సంఘ చరిత్ర
Church History (Telugu) – Chapter 2
పురాతన సంఘ చరిత్ర (Ancient Church History): 5 BC – AD 590.
ఈ భాగమును మూడు కాలములుగా విభాగించి నేర్చుకొంటాము.
A) మొదటి కాలము :
క్రీస్తు జననము మొదలు అపొస్తలుల శకాంతము వరకు (5 BC – AD 100). ఇందు క్రైస్తవ్యము యొక్క ఆవిర్భావము, అభివృద్ధి మరియు ఆది వ్యాపకము చూచెదము.
1.క్రైస్తవ్యము యొక్క ఆవిర్భావము : సంఘము క్రీస్తు అనే పునాధి మీద స్థాపించబడినది.ఈ కారణముచే ఆరంభము యేసుక్రీస్తుతోను, ఆయన పనితోను ముడివడియున్నది (లూకా 1:1-4; యోహా. 20:30,31: 1 యోహా. 1:1,2).క్రీస్తు జననము చరిత్ర యందొక నిశ్చిత కాలమందున జరిగెను. రోమా సామ్రాజ్యాన్ని ఔగుస్తు సీజర్లు (27 BC-AD 14) ఏలుచుండిన కాలమందు యూదయ దేశాన్ని పరిపాలించుచున్న రాజైన మహా హేరోదు (37-4BC) మరణించక మునుపు యెరూషలేమునకు దక్షిణముగా 6 మైళ్ళ దూరమందున్న బెత్లహేములో యేసు జన్మించెను.యేసు బాల్యము మొదలు 30 సం.లు వచ్చువరకు గలిలయలోని నజరేతులో ఉన్నాడు. 12 సం.ల ప్రాయములో పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చి దేవాలయమందు ధర్మశాస్త్రోపదేశకుల మధ్య గొప్ప ప్రజ్ఞను కనుపరచెను (లూకా 2:40-52).ముప్పది సంవత్సరముల ప్రాయములో యోర్ధాను నదిలో బాప్తీస్మమిచ్చు యోహానుచే బాప్తీస్మమును పొంది బహిరంగ పరిచర్యను ఆరంభించెను. యేసు మూడున్నర సం॥లు ఈ భువి పై పరిచర్య చేసెను.శిష్యగణాన్ని ఏర్పరచుకొనెను. “నా తండ్రికి ఇష్టమైనవి నేనెల్లప్పుడును చేయుచున్నాను” అన్నాడు. పాపరహితుడిగా ఉండి పాపసహితుల కొరకు ప్రాణం పెట్టాడు. పునరుత్థానుడై పరమునకు ఆరోహణమయ్యాడు. ఆరోహణుడయ్యే ముందు తన శిష్యులతో “సర్వలోకమునకు వెళ్ళి, సమస్తజనులకు సువార్తను ప్రకటించి, వారిని శిష్యులనుగా చేయుడి” అని ఆజ్ఞాపించెను (మార్కు 16:15; మత్త. 28:18-20).ఆయన స్థాపించ వచ్చిన రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. ఆయనకు సేనలేదు బలత్కారము చేయలేదు. ప్రేమతో రాజ్యమును జనుల హృదయాలలో స్థాపించెను. ఎవరైతే యేసునందు విశ్వాసముంచి ఆయనను తమ రక్షకునిగను, ప్రభువుగను అంగీకరించి లోబడుదురో వారు ఆయన రాజ్యములో చేరుదురు.
2. మొదటి క్రైస్తవ సంఘము : యేసు పరమునకు ఆరోహణుడయ్యే ముందు తన్ను వెంబడించిన వారితో “మీరు యెరూషలేమునుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి” (అపో., 1:4), “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినపుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని చెప్పెను.ఆ మాటలకు విధేయత చూపిన సుమారు 120 మంది యెరూషలేములో వాగ్దానము కొరకు ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్ధించుచు, కనిపెట్టు చుండిరి. క్రీస్తు ఆరోహణుడైన 10వ దినమున, మధ్యధరా సముద్ర తీర ప్రాంతములన్నిట నున్న యూదులు పస్కా పండుగ నాచరించుటకు యెరూషలేములో కూడియుండగా పరిశుద్దాత్మ బలీయముగా కనిపెట్టుచున్న వారిపైకి దిగివచ్చెను. వారందరు ఆత్మచేత నింపబడి, అన్యభాషలతో మాట్లాడుచు క్రీస్తును గూర్చి బహుధైర్యముతో సాక్ష్యమిచ్చిరి. పేతురు తోటి శిష్యులతో నిలువబడి సువార్తను ప్రకటించెను. ఫలితంగా మూడు వేల మంది రక్షింపబడిరి. అదియే సంఘ స్థాపనకు నాంది ప్రస్తావన. ఇదియే ప్రధమ క్రైస్తవ సంఘము.
