బైబిల్ ఆవిర్భావం
Bible History in Telugu
వేర్వేరు రచయితలు వ్రాసిన విభిన్న పుస్తకాలున్న బైబిలు ఒక చిన్న గ్రంథాలయం లాంటిది. వీరు సుమారు పదిహేను వందల సంవత్సరాల కాలవ్యవధిలో వేర్వేరు కాలాల్లో వేర్వేరు దేశాల్లో వేర్వేరు సందర్భాల్లో జీవించారు. మానవజాతిపట్ల దేవుని సంకల్పం వెల్లడికావడం వీరి రచనల్లో వున్న సాధారణాంశం. ఈ సంకల్పాన్నే హెబ్రీ పత్రిక రచయిత “పూర్వకాలమందు నానాసమయములలోను నానావిధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారునిద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను” (హెబ్రీ 1:1,2) అని సంక్షిప్తంగా వివరించాడు. మానవజాతి దేవునితో పునరైక్యత పొందవలసిన అవసరతను, మానవులు సాటివారితో సామరస్యంగా వుండవలసిన అవసరతను చాలా స్పష్టంగా వివరించే బైబిలు మానవజాతికి ఆయన అనుగ్రహించిన దివ్యసందేశం. యేసు క్రీస్తుద్వారా పరిపూర్తి చేయబడిన రక్షణ ప్రణాళిక గురించి బైబిలు ఉద్ఘాటిస్తోంది. కాబట్టి అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో “దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది” (2 తిమోతి 3:16-17) అని సంగ్రహంగా వివరించాడు. బైబిలు దివ్యప్రేరితమైన దేవుని వాక్యం.
బైబిల్ బాషలు.
బైబిలు అరవైఆరు వేర్వేరు పుస్తకాల సమాహారం. బైబిల్లోని పాత నిబంధనలో (యూదు లేఖనాలు) ముప్పయి తొమ్మిది పుస్తకాలున్నాయి; మిగిలిన ఇరవై ఏడు పుస్తకాలు క్రొత్త నిబంధనలో వున్నాయి. హెబ్రీ, అరామాయిక్ (హెబ్రీ మాండలికం) మరియు గ్రీకు భాషల్లో ఏదో ఒక దానిలో ఈ పుస్తకాల రచన జరిగింది. ఏవో కొన్ని పుస్తక భాగాలైన ఎజ్రా 4:8-16, దానియేలు 2:4-7 వంటివి అరామాయిక్ భాషలో వ్రాయబడ్డాయి. పాత నిబంధనలోని మిగిలిన పుస్తకాలన్నీ హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. యేసు కాలంలోను మరియు ఆదిసంఘం కాలంలోను ప్రధాన భాషగా వున్న గ్రీకు భాషలో క్రొత్త నిబంధన పుస్తకాల్ని వ్రాయడం జరిగింది.
మౌఖిక సందేశం
దేవుడు హెబ్రీ జాతిపట్ల జరిగించిన యావత్కార్యాల్ని పాత నిబంధన వివరిస్తోంది. “మౌఖిక పారంపర్యం” అని నేడు మనం పిలుస్తున్న ప్రక్రియ చాలా కాలంగా హెబ్రీ ప్రజల చరిత్రకు సజీవరూపాన్నిచ్చింది. వర్ణనల ద్వారా మరియు పాటలద్వారా వారి చరిత్ర ఒక తరంనుండి మరొక తరానికి అందించబడింది. ఈ విధంగా చరిత్ర ఒక తరం తర్వాత మరొక తరానికి అందడంలో మౌఖిక సందేశం ప్రముఖ పాత్ర పోషించింది. క్రొత్త నిబంధన తొలి రోజుల్లో అపొస్తలులు శిష్యులు యేసు క్రీస్తు గురించి తమ అనుభవాల్ని మౌఖిక సందేశాలద్వారా వివరించడాన్ని మనం గమనించగలం. క్రొత్త నిబంధనలోని సువార్తలు మొదట్లో మౌఖిక సందేశాలే.
లిఖిత సందేశం
కాలక్రమంలో పశ్చిమాసియాలోని మానవ సమాజాలు అక్షరాల లిపిని రూపొందించాయి. అది సుమారు క్రీస్తు పూర్వం 1800 కాలం. నేర్చుకోడానికి మరియు ఉపయోగించడానికి ఈ లిపి సులువుగా వుండడంతో ప్రజలు చారిత్రక సంఘటనల వర్ణనల్ని పాటల్ని మరియు ప్రవచనాల్ని లిఖించడం ప్రారంభించారు. తర్వాత ఇవే బైబిల్లో భాగమయ్యాయి. ప్రజలు వీటిని రెల్లునుండి చేసిన పాపిరస్ అనే అట్టలమీద మరియు వెల్లమ్ అనే చదునుచేసినట్టి ఎండిన జంతు చర్మాల మీద లిఖించారు. ఇవి చాలా పొడుగైనవి గనక వీటిని గుండ్రంగా చుట్టి భద్రపర్చేవారు. వీటిని “గ్రంథపు చుట్టలు” అని పిలిచేవారు. అయితే పాత నిబంధనలోని అన్ని పుస్తకాలు ఏక కాలంలో వ్రాయబడలేదు. ఈ పుస్తకాల్ని వ్రాయడానికి అనేక శతాబ్దాలు పట్టింది. ఒక సారి వీటిని వ్రాయడం ప్రారంభించిన తర్వాత, వాటి నకళ్లను మళ్లీ మళ్లీ వ్రాయవలసిన అవసరత ఏర్పడింది. కారణం, గ్రంథపు చుట్టల్ని విప్పి, చదివి, వాటిని చుట్టి పెట్టడంవలన అవి పాతబడిపోయి కొంతకాలానికి చదవడానికి ఉపయోగపడేవి కావు. లేఖనాల వ్రాతపతులకు నకళ్లు వ్రాసేవారిని “శాస్త్రులు” అని పిలిచేవారు. కొన్నిసార్లు శాస్త్రుల్లో ఎవరో ఒకరు బిగ్గరగా చదువుతుండగా అనేకమంది శాస్త్రులు నకళ్లు వ్రాసేవారు. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన వ్రాతపతుల్లో అతి ప్రాచీనమైన కొన్ని నకళ్లు నేటికీ భద్రంగా వున్నాయి. ఇవి యెరూషలేం, లండన్, పారిస్, డబ్లిన్, న్యూయార్క్, షికాగో, ఫిలదెల్ఫియ, యానోర్బర్, మిషిగాన్ నగరాల్లోని పురావస్తు ప్రదర్శన శాలలు మరియు గ్రంథాలయాల్లో వున్నాయి. Bible History in Telugu
యూదు లేఖనాల సేకరణ.
పాతనిబంధనలోని వివిధ పుస్తకాలు ఏకగ్రంథంగా సేకరించబడక మునుపు చాలా కాలం అవి విడి విడిగానే వుండేవి. యోషీయా రాజు కాలంలో దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరకడంతో (2 దిన 34:15) దివ్యావేశంవలన కలిగిన లేఖనాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే వివిధ పుస్తకాల్ని సేకరించడం, మరియు వాటికి సరైన గుర్తింపు నివ్వడం యూదులు బబులోనుచెరనుండి తిరిగి వచ్చిన తర్వాతనే జరిగింది. యూదు లేఖనాల్లోని పుస్తకాల్ని ఎప్పుడు తుదిరూపంలోనికి సంగ్రహపర్చారో కచ్చితంగా తెలుసుకోడం సాధ్యం కాదు. యూదు లేఖనాల్లో కొన్ని క్రీస్తు పూర్వం 1300నాటివి; అయితే వీటిని సంగ్రహపర్చి సమగ్రమైన రూపంలోకి తీసుకు రావడం సుమారుగా క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో ప్రారంభమై వుండవచ్చు. సుమారుగా క్రీస్తు శకం 90 సంవత్సరంలో పాలస్తీనాకు చెందిన యూదులు జామ్నియాలో సమావేశమై హెబ్రీ లేఖనాల్లో ముప్పయి తొమ్మిది పుస్తకాలుండాలని సాధికారికంగా ఆమోదించారు. ఈ ముప్పయి తొమ్మిది పుస్తకాలే బైబిల్లోని పాత నిబంధన
క్రొత్త నిబంధన పుస్తకాలు
క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఆరాధనకు సమావేశమైనప్పుడు హెబ్రీ లేఖనాలనుండి కొన్ని భాగాలను చదివేవారు. ఇది యూదుల ఆచారం. యేసు గురించి ప్రత్యక్షంగా తెలిసినవారు ఆయన జీవితం గురించి మరియు ఆయన బోధలగురించి మాట్లాడేవారు. అయితే రెండవ తరం క్రైస్తవులకొరకు మరియు భావితరాలకు లిఖిత పూర్వకమైన లేఖనప్రతి అనివార్యమయ్యింది. అపొస్తలులు శిష్యులు సువార్తలను, తాము జరిగించిన కార్యాలను మరియు ఇతర పత్రికలను వ్రాయడం ప్రారంభించారు. రోమా సామ్రాజ్యంలో ప్రపంచభాషగా పేరొందిన గ్రీకు భాషలో క్రొత్త నిబంధనలోని పుస్తకాలను వ్రాయడం జరిగింది. వీటిని క్రీస్తు శకం 45 – 95 మధ్య కాలంలో వ్రాశారు. ఇవి ఒకరి దగ్గరనుండి మరొకరికి అందేవి; వీటిని ఏక పుస్తకంగానో లేక పత్రికగానో చదువుకొనేవారు. దాదాపుగా మూడు వందల సంవత్సరాలపాటు (క్రీస్తు శకం 100 -400) ఆది సంఘంలో నాయకుల్లో క్రొత్త నిబంధన పుస్తకాల్లో ఏ యే వాటిని పవిత్ర లేఖనాలుగా గుర్తించి వాటికి హెబ్రీ లేఖనాల స్థాయినివ్వాలనే విషయంమీద తర్జనభర్జనలు జరిగేవి. క్రీస్తు శకం 367 సంవత్సరంలో అలెగ్జాండ్రియ బిషప్పుగా వున్న అతనేషియస్ ఇరవై ఏడు పుస్తకాల్ని పవిత్ర లేఖనాలుగా ప్రతిపాదిస్తూ క్రైస్తవులందరూ వీటిని ఆమోదించాలని ప్రకటన విడుదల చేశాడు. బిషప్ అతనేషియస్ ప్రతిపాదించిన ఇరవై ఏడు పుస్తకాలు అప్పటికే క్రైస్తవ సంఘాల్లో ప్రజాదరణపొంది వాడుకలో వున్న పుస్తకాలే. రోమ్ (క్రీ.శ.382), హిప్పో (క్రీ.శ.393), మరియు కార్తేజ్ (క్రీ.శ.397) లలో జరిగిన క్రైస్తవ సంఘ నాయకుల సమావేశాలు బిషప్ అతనేషియస్ నిర్ణయాన్ని ధృవీకరించాయి. ఈ ఇరవై యేడు పుస్తకాలనే నేడు మనం క్రొత్త నిబంధన అని పిలుస్తున్నాం.
