Book Of Ezra Explanation In Telugu – ఎజ్రా గ్రంధం వివరణ

ఎజ్రా గ్రంధం వివరణ.

Book Of Ezra Explanation In Telugu

  ఎజ్రా నిజానికి యీజక కుటుంబానికి చెందినవాడు. కానీ పరిస్థితులు ఆయన్ని నాయకునిగా మార్చాయి. ప్రజల సమస్య అంతా పరాయి దేశాలలో పరాయి పాలనలో ఉండడమే. దేవుడే వారి అవసరత గమనించి, కోరేషు అనే పారశీక రాజును ప్రేరేపించి వారికి విడుదల కలిగించాడు. 

  ఇప్పుడు వారిని జాగ్రత్తగా స్వదేశానికి చేర్చి, తమ ఆలయాన్ని, ఆరాధనా క్రమాన్ని పునరుద్ధరించే వారొకరు కావాలి. ఎజ్రా ఆ పనిచేశాడు. పరదేశం నుంచి స్వదేశానికి యూదులను జట్టుగా తీసుకొని రావడంలోనూ, మందిరం నిర్మించడంలోనూ జట్టు నాయకుడిగా, గొప్ప మాదిరి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు ఎజ్రా. 

  గత చరిత్ర విషయానికొస్తే, దినవృత్తాంతముల గ్రంథము వలెనె, ఎజ్రా గ్రంథము యూదా ప్రజల చరిత్రను తెలియజేస్తుంది. బబులోను చెర తరువాత యూదులు స్వదేశానికి రావటమే ఈ గ్రంథంలో కనిపించే ముఖ్యాంశం. 

  హెబ్రీ బైబిలులో ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు ఒకే గ్రంథముగా ఉండేవి. “టాల్మూడ్” (Tolmud) ను రాసిన వారుకూడా యీరెండూ ఒకే గ్రంథమని యెంచారు. యూదులు కూడ ఈ రెండు పుస్తకాలను ఒకే గ్రంథముగా భావించారు. 

  రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఆఖరు వచనాన్ని, ఎజ్రా గ్రంథం మొట్ట మొదటి వచనంతో పోల్చి చూస్తే, దినవృత్తాంతముల గ్రంథం ఎజ్రా గ్రంథంలో కొనసాగిందని అర్థమవుతోంది. ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు పాత నిబంధనలో చిట్టచివరి గ్రంథాలు. Book Of Ezra Explanation In Telugu

  రాజుల చరిత్ర చివరివరకు చెప్పిన తర్వాత యెరూషలేము, దానిలోని ఆలయం పాడుగా ఉండిపోయిన 70 సంవత్సరాల చరిత్ర విషయంలో బైబిలు మౌనంగా ఉండిపోయింది. ఈ 70 యేళ్ళ చెరకాలంలో చెరలోని యూదుల సంగతులు కొన్ని దానియేలు గ్రంథంలో కనిపిస్తాయి. చెరకాలం పూర్తికావస్తున్నప్పుడు ఆ విషయం గ్రహించి దానియేలు ప్రార్థించిన సంగతి, దానియేలు 9:1-3లో రాసివుంది. ఆ తరువాత ఎజ్రా గ్రంథంలో మొదలు పెట్టిన చరిత్ర కొనసాగింది.  Book Of Ezra Explanation In Telugu

  కోరేషు బబులోనును క్రీ.పూ. 538 సంవత్సరములో జయించాడు. అతడు బబులోనును జయించడంతో బబులోను చెరలోని యూదులు పారశీకుల పరిపాలన కిందికి వచ్చారు. అతడు రాజ్యమునకు వచ్చిన మొదటి సంవత్సరమున అక్కడ చెరలో నుండిన యూదులను తమ స్వదేశమునకు పోవుటకు ఒక ప్రకటన చేసాడు. దీనిని “కోరేషు సిలిండర్” (Cyrus Cylinder) అందురు. ఇది అతడు చేసిన ప్రథమ కార్యములలో ఒకటి. 