3.సంఘ విస్తరణ : సంఘము త్వరితగతిని వృద్ధినొందు చుండెను. వేల కొలదిగా ప్రభువును విశ్వసించి, సంఘములో చేర్చబడుచుండిరి (అపొ॥ 4:4; 5:14; 6:1). యాజకులలో అనేకులు ప్రభువును విశ్వసించిరి (అపొ॥6:7). సంఘము వృద్ధి నొందుచున్న కారణాన పరిచారకులను నియమించిరి (అసో॥6:1-6). ప్రబలుచున్న సువార్త మహోద్యమము యూదుల వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వచ్చెను. సంఘ పరిచారకుడైన స్తెఫను హతసాక్షి యాయెను. యెరూషలేములో నున్న సంఘమునకు శ్రమలు, హింస సంభవించిన కారణాన క్రైస్తవులు యూదయ, సమరయ దేశములందంతటకు చెదరిపోయిరి. చెదరిపోయిన వారు సువార్తను ప్రకటించుచు సంచరించిరి. సువార్తికుడైన ఫిలిప్పు సమరయ నుండి కైసరయ వరకు నున్న పట్టణము లన్నింటిలో సువార్తను ప్రకటించాడు. ఇతియోపీయులకు కూడా సువార్త అందుటకు కారకుడాయెను.స్తెఫను హతసాక్షి అయినపుడు అతని చావునకు సమ్మతించిన తార్సు పట్టణస్థుడైన, యూదామత విషయాల్లో ఆసక్తి పరుడైన సౌలు అను యౌవనస్తుడు యెరూషలేములోని క్రైస్తవులను హింసించుటతో తృప్తి చెందక క్రీస్తు శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు తనకు ప్రాణాధారముగా నెంచుకొని ప్రధానయాజకుని యొద్ద అధికార పత్రములను పుచ్చుకొని దమస్కునకు పయనమయ్యెను. దమస్కునకు సమీపించినపుడు క్రీస్తు దర్శనము పొందుకొని తన జీవితాన్ని ప్రభువు పనికి సంపూర్ణముగా అంకితమొనర్చెను.తదుపరి కాలంలో క్రైస్తవ్యము దూరతీరాలకు వ్యాపించుట యందు పలు సంఘముల స్థాపన జరుగుటలో సౌలు (పౌలు) ప్రముఖపాత్ర వహించెను. యూదయ, సమరయ, గలిలయ దేశముల యందంతట సంఘము కట్టబడుచు విస్తరించు చుండెను. పేతురు సకల ప్రదేశములలో సంచరించుచూ అన్యజనుల యొద్దకు సహితము సువార్తను మోసుకెళ్ళాను. సిరియా దేశమువరకు సువార్త ప్రబలముగా వ్యాపించి అంతియొకయ పట్టణములో అన్యజనుల మధ్య గొప్ప సంఘము ఏర్పడెను.ఈ సంఘమునే పౌలు కేంద్రముగా చేసుకొని మూడు గొప్ప మిషనరీ ప్రయాణములను చేసి, మధ్యధరా సముద్ర తూర్పు ప్రాంతంలోని అనేక ముఖ్య పట్టణాలలో సంఘముల స్థాపనకు కారకుడాయెను. తదుపరి పౌలు రోము వరకు, ఐతిహ్యము ననుసరించి మధ్యధరా సముద్ర పశ్చిమ ప్రాంతమంతట, లండన్ నగర సరిహద్దుల వరకు సువార్తను వ్యాపింపజేసెను.క్రీస్తు మరణ పునరుత్థానముల తర్వాత 40 సం||ల లోపుగానే క్రైస్తవ్యము పాలస్తీను, సిరియా, ఫెనికే, చిన్నాసియా, కుఫ్ర, క్రేతు, మాసిదోనియా, గ్రీసు, ఇల్లూరికు (దల్మతియ), ఇటలీ, ఐగుప్తు మున్నగు ప్రాంత మందంతటను వ్యాపించెను. ఈ వ్యాపన మంతయు లోకాధికారము, ధనము, ప్రోద్బలములే మాత్రము లేకయే జరిగెను. నమ్మిన వారు సువార్తను నమ్మకముగా ప్రకటించుట వలనను, క్రైస్తవుల భక్తిగల బ్రతుకుల వలనను ఇదంతయును సాధ్యమాయెను.
