సంఘ చరిత్ర
Church History (Telugu) – Chapter 1
ఉపోద్ఘాతము (Introduction) :
A.) నిర్వచనం:
విశ్వమంతటిలో క్రైస్తవ్యము యొక్క ఆవిర్భవం, అభివృద్ధి, వ్యాపకమును గూర్చిన వృత్తాంతమే సార్వత్రిక సంఘ చరిత్ర. సుమారు 2000 సం క్రితము ఆరంభమైన క్రైస్తవ్యము క్రమక్రమంగా ఎట్లు అభివృద్ధి చెందెనో, పలువిధ హింసలను మరియు అవాంతర మతములను (Heresies) ఎదుర్కొని, అధిగమించి ముందుకు సాగెనో, ఆయా పరిస్థితుల పై మరియు పరిస్థితులలో చవిచూచిన జయాపజయాలు, నిజ విశ్వాస ప్రమాణాలకు దూరనుగుచున్న సమయములో తీసుకు రాబడిన మతోద్ధారణ, ఆయా కాలాల్లో ఆయా జనాంగముల నైతిక ప్రవర్తన మరియు అంతరంగ జీవితాలపై క్రైస్తవ్యము చూపిన మార్పునట్టి ప్రభావమును ఇందు మనము నేర్చుకొనెదము.ఇంకనూ సంఘ పద్ధతులు ఆరాధనా క్రమములు మరియు మత సిద్దాంతములు, మత వివాధములు, మత విభాగములు, వివిధ మార్పులు, ఆయా మార్పులు సువార్త వ్యాప్తిపట్ల చూపిన ఆసక్తి, ఆయా గ్రంథరచనలు మరియు పరోపకార్యములను గూర్చి నేర్చుకొనెదము.
B) సంఘచరిత్ర మూలాధారములు (Sources) :
సంఘచరిత్ర ఆరంభము నూతన నిబంధన యందు ముఖ్యముగా అపోస్తలుల కార్యమునందు చూడగలము. ఆ తరువాత సంఘ పిత్తరుల వ్రాతలు, క్రైస్తవ్యమునందు చోటుచేసుకున్న సిద్ధాంత వివాదములు, వాటిని పరిష్క రించుటకుగాను జరిగిన ఆలోచనా సభల (Councils) వృత్తాంతములు, విశ్వాసప్రమాణములు (Creeds), విశ్వాస ఒప్పుకోళ్ళు (Confessions of Faith), క్రైస్తవ్యాన్ని నిరూపించడానికి రాజులకు, చక్రవర్తులకు వ్రాసిన వ్యాసములు, సంఘ ఆరాధనా క్రమ పద్ధతులు, రోమా పట్టణమునందు సమాధుల కొరకు తొలచబడిన సొరంగములలోని వ్రాతలు, శిలాక్షరములు, పోపులు విధించిన ఆజ్ఞలు, గొప్ప వేదాంతవేత్తల యొక్క మరియు మతోద్దారకుల యొక్క వ్రాతలు, వేర్వేరు కాలాల్లో వేర్వేరు దేశాల్లో క్రైస్తవ్యమును గూర్చి వ్రాయబడిన వివిధ చరిత్రలు, వివిధ జనాంగముల చరిత్ర యందు క్రైస్తవ్యమును గూర్చి ఉదహరించబడిన సందర్భములు సార్వత్రిక సంఘ చరిత్రకు మూలాధారాలు.
పైన చూపబడిన మూలాధారములనుండి సంగతులను సమకూర్చి ప్రాముఖ్యమైన విషయములను జాగ్రత్తగాను మరియు క్రమముగాను పొందుపరచి వాటికిగల సంబంధంను తేటగా చూపించుటయే సంఘచరిత్రకారుల కర్తవ్యమైయున్నది.
C) సంఘచరిత్రను వ్రాసిన వారిలో ముఖ్యులు :
1) కైసరయ్య వాడైన యుసీబియస్ (క్రీ. శ. 263 – 339) : సంఘచరిత్రకు పితామహుడు పురాతన సంఘచరిత్ర కారుల్లో బహు ప్రసిద్ధి నొందినవాడు. క్రీ.శ. 1 నుండి 325 వరకు జరిగిన సంఘటనలను విశేషంగా వ్రాస్తాడు. రోమా చక్రవర్తియైన కాన్స్టాంటైన్కు సన్నిహిత స్నేహితుడు.
