సంఘ చరిత్ర
Church History (Telugu) – Chapter3
నాలుగవ హింస : ఇది ‘ఏంటోనైనస్ పయస్’ (Antoninus Pius) మరియు ‘మార్కస్ ఆరేలియస్’ (Marcus Aurelius) చక్రవర్తుల కాలంలో (AD 139-180) జరిగాయి. ‘పయస్’ దయగలవాడు, న్యాయవంతుడైన చక్రవర్తి. అయితే ఇతని కాలంలో దేశంలో పలు కరువులు, జలప్రళయములు, అగ్నిప్రమాదములు సంభవించాయి. క్రైస్తవులు తమ దేవుండ్లను విసర్జించినందుననే ఇవి కలిగాయనే నింద వారి మీద మోపబడినందున వారు హింసల పాలైరి. హింస ననుభవించిన అనేకులలో కురువృద్ధుడును, స్ముర్న సంఘాధ్యక్షుడునైన ‘పాలికార్ప్’ ముఖ్యుడు. అధిపతి యొద్దకు తీసుకొని రాబడినపుడు అధిపతి పాలికార్ప్ ను చూచి, “నీవు చక్రవర్తి పేరట ఒట్టు పెట్టుకొని క్రీస్తును ద్వేషించినచో నిన్ను విడిపింతుననెను”. అందుకు పాలికార్ప్, “నేను 86 సం॥ల నుండి క్రీస్తును సేవించుచున్నాను. ఆయన నాకు ఎంత మాత్రమును కీడును చేయలేదు. నా రాజును, రక్షకుడు నైన క్రీస్తును ఎట్లు దూషించగలను” అనెను. అది విన్న అధిపతి “నిన్ను అడవి మృగములకు వేయించెదనని” బెదిరించెను. అందుకతడు “అలాగే కానియ్యుడి” అనెను. తిరిగి అధిపతి, “నీవు అడవి మృగములకు భయపడని యెడల నిన్ను అగ్నికి అప్పగించెద” ననగా “కొంచెము కాలము బాధించగల ఈ అగ్నితో నన్ను బెదిరించెదవా? దుర్మార్గులైన వారికి రాబోవుచున్న నిత్యాగ్నిని గూర్చి ఎరుగకున్నావా?” అని పాలికార్ప్ బదులివ్వగా కోపోద్రేకులైన ప్రజలు అతనిని స్తంభమునకు కట్టి, కట్టెలను పేర్చి మంట బెట్టిరి. అయితే జ్వాలలు అతనిని తాకక ధనురాకారమున అతని దేహమును చుట్టుకొనెను. ఈ కార్యమును నిర్వహించుచున్న తలారి తనకు ఆజ్ఞాపించబడినట్లుగా పాలికార్ప్ ను కత్తితో పొడిచినపుడు మంటలను చల్లార్చునంతటి పరిమాణములో అతని దేహము నుండి రక్తము ప్రవహించెను. ఈ రీతిగా పాలికార్ప్ హతసాక్షియాయెను. (On Feb 23, 155 AD)
ఆరేలియస్ పాలనాకాలంలో క్రైస్తవులు భయంకర హింసల నొందిరి. వీరిలో ‘జస్టిన్ మార్టిర్’ (Justin Martyr) గొప్ప విద్యావేత్త. క్రైస్తవ్యాన్ని దృఢపర్చుటకు చాలా గ్రంథాలు వ్రాసాడు. వీటిలో “క్రీస్తు మత సిద్ధాంత నిరూపణ” ప్రాముఖ్యమైనది. AD 166 లో రోములో తలగొట్టబడి హతసాక్షియాయెను.
‘గాల్’ దేశములోని ‘లయోన్స్’ (Lyons), ‘వీయెన్స్’ (Vienne) అను పట్టణాల్లో చెప్పనలవి కాని భయంకర హింసలు జరిగెను. ‘సాంక్టస్’ అను వ్యక్తిని ఎర్రగా కాల్చబడిన ఇత్తడిరేకులు శరీరములోని మృదువైన భాగములపై పెట్టి కాల్చిరి.
‘బ్లాండినా’ అను ఒక చిన్నదైన దాసిని చాలా కాలము నానావిధములుగా చిత్రహింసలు పెట్టిరి. ఆమె నొక కొయ్యకు సింహములకు ఆహారమగునట్లు వ్రేలాడదీసి సింహములను వదిలిరి గాని ఆమె చిరునవ్వుతో శాంతముగా నుండెను. ఆ అడవి మృగములామెను ముట్టకుండెను. కొద్ది వారముల తదుపరి చంపబడుటకు తీసుకు వచ్చుచుండగా ఆమె పెండ్లి విందుకు వెళ్ళినట్లు సంతోషముతో వధ స్థానమునకు నడచెను. అక్కడామెను కొరడాతో కొట్టి, ఎర్రగా కాల్చిన ఇనుపకుర్చీపై కూర్చుండబెట్టి, తదుపరి ఒక వలతో చుట్టి పోట్లఎద్దు ముందర వేసిరి. అది ఆమెను నెత్తురు వరదలగునట్లు కుమ్మికుమ్మి పొడిచెను, ఇంకను ఆమె జీవించినందున ఆ హింసకులు విసిగి కత్తితో పొడిచి చంపిరి.