4.సంఘము హింసలు : మానవ జాతి విమోచనార్థమై తన్నుతాను బలిగాను, అర్పణగాను అప్పగించుకొనుటకై భువికరుదెంచిన యేసుక్రీస్తు తన రక్షణ కార్యాన్ని పూర్తిచేయకుండుటకై సాతానుడు అడుగడుగునా విఘ్నములు కలుగజేస్తూ వచ్చాడు. అయితే విజయశీలుడైన క్రీస్తు సాతానీయ పన్నాగములను పరిమార్చి సాతాను తలను తన సిలువ బలియాగము ద్వారా చితుకగొట్టి, మృత్యుంజయుడై సమాధినుండి పునరుత్థానము నొందెను.క్రీస్తు రక్షణ కార్యమును అడ్డగించ యత్నించి, విఫలుడైన సాతానుడు ఏ సంఘ నిర్మాణార్థమై క్రీస్తు తన ప్రాణము నర్పించి తిరిగి లేచెనో, ఆ సంఘమును చిన్నాభిన్నములు గావించి, దేవుని అనాది సంకల్పమును రూపుమాపాలని సంకల్పించాడు. అట్టి సంకల్పముతో అపొస్తలుల పరిచర్యకు అడుగడుగున అడ్డు తగులుతూ, వారు హత్యగావించబడువరకు విశ్రమించక కృషిసలిపాడు. సాతానీయ ప్రక్రియ ద్వారా క్రీస్తు శిష్యులు ఆయా రీతుల్లో చిత్రహింసలకు గురియై హత్యగావించబడినప్పటికిని, క్రీస్తు శిష్యుల సాక్ష్యజీవితము వేలవేల మందికి ఆదర్శప్రాయముగా నిలిచి సంఘ నిర్మాణము త్వరితగతిని కొనసాగుటకే ఉపకరించినది తప్ప సాతాను ప్రయత్నము ఫలించలేదు.
ఎన్ని మారులు అపజయములకు గురియైనప్పటికిని సిగ్గును విడచిన సాతానుడు తన పంతమును నెగ్గించుకోవాలనే ప్రయత్నముతో తొలి శతాబ్దములలో రోమా సామ్రాజ్యాధీశుల ఆధ్వర్యములో సంఘాన్ని విధ్వంసమొనర్చి క్రీస్తు నామాన్ని రూపుమాపాలని సమకట్టాడు. అట్టి ప్రయత్నాలు AD 64వ సం॥ నీరో అను చక్రవర్తి ద్వారా ఆరంభమై AD 312 వరకు ఎడతెరిపి లేకుండా కొనసాగెను. అట్టి హింసలలో వేలాది మంది విశ్వాసులు, మహాభక్తులు హతసాక్షులైరి. కాల, సంధర్భాను సారముగా ఈ హింసలను గూర్చి తెలుసుకొందాం.