  కోరేషు బబులోనుకు రాకముందు 20 సంవత్సరములు పారశీక దేశపు రాజుగా ఉన్నాడు. కోరేషు అనే పేరుకు సూర్యుడు అని అర్థం. అతడు మహాజయశాలీ, జ్ఞానవివేకములు కలిగిన పాలకుడూ. యెషయా తన ప్రవచన గ్రంథంలో అతణ్ణి యెహోవా మంద కాపరి అనియు, యెహోవా అభిషేకించిన వాడనియు పిల్చాడు (యెషయా 44:28, 45:1).

  ఎజ్రా గ్రంథంలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం 1 నుంచి 6 అధ్యాయాలు. ఇందులో జెరుబ్బాబెలూ, యాజకుడైన యెషూవ నాయకత్వంలో ఆలయం తిరిగి కట్టించడం ఉంది. హగ్గయి, జెకర్యా ప్రవక్తలూ ఈ కాలంనాటి వారే. 

  రెండవ భాగం 7 నుంచి 10 అధ్యాయాలు. ఇందులో తిరిగి నిర్మించిన ఆలయంలో ఎజ్రా ఆలయ సేవలనూ, ఆరాధనలనూ తిరిగి ప్రారంభించడం వుంటుంది. ఈ రెంటికీ మధ్య 60 సంవత్సరాల వ్యవధి ఉంది.

  ఎజ్రా నెహెమ్యా జీవించిన కాలఘట్టంలోనే గౌతమ బుద్ధుడు (క్రీ.పూ. 560- 480) భారత దేశంలోనూ, కన్ఫూసియస్ (క్రీ.పూ. 551-479) చైనాలోనూ, సోక్రటీస్ (క్రీ.పూ. 470-399) గ్రీకులోను జీవించారు. 

  కోరేషు ఆజ్ఞ బయలుదేరగానే జెరుబ్బాబెలు నాయకత్వంలో సుమారు 50వేలమంది యూదులు యెరూషలేముకు తిరిగి వెళ్లారు. జెరుబ్బాబెలు దావీదు వంశంలో పుట్టిన ఒక రాజకుమారుడు. వెంటనే ఆలయం కట్టడం ఆరంభించారు. ఎందుకంటే యూదుల జీవిత సరళి అంతా వారి ఆలయంతో పెనవేసుకొని ఉంటుంది. అయితే వారు చెరలో నున్న కాలంలో ఆ ప్రాంతంలో వచ్చి స్థిరపడిన అన్యులూ (యూదులు కానివారు), వారి నాయకులూ ఆలయ నిర్మాణ విషయంలో వ్యతిరేకతలు కలిగించారు. ఈ కారణంగా నిరుత్సాహం చెందిన దేవుని ప్రజలు ఆలయం పని చాలించుకున్నారు. అప్పటికి పునాది మాత్రమే పూర్తి అయింది. Book Of Ezra Explanation In Telugu

  ఒక్క విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దేవుని పని ఎక్కడ ప్రారంభించినా, వెంటనే సాతాను తారసపడతాడు. విశ్వాసులకు ప్రబలశత్రువు ఎవరో బైబిలు తేటగా వివరిస్తుంది. “మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని సంచరించుచున్నాడు”  (1 పేతురు 5:8) అంటూ పేతురు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు.

అయితే అపవాది ఎప్పుడూ గర్జించే సింహంలాగే కనిపించడు. 

  కొన్నిసార్లు సర్పంగా వచ్చాడు (ఆది 3:1, ప్రకటన 20:2). యోబుపై దాడిచెయ్యటానికి వాడు దేవుని కుమారులతో వచ్చాడు (యోబు 1:6-12). వాడు వెలుగు దూత వేషం కూడా వేసికోగలడని పౌలు చెబుతున్నాడు (2కొరింథీ 11:14). 

