యోబు గ్రంధం వివరణ.
Book of Job Complete Explanation
పరిశుద్ధ గ్రంథంలో వివరింపబడిన భక్తుల జీవితములలో శ్రేష్టమైన స్థానమును పొందినవాడు భక్తుడైన యోబు! యోబు గ్రంథం బోధనకు ఆధారమైన గ్రంథము! యోబు గ్రంథములో ఎక్కువగా విజ్ఞాన నిధులు దాగియున్నాయి. విజ్ఞాన శాస్త్రము, జీవశాస్త్రము, భూగోళశాస్త్రము, ఖగోళశాస్త్రము తదితర ఆధునిక విజ్ఞాన శాస్త్రములకు యోబు గ్రంథము మాదిరిగా నున్నదనియు 77 కన్నా మించిన విజ్ఞాన సూచనలు (Evidence) ఈ యోబు గ్రంథంలో నున్నట్లు బైబిలు పండితులు వ్యక్తం చేసారు.
గ్రంథకాలమును గూర్చి రకరకాలైన కాల నిర్ణయాలను బైబిలు పండితులు సూచించారు. బహు నిర్థిష్టమైన కాలపరిమితిని నిర్ణయించి చెప్పుట కొంచెం అసాధ్యమైనప్పటికీ, పరిశుద్ధ గ్రంథమునందే సరియైన పరిశోధన చేసినచో రమారమి గ్రంథకాలమును కనుగొనవచ్చును!
మనం కొద్ది కొద్దిగా యోబు కాలమును సమీపిద్దాం! రండి!
మొదటిగా – యోబు – యేసుక్రీస్తు మరియు అపొస్తలుల కాలమునకు ముందటి కాలంలో జీవించినాడనుటకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో యీలాగు రాయబడి ఉన్నది – “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలసుకొని యున్నారు” అంటూ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మరియు యాకోబు, తన సహచర అపొస్తులులకు ముందున్న కాలంనాటి వాడని మనకు స్పష్టముగా అర్థమవుతోంది.
రెండవదిగా యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం “నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు” అంటూ సెలవిస్తోంది. కాబట్టి, యోబు -యెహెజ్కేలు కాలమునకు పూర్వము జీవించినవాడని స్పష్టమవుతోంది.
మూడవదిగా- ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరినప్పుడు వారికి ప్రత్యక్ష గుడారము, ధర్మశాస్త్రము, బలులు అర్పించు యాజకులు ఉన్నారు. ఎవరైనను -బలులు అర్పించు అవసరం ఏర్పడితే, లేవీయులైన యాజకులే వారి పక్షముగా బలులు అర్పించేవారు. అంతేగానీ, కుటుంబ యజమానులూ, లేదా పెద్దలూ ఆ విధంగా అర్పించే విధానము ధర్మశాస్త్ర కాలంలో లేదు.
యోబు గ్రంథంలో చూచినట్లయితే, యోబుగారే స్వయముగా బలులు అర్పించినట్లుగా రాయబడి ఉంది (1:5). అంతేకాదు – ధర్మశాస్త్రమూ, ప్రత్యక్ష గుడారమూ, లేవీయులూ వంటి పదాలు గాని, సూచనలు గాని యోబు గ్రంథంలో కానరావు. కాబట్టి యోబు ధర్మశాస్త్ర కాలానికి ముందు కాలంలో జీవించాడని మనం గ్రహించుటకు వీలు కలుగుచున్నది.
నాలుగవదిగా – ధర్మశాస్త్ర కాలానికి ముందున్న కాలము – పితరుల కాలమూ అని పిలువబడుతోంది. కొందరు బైబిలు పండితులు అది మనస్సాక్షి యుగమూ అని పిలుచుచున్నారు. కుటుంబ పెద్దలు తమ కుటుంబముల కొరకు వారే స్వయముగా బలులు అర్పించినట్టుగా ఆదికాండములో చదువుచున్నాము. అబ్రాము కుటుంబ పెద్దగా – బలిపీఠం కట్టి బలి అర్పించాడు (ఆది. 12:8). నోవహు కూడ కుటుంబ యజమానిగా తన కుటుంబం కొరకు బలిపీఠం కట్టి బలి అర్పించాడు (ఆది. 8:20). యాకోబు కూడ తన కుటుంబం కొరకు బలి అర్పించెనని ఆదికాండము 33:20లో చూస్తున్నాం!