మొదటి హింస : మొదటి శతాబ్దములో క్రైస్తవులకు కలిగిన హింసలలో ఇది మిక్కిలి ఘోరమైనది. ఇది నీరో చక్రవర్తి ఏలుబడిలో AD 64లో రోమా పట్టణములో సంభవించినది. అతిక్రూరుడు, మృగప్రాయుడు అయిన నీరో తన రాజధాని నగరమునకు నిప్పు పట్టించెను. అది తొమ్మిది దివారాత్రులు కాలినందున పట్టణములోని ఎక్కువ భాగము నాశనమాయెను.నాటకశాలలు, వాణిజ్యశాలలు, దేవాలయములు, గృహములు, గొప్పవియు, అందమైనట్టివియునైన అనేక కట్టడములు బూడిదయ్యెను. వేలాది మంది అగ్ని కీలల్లో దగ్ధులైరి. పొగవల్ల అనేకులు చనిపోయిరి. ఆ మహానగరము దహింపబడుతున్న సమయమంలో ఆ గొప్ప మంటల యొక్క అందమును చూచుటకు నీరో ‘మెకనస్’ గోపురమునకు ఎక్కి వెళ్ళి ‘ట్రాయ్’ నగర దహనమును గూర్చి తన వీణపై పాటలు పాడుచు ఆనందించెనట.తన ప్రవర్తన నిందకు గురియైనదని నీరో గ్రహించి తనపై మోపబడిన నిందను, ప్రజల ఆగ్రహమును తొలగించుకొనుటకు, క్రొత్త క్రూరకృత్యములను నెరపుట ద్వారా నేత్రానందము ననుభవించుటకై అవకాశము దొరుకునట్లు సమస్త నేరమును క్రైస్తవుల పైకి దొర్లించెను. సంఘము యొక్క మొదటి హింసకు నీరో యొక్క ఈ విపరీత ధోరణి కారణమయ్యినది.క్రైస్తవులను హింసించిన తీరులు పలు విధములు. కొందరు సిలువ వేయబడుట వలనను, కొందరు అడవి మృగముల చర్మములతో చుట్టబడి, కుట్టబడి వేట కుక్కలకు వేయబడి చిందరవందరలు చేయబడుట వలనను చంపబడిరి. మరింత దారుణమైన దేమనగా మరికొందరిని మైనము, కీలు పూసిన గుడ్డలతో గట్టిగా చుట్టి, గుర్రపు పందెములు జరుగు తన ఉద్యాన వనములోని చెట్ల మొదళ్ళకు కదలకుండా గట్టిగా కట్టి పందెములు జరుగు రాత్రులందు వారిని వెలిగించు నిమిత్తము నిప్పంటించుటకు ఆజ్ఞాపించెను. ఈ హింస క్రైస్తవ్యమును అణగార్చలేదుగాని శీఘ్రముగా వృద్ధి నొందుటకు దోహదపడినది. ఈ కాలంలో పౌలు, పేతురు భక్తులు హతసాక్షులైరి.
యెరూషలేము నాశనము : యెరూషలేము మీదకు రానున్న భయంకర నాశనమును యేసుప్రభువు ముందుగా నెరిగి, దాని చూచి, దాని విషయమై అంగలార్చెను (లూకా. 19:41-44). యూదులు దేవుని మాటలకు అవిధేయులై, దేవుని కుమారుని విసర్జించిన కారణముచేత నియమిత కాలము వచ్చినపుడు నిర్ణయమైన ఉపద్రవము లన్నియు వారికి సంభవించెను.రోమీయుల ప్రభుత్వాధిపత్యంలో నుండుటకు ఇష్టపడని యూదులు వారి అధికారాన్ని త్రోసివేయ నుద్దేశ్యముతో AD 66లో తిరుగుబాటు చేసిరి. దీన్ని గూర్చి విన్న నీరో తన గొప్ప సైన్యాధిపతియైన ‘వెస్పేషియన్’ను గొప్ప సైన్యముతో యూదయ దేశమునకు పంపెను. వెస్పేషియన్ యూదుల తిరుగుబాటును అణిచివేయుచున్న సమయములో ప్రజలు తనను రోమా సామ్రాజ్య చక్రవర్తిగా నేర్పరచుకొన్నారని విని తన కుమారుడైన తీతుకు సైన్యాధిపతి భాధ్యతలు అప్పగించి రోముకు వెళ్ళెను.తీతు AD 70లో యెరూషలేమును స్వాధీనం చేసుకొని సమూలధ్వంసం చేసెను. ఈ యెరూషలేము ముట్టడి, నాశనమును గూర్చి యూదుల చరిత్రకారుడైన ‘జోసీఫస్’ అనేక ఆసక్తి కరమైన విషయములను వెల్లడించాడు. ఈ ముట్టడి సుమారు 5 నెలలు జరిగెను. ఆ సమయములో యూదులు ఆయా దేశముల నుండి పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చియుండిరి. పట్టణము ప్రజలతో కిక్కిరిసి యుండెను.ముట్టడి కారణాన పట్టణము లోపట భయంకరమైన కరువు, దోపిడీలు, హత్యలు, రోగములు ఆరంభమాయెను. ప్రజలు ఆకలి బాధకు తాళలేక పట్టణము వెలుపటికి వచ్చి గడ్డిగాదములను తినయత్నించిరి. వచ్చిన వారిని వచ్చినట్లు రోమీయులు పట్టుకొని సిలువ కొయ్యలు నాటుటకు స్థలము లేకపోవు వరకును, సిలువల కొరకు కొయ్యలు దొరకక పోవువరకును యూదులను సిలువ వేసిరి.