  కొంతమంది చిత్రకారులు చిత్రించినట్లు రెండు కొమ్ములతో, తోకతో వస్తే మనం సులభంగా గుర్తించవచ్చు. కానీ, వాడు అధికశాతం మనకు సాయం అందించే స్నేహితుడి రూపంలో వస్తాడు. “అబద్ద ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు. కాని, వారు లోపల క్రూరమైన తోడేళ్లు” (మత్తయి 7:15) అంటూ యేసు హెచ్చరించాడు. 

  పై వేషము వేరు. లోపల అసలు నైజం వేరు. పైన గొర్రె, లోపల తోడేలు. ఇదీ, ఆదినుంచి అపవాది అనుసరిస్తున్న వ్యూహం. 

యూదులను నిరుత్సాహపరచి, బెదిరించి, ఎలాగైనా పని నిలుపుచేయాలని శత్రువులు ప్రయత్నించారు. దాని మూలంగా పని కుంటుపడింది. దేవుని ప్రజలకు చాలాసార్లు ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. వారు నమ్మకంగానే పనిచేస్తుంటారు. కానీ, పని ఆలస్యమవుతుంది. Book Of Ezra Explanation In Telugu

  యూదా శత్రువులు ఒక పట్టాన వదిలిపెట్టే రకం కాదు. వారు యూదులను తొందర పెడ్తూనే ఉన్నారు. అధికారులకు లంచాలిచ్చి, వారికి వ్యతిరేకంగా పనిచేయటానికి రేపారు. ఇదంతా యూదులకు ఎంతో బాధ తెచ్చిపెట్టింది. దేవాలయ నిర్మాణ కార్యక్రమం ఆగిపోయింది. 

  యూదులు తమ ఇళ్లు కట్టుకుంటూ ఉన్నప్పుడు వీరు పల్లెత్తు మాట కూడా అనలేదు. దేవుని కొరకు ఎప్పుడైతే పని ప్రారంభించారో అప్పుడు కష్టాలు మొదలయ్యాయి. దేవుని పనిని నిలుపు చేయటానికి తమ శక్తి మేర పనిచేసారు. ఈ విధంగా వారు కొన్ని సంవత్సరాలు వ్యతిరేకంగా పనిచేసారు. కోరేషు మరణించాడు. తరువాత దర్యావేషు. ఆ తరువాత అహష్వేరోషు రాజ్యానికి వచ్చారు.

మనం అలసిపోతామేమోకాని సైతాను ఎన్నడూ అలసిపోడు. వారు పనిని నిలుపుచేయలేదు గాని, ఆలస్యమయ్యేలా చేశారు. యూదులు తమ పనిని కొనసాగించ కుండా ఎన్నో ప్రతి బంధకాలు సృష్టించారు – ఆ శత్రువులు.  Book Of Ezra Explanation In Telugu

ప్రియులారా! ఒక విషయం అర్థం చేసుకోండి, సాతాను బలమైన పనిముట్లలో నిరుత్సాహం అనేది ప్రాముఖ్యమైనది. వాడు దానిని ప్రతి ఒక్కరి మీదా ప్రయోగిస్తాడు. పని చాలా కాలం పడ్తుంది. ఎంతో ఖర్చుతో త్యాగంతో కూడుకొని యుంది. చాలా కష్టమైనది అనిపించేలా చేస్తాడు సైతాను. 

  దీని ద్వారా మనం పని మానెయ్యాలని చూస్తాం. దానికి మంచి కారణం కూడా ఉంది అనుకుంటాం. 

  ఎజ్రా గ్రంథం రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంది అని చెప్పుకున్నాం కదూ! 1నుంచి 6 అధ్యాయాలు ఒక భాగం కాగా, 7 నుంచి 10వ అధ్యాయం వరకు మరొక భాగముగా ఉన్నది. 6,7 అధ్యాయాల మధ్య దాదాపు 60 ఏండ్ల విరామం ఉన్నది. ఈ కాలంలోనే ఎజ్రా జన్మించాడు. ఆ విధంగా ఎజ్రా మొదటి భాగం చారిత్రకం కాగ, రెండవ భాగం వ్యక్తిగత జీవిత విశేషాలు కలిగియున్నది. 