అలాగే యోబు కూడా కుటుంబ యజమానిగా, ఒక పెద్దగా తన కుటుంబం కొరకు స్వయముగా బలులు అర్పించాడు(1:5).
కాబట్టి, యోబు ధర్మశాస్త్ర కాలానికీ ముందున్నవాడనీ… మనస్సాక్షి యుగపు పరిశుద్ధుడని అర్థమవుతోంది.
ఐదవదిగా – “సర్వశక్తుడు” లేదా “సర్వశక్తిమంతుడు” అనేమాట ఈ గ్రంథంలో 31సార్లు కనిపిస్తుంది. సర్వశక్తుడు అనే పదం హెబ్రీ భాషలో – “ఎల్షర్దాయ్” గా పిలువబడుతోంది. మోషేకు దేవుడు హోరేబులో నున్న మండుచున్న పొదలో దర్శనమిచ్చిన తరువాత, దేవుడు – “యెహోవా” అనే జ్ఞాపకార్ధ నామమును ఇచ్చాడు. నిర్గమ కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో – “మరియు దేవుడు మోషేతో నిట్లనెను – మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. తరతరములకు ఇది నా జ్ఞాపకార్ధ నామము” అంటూ మోషేకి దేవుడు సెలవిచ్చాడు.
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కాలమున దేవుణ్ణి “సర్వశక్తుడు” అని పిల్చారు. యోబు కూడా దేవుణ్ణి అనేక సందర్భాలలో – “సర్వశక్తుడు” అని పిల్చాడు. కాబట్టి, యోబు ఇశ్రాయేలీయుల కనాను యాత్రకు ముందూ, అనగా పితరుల కాలంలో జీవించిన వాడుగా మనం గుర్తించవచ్చు!
ఆరవదిగా – అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కాలమందు వారికున్న పశువుల మందలను బట్టి వారి ఆస్తులు లెక్కింపబడ్డాయి. యోబుగారి ఆస్తులు కూడ పశువుల మంద రూపంలోనే చెప్పబడ్డాయి (యోబు 1:3). కాబట్టి, యోబు అబ్రాహాము యొక్క సమకాళికుడుగానో, లేదా అబ్రాహాము తర్వాత జీవించిన వాడుగానో ఊహింపవచ్చు.
ఏడవదిగా యోబు 22:16 లో “వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి, వారి పునాదులు జలప్రవాహము వలె కొట్టుకొనిపోయెను” అని రాయబడి వున్నది. ఇక్కడ “జల ప్రవాహము” అంటూ రాయబడిన మాటను బట్టి, యోబు, నోవహు కాలంలో సంభవించిన జలప్రళయం తర్వాతనే జీవించెనని చెప్పుటకు ఆధారం దొరుకుచున్నది.
యోబును గూర్చి విభిన్న అభిప్రాయాలు ఉన్నను, యోబు మోషేకు ముందు అనగా ధర్మశాస్త్రకాలానికి ముందున్న వాడనియు… మనస్సాక్షి యుగానికి చెందిన వాడనియు గట్టిగా చెప్పవచ్చు. ఇంకా వివరంగా చెప్పవలెనంటే – యోబు యొక్క చివరి దినములు, మోషే యొక్క ప్రారంభ దినములు (మిద్యానులో మోషే గడిపిన సం.లు) సమీపకాలమై యుండెను అనుటకు బలమైన ఆధారములు కలవు.
చివరిగా – యోబు జీవించిన సంవత్సరములను బట్టి అతడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కాలమునకు చెందినవాడనీ, లేదా వారి తర్వాతి కాలం నాటివాడని దృఢంగా మనం నమ్మటానికి గల కారణం ఏమిటంటే – యోబు శ్రమలు తీరిన తరువాత 140 సం.లు జీవించాడు (యోబు 42:16). అబ్రాహాము 175 సం.లు (ఆది 25:7), ఇస్సాకు 185 సం॥లు (ఆది 35:28), యాకోబు 147 సం.లు (ఆది 47:28), యోసేపు 110 సం॥లు (ఆది50:22) జీవించారు.
