క్రైస్తవులు ముహూర్తాలు జాతకాలు చూడ వచ్చా – Astrology Christianity

జాతకమా 

Astrology Christianity

 మనిషి ముఖం షేపు. అరచేతి గీతలు, జన్మనక్షత్రాలు, జాతకం ద్వారా అతని భవిష్యత్తును భలేగా చెప్పేసి భోళ మనుష్యుల్ని ఎందరినో బోల్తా కొట్టించేవారు ఏనాటినుండో బయలుదేరారు! తన భవిష్యత్తు ఎలా వుంటుందో తెలుసుకోవాలనే తపనే అనేకుల చేత తప్పటడుగులు వేయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ప్రతి ప్రజలపై కనబడుతోంది. పెళ్ళి కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, విదేశీ ప్రయాణం కొరకు, గృహ ప్రవేశం కొరకు, ఎన్నికల ముందు ప్రజలు వ్యర్థమైన వీటిని విపరీతముగా అనుసరించే ప్రయత్నాలు చేస్తారు. చాలామంది క్రైస్తవులు వీటిలో ఆసక్తి చూపుతారు. దేవుని కన్న ఎక్కువగా వీటిపై ఆధారపడతారు. ఆయన వాక్యము కంటే ఎక్కువగా వీటిపై వారికి విశ్వాసం! సాంప్రదాయపు సంకెళ్ళతో సతమతమై అనేకులు గుడ్డిగా దారి తప్పిపోతున్నారు. దినచక్రాలు, వారఫలాలు, రాశిచక్రం, చిలుకజోష్యం, జ్యోతిష్యం, టారట్కార్డులు వగైరా వన్ని దేవునికి హేయమైనవి. దేవుడు ఏయమ్యాడని నీవు వీటిని ఆధారం చేసుకుంటున్నది. ఈ జోస్యాలు ఏవీ నీ జీవితంలో “జోక్యం” చేయలేవు. 

 జ్యోతిష్యశాస్త్రం పురాతనమైనది. బబులోనులో ప్రారంభమైనది. గ్రహాలు లేక నక్షత్రాలు మనుష్యుల జీవితాలపై ప్రభావము చూపుతాయి అనే నమ్మికపై ఇది ఆధారపడి వుంది. జన్మ సమయంలో ప్రారంభమైన ఈ ప్రభావం జీవితమంతా ఉంటుంది అని జ్యోతిష్కుల వాదన. జన్మనక్షత్రాలను సూచించే జాతక చక్రం దీనిలో ప్రధానపాత్ర కలిగి వుంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రజల మన్నిక పొందుటకు కారణం వారు తెలుసుకోదలచిన ముఖ్యమైన సమాచారమును అందించగలదన్న నమ్మికయే! సంరక్షణ, సఫలీకృతులు అవుటకు సహాయం, నడిపింపు, భవిష్యత్ వాణి మరియు వారిని వారు తెలుసుకునేట్లు చేయగలదని జ్యోతిష్కులు ప్రచారం చేస్తున్నారు. 

 ప్రస్తుతం వేలాది దినపత్రికల్లో, వార పత్రికల్లో ఇవి ముద్రించబడుతున్నాయి మరియు టి.వి.లో జాతక సంబంధమైన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి! రోజు పేపర్ రాగానే నేరుగా వారఫలాలు లేక రాశిచక్రం చదివేవారు చాలా వున్నారు. 1930లో మొదటిసారి జాతకం లండన్ సండె ఎక్స్ప్రెస్ పేపరులో ప్రచురించబడింది. అయితే విచిత్రమేమంటే ప్రఖ్యాతి చెందిన జ్యోతిష్యశాస్త్రులు ప్రచురించబడుచున్న వాటిలో ఎక్కువ శాతం “చెత్త” అని అంటారు. 

 దేవుడు జ్యోతిష్యం, జాతకం గూర్చి తన ప్రజలను హెచ్చరిస్తూ, “అన్యజనుల ఆచారముల నభ్యసింపకుడి ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి” (యిర్మీయా 10:2) అని సెలవిచ్చాడు. దేవుడు ఆకాశ నక్షత్రములకు సృష్టికర్త, మనం ఆయన యందు నమ్మికయుంచి, ఆయనకే భయపడాలి కాని ఆయన చేత సృష్టింపబడిన వాటికి కాదు. జ్యోతిష్య శాస్త్రం శక్తిహీనమైనది. దానితో పేరుగాంచి దానిలో స్థిరపడిన బబులోనును తీర్పు తీరుస్తూ దేవుడు సవాలు చేసాడు. “నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము” (యెషయా 47:13-14). దానిని నమ్ముకున్న వారిని నట్టేట ముంచుట తప్పితే దానికి మరేమి చేత కాదు! దేవుని నమ్మని వారికి పట్టిన దరిద్రం ఇది. 