‘ఫెలిసిటాటిస్’ అను సద్గుణ సంపన్నురాలైన ఓ రోమీయు క్రైస్తవ స్త్రీ యొక్క ఏడుగురు కుమారులను ఆమె ఎదుటనే ఒక్కని చబుకులతో దండించి, మరణించునట్లు బరువుల నుంచి అణచిరి. మరో ఇద్దరిని మెదడులు చిందర వందరగునట్లు దుడ్డుకర్రలతో మోదిరి. మరొకరిని నిట్టనిలువుగా నున్న కొండమీద నుండి త్రోసి చంపిరి. మరో ముగ్గురిని శిరచ్ఛేదనము గావించిరి. తుదకు ఆమెను కూడా ఖడ్గముతో చంపిరి.
ఐదవ హింస : ‘సెప్టిమియస్ సెవిరస్’ కాలంలో (AD 192 -211) క్రీస్తును విశ్వసించిన కారణాన కొంతమంది స్త్రీలను బాధ అధికమగుటకు సలసల కాగుచున్న కీలులోనికి నెమ్మదిగా దించి చంపిరి. ఈ హింసలు ముఖ్యముగా ఉత్తరాఫ్రికాలోను, ఐగుప్తులోను జరిగెను. ‘కార్తేజ్’ పట్టణములో చంటి బిడ్డ తల్లియైన ‘పెర్పెట్యువ’ ను గర్భవతియైన ఆమె స్నేహితురాలు ‘ఫెలిసిటాస్’ ను చెరలో వేసిరి. ఫెలిసిటాస్ తన తొలిచూలు బిడ్డను చెరలోనే కన్నది. వయోవృద్ధుడైన ‘పెర్పెట్యువ’ తండ్రి ఆమె పసిబిడ్డను ఆమెకు చూపించి ఆమె కాళ్ళుపట్టుకొని “ఈ బిడ్డ ముఖము చూసియైనను (లేక) వృద్ధుడనైన నన్ను చూసియైనా, క్రీస్తును విడచి నీ ప్రాణమును దక్కించుకొనుమని” బహు దుఃఖముతో వేడుకొనెను. ఆమె వారి విషయము మిక్కిలి జాలిపడెను గాని క్రీస్తును విసర్జించుటకు ఎంత మాత్రమును ఒప్పుకొనక “మేము మా వారము కాము, దేవుని చేతిలో వున్నాము” అని జవాబిచ్చెను. తర్వాత వారు వస్త్రహీనులుగావించబడి అడవి మృగములకు వేయబడిరి. కొరడాలతో బాధించువారు రెండు వరుసలలో ఎదురెదురుగా నిలిచియుండగా కొంతమంది క్రైస్తవులను వారి మధ్యనుండి పరుగెత్తి వెళ్ళునట్లు చేసి, విపరీతముగా కొట్టి బాధించిరి.
ఆరవ హింస : ‘మాక్సిమినస్’ చక్రవర్తి (AD 235-237) కాలంలో ఏ నిరూపణ లేకుండగనే అసంఖ్యాక క్రైస్తవులు చంపబడిరి. ఏ వ్యత్యాసాలు చూడకుండగనే కుప్పలుగా వేసి సమాధి చేసిరి. కొన్ని సార్లు యాబై, అరవై మందిని కలిపి లోతైన గుంటలోనికి త్రోసివేసిరి. ‘హిప్పోలిటస్’ అను క్రైస్తవ గురువును గుర్రములకు కట్టి మరణించువరకు ఈడ్చిరి. కొద్దిమందిని కుటుంబములతో సహా చంపిరి.
ఏడవ హింస : ఇది ‘డేషియస్’ కాలం (AD 249 – 251) లో సంఘముపై తీవ్రమైన హింసాకాండ చెలరేగినది. కారణాలనేకం, తనకు ముందుగా పరిపాలించి క్రైస్తవుడిగా ఎంచబడిన ‘ఫిలిప్పు’ పై తనకున్న క్రోధము, క్రైస్తవ్యము దినదినాభివృద్ధి నొందుచున్నందున కలిగిన అసూయ, క్రైస్తవ ఆలయాల్లో జనులు గుంపులుగా కూడి దేవుని ఆరాధించు చుండుటయు, క్రైస్తవేతర ఆలయాలు నిర్జనముగా విడిచి పెట్టబడుటయు ఈ ఏడవ హింసకు ప్రబల కారణములు.