పట్టణమును స్వాధీన పర్చుకొని, లోపలకు ప్రవేశించిన సమయములో యూదులను చొప్పకట్టల వలె నరికిరి. పట్టణపు వీధులలో వారి శవములు కుప్పలుగా ప్రోగుపడెను. వారి రక్తము వీధులలో వెల్లువలై పారెను. ఈ నాశనములో చనిపోయిన వారి సంఖ్య 11 లక్షలగాను, పట్టబడిన వారి సంఖ్య 97 వేలగాను పేర్కొనబడెను. యెరూషలేములోని దేవాలయము సమూలముగా ధ్వంసము చేయబడి, అందలి ఉపకరణములు రోముకు కొనిపోబడెను. యూదులు సమస్త దేశములలోనికి చెదర గొట్టబడిరి.
రెండవ హింస: నిరంకుశ పాలనాధికారియైన డొమీషియన్ చక్రవర్తి 90-96 AD కాలంలో ఇది జరిగెను. ఈ హింసాకాలంలో శ్రమనొందిన అసంఖ్యాక హతసాక్షులలో సిలువ వేయబడిన యెరూషలేము బిషప్ ‘సిమియోను’, మరుగుచున్న నూనెతో వేయబడి తదుపరి పత్మాసు ద్వీపమునకు పంపబడిన అపో॥ యోహాను ఉన్నారు. క్రైస్తవులను గాయపరచు నిమిత్తమై పలురకములైన కల్పనా కథలు క్రైస్తవులకు వ్యతిరేకముగా కూర్చబడెను.క్రైస్తవ వ్యతిరేకుల చర్యలు ఎంత ఘోరమైనమనగా రోమా ప్రభుత్వాధీనంలో గల ప్రాంతంలో కరువులుగాని, అంటురోగములుగాని, భూకంపములుగాని సంభవించిన సందర్భాలలో వాటికంతటికి క్రైస్తవులే కారణమని వారిపై నేరారోపణ చేసి హింసించెడివారు. క్రైస్తవులు న్యాయాధిపతుల ముందుకు తీసుకొని పోబడినపుడు వారికి పరీక్షార్ధమైన ప్రమాణము చేయవలెనని ప్రతిపాదించిరి. వారు అట్టి ప్రమాణము చేయనిరాకరించి తాము క్రైస్తవులని ఒప్పుకొనిన పక్షాన మరణదండన విధించెడివారు. పౌలు శిష్యుడును ఎఫెసు బిషప్ గా నున్న తిమోతి ఈ కాలంలోనే హతసాక్షి యాయెను.
ఈ మొదటి కాలాంత మందు క్రైస్తవ్యము యొక్క స్థితి : దాదాపుగా రోమా సామ్రాజ్య మంతట క్రైస్తవ్యము వ్యాపించి యుండెను. ‘బితూనియ’ గవర్నరగు సీనీ (Pliny) AD 112 సం.లో ‘ట్రెజన్’ చక్రవర్తికి ఉత్తరము వ్రాసి తాను క్రైస్తవుల పట్ల ఎట్లు వ్యవహరించవలయునని సలహా అడిగినపుడు తన పరగణాలలో ఉన్న అన్ని తరగతుల జనులలో అనగా గొప్పవారి యందు సామాన్యుల యందు, పిన్న పెద్దలలోను, స్త్రీ పురుషుల యందును క్రైస్తవ్యము వ్యాపించి ఇతర మతస్థుల దేవాలయములు దాదాపుగా అన్నియు మూత పడుచున్నవని, బలి సంబంధిత వ్యాపారములు చేసుకొనువారు లేమి ననుభవించు చున్నారని పేర్కొనెను. చక్రవర్తి ఇంటిలో సహితము క్రైస్తవులుండిరి (ఫిలి 4:22).
a) క్రైస్తవ జీవనము : క్రైస్తవ్యము దేవుని మూలమైనదనటానికి మార్పు నొందిన జీవితములే నిదర్శనములు. విస్తారమైన దుర్మార్గము, విగ్రహారాధన, అపవిత్రత, మోసము, లౌకికము మొదలైన వాటితో ఆవరింపబడియున్నను నిజక్రైస్తవులు దైవభక్తి, సమాధానము, సత్ ప్రవర్తన కలిగి ఈ లోక సంబంధమైన వాటిమీద మనస్సుంచక తమ ప్రవర్తన ద్వారా క్రీస్తును ప్రకటించిరి.