 జ్యోతిష్యశాస్త్రం కూడా దేవుని వాక్యం ప్రకారం, మాంత్రిక శక్తులకు సంబంధించినది. “శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని, సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. (ద్వితీయో 18:10 – 12). వారిని విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెడతాడా? జ్యోతిష్య శాస్త్రం ద్వారా ప్రజలు గుప్తములైన వాటిని, నిషేదించబడినవాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదియు దేవుని ద్వారా కాక మరో మాధ్యం ద్వారా చేస్తున్నారు. దేవుని సహాయం లేని చోట తప్పక దురాత్మల సహాయమే లభిస్తుంది. ఇది ఘోరమైన పాపం మరియు దాని చేయువారికి క్షేమకరం కానేకాదు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో వుంది. ఆయన హయాంలో వుంది. వ్యర్థమైన వాటిలో కాదు. నీవు నీ భవిష్యత్తును ఎరుగక పోయినా భవిష్యత్తును కలిగియున్న ఆయనను యెరిగితే చాలును. 

 జ్యోతిష్య శాస్త్రంలో నిపుణులు దాని వలన కలిగే కొన్ని కీడులను సూచిస్తున్నారు : 1. శారీరక పీడన 2. నేర ప్రేరేపణ జాతకాలు చేసే కిరాతకాలు ఎలాంటి ఓ ఉదాహరణ చూడండి. ఒక తల్లి తన కుమారుడు మతిస్థిమితం లేని వాడవుతాడని జ్యోతిష్కుడు చెప్పగా వెంటనే ఆ కుమారుని చంపేసింది. వికలాంగునిగా బిడ్డపుడతాడని చెప్పినప్పుడు మరో తల్లి గర్భస్రావం చేయించుకుంది. 3. ఆర్థిక నష్టం – జ్యోతిష్యులను ఆధారం చేసుకుని డబ్బు పెట్టుబడిగా పెట్టి నష్టపోయిన వారెందరో ఉన్నారు. 4. ఆత్మీయ నష్టం – దేవునికి వ్యతిరేకమైనది కనుక దాని చేయువారు తప్పక నష్టపోతారు 5. మానసిక నష్టం మరియు 6. నైతికంగా నష్టపోతారు. ఒక వ్యర్థమైన, దైవవిరుద్ధమైన వ్యసనం కొరకు ఇంతగా నష్టపోయేవాడిని మూర్ఖుడు అనక మరేమంటారు. 

 కొంత కాలం క్రిందట 186 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, ఇందులో నోబుల్ గ్రహీతలు కొందరు వున్నారు. వీరంత జ్యోతిష్యశాస్త్రం పై విరుచుకుపడ్డారు. దానిని ఘోరంగా విమర్శించారు. దాని వలన ప్రజల మోసపోవడము, జ్యోతిష్కులు డబ్బు సంపాదించడము జరుగుతోందని తేల్చి చెప్పారు. ఒకవేళ ఈ వ్యాసం చదువుతున్న వారిలో ఎవరైన ఈ విషయంలో దోషులుగా వుంటే తక్షణం ప్రభువు పాదాల యొద్ధ క్షమాపణ కోరి, వెంటనే ఈ పనిని విసర్జించండి. 

 మీ జీవితాన్ని గూర్చి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి” (మత్తయి 6:25) అని యేసు చెప్పాడు. అవును వాటి గురించి ఆలోచించవద్దు. ఆందోళన చెందవద్దు భవిష్యత్తులో ఏది ఎప్పుడు ఎలా జరగాలో దేవుడు నిర్ణయించాడు. వాటిని ప్రేమతో కృపతో నీ కొరకు నిర్దేశించాడు. కనుక క్రీస్తులో వున్నవారు ఈ విషయాలను గూర్చి నిశ్చింతగా ఉండాలి. 

 జాతకాలు, జ్యోతిష్కులు నీ జీవితం యొక్క విషయాలను, జరిగే కార్యలను, ఎదుర్కొనబోయే పరిస్థితులను, నీ భవిష్యత్తును ఎరుగరు. సరిగా చెప్పలేరు. నిన్ను నడిపించుటకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆయన మాత్రమే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మిగతా వారందరు నిన్ను అసత్యములోనికి, అగాధకూపములోనికి నడిపిస్తారు. జాగ్రత్త!! 

 “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి” (కీర్తనలు 19:1) అని బైబిల్ చెబుతోంది. అంతే కాని మనుష్యుల వ్యవహారాలను తెలిపే పని ఆకాశములు మరియు నక్షత్రములది కాదు. సాతాను సుళువుగా చిక్కులబెట్టు పాపపాశాలతో అనేకులను బంధించి ఈడ్చుకుపోతున్నాడు. 

 కొందరు క్రైస్తవులు, తిథులు, నక్షత్రాలు, వర్ణ్యాలు, వాస్తులు వగైరా వగైరా చాలా ఆసక్తితో పాటిస్తారు. తరువాత పాట్లు పడతారు. వద్దు దేవునికి హేయమైన వాటిని హత్తుకోవద్దు. వాటి మూలంగా హతమైపోవద్దు. కనువిప్పు కలిగి క్రీస్తు యేసు కనికరము కొరకు క్షమాపణ కోరి, ఆయన కరుణతో మనం జీవిద్దాం ! మీకు తెలిసిన వారు ఎవరు ఈ విధంగా వున్నా వెంటనే వారిని హెచ్చరించండి. వీటి బంధకాల్లో నుండి విడుదలవుటకు సహాయపడండి. 


మరిన్ని బైబిల్ ప్రశ్నలు – సమాధానాల కోసం .. click here 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

1 thought on “క్రైస్తవులు ముహూర్తాలు జాతకాలు చూడ వచ్చా – Astrology Christianity”

Leave a Comment

error: Content is protected !!