Adoniram Judson Biography Telugu – అథోనీరామ్ జడ్సన్1

 అథోనీరామ్ జడ్సన్

Adoniram Judson Biography Telugu

 అథోనీరామ్ జడ్సన్ 1788 వ సంవత్సరము ఆగష్టు నెల 9 వ తేదీన మాసాచూసెట్సులోని ‘మాలిన్’ లో జన్మించెను. జడ్సన్ చిన్న వయస్సు నుండి మంచి నాగరికత, సంస్కృతి కలిగిన వాతావరణంలో పెరిగెను. జడ్సన్ తల్లి దండ్రులు భక్తి కలిగినవారు, సంస్కారవంతులు. జడ్సన్ 3 ఏండ్ల వయస్సులోనే బైబిల్ చదవడం నేర్చుకొనెను. నాలుగేండ్ల వయస్సులోనే తన చుట్టూవున్న పిల్లలను చేర్చుకొని బోధించుట మొదలు పెట్టెను. 10 ఏండ్ల వయస్సులో గణితశాస్త్రము, లాటిన్, గ్రీకు భాషలలో పాండిత్యము పొంది వేదాంత గ్రంథాన్ని పఠించెను. గాని 19 ఏండ్ల వయస్సులో కళాశాలలో చదువుచున్న రోజులలో ఒక నాస్తికునితో స్నేహం ప్రారంభమాయెను. ఆ నాస్తికుని స్నేహ ప్రభావమువల్ల జడ్సను దేవుని మీద ఉన్న విశ్వాసము క్షీణించెను. త్వరలోనే పాప జీవితమునకు, ఆచార భక్తికి అలవాటుపడెను. భక్తి కార్యాల మీద ఆశ తగ్గి నాటక సమాజంలో చేరెను. కాని అతని జీవితములో ఆనందము లేక మానసికమైన అలజడికి గురి అయ్యెను. అట్టి పరిస్థితులలో తనకు నాస్తికత్వము నేర్పించిన అతని యౌవన స్నేహితుడు వ్యాధిగ్రస్థుడై, బహువేదనకరమైన మరణం నొందెను. 

అది గమనించిన జడ్సన్లో ఒక గొప్పమార్పు కలిగెను. ఈ లోక జీవితము బహు అల్పమైనదని, మరణించిన తర్వాతే శాశ్వత జీవితమున్నదని, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించనిచో శాశ్వత నరకమేనని గ్రహించెను. ఆరు వారములు తిరుగకముందే మారుమనస్సు పొంది, తన ఇరవయ్యవ సంవత్సరములోనే తన జీవితమును దేవునికి సమర్పించుకొనెను. అంతేగాక తానొక మిషనెరీగా సువార్త అందని దేశాలకు వెళ్ళి ఆత్మలు సంపాదించాలని ఆశపడెను. 

 భారతదేశములో సువార్త ప్రకటించవలెననెడి ఆశతో నూతనముగా వివాహము చేసుకున్న “ఆనీ హజల్టైన్” అను తన భార్యతో పాటు బయలు దేరెను. ప్రయాణములో అనేక కష్టాలను ఎదుర్కొని 1812వ సంవత్సరములో జూన్ నెలలో కలకత్తారేవు చేరెను. అయితే ఆ సమయములో ఇంగ్లాండు దేశమునకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు – అమెరికా మిషనెరీలు వెంటనే వెనక్కి వెళ్ళి పోవాలని ఆజ్ఞ జారీ చేసిరి. “మేము సువార్తసేవ చేయుటకు తూర్పు దేశ ప్రజల దగ్గరకు వచ్చితిమి” అన్న జడ్సన్క ఇండియాలో కాలు మోపుటకు స్థలము లేక బర్మావైపు సాగుచున్న ఒక ఓడ యెక్కి 1813వ సంవత్సరములో బర్మా దేశమునకు చేరెను. 

 బర్మా దేశము మరింత చీకటి దేశము. క్రీస్తు సువార్తను బోధించువారిని, అంగీకరించు వారిని పిచ్చివారగునట్లు సుత్తెలతో కొట్టే దేశం. అయిననూ ప్రభువుపై భారం వేసి బర్మాలోని రంగూన్ పట్టణంలో ప్రవేశించెను. బహు మురికిగా; బురదతో, దుర్వాసనతో నిండిన ఆ పట్టణంలో జడ్సన్ భార్య వ్యాధి గ్రస్థురాలాయెను. వింతైన ఆచారాలతో, పద్ధతులతో నిండిన ఆ జనుల మధ్య నివసించి అతి ప్రయాసతో బర్మా భాష నేర్చుకొనెను. ఈలోగా వారి 8 నెలల కుమారుడు చనిపోయెను. వారు అనేక బాధలకు గురైరి. అయినను ఆ దేశమును వదలి వెళ్ళుటకు ఇష్టపడక, ఆ దేశ బౌద్ధమతస్థులను క్రీస్తుకొరకు సంపాదించుటకు నిశ్చయించుకొనిరి. 