2) బ్రీడ (BEDE) [క్రీ.శ. 673 -735] : ఇతడు ఇంగ్లాండులో పుట్టి ఆ దేశంలో వున్న క్రైస్తవ సన్యాసుల మఠములలోనే జీవితకాలమంతయు గడిపాడు. జూలియస్ కైసరు చక్రవర్తి కాలము మొదలుకొని క్రీ.శ. 731 వరకు ఇంగ్లాండు దేశ సంఘచరిత్రను వివరంగా వ్రాసాడు. తాను జీవించిన జీవితాన్ని బట్టి ప్రజలు ఈయనను “గణనీయుడైన బీడు” (The Venerable Bede) గా పిలిచారు.
3) కార్డినల్ బరోనియస్ (Cardinal Baronius) [క్రీ. శ. 1538-1607]: విద్యాధిక్యతలు గల తత్వవేత్త. ఈయన రోమన్ కేథలిక్ సంఘచరిత్రను పరిపూర్ణంగా వ్రాసాడు.
4) మోషయిమ్ (Mosheim) [క్రీ.శ. 1689-1755] : జర్మనీ దేశస్తుడు విద్యావంతుడగు వేదాంతి. క్రైస్తవ సంఘచరిత్రను విస్తారంగాను, శ్రేష్టతరంగాను వ్రాసాడు. ఈ గ్రంధమును మొట్టమొదట లాటిన్ భాషలో వ్రాసాడు. “అధునాతన సంఘ చరిత్రకు పితామహుడు”.
5 ) నెయాండర్ (Neander) [క్రీ.శ. 1789-1850] : జర్మనీలో జన్మించాడు. తల్లిదండ్రులు యూదులు. మారుమనస్సు నొంది క్రైస్తవ్యమును స్వీకరించి బాప్తీస్మము తీసుకొను సమయంలో ‘ నూతన మనిషి” అని అర్ధమిచ్చు నెయాండర్ అను పేరు పెట్టుకొన్నాడు. గొప్ప పండితుడు, వేదాంత శాస్త్రి, అనేక గ్రంథాలు వ్రాసాడు, విశేష భక్తిపరుడు, మేలైన పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు, వినయంగలవాడు. కలిగియుండిన నీతియుక్త నడతను బట్టి, సాత్వీకమును బట్టి జనులు బహుగా గౌరవించెడి వారు. ప్రసిద్ధికెక్కిన సంఘ చరిత్రకారుల్లో ఈయన ఒకడు.
6 ) షాఫ్ (Schaff) [క్రీ.శ. 1819-1893] : డాక్టర్ ఫిలిప్ షాఫ్ స్విట్జర్లాండ్లో జన్మించి, యూరప్ ఖండములో ఆయా ప్రముఖ కళాశాలల్లో విద్యనభ్యసించి, అమెరికాలో పేరొందిన వేదాంత కళాశాలలో పనిచేశాడు. క్రైస్తవ సంఘచరిత్రను అధికంగాను, శ్రేష్ఠతరంగాను వ్రాసాడు.
D) సంఘచరిత్రను తెలుసుకొనుట వల్ల కలిగెడి ప్రయోజనములు :
1. “ప్రస్తుతము”ను అర్థము చేసుకొనుటకు సంఘచరిత్ర గొప్ప సహాయకారి, “ప్రస్తుతము” యొక్క వ్రేళ్ళు ”గతము” లో నున్నవి గనుక గతమును గూర్చిన సరియైన అవగాహన అవసరం. ప్రస్తుత కాలంలో సంఘము ఎదుర్కొనుచున్న అనేక సమస్యలకు వివరణ గతమును గూర్చి చదువుటద్వారా లభించును.
2. సంఘచరిత్ర గొప్ప మార్గదర్శి వంటిది. సంఘములు, క్రైస్తవ ప్రజలు వేర్వేరు కాలముల యందు చేసిన గొప్ప తప్పిదములను, పొరపాటులను వాటివలన కలిగిన దుష్ఫలితములను సంఘ చరిత్ర యందు చూడగలము. అట్టి తప్పిదములను మనము తిరిగి చేయకుండుట సంఘచరిత్ర మనకు మార్గదర్శి. పౌలు భక్తుడు మనకు రోమా 15:4; 1 కొరింథి 10:6,11 లలో జ్ఞాపకము చేసినట్లు గతంలో జరిగిన సంఘటనలు చెడును విసర్జించి మంచిని చేపట్టుటకు దోహదపడును.