బైబిల్లోని వివిధ సాహిత్యరీతులు
ఒక్కొక్క సాహిత్యరీతిలో ఎన్నో గ్రంథాలుంటాయి. ఏదైనా ఒక ఉపకరణాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే నియమావళి ఆ ఉపకరణానికి సంబంధించిన సాంకేతిక భాషలో వుంటుంది. నవలలో కాల్పనిక వర్ణన వుంటుంది. పద్యంలో యతి ప్రాసలుంటాయి. ఏ నిబద్ధతకు లోబడని గేయాలు కూడ వుంటాయి. చరిత్ర గ్రంథాల్లో చారిత్రక సందర్భాల వివరణ కన్పిస్తుంది. గ్రంథం ఏ కోవకు చెందుతుందో అనే దాని మీద ఆ గ్రంథం రచనాశైలి కూడ ఆధారపడి వుంటుంది. బైబిలు ఒక పెద్ద గ్రంథం. దీంట్లో వివిధ సాహిత్య శైలుల్లో రాసిన వివిధ రచనలు వున్నాయి. విభిన్న శైలుల్లో వున్న బైబిలు గ్రంథం పాఠకుల్లో మరింత ఉత్సుకతను కల్గించి వారికో సవాలుగా నిలుస్తుంది.
బైబిలును అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పుస్తకాన్ని చదవడంతో బాటు ఆ పుస్తకం రచనాశైలిని కూడ పరికించడం చాలా ముఖ్యం. రచయిత ఉద్దేశాలను తెలుసుకోవడానికి రచనాశైలి వుపకరిస్తుంది. ఉదా : 1 సమూ 1:1-28 చూడండి. ఈ వాక్యభాగాన్ని 1 సమూ 2:1-10 లోని వాక్యభాగంతో పోల్చి చూడండిఒకే పుస్తకంలో వేర్వేరు రచనాశైలులు కన్పిస్తాయి. మొదటి భాగం గద్యం (వచనం); రెండవ భాగం పద్యరూపంలో వున్న కీర్తన లేక ప్రార్థన. పాఠకులు పుస్తకం ఉద్దేశాన్ని గ్రహించడంలో ఈ మార్పు సహాయపడ్తుంది.
క్రొత్త నిబంధన నుంచి మరో క్లుప్తమైన ఉదాహరణ : యేసు జనన వృత్తాంతం. లూకా 2:1-21లో యేసు జననం గురించి ఎన్నో వివరాలు సంఘటనలు కన్పిస్తాయి. ఇందుకు భిన్నంగా యోహాను సువార్తలో యేసు జననం గురించి ఏ ప్రస్తావనా కన్పించదు. ప్రతిగా, యేసు వాక్యము అని, నిజమైన వెలుగు అని, ఆయన శరీరధారి అయ్యాడని సూచించే కావ్యవర్ణన కన్పిస్తుంది (1:1-14). యేసు ఎవరనే ఆలోచనలను ఈ వివిధ సాహిత్య రీతులు ఎలా ప్రభావితం చేస్తాయి? సువార్త రచయితలు తమ సువారల్లో యేసు జననం గురించి ఆయన మూర్తిమత్వం వ్యక్తిత్వం గురించి వివిధ అంశాలను ఎందుకు వక్కాణించారు? ఒక్కొక్క రచయిత తన ఉద్దేశాలను ఏ శైలిలో చెప్పాడనే సంగతి కూడ బైబిలు ఏం బోధిస్తుందో తెలుసుకోవడానికి క్రొత్త మార్గాలను చూపిస్తుంది.
ఈ బైబిల్లో వివిధ సాహిత్య రీతులు వున్నాయి. కొన్ని పుస్తకాలు ఆద్యంతం ఒకే సాహిత్య శైలిలో వున్నాయి. వీటిలో ముఖ్యమైనవి : ఆజ్ఞలు విధులు చరిత్ర పద్యం కీర్తనలు జ్ఞానసాహిత్యం సామెతలు సువార్తలు పత్రికలు దర్శనసాహిత్యం. కొన్ని పుస్తకాల్లో విభిన్న సాహిత్య శైలులు కన్పిస్తాయి. వీటిల్లో వర్ణన ప్రార్థన ఉపమానాలు ప్రవచనాలు (దేవోక్తులు) వంశావళులు ముఖ్యమైనవి.
ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు : అనేక ప్రాచీన పశ్చిమాసియా సంస్కృతుల్లో ప్రతి సంస్కృతిలోనూ వేర్వేరుగా న్యాయవిధివిధానాలుండేవి (చట్టాలు). వీటిలో బబులోను అధిపతి హమ్మూరాబి (క్రీ.పూ. 1792-1750) ఆధ్వర్యంలో అమలులోనికి వచ్చిన శిక్షాస్మృతి బాగా ప్రసిద్ధి చెందింది. యూదు లేఖనాలలోని (పాత నిబంధన) మొదటి ఐదు గ్రంథాలను పంచగ్రంథాలు లేక పంచకాండాలు లేక ధర్మశాస్త్రం (తోరా) అని పిలుస్తారు. ఈ గ్రంథాల్లో ధర్మవిధులతోబాటు మరెన్నో విషయాలు కూడ వున్నాయి. ఈ ధర్మ విధుల్లో నిషేధాజ్ఞలు (చేయకూడదు), అనుసరించదగిన ఆజ్ఞలు (చేయవలెను) వున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధించడం ఒకరిపట్ల ఒకరు యథార్థంగా ప్రవర్తించడం ధర్మశాస్త్రం ముఖ్యోద్దేశం. బైబిల్లో ముఖ్యమైన ధర్మవిధులు ‘పది ఆజ్ఞలు’ (నిర్గమ 20:1-17; ద్వితీ 5:6-21), ఇతర ఉదాహరణలు : నిర్గమ 21:1-23:19; లేవీయ 1:1- 7:36; సంఖ్యా 6:1-21; 35:16-34; ద్వితీ 14:3-17:7; యాకోబు 4:11,12.
చరిత్ర : పాత నిబంధనలోని చరిత్ర గ్రంథాలు ఇశ్రాయేలీయులు క్రీ.పూ. 1250లో కనాను దేశంలో స్థిరపడినప్పటినుంచి క్రీ.పూ. 587లో యెరూషలేం పతనం వరకు గల చరిత్రను వివరిస్తాయి. ఈ గ్రంథాల్లో ప్రముఖ ప్రవక్తలైన ఏలీయా ఎలీషా జరిగించిన అద్భుతకార్యాలు ఇశ్రాయేలును యూదాను పరిపాలించిన రాజుల కార్యాలు (దావీదు సొలొమోనుతో సహా) కన్పిస్తాయి. క్రీ.పూ. 931లో ఇశ్రాయేలు దేశం రెండుగా వేరైపోయిన తర్వాత జరిగిన సంఘటనల వివరాలు కూడ ఈ చరిత్ర గ్రంథాల్లో కన్పిస్తాయి. యెహోషువ, 1,2 రాజులు గ్రంథాలు పాతనిబంధనలోని చరిత్ర గ్రంథాలు. క్రొత్తనిబంధనలోని అపొస్తలుల కార్యములు ఆది క్రైస్తవసంఘచరిత్రను తెలియజేస్తుంది.