 జడ్సన్ దంపతులు బర్మా భాషను నేర్పుటకు ఒక పాఠశాలను నెలకొల్పి విద్యతో పాటు దేవుని వాక్యము బోధించుచుండిరి. జడ్సన్ ప్రయాస ఫలితంగా 6 సంవత్సరముల తర్వాత “మాంవినాస్” అను వ్యక్తి మొట్టమొదట క్రీస్తును అంగీకరించెను. సువార్త సేవ వృద్ధి పొందుచున్న దినములలో బౌద్ధమతమును తప్ప మరి ఏ మతమును అనుసరింపకూడదనే చట్టము రూపుదాల్చెను. రాజాగ్రహమునకు భయపడి బర్మాను విడిచి పెట్టవలెనని తలంపు కల్గెను. కాని దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకొనిన జడ్సన్ బలము పొందెను. 

 బ్రిటిష్వారు బర్మాను ముట్టడించినపుడు జడ్సన్ ఏదో రహస్యము బ్రిటిష్ వారికి అందజేసెనని నిందవేసి కారాగారములో వేసిరి. బహు మురికితోను, భయంకరమైన హింసలతోను కూడిన ఆ కారాగారములో అతడు 20 నెలలు గడిపెను. ఆ సమయంలో అతని భార్య ప్రసవించి కుమార్తెను కనెను. ఆమె తన కుమార్తెను చెఱసాల దగ్గరకు తెచ్చి చూపించవలసి వచ్చెను. ఆమె తర్జుమా చేసిన క్రొత్త నిబంధన ప్రతులను తలగడ సంచిలో కుట్టి చెఱసాలలో ఉన్న జడ్సన్క అందించెను. 20 నెలలు చెరసాలలో మగ్గిన జడ్సన్ విడుదల పొంది ఇంటికి వచ్చేలోగా బహువ్యాధిగ్రస్థులై పరుండియున్న తన భార్య ఆనీని, చిక్కిశల్యమై యున్న చిన్న కుమార్తెను కనుగొనెను. త్వరలోనే అతని భార్య జ్వర బాధతో మరణించెను. మరికొద్ది రోజులోనే చిన్నకుమార్తె కూడా మరణించెను. అది జడ్సను సహించరాని దుఃఖమును కలుగజేసినది. 

 అయినను దేవునిని ఎన్నడూ నిందించని జడ్సన్ తన సేవలో ముందుకు సాగెను. ఆ తరువాత ఓర్పుతో 16 సంవత్సరములు అవిరామ కృషి సల్పిన అదోనిరామ్ సువార్తను బర్మాలో ప్రకటించి 1840 నాటికి 100 మందికి పైగా బాప్తిస్మాలిచ్చెను. బైబిలును బర్మాభాషలోనికి తర్జుమా చేసెను. మరియు ఇంగ్లీషు- బర్మా డిక్షనరీ తయారు చేసెను. 

 34 సంవత్సరములు అనేక కష్టములకు ఓర్చి చేసిన సేవవలన మంద దృష్టిగలవాడై, విపరీతమైన తల బాధకు గురై, నలిగి పోయిన శరీరము కలవాడైనను “క్రీస్తు ప్రభువు సిలువ ప్రేమను స్థిరంగా ఇక్కడ స్థాపించేవరకు ఈ ప్రాంతాన్ని విడువనని” చెప్పి; ఎన్నో కష్టనష్టాలను భరించి, భార్యా, బిడ్డలను, తన ఆరోగ్యమును చివరికి తన ప్రాణమును పోవువరకు అక్కడే నిలిచి సేవచేసి తన 62 వ ఏట అనగా 1850 ఏప్రిల్ 12న ఉదయం 4 గంటల 10 నిముషములకు “బర్మా మిషనెరీ” అని పేరు పొందిన అదోనీరామ్ ప్రభువు నందు నిద్రించెను. ఆయన ఎప్పుడూ ఇష్టపడే నల్ల సూట్ వేసి, మౌనముగా అతని దేహమును పడవపై నుండి సముద్రపు అలల మీద నెమ్మదిగా దించిరి. అక్కడ భూ స్థాపన గాని, ఆరాధన గాని ఏదీ లేకపోయెను. 


మరిన్ని మిషనరీ జీవిత చరిత్రల కోసం…..Click Here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!