b) స్త్రీల స్థితి : ఇతర మతాల్లో స్త్రీలు లోకువైనట్టి, నీచమైనట్టి రీతిలో చూడబడి అన్యాయమునకు గురై, అజ్ఞాన మందుండగా క్రైస్తవ్యములో స్వేచ్ఛ, స్వాతంత్య్రములను అనుభవించి ఉన్నత స్థితి కలిగియుండెను. (గలతి 3: 26-).
c) బానిసత్వము : రోమా సామ్రాజ్యములో బానిసత్వము బహుక్రూరముగా ఉండెడిది. మానవులు అమ్మబడి కొనబడిరి. బానిసలపై యజమానులకు సర్వహక్కులు ఉండేవి. యజమానులు వారిని నీచముగా చూచెడివారు. క్రైస్తవ్యము దయాళుత్వమును, సహోదరత్వమును నేర్పించెను. బానిసలు, యజమానులు క్రీస్తులో సమానులై, ప్రేమాను బద్ధులైయుందురు.
d) రాజ్యము – రాజ్యాధికారుల పట్ల విధేయత : రాజ్యాధికారులకు లోబడుట క్రైస్తవుల విధి అని చూపుచు పన్ను కట్టుటలో మిగిలిన రాజ్య చట్టాలను గౌరవించవలెనని, ఘనపర్చవలెనని క్రైస్తవ్యము నేర్పించెను. క్రైస్తవులు విగ్రహములనుగాని, చక్రవర్తినిగాని మ్రొక్కుటకు సమ్మతింపక శిక్షనైనను అనుభవించుటకు ఇష్టపడిరి. ఈ కారణాన్ని బట్టి వారు మూర్ఖపు పట్టు గలవారనే నిందను ఎదుర్కొనిరి.
e) లౌకిక వినోదములు : నాటక శాలలలోని చెడ్డవైన, క్రూరమైన, రక్తము చిందించుటతో కూడిన వేడుకలను చూచునిమిత్తము తమ పొరుగువారితో క్రైస్తవులు వెళ్ళెడివారు కారు. దీన్ని బట్టి క్రైస్తవులు మనుష్యద్వేషులు అని పిలువబడిరి.
f) సంఘములు : పౌలు, పేతురు, యాకోబు, యోహాన్లు, యూదాలు వ్రాసిన వ్రాతలను బట్టి మధ్యధరా సముద్ర తీర ప్రాంతమంతట సంఘములున్నట్లు కన్పించును. సంఘములకు పలుపత్రికలు వ్రాయబడెను. అపొస్తలుల శిష్యులు కూడా ఆయా సంఘములకు కొన్ని పత్రికలు వ్రాసిరి.
g) సంఘ సభ్యత్వము, సిద్ధాంతములు, క్రమశిక్షణ : క్రీస్తును విశ్వసించి రక్షకునిగాను, ప్రభువుగాను అంగీకరించి, ఆయన ఆజ్ఞాపించిన నియమముల ప్రకారము బాప్తీస్మముద్వారా బహిరంగముగా ఒప్పుకొనిన వారు సంఘములో చేర్చబడిరి. క్రొ.ని. లో కన్పించు అపొస్తలుల బోధే ప్రామాణికము. విశ్వాసులు జాగ్రత్తగాను, నమ్మకముగాను జీవించి క్రీస్తుకు నిజసేవకులై యుండునట్లు ప్రోత్సహింపబడిరి. అక్రమముగా నడచువారిని సంఘముల నుండి వేరుపరచిరి
h) సంఘాధికారము – సంఘాచారములు : అధికారులలో రెండు తరగతులు మాత్రమే ఉన్నవి. అవి అధ్యక్షులు (లేక) పెద్దలు మరియు పరిచారకులు. నూతన విశ్వాసులను సంఘములో చేర్చుకొనుటకును సంఘక్రమశిక్షణ విధించుటకును సంఘమే అధికారము కలిగియుండెను. ప్రతి సంఘము స్వతంత్రాధికారము కలిగియుండెను. సంఘాచారముల విషయములో ప్రభువు ఆజ్ఞాపించిన బాప్తీస్మము మరియు ప్రభుభోజన సంస్కార పరిచర్య ఆచరింపబడు చుండెను.