పద్యం, కీర్తనలు : విభిన్న రీతులున్న పెద్ద విభాగమిది. యోబు కీర్తనలు పరమగీతము గ్రంథాల్లో పద్యశైలి కన్పిస్తుంది. బైబిల్లో కొన్ని ప్రాచీన స్తుతిగీతాలు (కీర్తనలు) పద్య శైలిలో వున్నాయి. కీర్తనల్లో అధికభాగం ఆరాధనలో వుపయోగపడినవే. కొన్ని కీర్తనలు వాస్తవానికి ప్రార్థనలే. ప్రవక్తల సందేశాలు కూడ కొన్ని చోట్ల పద్యశైలిలో వున్నాయి. హెబ్రీ పద్యాన్ని అనువదించడం అంత సులభం కాదు. మూలభాషలో ఉన్న శక్తిమంతమైన అర్థాన్ని పరిభాషను అనువాదంలో ప్రతిబింబించడం మామూలు విషయం కాదు ఒకే భావాన్ని రెండు సామ్యాలతో (పోలికలతో) వర్ణించడం హెబ్రీ పద్యం విశిష్టత. కీర్తన 22:9,10 వచనాలు భావాన్ని ఈ వర్ణనకు చక్కని వుదాహరణ. పాత నిబంధనలోని మరి కొన్ని ఉదాహరణలు : నిర్గమ 15:1-18; యోబు 22:21-30; కీర్తన 23; యెషయా 5:1-7; యోనా 2:2-9. క్రొత్త నిబంధనలో కూడ పద్య శైలి కన్పిస్తుంది. లూకా 1:46-55; ఫిలిప్పీ 2:6-11; ప్రకటన 15:3,4 పద్య శైలికి చక్కని వుదాహరణ. Bible History in Telugu
జ్ఞానయుక్తమైన సూక్తులు, సామెతలు : పాత నిబంధనలో మరో పెద్ద విభాగమిది. ఆరాధనా ప్రకరణంలో పద్యం కీర్తనలు కథ వంటి విభిన్న శైలులు కన్పిస్తాయి. లోకం గురించి దేవుని గురించి మనుషుల గతి గురించి వివేచన (ఇంగిత జ్ఞానం) కలతకు సామెతలు సూక్తులు ఒక విశిష్టమైన శైలిలో వుంటాయి. జ్ఞానయుక్తమైన సూక్తులు సామెతలు గ్రంథంలోనే కాక బైబిల్లోని యితర గ్రంథాల్లో కూడ కన్పిస్తాయి. ప్రసంగి యోబు గ్రంథాల్లో తాత్వికధోరణితో బాటు జ్ఞానవంతమైన ఉపదేశాలు కూడ వున్నాయి. జ్ఞానసాహిత్యంలో ఇశ్రాయేలు చరిత్ర వివరాలు కన్పించవు. అయితే, నైతికత గురించి మానవ జీవితంలోని కఠినమైన వాస్తవాల గురించి వివిధ సవాళ్లు ఈ గ్రంథాల్లో కన్పిస్తాయి. జ్ఞానసాహిత్యంలోని కొన్ని గ్రంథాలను అత్యంత జ్ఞాని ఇశ్రాయేలు రాజు సొలొమోను రచించినట్లు చెబుతుంటారు. బహుశా వీటిల్లో కొన్ని సొలొమోను మరణా నంతరం అతని పేరు మీద వ్రాసిన గౌరవార్థ రచనలై వుండవచ్చు. యిప్పటి వరకు ప్రస్తావించిన వాటితో బాటు కీర్తన 1, కీర్తన 37లను కూడ జ్ఞానసాహిత్యానికి చక్కని ఉదాహరణలుగా చెప్పవచ్చు. జ్ఞాన సాహిత్యం క్రొత్త నిబంధనలో కూడ ప్రముఖంగా కన్పిస్తుంది. పర్వత ప్రసంగం (మత్తయి 5-7 అధ్యాయాలు); యాకోబు 3:2-8; 4:13-17 వచనాలు క్రొత్త నిబంధనలోని జ్ఞానసాహిత్యానికి సోదాహరణలు.
సువార్తలు : క్రొత్త నిబంధనలోని మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు యేసు జీవితం గురించి ఆయన బోధల గురించి వివరిస్తాయి. వీటిని సువార్తలు అని పిలుస్తారు. ఇవాంజెలియన్ అనే గ్రీకు పదానికి గాడ్స్పెల్ అనే ప్రాచీన ఆంగ్లపదం సూటి అయిన అనువాదం. గాడ్ స్పెల్ అనే పదం నుంచి గాస్పెల్ అనే పదం వచ్చింది. గాస్పెల్ అంటే సువార్త అని అర్థం.
పత్రికలు : క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు యింకా యితరులు రాసిన పత్రికలు వున్నాయి. యివి క్రీస్తు శకం మొదటి శతాబ్దపు గ్రీకు లేఖరచనాశైలిలో రాసిన పత్రికలు. రచయిత పరిచయం పత్రిక ప్రారంభంలో కన్పిస్తుంది (ఉదా : రోమా 1:1,2-7). ఆ తర్వాత, పత్రికను ఎవరికి వ్రాశారో వారి ప్రస్తావన, శుభవచనం కన్పిస్తాయి (ఉదా : రోమా 1:2-7). పత్రికలో ప్రధాన భాగం సందేశం (ఉదా : రోమా 1:16-15:35). పౌలు పత్రికల్లో చాలా వాటిల్లో శుభవచనం తర్వాత కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్ధన వుంటుంది (ఉదా : రోమా 1:8-15). అంతిమ శుభ వచనంతో ఆశీర్వాదంతో పత్రిక ముగుస్తుంది (ఉదా : రోమా 16:1-27). ప్రతి పత్రికలో ప్రార్థనలు ఉపదేశాలు బోధ జ్ఞానసాహిత్యం హెచ్చరికలు ఆరాధనాగీతాలు (లేక, కీర్తనలు) వ్యక్తిగత సమాచారం వంటి విభిన్నరీతులు కన్పిస్తాయి. క్రొత్త నిబంధనలో పత్రికలు విభాగంలో కన్పించే కొన్ని రచనలు క్రైస్తవులందరికి వర్తించే సాధారణాంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తాయి.
హెబ్రీ పత్రిక యిటువంటి సాధారణ పత్రిక. చిన్నాఆసియాలోని ఏడు సంఘాలకు రాసిన క్లుప్త పత్రికలు ప్రకటన 2,3 అధ్యాయాల్లో వున్నాయి. క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములు ప్రకటన గ్రంథాల మధ్య పత్రికలు విభాగం కన్పిస్తుంది.
(దర్శన సాహిత్యం : అపొకలిప్పిస్ అనే గ్రీకు పదం బయలుపరచు లేక తెరతీయు అనే అర్థాన్నిస్తుంది. ఈ సాహిత్యాన్ని కొన్నిసార్లు ప్రవచన సాహిత్యం అని కూడ పిలుస్తారు. ప్రవచనం లాగా దర్శన సాహిత్యం కూడ భవిష్యత్కాలంలో జరగబోయే సంఘటనలను తెలియజేస్తుంది. అయితే, దర్శన సాహిత్యం విశిష్టత వేరు. ఉదా : దర్శన సాహిత్యం దేవుని నుంచి కలిగిన దర్శనాలను వివరిస్తుంది. నిగూఢమైన అర్థాలను స్ఫురింపచేసే మృగాలు రంగులు సంఖ్యలు మొదలైన సాదృశ్యాలు, యెహోవా దినము గురించి ప్రవచనాలు సాధారణంగా దర్శనసాహిత్యంలో ప్రాముఖ్యంగా వుంటాయి. దేవుని ప్రజలు అనుభవించిన గడ్డు పరిస్థితుల్లో వ్రాసిన రచనలే దర్శన సాహిత్యం. దేవునిపట్ల విశ్వాస్యత చూపినవారికి ఆయన తోడుగా వుంటాడనే నిరీక్షణాస్పదమైన ఆశాభావం | దర్శన సాహిత్యంలో ప్రధానంగా కన్పిస్తుంది. దానియేలు, ప్రకటన గ్రంథాలు దర్శనసాహిత్యానికి మచ్చుతునకలు.
బైబిల్లోని వివిధ రచనాశైలులు
గద్యం (వచనం) : వర్ణన వివరణ వచనంలో ప్రధానభాగాలు. వ్యక్తుల గురించి చరిత్ర గురించి వరన వచనంలో కన్పిస్తుంది. వచనంలో సంభాషణ అనే మరో రచనాశైలి కూడ కన్పిస్తుంది. బైబిల్లో చాలా భాగం వచనంలో వుంటుంది. గద్యరచనలో కథ లేక ఇతివృత్తం ప్రముఖమైంది. కొన్ని ఇతివృత్తాలు క్లుప్తంగా కేవలం కొన్ని అధ్యాయాలకే పరిమితమై వుంటాయి. ఉదా : నోవహు (ఆది 6-10); యోసేపు (ఆది 37:1-47:26), మరికొన్ని గ్రంథాల్లో గ్రంథమంతటా ఒకే ఒక వృత్తాంతం వుంటుంది (ఉదా: రూతు ఎస్తేరు). సువార్తలు యేసు జీవితం గురించి ఆయన మరణపునరుత్థానాల గురించి వివరిస్తాయి. అయితే, సువార్తల్లో మరికొన్ని కథనాలు కూడ వున్నాయి. ఉదా: బాప్తిస్మమిచ్చు యోహాను (మత్తయి 3:1-17; 11:1-19; 14:1-12).