యోబు భార్య పేరు వ్రాయబడలేదు. ఒక పురాతన వ్రాత ప్రతి యోబు భార్యపేరు – దీనా అని తెలియజేస్తుంది. యాకోబు కుమార్తె పేరు కూడ “దీనా” (ఆది 34:1). బహుశ యాకోబు, భక్తుడైన యోబు భార్యపేరు తన కుమార్తెకు పెట్టాడేమో! అబ్షాలోము తన కుమార్తెకు తన చెల్లి తామారుయొక్క పేరు పెట్టుకున్నాడు. తన చెల్లి పట్ల తనకున్న ప్రేమను బట్టి… సానుభూతిని వ్యక్తం చేయడానికి తన కుమార్తెకు ఈ పేరు పెట్టాడు (2సమూయేలు 13:1,22, 14:27).
పండితులలో కొందరు యోబు చారిత్రక పురుషుడు కాడు, కేవలం అతడు ఒక కల్పిత పాత్ర మాత్రమేనంటూ కొట్టిపారేసారు. యోబు గ్రంథ రచయిత ఒక సత్యాన్ని వివరించుటకు గాను తన మనసులో కల్పించి రాసిన కావ్యనాటకం మాత్రమే అంటూ చెబుతున్నారు.
పురాతన కాలంలోని యూదులు ఈ గాధ అక్షరార్థముగానూ, చరిత్రార్థముగానూ జరిగెనని నమ్మారు. కేంబ్రిడ్జి బైబిలు వ్యాఖ్యానము కూడా “ఇది జరిగిన చరిత్ర” అంటూ తెలియజేసింది. అయితే ఇది కావ్య గ్రంథముగా రచింపబడినది.
యెహెజ్కేలు 14:14లో “నోవహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు” అంటూ రాయబడినది. నోవహు నిజమైన వ్యక్తి, దానియేలూ నిజమైన వ్యక్తే, మరి అలాంటప్పుడు యోబు కల్పిత వ్యక్తి అవుతాడా? కాదు కదా! అతడును నిజమైన చారిత్రక పురుషుడే!
క్రొత్త నిబంధనలోని యాకోబు 5:11లో – యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అని రాయబడింది. కల్పిత పాత్ర యొక్క సహనమును నిజజీవితమునకు మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తారా? అలాగు ఎన్నడు జరుగదు!
దీని గ్రంథకర్త మోషే అని బలమైన ఆధారములు కలవు. మోషే మిద్యానులో 40 సంవత్సరములు తన మామ యిత్రో దగ్గర గొట్టెలను కాయుచు ఉన్నప్పుడు దీనిని వ్రాసి యుండవచ్చు. మిద్యాను – ఊజు దేశములు రెండును దగ్గర దగ్గరగా ఉన్నాయి. అవి ప్రక్క ప్రక్కనున్న ప్రాంతాలు. ఉత్తరం నుండి దక్షిణమునకు పోవు రహదారి ఆ రెండు దేశాల మీదుగా వెళ్తుంది. వ్యాపారస్తులూ, శాస్త్రులూ ఆ రహదారిలో పోవుచుండగా వారి దగ్గర యోబును గూర్చి తెలుసుకొనుటకు మోషేకు ఎన్నో అవకాశాలు దొరికాయి.
యోబు గ్రంథంలోని లోతైన సంగతులూ, లోతైన ఆలోచనలూ, విజ్ఞాన సంబంధమైన విషయాలూ ఒకడు రాయాలి అంటే, జ్ఞాన శాస్త్రములు తెలిసిన వ్యక్తియై యుండినప్పుడే అది సాధ్యపడుతుంది. మోషే అందుకు అర్హుడని చెప్పొచ్చు. ఎందుకంటే – మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును, కార్యముల యందును ప్రవీణుడై యుండెను (అపొ. 7:22) అని చెప్పబడింది.
