నిరీక్షణ.
Powerful Sunday School Stories Lessons
“నిరీక్షణాపురం” వెళ్ళే ఓ ట్రైన్లో “మార్గదర్శి” అనే ఒక బోధకుడు ప్రయాణం చేస్తున్నాడు. తన ప్రయాణ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? అనుకుని బైబిల్ తెరచి చదువుకోసాగాడు. అలా బైబిల్ను శ్రద్ధగా పఠించుచుండగా ఓ నాస్తికుడు చూసాడు.
పాదిరిగారు – నిజంగా దేవుడున్నాడంటారా? అంటూ కాలక్షేపానికీ ప్రశ్నించాడు.
బోధకుడు తలెత్తి అతని వంక చూసి, ఉన్నాడన్నట్లుగా మౌనంగా తలూపి మరల బైబిలుని చదువుకోసాగాడు.
“దేవుణ్ణి చూడాలని నాకు బాగా కుతూహలముగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?” అంటూ పరిహాసంగా అడిగాడు నాస్తికుడు.
బోధకుడు బైబిలు మూసేసి ఆ నాస్తికుని వైపు తిరిగి “సహోదరుడా నీకొక కథ చెబుతా విను” అన్నాడు.
“పూర్వం ఓ ఊళ్ళో ఒక అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయ నిర్ణయించారు. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. నేను పెళ్ళి అంటూ చేసుకుంటే అందరికన్నా గొప్పవాణ్ణి చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోనని తెగేసి చెప్పిందా పిల్ల.
అయితే ఎవర్ని చేసుకుంటావు? అడిగింది ఆ పిల్ల తల్లి.
మన ఊళ్ళో అందరికన్నా గొప్పవాళ్ళెవరు? అని అడిగిందా అమ్మాయి. మన ఊళ్లో కాదు, మన దేశంలోని అందరికంటే గొప్పవాడు మనరాజుగారు అని చెప్పాడు పిల్ల తండ్రి.
అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను అందా పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదు ఆ అమ్మాయి. తండ్రికి ఏం చెయ్యాలో పాలుపోక సరే అన్నాడు. ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకు ఎదురుపడ్డాడు. నన్ను పెళ్ళి చేసుకో అని ఆమె అడుగబోతూ ఉండగా, ఆ రాజు పల్లకీ దిగి కాలినడకన వెళ్లే ఒకాయనకు సాష్టాంగ నమస్కారం చేయడం చూసింది. రాజుగారే సాక్షాత్తూ దిగొచ్చి నమస్కారం చేసిన ఈ వ్యక్తి ఎవరో అని ఆరా తీసింది. తీరా దొరికిన సమాధానం – అతను రాజుగారి గురువుగారు అని తెల్సింది. కాబట్టి రాజుగారే నమస్కరించాడంటే, అతను రాజుకంటే గొప్పవాడు అని ఆలోచించి ఆయన్నే వివాహం చేసుకోవాలనుకుంది.
ఆ విషయం అతణ్ణి అడిగి పెళ్ళి చేసుకోవాలన్న ఆశతో – అతణ్ణి వెంబడించింది. కొంచెం దూరం వెళ్లాక – తనకంటే పెద్దవారిని గౌరవించే ఈ గురువుగారు ఒక వయో వృద్ధుడు చేత కర్ర పట్టుకుని ఊరు మధ్యలో నున్న పెద్ద బండపై కూర్చుండగా, అతని వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసాడు. కాబట్టి గురువుగారి కంటే ఈ వయోజనుడే గొప్పవాడుగా ఉన్నట్టుందే అని ఆ అమ్మాయి వయోవృద్ధుణ్ణి పెళ్ళి చేసుకోవాలనుకుంది.
ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ బండమీదికి ఎక్కి వెనుకనుంచి కాలెత్తి మూత్రముతో ముసలాయన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ ముసలాయన కన్నా ఆ కుక్కే శ్రేష్టం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుండగా, ఓ పిల్లవాడు ఆ కుక్కను రాయితో కొట్టాడు. ఆ కుక్క కుయ్యుమంటూ పరిగెత్తింది.
ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకుని వాణ్ణి పెళ్లి చేసుకోవాలను కుంది. కాని ఇంతలో ఓ యువకుడు – వచ్చి ఏరా, బడికి వెళ్లకుండా ఊరకనే అటు ఇటు తిరుగుతున్నావా? అంటూ వాని చెవిని నులిమి తలపై మొట్టికాయ వేసాడు. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఇంటిదారి పట్టాడు.
దాంతో తను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకుని వాడి దగ్గరకు వెళ్ళి తనని వివాహం చేసుకోమని అడిగింది.
ఆ యువకుడు ఎవరో కాదు – ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి అబ్బాయే.
మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెదకడం సరికాదు. మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు. అక్కడ తప్ప ఇంకెక్కడ వెదకినా దేవుడు దొరకడు.
“మన హృదయమే దేవుని యొక్క నిజమైన చిరునామా!” అంటూ చెప్పుకొచ్చాడు మన పాదిరిగారు. అంతటితో అదిరిపడ్డాడు నాస్తిక సోదరుడు!
పరిశుద్ధ బైబిలు గ్రంథంలో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో – మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరెరుగరా? (3:16) అంటూ తెలియజేసాడు. ఆరవ అధ్యాయం, పంతొమ్మిదవ వచనంలో – మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? అని కూడ చెబుతున్నాడు.
మనం ఎక్కడ ఉంటే అదే అసలైన దేవుని చిరునామా!
పిల్లలూ, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీలో నున్న దేవుని యొక్క స్వరాన్ని అనుదినం విని ఆయన మాటచొప్పున చేయుటకు మిమ్మును మీరు సమర్పించుకొనండి!
ప్రసంగ శాస్త్రం .. click here