  ఎజ్రా పూర్ణవిశ్వాసము, యథార్థత, భక్తికలిగి ధర్మశాస్త్రాన్ని అవలంభించిన నిజమైన శాస్త్రి. ఎజ్రా మంచి ఆరాధన క్రమాన్ని సిద్ధపరచినవాడు. ఎజ్రా గ్రంథంలో రెండుసార్లు యూదులు బబులోనులోనుంచి తిరిగి వచ్చినట్లు చూస్తాం. మొదటిసారి ఆలయ పునర్నిర్మాణము నిమిత్తము జెరుబ్బాబెలు నాయకత్వమున, రెండవసారి ప్రజల ఆధ్యాత్మిక స్థితిగతుల పునర్నిర్మాణము నిమిత్తము ఎజ్రా నాయకత్వమున వచ్చారు. ఈ రెండు రాకల మధ్య వ్యవధి 60 ఏండ్లకాలం. ఈ మధ్య కాలంలోనే ఎస్తేరు షూషను కోటలో రాణి అయింది. 

  ఎజ్రా ద్వారా దేవుడు గొప్ప సంస్కరణను తీసుకొచ్చాడు. అంటే దిద్దుబాటు అన్నమాట. మరో మాటలో చెప్పాలంటే, గొప్ప ఉజ్జీవం. ఎజ్రా తన దగ్గరే పని ప్రారంభించాడు. అందరికంటే ముందే తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. ఈ ఉజ్జీవం తనతోనే ప్రారంభమైంది. విజయవంతమైన ఉజ్జీవాలన్నీ ఇలాగే ప్రారంభం అవుతాయి. 

  ఎజ్రా దేవుని ధర్మశాస్త్రం విషయంలో ఎంతో దృఢ సంకల్పం కలిగినవాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను అంటూ రాయబడింది. 

  “యెహోవా ధర్మశాస్త్రం చొప్పున నడుచుకొనుటకు” ఎజ్రా తీర్మానించుకున్నాడట. ఆహా! ఎంత సమర్పణ! ఎంతటి తెగింపు! 

  ప్రియులారా, ఇది మనం వ్యక్తిగతంగా చేసికోవలసిన తీర్మానం. మరొకరు చెయ్యలేరు. “తనను అపవిత్రపరచుకొనకూడదని” దానియేలు కూడా తీర్మానించు కున్నాడు (దానియేలు 1:8). తన జీవిత కాలమంతా ఈ నిర్ణయానికి బద్ధుడైయున్నాడు. ఎజ్రా, దానియేలు అన్యదేశంలో చెరలో నున్నప్పటికీ, సరైనదే చేయాలని దృఢమైన తీర్మానం చేసుకున్నారు. Book Of Ezra Explanation In Telugu

  వారిద్దరినీ రాజులతో మాటలాడగలిగే స్థాయికి హెచ్చించాడు దేవుడు. హృదయాన్ని సిద్ధం చేసుకున్న ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. చాలాసార్లు దేవుడు తన సంకల్పసిద్ధి కోసం అద్భుతాలు జరిగించాడు. అదే సమయంలో తన పని చేయటానికి ఇష్టపడి, సిద్ధంగా ఉన్న కొందరు ఊరూపేరు లేని వ్యక్తులను కూడా దేవుడు వాడుకున్నాడు. 

ఈ గ్రంథంలో ఆటంకాలు ఏ మేరలో ఎదురయ్యాయో, అంతకన్నా రెట్టింపు స్థాయిలో దేవుని కార్యాలు జరగటం మనం చూస్తాం. 