యోబు గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటంటే – బైబిలులోని 66 పుస్తకాలలో మొదటిగా రాయబడిన గ్రంథముగా చెప్పబడుతుంది.
ఈ గ్రంథం మనుష్యులందరు ఎదుర్కొనవలసిన సమస్య గురించి చర్చిస్తుంది. ఇందులో రెండు ప్రధానమైన ప్రశ్నలు ఎదురగుచున్నాయి.
“మనిషికి శ్రమలెందుకు వస్తాయి?”
“నీతిమంతునికి కూడ శ్రమలు వస్తాయా?”
రెండవ ప్రశ్నకు జవాబు ఆ కాలపు భక్తులకు తెలియదు. యోబు యొక్క ముగ్గురు స్నేహితులక్కూడ తెలియదు. ఎలీహు మరియు యోబులక్కూడ తెలియదు. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు, యోబు శ్రమలకు అతని రహస్య పాపములే కారణమని బల్లగుద్ది చెప్పారు. దానికి కారణం కూడా చూపించారు. యథార్థవంతులను దేవుడు ఎన్నడూ శిక్షించడని వారు తమ నమ్మకాన్ని వెలుబుచ్చారు.
ఆ సమయంలో యోబు తాను నిర్దోషినని వాదించుకున్నాడు “నేను నీతిమంతుణ్ణి” అనే స్వనీతి అతన్లో ఉంది. ఎలీహు చిన్నవాడైనప్పటికీ యోబును గురించి దేవుని పక్షముగా చక్కగా వాదించాడు.
యోబుకు శ్రమలు కల్గినప్పుడు తన ముగ్గురు స్నేహితులు ఆదరించడానికి వచ్చారు. వీరి బోధ యోబుకు ఆదరణ ఇవ్వలేదు. వీరు దేవుని పక్షముగా మాట్లాడారు. కాని యోబు సమస్య తీరలేదు. అసలు యోబు సమస్య వేరు. అది వీరికి ఎవ్వరికీ అర్థం కాలేదు. యోబుక్కూడ అర్థం కాలేదు. చివరికి సాతానుకి కూడ అర్థం కాలేదు. యోబు భార్య ఇచ్చిన సలహా కూడ సరియైనది కాదు.
దేవుడు నిష్కారణముగా యోబును శ్రమల పాలు చేయలేదు. యోబుపట్ల దేవునికి గల ఆలోచన మహోన్నతమైనది. సాతాను ఐతే బహు సంతోషించి ఉండవచ్చు – ఆ బాధలను చూచి. కాని వాడికి చచ్చిన అర్థం కాలేదు – దేవుని మహిమ గల తలంపులూ.
యోబును దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాలని సంకల్పించాడు (42:12). ఒకవేళ యోబు రెండింతలు ఆశీర్వదింపబడనైయున్నాడు అని సాతానుకు తెలిస్తే, యోబు జోలికి వెళ్లేవాడే కాదేమో! అతని జోలికెళ్లి, అతడు రెండింతలు దీవించబడే కన్నా, నేను ఉత్తగా ఉంటే పోలా? అనుకుంటాడు!
బంగారము వంటి యోబును మేలిమి బంగారముగా మార్చుట దేవుని యొక్క సంకల్పం. “ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును” అంటూ సాక్ష్యమిచ్చాడు యోబు (23:10).
పరమండలంలో సాతాను యోబును గూర్చి దేవునితో వాదించుచూ – నీవు అతనికిని అతని యింటివారికిని కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివిగదా! నీవు అతని చేతి పనిని దీవించుటచేత అతని ఆస్థి దేశములో బహుగా విస్తరించి యున్నది. అందుచేత యోబు నీయందు భయభక్తులు గలవాడాయెను (యోబు 1:9,10) అని అన్నాడు.