అపోస్థలుల కార్యములు గ్రంథం పేతురు గురించి పాలు గురించి యేసుక్రీస్తు సందేశాన్ని ప్రకటించిన ఇతర శిష్యుల గురించి తెలియచేస్తుంది.
ప్రార్థనలు : ప్రార్థనలు గద్యంలోనూ పద్యంలోనూ వుంటాయి. దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఇదే ప్రార్థన విశిష్టత. కీర్తనలు గ్రంథంలో పద్యరూపంలో వున్న ప్రార్థనలు కన్పిస్తాయి. కొన్ని కీర్తనలు బహిరంగ ఆరాధనలో దేవుని సహాయాన్ని అర్థిస్తూ చేసిన ప్రార్థనలు (కీర్తన 79; 80); మరికొన్ని కీర్తనలు పంట కోత సమయంలో చెల్లించే కృతజ్ఞతాస్తుతులు (కీర్తన 126); మరి కొన్ని కీర్తనలు క్రొత్త రాజు అభిషేక కార్యక్రమానికి సంబంధించినవి (కీర్తన 21); కొన్ని కీర్తనలు విచారాన్ని వెలిబుచ్చుతూ సహాయాన్ని అర్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ క్షమాపణ కొరకు వేడుకుంటూ చేసిన వ్యక్తిగత ప్రార్థనలు (కీర్తన 12:51, 120; 138). ప్రార్థనలు బైబిలు అంతటా కన్పిస్తాయి (కొన్ని ఉదాహరణలు: ఆది 18:27, 28: నిర్గమ 17:4: న్యాయాధి 5:2-31; 1 సమూ 2:1-10; 1 రాజులు 3:6-9; యోనా 2:2-9; లూకా 11:2-4; 22:42; యోహాను 17:1-26; రోమా 16:25-27; హెబ్రీ 13:21). అన్నిటి కంటే ముఖ్యమైంది యేసు శిష్యులకు నేర్పిన ప్రార్ధన (మత్తయి 6:9-13).
ప్రవచనాలు : పాత నిబంధనలో మరో ప్రధానభాగం ప్రవచన సందేశాలు (లేక దేవోక్తులు). యెహోవా వాక్కు లేక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనే పదాలతో ప్రవచనాలు ప్రారంభమౌతాయి. అనగా, ప్రవక్త పలికే సందేశం ప్రవక్త స్వంత సందేశం కాదని దేవుని వద్ద నుంచి వచ్చిన సందేశాన్నే ప్రవక్త పలుకుతున్నాడని అర్థం. ప్రవచన సందేశాలు పలుచోట్ల హెబ్రీ పద్య శైలిలో వున్నాయి. పద్యంలో సాధారణంగా కనిపించే భాషాలంకారాలు (ముఖ్యంగా సామ్యం, లేక పోలిక) ప్రవచనాల్లో కూడ కన్పిస్తాయి. పాత నిబంధన గ్రంథంలోని ప్రవచన గ్రంథాలు ప్రవక్త గురించి అతని పరిచర్య గురించి ప్రవక్తకు దేవునివద్ద నుంచి వచ్చిన సందేశాలు) తెలియజేస్తాయి. పాత నిబంధనలో వైవిధ్యభరితమైన ప్రవచనాలకు యెషయా 1:2-31; 10:24-27; యిర్మీయా 2; యెహెజ్కేలు 36:22-32; ఆమోసు 5:4-27; జెకర్యా 9:1-17 చక్కని వుదాహరణలు. క్రొత్త నిబంధనలో కూడ ప్రవచన సందేశాలు కన్పిస్తాయి. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి యేసు గురించి వున్న ప్రవచనాలు క్రొత్త నిబంధనలో ముఖ్యమైన ప్రవచనాలు (మత్తయి 3:1-12; 24:1-31), 2 పేతురు 3:8-13 చూడండి.
ఉపమానాలు: దేవుని గురించి ఆయన రాజ్యం గురించి ముఖ్యమైన సత్యాలను దైనందిన జీవితంలో అందరికి బాగా తెలిసిన విషయాలతో పోల్చి చెప్పే చిన్న కథలే ఉపమానాలు. యేసు ఉపమానాల ద్వారా దైవసత్యాలను బోధించినట్లు సువార్తలు తెలియజేస్తున్నాయి. ఉపమానాలు క్లుప్తంగానైనా (మత్తయి 13:44-48), లేక వివిధ పాత్రలతో లేక సాదృశ్యాలతో పెద్దవైనా కావచ్చు (లూకా 10:30-37; 15:11-32), ఉపమానాలు అన్న చిన్న వ్యాసం కూడ చూడండి.
వంశావళులు (కుటుంబ పట్టికలు) : బైబిల్లో సుదీర్ఘమైన వంశావళులు కన్పిస్తాయి. ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖుల కుటుంబ చరిత్రను ఈ వంశావళులు తెలియజేస్తాయి. మత్తయి సువార్త ప్రారంభంలో కన్పించే వంశావళి యేసు దావీదు వంశం నుంచి వచ్చాడని తెలియజేస్తుంది (మత్తయి 1:1-17). యేసు దావీదు వంశీయుడని, ప్రవక్తల ప్రవచనాల ప్రకారం లోకాన్ని రక్షించడానికి వచ్చిన అభిషిక్తుడని తెలియజేయడానికి మత్తయి సువార్త రచయిత ఈ వంశావళిని పేర్కొన్నాడు. పితరుల పట్టికలను బైబిల్లో ఎందుకు చేర్చారో అన్ని సందర్భాల్లో స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు ప్రాచీన పశ్చిమాసియా ప్రజలకు బంధుత్వాలు ముఖ్యమని వీటిని బట్టి తెలుస్తుంది. కొన్ని వంశావళులు పేర్ల పట్టికలు ఆది 5:1-32; 1 దిన 1-8; ఎజ్రా 8:2-14లలో వున్నాయి.
బైబిలు అనువాదం
ఆజ్ఞలుకావచ్చు. ఒక సందేశాన్ని దాని మూలభాషలో కాక వేరొక భాషలో వ్యక్తీకరించే ప్రక్రియ అనువాదం లేక తర్జుమా. ఈ సందేశం గీతం కావచ్చు. పద్యం కావచ్చు. సంఘటన కావచ్చు, ఉపదేశం కావచ్చు. అపరిచిత భాషలోని సందేశాన్ని అర్థం చేసుకోడానికి అనువాదం అవసరం.
నేడు మనకు పరిచయం లేని భాషల్లో కొన్ని వేల సంవత్సరాల క్రిందట వ్రాసిన వేర్వేరు గ్రంథాల సంకలనమే బైబిలు. ఈ గ్రంథాలు ‘బైబిలు’గా తుది రూపంలోనికి రావడానికి సుమారు వెయ్యేండ్ల పైనే పట్టింది. బైబిల్లోని గ్రంథాలను ప్రాచీన హెబ్రీ అరమేయ భాషల్లో (పాత నిబంధన), గ్రీకు భాషలో (క్రొత్త నిబంధన) వ్రాశారు. బైబిలు అనువాదం జరగకపోయినట్లయితే బైబిలు చదవడానికి నేడు మనం ఆ యా భాషలు నేర్చుకోవలసి వుండేది.
బైబిలు అనువాదం – తొలి దశలు
గ్రీకు భాష మాట్లాడే ప్రాంతాల్లో నివసించే యూదుల సౌలభ్యం కొరకు క్రీ.పూ. 250లో యూదు పండితులు హెబ్రీ లేఖనాలను గ్రీకు భాషలో వ్రాయడంతో బైబిలు అనువాదానికి నాంది పలికినట్లయ్యింది. ఈ అనువాదాన్ని సెప్టువజింటు అని పిలిచారు. యూదులు నివసించే ప్రాంతాల్లోని ప్రజలు మాట్లాడే భాషలో హెబ్రీ లేఖనాల నందించడం సెప్టువజింటు ముఖ్యోద్దేశమని స్పష్టమవుతోంది. హెబ్రీ భాషలోని యూదు లేఖనాలను గ్రీకు భాషలో వున్న క్రొత్త నిబంధనను కొన్ని వందల భాషల్లోకి అనువదించారు. వీటిలో అతి ప్రాచీన భాషలు (కాప్టిక్, అరబిక్, లాటిన్, సిరియా భాషలు) కూడ వున్నాయి. ఈ అనువాదాల వెనుక వున్న ఉద్దేశం సెప్టువజింటు అనువాదం వెనుక వున్న వుద్దేశమే : లేఖనాలను అందరూ తెలుసుకోవాలి.
బైబిలు అనువాదం – తీరుతెన్నులు
ఈ మధ్యకాలం వరకు రూపాత్మక సమపరివృత్తి (లేక, సాంప్రదాయక సమతుల్యత) పద్ధతిలో బిలు అనువాదాలు జరిగాయి. ఈ పద్ధతిలో మూలభాషలోని వ్యాకరణం పదజాలం అన్నీ యథాతథంగా మరో భాషలోనికి హెచ్చుతగ్గులు లేకుండా నిర్దిష్టంగానూ సంక్షేపంగానూ వుంటుంది. అయితే, ఏ భాషలోకైతే అనువాదించారో ఆ భాషలోని (గ్రాహక భాషలోని ) వ్యాకరణాన్ని వాక్యనిర్మాణ క్రమాన్ని వుపయోగించకపోతే, అనువాదప్రతి చాలా అసహజంగా అర్థరహితంగా వుంటుంది.
