Amy Carmichael Biography Revealed in Telugu – అమీకార్ మైఖేల్

అమీకార్ మైఖేల.

Amy Carmichael Biography Revealed in Telugu

 అమీకార్ మైఖేల్ 1867 డిశంబరు 16 న నార్తర్న్ ఐర్లాండులోని ‘కౌంటెన్’లో జన్మించెను. ఈమె తల్లిదండ్రులు అనేక పిండి మిల్లులు కలిగి యుండిరి. చిన్న వయస్సులో సంతోషకరమైన, సమృద్ధిగల కుటుంబములో పెరిగెను. 1883 లో వెస్లియన్ మెథడిస్ట్ స్కూల్లో విద్యార్ధిగా ఉన్నప్పుడే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించెను. 1886 లో గ్లాస్కోలో జరిగిన కెస్విక్ సభలలో లోతైన రక్షణ అనుభవము పొంది పరిశుద్ధ పరచబడిన జీవితములోనికి ప్రవేశించెను. ఈమె అనేక కూటములకు వెళ్ళి రకరకాల ప్రసంగాలు వినడంలో సంతోషించక, ఇతరులకు క్రీస్తు నందించు విషయములో భారము కలిగి, వారి పిండిమిల్లులో పనిచేసే అమ్మాయిలకు దగ్గరలో ఉన్న చర్చిలో కూటము ప్రారంభించి ప్రభువు చిత్తము కొరకు ప్రార్థించుచుండగా, ప్రభువు ఆమెను ప్రత్యేకమైన సేవకు నడిపించి ఒక కట్టడమును కూడా కట్టుటకు సహాయము చేసెను. ఆ కట్టడములో జరిగిన కూటములలో అనేక మంది రక్షింపబడిరి. అంతేకాదు బాధలలో ఉన్నవారు, దిక్కులేనివారు, నలిగినవారు, అనేకులు వచ్చి క్రీస్తు ప్రేమను రుచి చూచి ఆదరణ పొంది రక్షింపబడుచుండిరి. 

 ఒక దినము ఆమె ప్రార్థించుచుండగా, ఆమె- ‘నీ జీవితమును మిషనెరీ సేవకు సమర్పించి నా చిత్తప్రకారము నడువు’ మన్న దేవుని స్వరము వినెను. 1892 జనవరి 13వ తేదీన ప్రభువు మరల మాట్లాడెను. ఆమె ప్రార్థించుచుండగా దేవుడు మార్గము తెరచి 1893 మార్చి 3 వ తేదీన కెస్విక్ కన్వెన్షన్ తరఫున మొదటి మిషనెరీగా జపాన్కు పంపబడెను. జపాను దేశమునందు సేవలో అనేక అనుభవములను పొందెను. గాని ఆమె వ్యాధికి గురి అయినందున విశ్రాంతి కొరకు స్వదేశమునకు తిరిగి వచ్చి, ఆ తరువాత చైనాకు, శ్రీలంకకు చివరికి 1894లో తిరిగి ఇంగ్లాండుకు వెళ్ళెను. 

 అయితే ప్రభువు ఆమెను 1895 లో నవంబరు 9 వ తారీఖున ఇండియాకు రప్పించెను. 1901 మార్చి 6 వ తేదీన ‘ప్రీన’ అనే 7 సంవత్సరముల అమ్మాయి ఆమె యొద్దకు పరుగెత్తుకొని వచ్చి ఏడ్చెను. ఆమె తలిదండ్రులు దేవదాసిగా ఉండటానికి ఆమెను ఎట్లు ఒక గుడికి అమ్మి వేసిరో ఆ బిడ్డ కన్నీటితో చెప్పినపుడు అమీకార్ మైఖేల్ హృదయము ద్రవించెను. వారినెట్లు వేశ్యలుగా (దేవదాసిలుగా) ఆ గుడులలో ఉంచుచున్నారో ఎరిగినపుడు ఆమె మోకాళ్లపై కన్నీటితో వారి ఆత్మల కొరకు, శరీరముల కొరకు ప్రార్థించెను. అటువంటి పిల్లలను ఆ భయంకరమైన స్థితి నుండి విడిపించుటలో ఆమె, ఆమె అనుచరులు బెదిరింపులకు, బంధింపులకు లోను కావలసి వచ్చెను. అయినను 1904 వ సంవత్సరానికి 17 మంది పిల్లలు, క్రీస్తు ప్రేమను చూపించే ఈ అమ్మను చేరుకొని సువార్త విని రక్షింపబడిరి. 