B) రెండవ కాలము : అపొస్తలుల శకాంతము మొదలు ‘కాన్స్టాంటైన్’ చక్రవర్తి మత పూర్ణ స్వాతంత్ర్యము కొరకు చేసిన ప్రకటన వరకు (AD 100-313).
ఈ కాలంలో క్రైస్తవ్యము పలురీతులుగా హింసల నెదుర్కొని, జయమొంది నిలిచిన విధమును చూచెదము. అపొస్తలులును, మన ప్రభువును కన్నులార చూచిన వారందరును గతించిరి. క్రైస్తవ్యము లోకమందు నలుప్రక్కలకు వ్యాపించెను. క్రైస్తవులు తొడేళ్ళ మధ్య గొర్రెలవలె నుండిరి. రెండు వందల సం॥లకు పైగా క్రైస్తవులు పలు హింసలు నెదుర్కొనిరి.
1) క్రైస్తవ్యము హింసింపబడుటకు గల కారణములు :
a) క్రైస్తవులను నాస్తికులు (లేక) నిర్దేవులు అని అన్యులు సంబోధించిరి. కారణము – క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని తప్ప మరి ఏ ఇతర మతములను అంగీకరించక పోవుట. క్రైస్తవులు ఆత్మతోను, సత్యముతోను దేవున్ని సేవించుచు, దేవుడు ఒక్కడే అని విశ్వసించిరి. కావున వారు విగ్రహారాధనలను గాని వాటి అర్పితములు, పూజలు, పండుగలను గాని ఆచరించెడివారు కారు. విగ్రహములు/ దేవుళ్ళు అనే భావనను వీరు అంగీకరించలేదు.
b) క్రైస్తవులు మనుష్యజాతి ద్వేషులు అని పిలువబడిరి. రోమీయులకు ప్రియముగా నుండు ఇహలోక మాలిన్యముతో కూడికొనిన నాటకములు, ముష్టి యుద్ధములు, మనుష్యులు మనుష్యులతోను, అడవి మృగములతోను పోట్లాడుట మున్నగు వాటిని విసర్జించి అట్టి స్థలములకు వెళ్ళెడివారు కారు.
c) క్రైస్తవులపై రాజద్రోహులనే నింద మోపబడెను. కారణం రోమీయులు సాధారణముగా చక్రవర్తి ప్రతిమ ఎదుట ధూపము వేసెడివారు. ఇట్లు చేయుట దేవునికి విరోధమైన పాపమని, క్రైస్తవులు నమ్మి దానిని తృణీకరించిరి. క్రైస్తవులు యేసుక్రీస్తును తమ ప్రభువని ఒప్పుకొనుచున్న కారణాన వారు రోమా చక్రవర్తికి తగినంత విధేయత చూపుటలేదని రోమీయులు తలంచిరి (అపో. 17:7).
d) క్రైస్తవులు నరమాంస భక్షకులు, వ్యభిచరించువారు అనే అపనిందలను ఎదుర్కొనిరి. కారణం ప్రభుభోజన పరిచర్యను ఆచరించుట, ప్రేమ విందులు ఆరగించుట మున్నగు కార్యములు రహస్యముగా చేసెడివారు. అట్టి సమయాల్లో వారు అవమాన కరమైన పాపములు చేసెడివారని విరోధులు అనుమానించి, అపవాదులు వేసిరి.
e) ప్రకృతి వైపరీత్యములకు క్రైస్తవులే కారకులనిరి. తమ రాజ్యమందుండి క్రైస్తవులు తమ దేవతలను/ దేవుళ్ళను ఆరాధింపక పోవుట వలన అవి కోపగించి కరువులు, వరదలు, భూకంపములు, తెగుళ్ళు మున్నగు ఆపదలు తమ దేశము పైకి పంపుచున్నారని రోమీయులు తలంచిరి.
f) క్రైస్తవ్యము ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయుచున్నదని భావించిరి. క్రైస్తవ్యము అతివేగముగా వ్యాప్తి చెందుటవలన అనేకులకు జీవనాధారమైన వ్యాపారములు నిలిచిపోయెను (అపో. 19:21-27).
g) క్రైస్తవులు మొండితనము గలవారని విరోధులు తలంచిరి. కారణం తమ ప్రభువును విసర్జించుట కంటెను, తప్పని తమకు తోచిన దేనినైనను చేయుట కంటెను ఎట్టి శ్రమనైనను అనుభవించుట శ్రేష్ఠమని క్రైస్తవులు ఎంచి వాటన్నిటిని సహించు చుండిరి. క్రైస్తవులు బహు స్థిరులును, కదలని వారునైయుండి హింసలను సహించుట మొండితనమని విరోధులు భావించి, ఆ మొండితనమును ఏ విధముగా నైనను అణచవలెనని మరిన్ని నేరములను కూడ మోపిరి.