3.ప్రజలను దేవుని పనిచేయుటకు గాను పురికొల్పునట్టి శక్తి సంఘ చరిత్రలోకలదు. సంఘచరిత్ర ఉత్తమమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించుటకుగాను జ్ఞానాభివృద్ధిని, ఉత్తేజాన్ని, అత్యుత్సాహాన్ని కలుగజేస్తుంది.
a) రాజకీయ పరంగా ఉన్నతాధికార స్థలాల్లో, సంఘ సంబంధమైన విషయాలలో జరుగుచున్న దుర్నీతిని, చెడును వ్యతిరేకించిన మిలాన్ వాడైన ఆంబ్రోసు, సువార్త ప్రకటించుచూ రెండు లక్షల యాబై వేల మైళ్ళు (ముఖ్యంగా గుఱ్ఱంమీద) సంచరించి తన జీవిత కాలంలో పదివేలకంటే ఎక్కువ ప్రసంగాలు చేసిన జాన్వెస్లీ, ”అధునాతన ప్రేషితోధ్యమ పితామహుడైన” (Father of Modern Missionary Movement) విలియం కేరి జీవితాలను గూర్చి సంఘచరిత్రలో చదువునప్పుడు మనము ప్రభువుకొరకు గొప్ప పరిచర్య చేయాలనే ప్రోద్భలాన్ని పొందుకోగలం.
b) మన ఆత్మీయ వంశ వృక్షమును గూర్చి తెలుసుకోవడానికి అందులో నశించుచున్న ఆత్మల పట్ల మంట కలిగి సువార్త సంచారము చేసి సంఘాలను స్థాపింఛిన భక్తపౌలు, లోకము ఇవ్వజూపే సుఖసౌఖ్యాలకు వెన్నుజూపి, తన్నుతాను రిక్తునిగా చేసుకుని తన రచనలతో ప్రజలను భక్తి విషయంలో ప్రభావితుల్ని చేసిన ప్రార్ధనా పరుడైన క్లెయర్ వాక్స్ వాడైన బెర్నార్డ్, గొప్ప భక్తులైన ఆగస్టీన్, మార్టిన్ లూథర్, వెస్లీ, విలియం బూత్ వంటి మహామహులు ఉండిన ” క్రీస్తు శరీరము”! లో మనము భాగమని గుర్తించుట ఎంతో ప్రోత్సాహకరమగును.
c) శతాబ్దాల తరబడి బాహ్య, అంతరంగ హింసలకు, వేదింపులకు గురైన సంఘంను గూర్చి నేర్చుకోవడం ద్వారా ఆయా దేశాల్లో శ్రమలు, వేదనలు, హింసలకు లోనగుచున్న సంఘాల భవితవ్యమును గూర్చిన ఆందోళన…
చెందక, అట్టి సమయాల్లో వెనుదిరిగి పారిపోక వాటిని ఎదుర్కొని స్థిరంగా నిలబడితే జయం మనదేనని భవిష్యత్ ప్రకాశమానంగా ఉండునని గుర్తించగలము..
4 . సంఘచరిత్రను చదువుట వల్ల మనుష్య జాతికి దాని వల్ల కలిగిన మెండైన మేళ్ళను చూడగలము.
a) నాగరికతా సంస్కృతులను వృద్ధి పరచి స్వేచ్ఛను, విద్యను క్రైస్తవ్యము ప్రసాదించింది.
b) ప్రజల సంక్షేమార్థమై క్రైస్తవులు అనేక విధాలుగా కృషి సల్పిరి. రోగులు, నిరాధారులు, మానసిక రుగ్మతలకు గురైనవారు, కుష్టురోగులు, అనాధలు, అంగవికలులు మొదలగు వారికి శరణాలయములను ఏర్పరచి వారిని పోషించుచు వారిపట్ల కనికరమును, శ్రద్ధను చూపిరి.
క్రీస్తు మనస్సును ఉపదేశమును ప్రతిబింబింపచేయు రీతిలో శత్రువుల ఎడల, నేరస్తుల ఎడల ప్రేమను వ్యక్తపరచి ఉపచారము చేసిరి.