ఆకృతికి శైలికి అంత ప్రాముఖ్యత యివ్వకుండా పాఠకుల (లేక, శ్రోతల) అవసరాలకు తగిన విధంగా భావవ్యక్తీకరణలో వచ్చిన మార్పుల ననుసరించి బైబిలు నను ననువదించడం 1960లో ప్రారంభమైంది. బైబిలు అనువాదంలో ఇది మరో పద్ధతి. ఈ అనువాదం ప్రయోజనాత్మక సమపరివృత్తి మీద ఆధారపడిన అనువాదం. మూలభాషలోని సందేశాన్ని యథాతథంగా కాక భావాన్ని (అర్థాన్ని) మాత్రమే వ్యక్తీకరించడం ఈ పద్ధతి ముఖ్యోద్దేశం. ఈ పద్ధతిలో ఆకృతికన్నా ప్రయోజనం ముఖ్యం.
ఏ పద్ధతి ననుసరించి బైబిలు ననువదించినప్పటికీ, బైబిలు అనువాదకులు విమర్శాత్మక లేక ప్రామాణిక హెబ్రీ గ్రీకు మూలప్రతుల నుపయోగించారు గనుక వారి అనువాదాలు కచ్చితమైనవి, విశ్వసనీయమైనవి. Bible History in Telugu
బైబిలు – తెలుగు అనువాదం
దక్షిణ భారతదేశంలోని ద్రవిడ భాషల్లో తెలుగు భాష ఒకటి. అన్ని ప్రధాన ద్రవిడ భాషల్లాగానే తెలుగుభాషకు స్వంత లిపి సాహిత్యం వున్నాయి.
తెలుగు బైబిలు అనువాదం పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమైంది. 1727 సంవత్సరంలో ట్రాంక్విబార్ మిషనుకు చెందిన జర్మన్ లూథరన్ మిషనరీ రెవ.డా. బెంజిమిన్ షుల్ట్ తెలుగులో క్రొత్త నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు (ఈయన తమిళ హిందీ భాషల్లో ప్రవీణుడు). 1732 సంవత్సరం నాటికి షుల్ట్ పాత నిబంధన అనువాదాన్ని కూడ పూర్తి చేశాడు. అయితే షుల్జ్ అనువాదాలు ప్రచురణకు నోచుకోలేదు. 1742 సంవత్సరంలో జర్మనీకి చెందిన ఫిలిప్ పెబ్రీషియన్ అనే లూథరన్ మిషనరీ మద్రాసు స్థావరంగా అవిరళ కృషి సలిపి బైబిలును తెలుగులోకి తమిళంలోకి తర్జుమా చేశాడు. అయితే ఇవి కూడ ముద్రణకు నోచుకోలేదు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి కెప్టెన్ జేమ్స్ డాడ్స్ అనే స్కాటిష్ అధికారి బైబిలును తెలుగుభాషలోకి అనువదించినట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది (1795). అయితే అలు పెరుగని సిరంపూరు మిషనరీలు డా. విలియమ్ కేరీ నేతృత్వంలో 1805 సంవత్సరంలో తెలుగు బైబిలు అనువాదానికి శ్రీకారం చుట్టారు. క్రొత్త నిబంధన అనువాదం 1811 సంవత్సరంలో ముగిసింది. 1812 సంవత్సరంలో తెలుగు బైబిలు అచ్చయ్యే సమయంలో బైబిలు వ్రాతప్రతులు ముద్రణాలయం అన్నీ అగ్నిప్రమాదానికి గురయ్యాయి. మరలా సరిక్రొత్తగా బైబిలు అనువాదం ప్రారంభమయ్యింది. 1818 సంవత్సరంలో క్రొత్త నిబంధన ప్రచురణ జరిగింది. మూడు సంవత్సరాల అనంతరం పంచకాండాల (ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు) ముద్రణ జరిగింది. లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీ అగస్టస్ డెంజెస్ బైబిలును గ్రీకుభాషనుండి తెలుగులోకి అనువదించాడు. ఇతనికి టిప్పు సుల్తాన్ దర్బార్లో ఉద్యోగి అయిన ఆనందరాయుడు అనే మహారాష్ట్ర బ్రాహ్మణుడు సహాయకుడుగా పని చేశాడు. వీరిరువురూ కలిసి క్రొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక వరకు అనువాదం పూర్తి చేశారు. ఇది ఇలా ఉండగా లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎడ్వర్డ్ ప్రిచ్చెట్ అనే మిషనరీ ఆనందరాయుడు జాన్ గోర్డన్ అనేవారి సహాయంతో తెలుగు అనువాద కార్యక్రమాన్ని కొనసాగించాడు. అయితే, ప్రిచ్చెట్ 1824 సంవత్సరంలోను గోర్డన్ 1828 సంవత్సరంలోను మరణించారు. వీరిరువురూ పాత నిబంధనలో చాలా భాగాన్ని తెలుగులోకి అనువదించారు. 1831 సంవత్సరంలో మద్రాస్ కమిటీవారు ఆదికాండము మరియు నిర్గమకాండములను (1 నుండి 22 అధ్యాయాలు) ముద్రించారు. మద్రాస్ సివిల్ సర్వీసు ఉద్యోగి అయిన సి.పి.బ్రౌన్ కూడ బైబిలును తెలుగులోకి అనువదించాడు. బ్రౌన్ తెలుగుభాషలో ప్రావీణ్యుడు, తెలుగు వ్యాకరణాన్ని నిఘంటువును రచించిన పండితోత్తముడు. 1838 సంవత్సరంలో బ్రౌన్ అనువదించిన లూకా సువార్తను ప్రచురించడం జరిగింది.
1844 సంవత్సరంలో అనువాద సంఘం ఏర్పడింది. లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీలు ఆర్.డి. జాన్స్టన్, జె.డబ్లూ. గోర్డన్ (జె.గోర్డన్ కుమారుడు) అనేవారు బైబిల్లో చాలా భాగాన్ని బాగాన్ని తెలుగులోకి అనువదించారు. బ్రౌన్ తన అనువాదప్రతిని 1853 సంవత్సరంలో మద్రాస్ ఆక్టిలరీకి అందచేశాడు. బ్రౌన్ అనువదించిన తెలుగు బైబిలు వ్రాతపతిని లండన్లోని బైబిల్ హౌస్ గ్రంథాలయంలో భద్రపర్చారు. 1854 సంవత్సరంలో పాత నిబంధన ప్రచురణ జరిగింది. 1857 సంవత్సరంలో సవరించిన బైబిలును ప్రచురించారు.
వారు కాక మరికొందరు కూడ బైబిలును తెలుగులోకి అనువదించారు. జె. రెయిడ్ అనే లండన్ మిషనరీ సొసైటీ మిషనరీ అనువదించిన ఆదికాండమును 1841 సంవత్సరంలోనే మద్రాస్ ఆక్జిలరీవారు ప్రచురించారు.
అయితే, ఆ తర్వాత అనువాద కమిటీ పని నిదానంగా సాగింది. క్రొత్త నిబంధన అనువాదం వచ్చేసరికి ఏ గ్రీకు మూలప్రతిని ఉపయోగించాలో వీరిలో వీరికి ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి, లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎస్. వార్థా, జాన్ హే అనేవారు ఈ కమిటీనుండి వేరై సవరించిన గ్రీకు ప్రతి ఆధారంగా స్వంతంగా క్రొత్త నిబంధనను అనువదించి 1856 సంవత్సరంలో ప్రచురించారు. ఈ అనువాదాన్నే మద్రాస్ ఆక్టిలరీవారు 1860లో ప్రచురించారు. పాత క్రొత్త నిబంధనలను కలిపి 1857 సంవత్సరంలో మద్రాస్ ఆక్టిలరీవారు ప్రచురించిన సంకలనమే తొలి తెలుగు బైబిలు.
తెలుగు క్రైస్తవ ఆదికవి చౌదరి పురుషోత్తము క్రొత్త నిబంధన అనువాదంలో ఎస్. వార్డ్ లా, జాన్ హే అనేవారికి తన సహాయసహకారాలు సందించాడు. చౌదరి పురుషోత్తము వ్రాసిన క్రైస్తవగీతాలు తెలుగు క్రైస్తవ లోకానికి ప్రశస్తమైన ఆణిముత్యాలు, ప్రాచీన హెబ్రీ గ్రీకు ప్రతుల ఆధారంగా అనువదించిన తెలుగు బైబిలు సవరణ కార్యక్రమంలో జాన్ హేకు సహాయం చేయడానికి 1865 సంవత్సరంలో బైబిలు సొసైటీ మద్రాస్ ఆక్టిలరీవారు ఒక కమిటీని నియమించారు. జాన్ హే తెలుగు అనువాదానికి సంబంధించిన నియమావళిని క్రైస్తవ వేదాంత అంత్యప్రత్యయాలను (పదజాలాన్ని) సమీక్షించి వీటిని 1874 సంవత్సరంలో ప్రచురించిన బైబిల్లో ఆదికాండము గ్రంథపీఠికలో చేర్చాడు. ఆ తర్వాత, 1878 సంవత్సరంలో సవరించిన క్రొత్త నిబంధనను ప్రచురించారు. 1882 సంవత్సరంలో బైబిలు సొసైటీవారికి లండన్ మిషనరీ సొసైటీకి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హే ‘ముఖ్య సవరణాధికారి’గా తన పూర్తి సేవలను బైబిలు సొసైటీకి అందించాడు. 1884 సంవత్సరంలో సవరించిన బైబిలు విడుదల అయ్యింది. దాదాపు ఇరవై అయిదేండ్లు తన శక్తిని సమయాన్ని తెలుగు బైబిలు అనువాదానికి వెచ్చించి అహర్నిశలు శ్రమించిన హే 1891 సంవత్సరంలో మరణించాడు. ఆ తర్వాత కూడా బైబిలు అనువాదం సవరణ కొనసాగాయి.