  కొందరు కుట్రల మూలంగా దేవాలయం పని ఆగిపోయింది. భయం ప్రజలందరినీ ఆవరించింది. పని ఒక్కసారి స్తంభించిపోయింది. ప్రజలు తమ ఇండ్లకు వెళ్లిపోయారు. పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి. మందిరం పని ప్రారంభించిన జెరూబ్బాబెలు ఈ 16 ఏండ్ల కాలంలో ఏం చేశాడో తెలీదు. మొదటి నెలలోని అతడి ఉత్సాహం, జరిగించిన పని వలన తృప్తి అంతా హరించుకొని పోయి నిరుత్సాహం చోటుచేసుకుందేమో. ఈ భావాలు క్రమక్రమంగా నిరాశా వాదానికి దారితీసాయేమో.Book Of Ezra Explanation In Telugu

  అప్పుడు జెరుబ్బాబెలుకు తోడుగా దేవుడు హగ్గయి, జెకర్యా అనే ప్రవక్తలను పంపించాడు

  మనం ఎప్పుడు కృంగిపోతామో, అప్పుడు దేవుడు మనతో మాట్లాడ్తాడు. ఆదరిస్తాడు. పని ప్రారంభమై రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి, నాలుగేళ్లలో పని ముగించారు. 

  మనం కూడా జెరుబ్బాబెలులాగ ప్రారంభించటానికైతే ప్రారంభిస్తాం. కానీ, దానిని కొనసాగించటం చాలా కష్టంగా భావిస్తాం. అతనిలాగే నిరాశను నెత్తికెక్కించుకుంటాం. 

దేవుడు పరిస్థితులన్నీ తన స్వాధీనంలోకి తీసుకొని పని పూర్తిచేసాడు. 

  దైవజనుడా, నువ్వు ప్రారంభించిన పనులూ కొనసాగుతూ వున్నాయా? లేక స్థంభించిపోయాయా? నిరుత్సాహమనే సైతానుగాన్ని గద్దించుము. 

  శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు ప్రభువు సెలవిస్తున్నాడు. 

  మనయెదుట కొండలు నిలువవు. దుర్గాలు నిలువవు ప్రతి పర్వతం చదును భూమిగా మారుతుంది. 

  1. చెరనుండి విడుదలై జెరుబ్బాబెలు నాయకత్వాన

 తిరిగి వచ్చిన దేవుని ప్రజలు (మొదటి గుంపు)…..ఎజ్రా 1-6 అధ్యాయాలు

1.) కోరేషు ప్రకటన మరియు తిరిగివచ్చిన వారి సంఖ్య …..1:1-2:70 

2.) బలి పీఠమును కట్టుట మరియు పర్ణశాలల పండుగనాచరించుట….. 3:1-7 

3.) దేవాలయ నిర్మాణము మరియు ఆటంకములు….. … 3:8-6:15

4.) దేవాలయ ప్రతిష్ట……….6:16-22 

  • చెరనుండి విడుదలై ఎజ్రా నాయకత్వంలో తిరిగి వచ్చినదేవుని ప్రజలు (రెండవ గుంపు)….ఎజ్రా 7-10 అ॥లు 

1.) యెరుషలేము పట్ల ఎజ్రా యొక్క విధి…7వ అధ్యాయం

2.ఎజ్రాతో నుండినవారును, వారి పరికరములును… 8వ అధ్యాయం 

3.) ఎజ్రా చేసిన సంస్కరణలు…..9వ అధ్యాయం 

4.) ప్రజల ఒప్పుకోలు, వాగ్దానము….10వ అధ్యాయం

   దేవుడు తన కోసం, తన బిడ్డల కోసం ఎంతటి కార్యాలనైన జరిగించి తీరతాడు. రాజ్యాల పునాదులను వారికోసం అవసరమైతే కదిలించి వేస్తాడు. కొండల్లాంటి సమస్యలూ, వ్యతిరేకతలూ ఎదురైనప్పటికీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనే సత్యం ఈ ఎజ్రా గ్రంథం నుంచి మనం నేర్చుకోవచ్చు. 


ప్రత్యక్ష గుడారం subject నేర్చుకోవడానికి click చేయండి…CLICK HERE

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!