వేసి కుట్రతో ఒక వ్యక్తిని చంపినవాడు ఈ ఆశ్రయ పురాలలోనికి పారిపోయినప్పటికిని, వానిని చంపివేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. పాత నిబంధన కాలంలో బుద్ధిపూర్వకంగా పాపం చేసినవారికి క్షమాపణలేదు. కాని ఈ కృపాకాలంలో ఆలాంటి వారు కూడ పశ్చాత్తాపపడి, మార్పుమనస్సు పొందితే దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు.  సంఖ్యాకాండము వివరణ

36వ అధ్యాయంలో, ప్రతి పురుషుడు లేక స్త్రీ, తన గోత్రంలోని వారినే వివాహం చేసికోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ విధమైన ఏర్పాటు వారి గోత్రాల స్వాస్థ్యాన్ని, ఆస్తులను సంరక్షించడానికేనని మనం గ్రహించాలి. 27వ అధ్యాయంలో మనషే వంశస్థుడైన సెలోపెహాదు కుమార్తెలు తమకు సహోదరులు లేరుగనుక తమ తండ్రి సహోదరులతో పాటు తమకు స్వాస్థ్యమునిచ్చి తమ తండ్రిపేరును అతని వంశములో, మాసిపోకుండ చేయాలని మోషే, ఎలియాజరు మరియు సర్వసమాజం ఎదుట మనవి చేయడం చూస్తాము (27:1-11). మోషే వారి విషయం దేవుని సన్నిధిలో మనవిచేసినప్పుడు దేవుడు స్వాస్థ్యము పొందే విషయంలో మరొక నియమాన్ని స్పష్టంగా తెలియజేసాడు. ఎవరికైనా కుమారులు లేకుంటే, అతడు మృతిబొందిన తరువాత అతని భూస్వాస్థ్యము అతని కుమార్తెలకు చెందాలి. అయితే వారు తమ స్వాస్థ్యమును మరొక గోత్రములోనికి పోనివ్వకుండ తమ గోత్రానికి చెందినవారినే వివాహం చేసికోవాలి. ఈ విధంగా దేవుడు కనాను దేశంలో ఇశ్రాయేలీయులు పాటించాల్సిన విధులను, నియమాలను, స్పష్టంగా బోధించాడు. తన ప్రజలు, భూమ్మీదనున్న ఇతర ప్రజలకంటే ప్రత్యేకమైనవారిగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. మనందం దేవుని ఉద్దేశానుసారంగా జీవించే కృప ప్రభువు దయచేయును గాక! 


బైబిల్  ప్రశ్నలు – సమాధానాల కోసం .. click here 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!