అయితే దేవుడు అందుకు ఒప్పుకోలేదు. అది తప్పు, శుద్ధ అబద్ధం అన్నాడు. నాకును యోబునకును కల్గిన సంబంధమును బట్టియే యోబు నాయందు భయభక్తులు గలవాడాయెనని ఋజువు చేయదల్చుకున్నాడు దేవుడు. అంతేకాదు, యోబు ద్వారా సాతాను చిత్తుచిత్తుగా ఓడిపోవాలనే (రోమా 16:20) ధృఢ నిశ్చయంతో దేవుడు అంగీరించాడు!
ప్రియ దేవుని బిడ్డా! నీ యెడలను దేవునికి అద్భుతమైన మహిమకరమైన ఆలోచనలూ ఉన్నాయి. నీ ద్వారా సాతాను రాజ్యము కూలిపోవాలి. వాని పునాదులు అదిరిపోవాలి! వాని రాజ్యంలోని సంపదలన్నీ కొల్లసొమ్ముగా పంచుకోవాలి – చరిత్రలో మరొక్కసారి నీ ద్వారా తాను (దేవుడు) సాతాను ఎదుట మహిమ పొందుకోవాలి – ఇదీ, నీ యెడల దేవుని సంకల్పం!
యోబుగ్రంథం నుంచి మనం నేర్చుకొనే మరొక శ్రేష్టమైన పాఠము ఏమిటంటే దేవుడు తన భక్తుని ఎలాంటి పరిస్థితులలోను విడిచిపెట్టడు అనే పాఠం!
యోబు మొదటి అధ్యాయం ప్రారంభ వచనాలలో – యోబు యొక్క గుణశీలములను గూర్చి చెప్పి, ఆ తర్వాత అతని ఆస్తులను గూర్చి రాయబడ్డాయి.
ఆ తర్వాత సంపద! మొదట అతడు గుణవంతుడైతే సంపదలున్నప్పటికీ బండమీద పాదాలు స్థిరపర్చబడిన వానివలె ఎన్నడు కదలకుండ ఉంటాడు.
మొదట ఎవరైన ఒకరిని పరిచయం చేయునప్పుడు ఇహ సంబంధమైన ఆస్తులూ, భోగభాగ్యాలతో పరిచయం చేస్తారు. కాని దేవుడు ఈ వాడుకను పూర్తిగా మార్చివేసాడు.
మీరందరూ ఒకసారి మీ మనోనేత్రములతో ఊజు దేశం వైపు చూడండి – సముద్రపు ఇసుకవలె విస్తారముగా కనబడ్తుంది చూడండి! అవి – 7000 గొట్టెలూ, వాటిని మేపుచున్న కాపరులందరు యోబుగారి స్వాస్థ్యము!
మీ నేత్రాలను కొద్దిగా ప్రక్కకు త్రిప్పండి – వినీలాకాశం వైపు తమ వీపులను శిఖరం వలె హెచ్చించి చూపుచున్నవి ఏమిటో గుర్తుపట్టారా? – అవి ఒంటెలండీ! అవి 3000, వాటి ప్రక్కనున్న ఆ పరిచారకులూ, ఆ కుటీరములూ మన యోబయ్య స్వాస్థ్యము! స్కడ్స్ వలె చక్కగా అమర్చబడియున్నవి కదూ! మరల మీ నేత్రాలను ముందువైపు త్రిప్పిచూడండి. – ఆ నాగళ్ళూ, దాని ప్రక్కనే కట్టబడియున్న 500 దుక్కిటెద్దులునూ, దాని యొక్క వ్యవసాయకులునూ వారి కుటీరములన్నియూ మన భూస్వామి యోబ్బాబు గారివే! చివరిసారిగా మీ దృష్టిని యింకొంచెం ముందుకు మరల్చండి – అరణ్య నౌకలను, పేరొందిన 500 ఆడుగాడిదలూ, వాటి కాపరులూ, వారి గుడారములూ మన యోబన్నవే.
500 అరకలతో పంట పండించగలిగిన వేల ఎకరాల ఆస్తిపరుడు. ఆ పొలములను సాగుచేయగల పరిచారకులు కలిగిన సమర్థుడు. మహాధికారము కల్గి ఎదురు ప్రశ్నించలేని సాటిలేని సామంతుడూ, మకుఠం లేని మహారాజు యోబు!