2.) ఈ కాలమందలి ముఖ్యహింసలు: మొదటి కాలమునందు నీరో, డొమీషియన్ చక్రవర్తుల పరిపాలనలో కలిగిన రెండు గొప్ప హింసలు చూచాము.
మూడవ హింస: ఈ హింసలు AD 98-138 సం.ల మధ్య రోమాను ఏలిన ‘ట్రాజన్’ మరియు ‘హెడ్రియన్’ ల ద్వారా కలిగినవి. ఈ కాలంలో క్రైస్తవుల వధను చూసి దయతో కదిలించబడిన క్రైస్తవేతరులును, పేరొందిన ‘బితూనియ’ గవర్నరైన ‘సినీ’ శిక్షార్హమైన రోమా శాసనములకు వ్యతిరేకముగా ఏమీ చేయని అనేక వేలమంది అనుదినము చంపబడుచున్నారని ‘ట్రాజన్’ కు ఒక లేఖ వ్రాసెను.ఆ లేఖ సారాంశమేమనగా “ఒక నిర్ణీత దినమున తెల్లవారకముందే వారందరును కలుసుకొని క్రీస్తు దేవుడైనట్లు కీర్తనలు పాడుచు, ప్రార్థనలు చేయుచు వాటి యందు అభ్యాసము కలిగియున్నారు. చెడుపనులను చేయుటకు గాక దుష్కార్యములకు వ్యతిరేకముగా అనగా ఎన్నడును దొంగిలించక, దోపిడి చేయక, వ్యభిచరింపక యుండునట్లును, మాటలో ఎన్నడును తప్పక యుండునట్లును, ఏ మనుష్యుని ఎన్నడును వంచింపక యుండునట్లును సుహృద్భావముతో మెలగవలెనన్న నిబంధనకు తమ్మును తాము వశపరచుకొనిరి. ఈ విధముగా ప్రత్యేకించుకొనిన అలవాటు ముగిసిన పిమ్మట హాని కలిగించనటువంటి సామూహిక విందులో పాలుపొందుటకై కూడుకొనుచున్నారు. వారిపైన మోపదగిన నేరము ఇది మాత్రమే”. అపొస్తలుడైన యోహాను శిష్యుడును, అంతియొకయ సంఘాధ్యక్షుడు నైన ‘ఇగ్నేషియస్’ ‘ట్రాజన్’ ఏలుబడిలో హతసాక్షియాయెను. ‘ఇగ్నేషియస్’ క్రీస్తును గూర్చి బహిరంగముగా ప్రకటించిన కారణమున అడవి మృగములకు వేయవలయునని తీర్పుచెప్పి సిరియా నుండి రోమునకు పంపబడెను. మార్గమధ్యములో నున్న సంఘములను దర్శించి, వాక్యమును బోధించి, బలపరచి స్థిరపరచెను. ఇతడు స్ముర్న నుండి రోమా సంఘమునకు ఉత్తరము వ్రాయుచు ‘‘తాను హతసాక్షి కాకుండా ఎట్టి ప్రయత్నములు చేయవద్దని, అగ్నియైనను, సిలువయైనను, క్రూరమృగముల సహవాసమైనను, శరీరమంతయు పొడిచేయబడుటయైనను, సాతానీయ క్రోధమంతయు నామీదికి వచ్చినను నేను క్రీస్తును సంపాదించుకొనినందున వెనుదీయను”.రోములో ఒక పండుగ దినమున జనుల వినోదముకై అడవి మృగముల ముందు వేయబడు సమయములో శ్రమ నొందుటకు తనలో నున్న కోరికతో “నేను క్రీస్తు కొరకైన గోధుమ పంటనైయున్నాను. నేను శ్రేష్టమైన రొట్టెగా రూపింపబడు నిమిత్తము క్రూరమృగముల పండ్లతో విసరబడుటకై వెళ్ళుచున్నానని” పలికెను.
మిషనరీ జీవిత చరిత్రల కొరకు…..CLICK HERE