 అమీకార్ మైఖేల్ చిన్నతనంలో తన కన్నులు తన తల్లి కన్నులవలె ఊదా రంగులో లేవని చింతతో బాధపడి ప్రార్థన ద్వారా తన నల్లనికండ్లు ఊదారంగుగా మారతాయని విశ్వాసంతో ఒక రోజంతా ప్రార్థించసాగెను. అయితే ప్రభువు ఆమె ప్రార్థన విని ఆమె కండ్ల రంగు మార్చలేదుగాని, ఆమెతో- కుమారీ! వద్దు! అని చెప్పెను. అనేక సంవత్సరముల తరువాత భారత దేశమునకు మిషనెరీగా వచ్చినప్పుడు భారతీయ బాలికల కండ్లు నల్లగా ఉండుట చూచి, ఆమెకు ఎక్కడలేని ఆనందము కలిగెను. చిన్నతనములో దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వని రహస్యమును గ్రహించెను. 

 ఆమె స్థాపించిన ఆశ్రమము కొరకు ఎవరినీ ఆర్థిక సహాయాన్ని అడిగేది కాదు. ఒక బిడ్డను మేము పోషిస్తామని ఎవరైనా ముందుకు వచ్చినను, ఆమె ఒప్పుకొనక అన్ని కానుకలను ప్రభువు చేతిలో పెట్టి ప్రభువు నడిపింపు ప్రకారము చేసెను. ఆమెతో పనిచేసేవారిని చాలా జాగ్రత్తగా ఎన్నుకొనేది. వారికి జీతముల పద్దతి లేదు. కాబట్టి త్యాగముతో పరిచర్యచేసే వారు మాత్రమే ఆమెతో ఉండెడివారు. 60 సంవత్సరముల సేవలో ఆమె ఎప్పుడును తన దేశానికి వెళ్ళి నిధుల కొరకు, డబ్బు కొరకు తన వారిని అడుగలేదు. అయినను ఎన్నడూ ఆ సేవ లోటు పడలేదు. అప్పులపాలు కాలేదు. 

 భారతీయ వస్త్రధారణ ధరించి ప్రాంతీయ భాషలు నేర్చుకొని తమిళనాడులోని తంజావూరు ప్రాంతములో సేవ చేసెను. “సేవలో ముమ్మరంగా ఉండి వ్యక్తిగత ప్రార్థనా సమయము పోగొట్టుకోవద్దు అని, ప్రార్థనా కూటములలో ప్రార్థనను మాని భక్తి మాటలు చెప్పుకొనే విషయములో జాగ్రత్తగా ఉండమ”ని ఆమె తన సహాయకులను హెచ్చరించేది. ఆమెచే విడిపించబడి రక్షించబడిన వారనేకులు ఆమెతో పాటు బహు నమ్మకస్థులుగా సేవ చేసిరి. ఆమె గంటలు తరబడి బైబిలు చదవడమే గాక మిషనెరీల అనుభవాలను అధికముగా చదువుచుండెడిది. ఈమె ఇంచుమించు అనేక రకములైన 35 పుస్తకములను రచించెను. 

 మనుష్యులను సంతోషపెట్టి, వారి ఆదరాభిమానములను, ధనమును సంపాదించుకోవాలని ఈమె ఎప్పుడూ ఆశించక; దిన దినము, క్షణ క్షణము ప్రభువుపై ఆధారపడి ప్రార్థించినందువల్ల ఆమె స్థాపించిన “డోనాఊర్ ఫెలోషిప్” పరిచర్యలు ఇంకను దక్షిణ భారత దేశములో కొనసాగించబడుచున్నవి. 

 ఈమె మంచి ప్రార్థనాపరురాలు! “ప్రభువా, నీ కిష్టమొచ్చినట్లు నన్ను చేసుకో! నీ నామములో నీవు ప్రేమించిన వారికి పరిచర్య చేయుటకు తగిన వ్యక్తిగా నన్నేమైనా చేసుకో” అని ఒక దినం భారంతో ప్రార్థించినది. ఆ మధ్యాహ్నం ఆమె కాలు తడబడి పడటం వలన కాలు విరిగినది. ఆమె అప్పటికి 36 సంవత్సరములు పరుగులెత్తుతు చేసిన పరిచర్య కూడా ఆగినది. అయితే ఆ తరువాత 20 సంవత్సరములు ఆమె తన గదిలోనే పడకపై పరుండవలసి వచ్చినను వేలాది ఉత్తరములు వ్రాయుట ద్వారా, పుస్తకములు వ్రాయుట ద్వారా ఆ 20 సంవత్సరములు మరింత గొప్ప విశ్వాస పరిచర్యను కొనసాగించెను. 1948 లో మరింత వ్యాధిగ్రస్థురాలై పడకను విడువలేక పోయినప్పటికిని ప్రభువును ప్రార్థించుచుండెను. చివరికి తన 84 వ ఏట అనగా 1951 జనవరి 18 వ తేదీన ప్రభువు సన్నిధికి వెళ్ళెను ఈ యోధురాలు. 


మరిన్ని మిషనరీ జీవిత చరిత్రల కొరకు.. click here 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!