ఆ తర్వాత అప్పటివరకు ముద్రితమైన బైబిలు అనువాదాలను సవరించాలనే నిర్ణయాన్ననుసరించి 1904 సంవత్సరంలో ఆద్యంతాలు ఒకే శైలిలో ఉండేలాగా అనువాదాలన్నిటినీ సవరించి సరి క్రొత్త బైబిలును విడుదల చేశారు. అనంతరం, మళ్లీ సవరణతో కూడిన ప్రతిని తయారుచేయడంలో చర్చ్ మిషనరీ సొసైటీకి చెందిన డి. అనంతం బి.శీనయ్య అనేవారు లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీలు ఇ.లూయిస్, జె.ఆర్.బేకన్ అనేవారికి సహాయపడ్డారు. ఇతర భారతీయ భాషల్లో లాగానే తెలుగు భాషలో కూడా వివిధ మాండలికాలు ఉన్నందున అందరికీ ఆమోదయోగ్యమైన బైబిలును సిద్ధం చేయడం చాలా కష్టతరమైంది. 1904 సంవత్సరంలో సవరించిన బైబిలు ప్రతిమీద సలహాలను సూచనలను కోరడం జరిగింది. ఈ సవరణలో సలహాలు సూచనలు ఇచ్చినవారిలో గుంటూరు లూథరన్ మిషన్కు చెందిన రెవ.డా. ఎఫ్.ఎల్.ఊల్ఫ్, రెవ.డా. జాన్ అబర్తీ; గోదావరి డెల్టా మిషనుకు చెందిన జాన్ బీర్ వంటి ప్రముఖులున్నారు. ఈ ప్రయత్నాల ఫలితం – అంతకు ముందున్న బైబిలు ప్రతులకంటె ఆమోదయోగ్యమైన తెలుగు బైబిలు ముద్రణ (1911). ఆ తర్వాత బైబిలు ప్రతిని పెద్దగా మార్చలేదు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆంధ్ర క్రిష్టియన్ కౌన్సిల్ లిటరేచర్ సెక్రటరీ రెవ.డా.ఈ. ప్రకాశం ఆధ్వర్యంలో 1953 సంవత్సరంలో మరోసారి తెలుగు ముద్రణ జరిగింది. రెవ.డా.ఈ. ప్రకాశం సికిందరాబాదు బైబిలు సొసైటీకి సెక్రటరీగా కూడ పని చేశారు.
అధికారిక తెలుగు బైబిలు అనువాదం మరియు ముద్రణ ఇలా ఉండగా, తెలుగు బైబిలుకు సంబంధించిన మరో అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం కాబోదు. 1913, 1914 సంవత్సరాలలో మత్తయి లూకా సువార్తలు పద్యరూపంలో ముద్రితమయ్యాయి. రెండు సంవత్సరాల తర్వాత రోమా గలతీ పత్రికలను మరికొంత కాలం తర్వాత క్రొత్త నిబంధనను సంక్షిప్తంగా పద్యరూపంలో ప్రచురించారు. ఏలూరు సమీపంలోని లక్కవరం జమీందారు రాజా ఎమ్.భుజంగరావు రచనలే ఈ పద్యాలు. లూథర్ మిషన్ ఆస్పత్రిలో తన భార్యాబిడ్డలకు జరిగిన వైద్యం ఈ రాజావారి దృష్టిని క్రైస్తవ్యం వైపు మరల్చింది.
పురావస్తు శాస్త్రం – బైబిలు
భూగర్భంలోని – పురావస్తుశాస్త్రం గతానికి సంబంధించిన శిథిలాలను ఉపకరణాలను పరిశీలించడం ద్వారా కాలగర్భంలో కలిసిపోయిన నాగరికతలను అధ్యయనం చేస్తుంది. శిథిలాలను వెలికి తీయడం కూడ ఈ అధ్యయనంలో భాగమే. పురాతన పట్టణాల శిథిలాలను వెలికి తీసినప్పుడు ఒకేచోట వివిధ నాగరికతలకు చెందిన శిథిలాల దిబ్బలను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ప్రాచీన నగరాలు శిథిలాలపై తర్వాత కాలంలో క్రొత్త నగరాలను నిర్మించారు. ఈ దిబ్బలు ఎన్నో వాస్తవ కథనాలను విన్పిస్తాయి. శిథిలాల త్రవ్వకంలో బయటపడిన ఉపకరణాలను రెండు విధాలుగా విభజించవచ్చు. మొదటిది : భవనాలు (ఇండ్లు, దేవాలయాలు), విగ్రహాలు (లేక ప్రతిమలు), మట్టికుండలు, ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, గృహోపకరణాలు. రెండవది : దస్తావేజులు, శిలాశాసనాలు.
పురావస్తుశాస్త్రం బైబిలు అధ్యయనానికి ఎలా దోహదం చేస్తుంది? త్రవ్వకాల్లో లభించిన శిథిలాలు ఉపకరణాలు దస్తావేజులు బైబిలును అధ్యయనాన్ని మరింత మెరుగుపరచాయి. ప్రాచీన ఇశ్రాయేలు సంస్కృతితోబాటు ఇశ్రాయేలు చుట్టుప్రక్కల వున్న దేశాల చరిత్ర సంస్కృతులను అర్థం చేసుకోడానికి కూడ పురావస్తుశాస్త్రం ఎంతో సహకరించింది. ఇశ్రాయేలు ప్రజలు కనానులో నివసించడానికి పూర్వం అక్కడ నివసించిన ప్రజల గురించి చరిత్ర గురించి సంస్కృతి గురించి మతం గురించి తెలుసుకోడానికి కూడ పురావస్తు శాస్త్రం తోడ్పడుతుంది. త్రవ్వకాల్లో దొరికిన ఉపకరణాలు వస్తువులు గత సంస్కృతుల మతాల ప్రభావాన్ని సహితం తెలియజేస్తున్నాయి. బైబిలు అధ్యయనానికి దోహదం చేసే పురావస్తుశాస్త్ర విభాగాన్ని ‘బైబిలు సంబంధిత పురావస్తు శాస్త్రం అని పిలుస్తారు. చరిత్ర సంస్కృతుల గురించి సరైన అవగాహన లేకుండా బైబిలును అర్థం చేసుకోవడం కష్టంతో కూడుకున్నపని.
పురాతన ప్రతులు ఏం వెల్లడి చేస్తున్నాయి ?
పురాతన రాతల్లో కొన్ని హెబ్రీ పదాలను కనుగొనేవరకు కూడ బైబిల్లో ఈ పదాలను కచ్చితంగా అనువదించడం బైబిలు అనువాదకులు ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి. ఈ రాతల్లోని హెబ్రీ పదాలతో పోల్చి చూచినప్పుడు వీటి అర్థం మరింత స్పష్టంగా తెలిసింది. కొన్ని పురాతన రాతలు మత సాంప్రదాయాల గురించి రాజ్యపరిపాలనా పద్ధతుల గురించి చరిత్ర గురించి నాటి ఇశ్రాయేలు యిరుగుపొరుగు ప్రజల సంస్కృతుల గురించి వివరిస్తాయి. ఈ రాతల్లో కొన్నిటిని రాతి పలకలమీద మట్టిపలకలమీద పగిలిన మృణ్మయపాత్రల మీద ఎండిన జంతుచర్మాల మీద పాపిరస్ అట్టల మీద రాశారు. పాపిరస్ అనే రెల్లు దుబ్బుల నుంచి చేసిన కాగితపు అట్టలను పాపిరస్ అట్టలు అని పిలిచేవారు.Bible History in Telugu
పురావస్తు పరిశోధకులు కనుగొన్నవాటిలో ముఖ్యమైనది పది అంగుళాల పొడవున్న మట్టి పీపా. యిదే కోరెషు స్థూపం. ఈ స్థూపంమీద క్రీ.పూ. 500లో అక్కాడియన్ భాషలో వ్రాసిన సమాచారం వుంది. బబులోను రాజ్యాన్ని ఓడించిన పారసీక రాజైన కోరెపు విజయగాథలను ఈ శాసనం తెలియజేస్తుంది. కోరెషు రాజు తన రాజ్యంలోని ప్రజలపట్ల పరమతసహనం చూపించాడని కూడ ఈ శాసనం తెలియజేస్తుంది. అలాగే, బబులోనువారు కొల్లగొట్టి తీసుకపోయిన యెరూషలేం దేవాలయ ఉపకరణాలతో బాటు యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లడానికి కోరెషు రాజు వారిని అనుమతించినట్లు కూడ ఈ శాసనం తెలియజేస్తుంది (ఎజ్రా 1:1-11). కొన్ని యితర పురాతన ప్రతులు కూడ ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లోని సంఘటనల గురించి తెలియజేస్తాయి. పురావస్తు ఆధారాలు సహితం ఈ సంఘటనల వాస్తవికతను రుజువు చేస్తున్నాయి.