5. క్రైస్తవ్యము దైవ సంకల్పితమని, దానికి మూలము మానవుడుకాదని సంఘచరిత్రయందనేక ఋజువులు కనిపించును. బహు భయానకమైన మత హింసలు కలిగిననూ క్రైస్తవ్యము జయమొందుచూ బహుగా ప్రబలెను.
దేవుడు దానిని కాపాడి, సంరక్షించి నడిపించని యెడల తిరిగి చక్క పరచ వీలులేనంతగా చెడిపోయి లోకములో కలిసి ఉండెడిది.
అయితే క్రైస్తవ్యము సమస్త ఆటంకములను అధిగమించి జీవించుచూ, ఆత్మీయ బలమునందు స్థిరముగా ఎదుగుచూ, నేటికీ పూర్వముకన్నా బలముగలదై లోకమునకు అమితాశీర్వాదములను కలిగించుచున్నది.
6. సంఘచరిత్ర మనకు ఆచరణాత్మకమైన విలువలనొసంగు పరికరము (లేక) సాధనము వంటిది.
a) సువార్తికునిగా, కాపరిగా, బోధకునిగా మనము క్షుణ్ణంగా ఎరిగియుండవలసిన త్రిత్వము, క్రీస్తు, పాపము, రక్షణ మున్నగు ప్రముఖ సిద్ధాంతములను సంఘచరిత్రతో నిమిత్తం లేకుండా తెలుసుకొనలేము.
b) మన ప్రసంగాలలో అవసరమైన, ఎన్నో అమూల్యమైన, ప్రోత్సాహకరమైన ఉదాహరణలు సంఘచరిత్ర నుండి లభించును.
E) సంఘచరిత్ర విభాగములు :
చరిత్ర “ అతుకులు లేని ఓ అంగీ” వంటిది. కాలము, స్థలము అనే చట్రములో నిరంతరము ప్రవహించే సంఘటనల ప్రవాహము వంటిది చరిత్ర.
ఈ కారణాన్ని బట్టీ సంఘచరిత్రను విభాగించటం అనేది కొంత కష్టతరమయినప్పటికీ విద్యార్థులు ముఖ్య విషయములను తేలికగా గుర్తుంచుకొనుటకు అనువుగా సార్వత్రిక సంఘచరిత్రను మూడు ముఖ్య భాగాలుగాను, 7 కాలములుగాను విభజించుచున్నాము.
1. పురాతన సంఘచరిత్ర (Ancient Church History) [క్రీ.పూ. 5 – క్రీ.శ. 590]
మొదటికాలము : క్రీస్తు జననము మొదలు అపొస్తలుల శకాంతము వరకు. [క్రీ.పూ. 5 – క్రీ. శ. 100]
ఇందు క్రైస్తవ్యము యొక్క ఉత్పత్తి లేక ఆరంభము, అభివృద్ధి మరియు వ్యాపకమును గూర్చి చూచెదము.
రెండవకాలము : అపొస్తలుల శకాంతము మొదలు కాన్స్టాంటైన్ చక్రవర్తి మత పూర్ణస్వాతంత్ర్యము కొరకు చేసిన ప్రకటన వరకు [క్రీ.శ. 100 – 313] ఈ భాగంలో క్రైస్తవ్యము పలురీతులుగా హింసింపబడి జయమొంది నిలచిన విధమును గమనించగలము.
మూడవ కాలము : కాన్స్టాంటైన్ ప్రకటన మొదలు పోప్ మొదటి గ్రెగొరి వరకు [క్రీ.శ. 313-590].
ఈ కాలములో క్రైస్తవ్యము రాజకీయమగుట, మత సిద్ధాంత వివాదములు వాటిని పరిష్కరించడానికి నిర్వహించబడిన మహాధ్యక్షసభలు మరియు పోపుల యొక్క ఆధిపత్యారంభము చూడగలము.
2. మధ్యయుగ సంఘచరిత్ర (Medieval Church History) [క్రీ.శ. 590-1517]
నాలుగవ కాలము : పోప్ గ్రెగొరి I మొదలు గ్రెగొరి VII (హిల్డెబ్రాండ్) వరకు [క్రీ. శ. 590-1073],
మిషనరీ జీవిత చరిత్రల కోసం.. Click Here