ఒక్కసారి మీరు ఆలోచించండి! ఇంత విస్తారమైన సంపదలూ, అధికారమూ, సానుభూతి ఒకడు కల్గియుంటే అతడెలా ఉంటాడు? ఖచ్చితంగా 99.9 శాతము భక్తిహీనుడూ దుర్మార్గుడూ అయ్యుంటాడు కదా! సామెతలు 30:9లో భక్తుడు యీలాగు ప్రార్ధించాడు. – “ఎక్కువైన యెడల నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో” అన్నాడు.
`ప్రియ దేవుని బిడ్డ! దేవుడు ఈ రోజు నీతో మాటలాడి, రేపు నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తే, తరువాత ఆదివారము ప్రభువును ఆరాధించటానికి మందిరానికి వెళ్తావా? లేక అవీ ఇవీ కొనడంలో బిజీ అయిపోయి ఆరాధన ఎగ్గొడతావా? ఏం చేస్తావ్??
“సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము కాని, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దర్లభము” అని చెప్పాడు ప్రభువు. ఇది ఇజమే అయితే దీనిని తప్పించుకొని దేవుడు అపేక్షించే ఆత్మీయతలోనికి ఎదిగిపోయాడు యోబు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించెనని రాయబడింది గాని దేవుణ్ణి విసర్జించెనని రాసిలేదు. ప్రియ స్నేహితుడా! ధనము నీపై పెత్తనం చేస్తుందేమో పరిశీలించి చూడు!
దేవుడు యోబును గూర్చి సంబోధిస్తూ – “నా సేవకుడైన యోబూ” అన్నాడు. యోబు గురించి దేవుడు ఒక చిత్రపటం మన ముందు పెట్టాడు.
యథార్థవర్తనుడు (1:1), న్యాయవంతుడు (1:1), దేవుని భయం గలవాడు (1:1), దేవుని యందు భక్తిగలవాడు (1:1), చెడుతనం విసర్జించినవాడు (1:1), నీతిమంతుడు (యెహె. 14:14, యోబు 29:14), శ్రమలను సహించినవాడు (యాకోబు 5:11), భూమిమీద అతనివంటివాడెవడును లేడు (యోబు 1:8).
ప్రియ సోదరీ! సోదరుడా!! ఇలాంటి సాక్ష్యం మన గురించి దేవుడు ఇయ్యగలడా?
యోబు జీవితం ఒక పోరాట పటం. అపవాదితో అదృశ్య పోరాటం (1:13, 2:7), ప్రతీ పరిస్థితిలో శరీర పోరాటం (7:5), భార్యతో సున్నితమైన పోరాటం (2:10), స్నేహితులతో నీతి నిరూపణల పోరాటం (12 – 14 అధ్యా॥), అయోమయంలో దేవునితో పోరాటం (10:1-22).
ఈ పోరాటాలన్నిటిలో యోబు నిర్దోషిగా నిలబడ్డాడు – మరి మనమో!?
యోబు అంతగా బాగుపడినవారూ యోబు అంతగా బాధపడినవారు లేరు లేరు! యోబు అంతగా ద్వేషించబడినవారు లేరు – యోబు అంతగా దీవించబడినవారూ లేరు! యోబు అంతగా క్షీణించిపోయినవారు లేరు – యోబు అంతగా క్షేమము పొందినవారూ లేరు! యోబు అంతగా నష్టపోయినవారు లేరు – యోబు అంతగా లాభపడినవారూ లేరు! యోబు అంతగా సాతాను చేతిలో అగచాట్లు పడినవారు లేరు యోబు అంతగా సాతానును అవమానపరచినవారూ లేరు! యోబు అంతగా అవమాన పరచబడినవారు లేరు – యోబు అంతగా అభిమానించబడినవారూ లేరు! యోబు ఆయాసము గొప్పది – యోబు ఆయుష్కాలమూ గొప్పది!
దేవుని అనంత జ్ఞాన ప్రణాళికలో ఉన్న యోబు జీవితం ధన్యం!