క్రీపూ927 ఐగుప్తురాజైన షీషకు యెరూషలేం మీద దాడిచేసి దేవాలయాన్ని కొల్లగొట్టాడు. (1 రాజులు 14:25,26; 2 దిన 12:2-4), ఈజిప్టులోని థేబ్స్ నది సమీపంలో వున్న అమ్మోన్ గుడి గోడల మీద వున్న ఈ శాసనాలను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. పాలస్తీనాలో షీషకు విజయగాధలను ఈ శాసనాలు తెలియజేస్తాయి. సొలొమోను అనంతరం రాజ్యం బలహీనమై ఉత్తర (ఇశ్రాయేలు), దక్షిణ (యూదా) రాజ్యాలుగా వేరైపోయినప్పడు షీషకు పాలస్తీనాపై దండెత్తాడు.
చరిత్రలో మైలురాయి అనదగిన సంఘటన 1947లో సంభవించింది. గొర్రెలను కాచే బాలుడొకడు తప్పిపోయిన గొర్రె కొరకు ఒక గుహలో వెదికాడు. ఈ గుహ మృత సముద్రానికి పడమరగా వుంది. ఈ గుహలో మృతసముద్రపు గ్రంథపుచుట్టలు బయటపడ్డాయి. క్రీ.పూ. 250- క్రీ.శ. 68 మధ్య కాలంలో ఈ గుహల్లో నివసించిన ఎస్సేనీ సమాజం గురించి ఈ గ్రంథపు చుట్టలు తెలియజేస్తాయి. మతపరమైన రాజకీయపరమైన కారణాలవల్ల యెరుషలేంను విడిచి పెట్టి ఖుమ్రాన్ ప్రాంతంలోని నిర్జన ప్రదేశాల్లో జీవించిన మతాభిలాష కలిగిన వర్గం ఎస్సేనీయులు. ఖుమ్రాన్ గుహల్లో దొరికిన వాటిలో అతి ముఖ్య మైనవనదగినవి పాతనిబంధన గ్రంథపు చుట్టలు. యివి అత్యంత ప్రాచీనమైన హెబ్రీ లేఖనాలు. వీటిలో మరీ విలువైనది యెషయా గ్రంథం. క్రీ.పూ. 150 – క్రీ.పూ. 50 మధ్యకాలంలో వ్రాసిన యెషయా గ్రంథపు ప్రతి ఈ చుట్టలో వుంది. జంతు చర్మాలపై వ్రాసిన ఈ వ్రాతప్రతి సుమారు ఇరవై అడుగుల పొడవుంది. యిది యిప్పటికి అతి భద్రంగా వుంది.
గతాన్ని వెలికితీయడం : పురావస్తు ఆధారాలు బైబిల్లోని సంఘటనలను నిర్ధారిస్తున్నాయి. బైబిల్లోని ప్రతి సంఘటనకు పురావస్తు అధారాలు లభ్యం కాకపోయినప్పటికీ బైబిలు వివరించే చాలా సంగతులు పురావస్తు ఆధారాలతో పొంతన కలిగి వుంటాయి. ఉదా : క్రీ.పూ. 1000లలో పాలస్తీనాలోను పరిసర ప్రాంతాల్లోనూ ఫిలిష్తీయులు నివసించారని పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఏ ఇరుగు పొరుగున వున్న ప్రజలకు (ఇశ్రాయేలీయులతో సహా) వీరినుంచి ముప్పు పొంచి వుండేది. బహుశా ఇందుకొరకే ఇశ్రాయేలు ప్రజలు తమను కాపాడడానికి తమకొక బలమైన రాజు కావాలని కోరుకొని వుండవచ్చు (1 సమూ 8).
క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటి యూదాలో పల్లె ప్రాంతాల గురించి పురావస్తు పరిశోధకులు చేసిన అధ్యయనాలు అవి చాలా కాలం ఏ జనవాసాలూ లేని నిర్జన ప్రాంతాలని తెలియజేస్తున్నాయి. బబులోను చెరకు ఇది బలమైన రుజువు. క్రీ.పూ. 586-538 మధ్య కాలంలో బబులోనులో యూదుల ప్రవాసం (చెర) కొనసాగింది. క్రీ.పూ. 538లో పారసీక రాజైన కోరెషు యూదులు తిరిగి తమ స్వదేశానికి వెళ్లవచ్చని అనుమతించాడు. ఈ దిగువ ప్రస్తావించిన స్థలాల్లో ముఖ్యమైన పురావస్తు ఆధారాలు బయటపడ్డాయి.
యెరికో : యెరికోలో వివిధ నాగరికతలకు చెందిన శిథిలాలను కనుగొన్నారు. వీటిల్లో అతి పురాతనమైన నాగరికత క్రీ.పూ. 5000 నాటిది. అంటే ఇశ్రాయేలీయులు యెరికోను జయించక పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తుంది (యెహోషువ 5:13-6:27). ఆ తర్వాత, పురావస్తు పరిశోధకులు యెరికోలో ఒక భవంతి శిథిలాలను కూడ కనుగొన్నారు. ఇది మహా హేరోదు శీతకాలపు విడిది భవనం అని నిర్థారించారు.
షెకెము, గెరిజీము పర్వతం, సమరయ (షోమ్రోను) : ఇవన్నీ పాలస్తీనా మధ్య ప్రాంతంలో వున్నాయి. ఇవి ఉత్తరగోత్రాలకు చెందిన ప్రజల ఆరాధనకు రాజకీయజీవితానికి కేంద్రాలు కూడ. గుర్రపుశాలలను కనుగొన్నారు (1 రాజులు 9:19). ఇక్కడ వ్వకాలు జరిగిన ప్రాంతం సుమారు డెబ్బయి మైళ్ల లోతులో అనేక పొరలతో నిండి వుంది.
యెరూషలేం : ఇక్కడ హిజ్కియా సొరంగాన్ని కనుగొన్నారు. క్రీ.పూ. 701లో అపూరువారు రూంను ఆక్రమించినప్పుడు నగరంలోనికి నీటి సరఫరా కొరకు ఈ సొరంగమార్గం వుపయోగపడింది (2 రాజులు 20:20).
కపెర్నహూము ఇక్కడ యూదుల సమాజమందిరాన్ని కనుగొన్నారు. ఇది ప్రాచీన కాలానికి చెందింది. బహుశా మార్కు 1:21లోని సమాజమందిరం యిదే కావచ్చు. సమీపంలో ఒక జాలరి గృహాన్ని కూడ కనుగొన్నారు. ఈ గృహం క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి చెందింది.
ఎఫెసు : ఇక్కడ అర్తెమిదేవి గుడిని కనుగొన్నారు. ఈ గుడిలో చిన్న చిన్న వెండి ప్రతిమలున్నట్లు తెలిపే వ్రాతలను కూడ కనుగొన్నారు. బహుశా అ.కా. 19:24 లోని వెండి గుళ్లు యివే కావచ్చు.
ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడం
బైబిలు కాలంలో ప్రజల జీవనవిధానం గురించి కూడ పురావస్తు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రాజ్యపరిపాలనా పద్దతుల గురించి ప్రజల వృత్తులు వ్యాపకాల గురించి వారి ఆహారపుటలవాట్ల గురించి వారుపయోగించిన వస్తువుల గురించి భవననిర్మాణ పద్ధతుల గురించి మతసాంప్రదాయాల గురించి నమ్మకాల గురించి భవిష్యత్తుపట్ల వారికున్న ఆశాభావం గురించి కూడ పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి
ప్రాచీన కాలంలోని సంస్కృతుల గురించి ఎన్నో వివరాలు వేర్వేరు ఆధారాల ద్వారా లభిస్తాయి. సంతానంలేని ఒక స్త్రీ తన దాసి ద్వారా బిడ్డలను కనమని తన భర్తను అడగవచ్చని హమ్మూరాబి శిక్షాస్మృతి వివరిస్తుంది. తాను గొడ్రాలు కాబట్టి శారా అబ్రాహాంను ద్వారా సంతానాన్ని పొందమని అడగడానికి (ఆదికాండము పదహారవ అధ్యాయం) బహుశా ఈ ఆచారమే కారణం అయ్యుండవచ్చు.
మరో ముఖ్యమైన పురావస్తు పరిశోధన నాణేలకు సంబంధించినది. వీటి ప్రస్తావన ఎజ్రా 2:69; నెహ్రమ్యా 7:70-72లలో కన్పిస్తుంది. స్థానిక పరిపాలనాధికారాలను తెలుసుకోడానికి చారిత్రక కాలాన్ని నిర్థారించడానికి నాణేల పరిశోధన ఎంతో వుపయుక్తమైనది.
దంతంతో చేసిన నగిషీ పని పూజాప్రతిమలు మట్టికుండలు ఆభరణాలు అస్థికలు (మనుషుల, పశువుల యెముకలు). బైబిలు కాలంనాటి సంస్కృతుల గురించి తెలుసుకోడానికి దోహదం చేస్తాయి. యేసు కాలంనాటి అస్థిపంజరాలు అప్పటి ప్రజల సరాసరి ఎత్తు ఐదడుగుల పైనేనని తెలియజేస్తున్నాయి. సువార్తల్లో వివరించినట్లుగా నేరస్థుణ్ణి సిలువకు మేకులతో… కొట్టేవారని కూడ పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. పాదంలో మేకు విరిగి వున్న కాలిపిక్క వున్న పురుషుని అస్థిపంజరాన్ని శిథిలాల్లో కనుగొన్నారు. సిలువవేయడం గురించి, సిలువవేయబడిన నేరస్థుణ్ణి కాళ్లు విరుగగొట్టడం గురించి యోహాను సువార్త తెలియజేయడం విదితమే (యోహాను 19:18,32).
మరి కొన్ని పురావస్తు పరిశోధనలు యేసు కాలంలో రోమన్ల శిల్పకళానైపుణ్యం గురించి భవన నిర్మాణకళ గురించి తెలియ జేస్తాయి. మహా హేరోదు నిర్మించిన దేవాలయపు శిథిలాలు సైతం నేటికీ భద్రంగా వున్నాయి. అలాగే గ్రీకు రోమన్ దేవుళ్ల దేవతల గుళ్ల శిథిలాలను సైతం కనుగొన్నారు. బైబిలు కాలం గురించి తెలుసుకోవాలనుకొనే వారికి యివి ఎన్నో వివరాల నందిస్తాయి. తొలి క్రైస్తవులు గతంలో యూదు మతాన్ని అవలంబించిన వారేనని, వారిమీద నాటి తత్వసిద్ధాంతాల ప్రభావం కూడ ఉందనేది విస్మరించలేని విషయమని పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. Bible History in Telugu
పాత నిబంధన – పరిచయం
పాత నిబంధన (యూదు లేఖనాలు) బైబిల్లో ప్రథమభాగం. తొలి క్రైస్తవులు ఉదాహరించిన లేఖనాలు కూడ యివే, క్రీస్తు శకం మొదటి రెండు శతాబ్దాల్లో క్రొత్త నిబంధనలోని గ్రంథాలకు లేఖన ప్రతిపత్తి లభించిన తర్వాతనే యూదు లేఖనాలను పాత నిబంధన అనడం ప్రారంభమైంది. .దిం వాస్తవానికి పాత నిబంధన గ్రంథం సుమారు వెయ్యేండ్ల కాలంలో వివిధ వ్యక్తులు వ్రాసిన వివిధ రచనల సంకలనం. పాత నిబంధనలోని కొన్ని రచనలు క్రీ.పూ. 1200నాటికి చెందినవి. పాత నిబంధన రచనల్లో కొన్ని వాస్తవానికి తరతరాలుగా వచ్చిన పారంపర్య గాథలే. ఈ గాథలనే సేకరించి గ్రంథస్థం చేయడం జరిగింది (ఉదా : ఆధికాండము 12-24 అధ్యాయాల్లోని అబ్రాహాం వృత్తాంతం). పాత నిబంధనలోని చాలా భాగాన్ని హెబ్రీ భాషలో వ్రాశారు. ఇశ్రాయేలీయుల భాష హెబ్రీ భాష. పాత నిబంధనలోని కొన్ని రచనలను తర్వాత కాలంలో హెబ్రీ భాషకు దగ్గరగా వుండే అరమేయ భాషలో రాశారు.
ఇశ్రాయేలు ప్రజల స్వంత దేవుని గురించి, దేవుడు వారికి నిర్దేశించిన జీవన విధానం గురించి పాత నిబంధన గ్రంథం తెలియజేస్తుంది. (లేవీయ 20:7,8). దేవుడైన యెహోవాయే సృష్టికర్త అని (ఆది 1; కీర్తన 104), ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసే ధేవుడని కూడా పాత నిబంధన తెలియజేస్తుంది. దేవుడు అబ్రాహాం మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనలలో ఈ ఆశీర్వాదాలు వున్నాయి. అబ్రాహాం శారాల సంతానం గొప్ప ప్రజ అవుతారని దలుకొని వారొక దేశాన్ని స్వతంత్రించుకుంటారని అబ్రాహాం సంతానానికి (ఇశ్రాయేలు ప్రజ) దేవునికి మధ్య నెలకొన్న ప్రత్యేకమైన సంబంధం సర్వలోకానికి ఆశీర్వాదకారణ మౌతుందని దేవుడు అబ్రాహాంకు వాగ్దానం చేశాడు (ఆది 12:1-3; 15:5-8,18-20; 17:8). అబ్రాహాం అతని సంతానం తమకు దేవునికి మధ్య వున్న నిబంధనకు గుర్తుగా సున్నతి నాచరించాలి (ఆది 17:9-14). Bible History in Telugu
అనేక సంవత్సలు అనంతరం అబ్రాహాం సంతానాన్ని (ఇశ్రాయేలీయులు) ఇగుప్తు నుంచి వెలుపలికి నడిపించడానికి ధేవుడు మోషేకు సహాయం చేశాడుఅయితే, దేవుడు వారికి సంవత్సరాల అనంతరం అబ్రాహాం సంతానాన్ని (ఇశ్రాయేలీయులు) ఐగుపు నుంచి వెలుపలికి నడిపించడానికి దేవుడు మోషేకు సహాయం చేశాడు. అయితే, దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశం (కనాను) చేరేముందు వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరించారు. ఈ అరణ్య ప్రయాణంలో సీనాయి పర్వతం వద్ద దేవుడు మోషేతో ప్రజలతో నిబంధన చేశాడు. ఈ నిబంధనలో ఆజ్ఞలు ఉపదేశాలు (హెబ్రీ భాషలో తోరా) వున్నాయి. దేవుడైన యెహోవాను ఎలా ఆరాధించాలో దేవుని ప్రజలైన వీరు ఎలా జీవించాలో ఈ ఆజ్ఞలు ఉపదేశాలు బోధిస్తాయి. ప్రజలు ఈ ఆజ్ఞలకు బద్ధులై దేవుని పట్ల విశ్వాస్యత చూపినట్లయితే దేవుడు అబ్రాహాంతో చేసిన వాగ్దానాలన్నీ నెరవేరతాయి. అయితే, వారు ఆజ్ఞలకు బద్దులు కాకపోయినట్లయితే దేశం వారికి దక్కదు; శత్రువులు వారిని శిక్షిస్తారు (ద్వితీ 7:6-15). దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఈ నిబంధనకు బద్ధులై వుండడానికి ఎలా ప్రయాసపడ్డారో వారు అవిధేయులైనప్పుడు దేవుడు వారిని క్షమిస్తూ ఎలా కాపాడుతూ వచ్చాడో పాత నిబంధన వివరిస్తుంది.
పాత నిబంధన విశ్వాసం గురించి కూడ తెలియజేస్తుంది. యూదులకు క్రైస్తవులకు యిది పవిత్ర గ్రంథం. వారి జీవితాలకు ఒక అర్థాన్ని చేకూర్చుతూ వారిని ఒక అధికారానికి బాధ్యులను చేసే గ్రంథమిది. పాత నిబంధనలోని చాలా భాగాలను సంఘారాధనల్లో చదువుతారు, ఆలపిస్తారు కూడ. దేవుని ప్రజలు పరిశుద్ధతతో నైతిక విలువలతో జీవించాలనేది దేవుని అభీష్టమని పాత నిబంధనలోని ఆజ్ఞలు ఉపదేశాలు తెలియజేస్తాయి. సాధారణమైన వ్యక్తులు విశ్వాస విధేయతల విషయంలో మార్గదర్శకులు కావడం గురించి పాత నిబంధనలోని వృత్తాంతాలు తెలియజేయడమేకాక యితరులను విశ్వాసం విధేయతల విషయంలో ప్రేరేపిస్తాయి కూడ. సరైన జీవితం సరైన ఆరాధన ఎంత అవశ్యకమో ప్రవక్తల సందేశాలు నొక్కి చెబుతాయి. దేవుడు బీదలను కటాక్షిస్తాడని అవిధేయులను క్షమించడానికి సిద్ధమనస్సు చూపుతాడని కూడ ఈ సందేశాలు వక్కాణిస్తాయి. జ్ఞానసాహిత్యం జ్ఞానవివేకాలను బుద్ధికుశలతను కలిగిస్తూ సరైన జీవితం కొరకు సమయోచితమైన సలహాలనిస్తూ పురాతనకాలం నుంచి ప్రజలకు జవాబు దొరకని జీవితపు జటిల ప్రశ్నలకు సరియైన జవాబుల నివ్వడంలో సహాయపడుతుంది. Bible History in Telugu
వేర్వేరు సాంప్రదాయాలకు చెందిన బైబిళ్లలో పాత నిబంధన గ్రంథంలోని రచనల సంఖ్య ఒకటిగా వుండదు. అయితే, పాత నిబంధన దేవునికి ఆయన ప్రజలకు మధ్య వున్న ప్రత్యేకమైన సంబంధాన్ని వెల్లడి చేస్తూ క్రొత్త నిబంధన సందేశాన్ని అర్థం చేసుకోడానికి పూర్వరంగంగా నిలుస్తుందన్నదనేది అందరూ అంగీకరించే విషయం.
ప్రత్యక్ష గుడారం మెటీరియల్ కొరకు .. click here