ఒక భక్తుని జీవితంలో కలిగే అనుభవాలన్నింటిలో కెల్లా శ్రేష్టమైనది – దేవునికి మరియు భక్తునికి కలిగే సహవాసం! యోబు గ్రంథంలో మనం అదే చూస్తాం. దేవుడు యోబుతో మాటలాడెను. యోబుతో సహవాసం చేసెను. ఎంత భాగ్యము!
యోబు యొక్క సాక్ష్య జీవితం కూడా చాలా గొప్పది! పంచ దిశలనుంచి యోబు అద్భుతమైన సాక్ష్యము పొందాడు.
మొదటిగా – యోబు పరిశుద్ధాత్మ నుంచి సాక్ష్యం పొందాడు!
“యోబు అను ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడు…” అంటూ యోబు 1:1 చెబుతోంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు… మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పల్కిరి అంటూ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20, 21 వచనాలు చెబుతున్నాయి. అంటే లేఖనాల రచయిత పరిశుద్ధాత్ముడన్నమాట! యోబు గ్రంథాన్ని ఆ విధంగా ప్రారంభించింది పరిశుద్ధాత్మయే. కాబట్టి యోబు పరిశుద్ధాత్మ నించి – “యథార్థవంతుడు” అని సాక్ష్యాన్ని పొందాడు.
రెండవదిగా – యోబు దేవుని యొద్ద నుంచి సాక్ష్యం పొందాడు!
యోబు 1:8లో – దేవుడు అపవాదితో – “నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును…” అంటూ సాక్ష్యమిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యతండీ! సృష్టికర్త తన సృష్టిని గూర్చి శత్రువుకు సాక్ష్యమియ్యడమా?! అబ్బో… ఎంత గొప్ప భాగ్యం!
మూడవదిగా – సాతాను నుంచి సాక్ష్యం పొందాడు!
దేవుడు వానితో ఆ విధంగా సాక్ష్యమిచ్చింతర్వాత, సాతాను దేవునితో యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయెనా? అంటున్నాడు. ఈ “ఊరకయే” అను మాటను కాసేపు పక్కన పెట్టినచో – దేవుని యందు భయభక్తులు కలవాడాయెను అంటూ చదువుకోవలసి వస్తుంది. చీకటి వ్యక్తి, వెలుగు బిడ్డను గూర్చి ఇచ్చిన సాక్ష్యము ఇదండీ.
నాలుగవదిగా – యోబు తన భార్యనుంచి సాక్ష్యం పొందాడు.
యోబు 2:9లో – “నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా?” అంటూ భర్తను ప్రశ్నిస్తోంది – యోబమ్మ. ఇన్ని ఇబ్బందుల్లోను, అన్ని శ్రమల్లోను యోబు యథార్థంగా నుండెనని గ్రహించింది! సాతాను నుంచైన సాక్ష్యం పొందగలం గాని భర్త తన భార్యనుంచి సాక్ష్యం పొందడం కష్టసాధ్యమండోయ్!
ఒక పాష్టరమ్మ గారు తన భర్తను గూర్చి సంఘస్తులతో “నా భర్త చెప్పేమాటలూ 25 శాతం నమ్మొచ్చు, మిగతా 75 శాతం అవి గాలిమాటలే” అంటూ మాట్లాడిందట!
ఐదవదిగా – యోబు యొక్క మనస్సాక్షియే యోబును గూర్చి సాక్ష్యమిచ్చింది!
యోబు 31:6,7లో – నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసికొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అంటున్నాడు యోబు! మన యథార్థతను గూర్చి, మనం మన హృదయపు లోతుల్లోంచి యథార్థంగా సాక్ష్యమియ్యగలమా?
ఈ విధంగా యోబు 5 దిక్కుల నుంచి యథార్థవంతుడనే సాక్ష్యం పొంది నేటి విశ్వాసులకును సేవకులకును గొప్పమాదిరి పురుషునిగా చరిత్రలో నిల్చిపోయాడు.
యోబును బాధపరచిన ప్రశ్నకు జవాబు అన్ని శ్రమల యొక్క ఉద్దేశ్యం ఇదే! దేవుడు యోబుతో మాటలాడిన తీరు ఎంతో భిన్నముగా ఉన్నది. ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతట యోబు పశ్చాత్తాపపడి – “చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతినుంచుకొందును. ఒకమారు మాట్లాడితిని. నేను మరలా నోరెత్తను, రెండుసార్లు మాట్లాడితిని ఇకను పలుకను” అన్నాడు (40:4,5). అయినను దేవుడు యోబుతో మాట్లాడుట కొనసాగించాడు.
ఒక మనుష్యుడు వడిగల ప్రవాహంలో కొట్టుకొనిపోతున్నాడు. అతడు – “నన్ను రక్షించండి రక్షించండి” అని కేకలు వేస్తున్నాడు. ఒక గజ ఈతగాడు ఆ ప్రవాహంలో దూకి అతనిని చేరి, కొట్టుకొనిపోవుచున్నవాని తలమీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. అతడు స్పృహ కోల్పోయాడు. అంతట అతడు తన వీపున మోసికొని ఈదుచూ దరి చేరి అతణ్ణి రక్షించాడు.
దేవుడు యోబుతో మాట్లాడిన విధానమూ యిలాగే ఉన్నది. యోబును పూర్తిగా నిస్సహాయ స్థితిలోనికి వచ్చునట్లు చేసి, తరువాత రెండంతలు అతణ్ణి ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఉద్దేశ్యం సఫలమైనది. “దేవుడు గొప్ప బోధకుడు! ఆయన మనలను సంధించు విధానములు ఆశ్చర్య కరములు!
ప్రియ దైవజనుడా! నీవు ఈరోజు ఇంత నిస్సహాయకరమైన స్థితిలోకి ఎందుకు వచ్చావో తెలుసా? “దేవుడు నీకు రెండింతల ఆశీర్వాదము ఇవ్వడానికి!
పిల్లలూ, ఆస్తులూ, ఆరోగ్యమూ, అందలము, గౌరవమూ, మర్యాదలూ అన్ని పోయాయి. అయినను యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటూ కష్టాలలో కూడా స్తుతి మన గొంతులో ప్రతిధ్వనించునట్లు నేటి క్రైస్తవులకు మాదిరికరముగా నిలబెట్టాడు దేవుడు యోబును.
యోబు ఓర్పుతో – శ్రమలూ, బాధలన్నిటినీ సహించాడు. సాతాను – యోబు భార్యనూ ఆయన ముగ్గురు స్నేహితులనూ, ఆకాశం నుంచి పడిన అగ్నినీ, షెబాయీయులనూ, కల్దీయులనూ, తన సాధనములుగా వాడుకున్నాడు. చివరికి యోబును కూడా అర్థం కాని ఆ వేదనలో, ఆ బాధలో కాని మాటలు పల్కించాడు.
కాని యోబు వీటన్నిటిని విశ్వాసముతో జయించాడు. సాతాను యొక్క అగ్ని బాణములను ఆర్పివేయగలిగాడు. సాతానుకు యోబునకు కల్గిన ఈ ఆత్మీయ పోరాటంలో యోబు గొప్ప విజయాన్ని సాధించాడు. చిట్టచివరికి దేవుని సంకల్పం నెరవేరింది. సాతాను మరోసారి సిగ్గుతో తలదించుకున్నాడు. జయం యోబన్న సొంతం అయింది. దరిద్రునిగా దీన స్థితికి దిగజారిన సామంతరాజు – చట్టపూర్వకంగా అట్టహాసముగా దేవుని మహిమగల సింహాసనం అధిష్టించాడు. మకుఠమొక్కటే లేదు గాని మన యోబు బాబు గారు తూర్పు దిక్కు ప్రజలందరిలో..
సర్వ హక్కులు రచయితలకు మాత్రమే చెందినవి ,
ప్రసంగ శాస్త్రం నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. క్లిక్ హియర్





Good massage.very clear to understanding.
Exelent Bible Information, It is very Valueble, Thank you very much sir ,Praise the God