‘జూలియన్’ క్రైస్తవుడైనందున అసంఖ్యాకమైన సర్పములతోను, తేళ్ళతోను నిండియున్న తోలు సంచిలో పెట్టబడి సముద్రము లోనికి విడువబడెను. ఎముకలన్నియు విరుగ గొట్టబడు నట్లుగా కొందరిపై బండిచక్రము లాగిరి. కొంతమంది రాళ్ళురువ్వి చంపబడిరి. ఇనుప కొక్కెములతో చీల్చబడిరి. పాదములలో మేకులను కొట్టి వీధుల గుండా త్రిప్పిరి. ఈ కాలంలో క్రేతు ద్వీపములో హింసలు తీవ్రతరముగా నుండెను. బహుతరచుగా శిరచ్ఛేదనము అమలు పర్చుట ద్వారా ఆ ప్రాంతములో పవిత్ర రక్తము ప్రవహించెను. కొంతమంది ఒంటె వీపులకు కట్టబడిన వారై చబుకులతో తీవ్రముగా బాధించబడిరి.
ఈ కాలంలోనే అలెగ్జాండ్రియా వాసియైన ‘ఆరిజన్’ అను వేదాంతి బహుగా హింసింపబడెను. అసహ్యకరమైన చెరసాలలో వేయబడి, బరువైన సంకెళ్ళతో బంధింపబడి, అతని పాదములను బండకొయ్యపై ఉంచి అనేకదినముల తరబడి అతని కాళ్ళను దూరముగా సాగలాగిరి.
ఎనిమిదవ హింస : ఇవి ‘వలేరియన్’ కాలంలో సంభవించెను (AD 253 – 260). AD 253 లో ఆరంభమైన మూడున్నర సం॥లు కొనసాగెను. సంఘాధ్యక్షులందరిని దూరదేశాలకు పారద్రోలవలెనని, క్రైస్తవులు ఒక చోట కూడుకొనుట తక్షణమే మానవలెనని, హతసాక్షుల సమాధులను దర్శింపరాదని ఆజ్ఞ జారీ చేసెను. ఉన్నత స్థానాల్లో నున్నవారిని, అనేకమంది బిషప్పులను, స్త్రీ పురుష, వృద్ధ బాలుర విచక్షణ లేకుండా అనేకమందిని హతమార్చిరి. విగ్రహములకు బలి అర్పించ నిరాకరించిన బిషప్ ‘సాటర్ నినస్’ కాళ్ళను ఎద్దుతోకకు కట్టి, దేవాలయపు మెట్ల పైనుండి క్రిందకు తోలగా మెదడు బయటకొచ్చి హతుడాయెను. ‘లారెన్స్’ అను బోధకుని పట్టకారులతో నొక్కి పట్టి, ముండ్ల గరిటలను తీసుకొనివచ్చి, నిప్పులతో నిండిన ఇనుప పెనముమీద వేసి, వేయించి హతమార్చారు. కార్తేజ్ పట్టణ సంఘాధ్యక్షుడైన ‘సిప్రియన్’ మరొక హతసాక్షి. ఇలా మరెందరో.
తొమ్మిదవ హింస : ఇవి ‘ఆరేలియన్’ కాలంలో (AD 270-275) అనేకులు నిలువు స్తంభములకు కట్టబడి, పాదములలో మేకులు దిగగొట్టబడుట ద్వారా శ్రమ నొంది నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించిరి. కొంతమందిని చెట్లకు వ్రేలాడదీసి క్రింద మంట పెట్టిరి. ఈ శిక్షలను అమలు చేయుచున్న అనేకమంది క్రైస్తవుల నిబ్బరమైన విశ్వాసాన్ని, నిరీక్షణను చూసి, క్రీస్తునంగీకరించి, వారును హతసాక్షులు గావించబడిరి. ఈ హింసలు ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు కూడా వ్యాపించినవి.
పదవ హింస : ఇవి ‘డయొక్లీషియన్’ (AD 284 -305), ‘మాక్సిమియన్’, ‘గలేరియస్’ (AD 284 -311) కాలంలో ఇంతకు మునుపు కలిగిన భయంకర హింసలన్నింటిని మరిపించు రీతిలో అతి దారుణముగా క్రైస్తవులు హింసల నొందిరి. ప్రార్థనాలయాలను నేల మట్టం చేయటం, మత గ్రంథాలన్నింటిని అగ్నిపాలు చేయటం జరిగింది. కొంతమంది మీద విషప్రయోగం చేయబడింది. కొంతమంది మెడలకు రాళ్ళుకట్టి వారిని ఏకముగా బంధించి సముద్రములోనికి త్రోసిరి. క్రైస్తవుల ఇండ్లను వారితో పాటే దహించిరి. ఈ హింసలు ‘గాల్’, ‘బ్రిటన్’ దేశాలకు కూడా వ్యాపించినవి. ‘సెబాస్టియన్’ అను క్రైస్తవుడు చక్రవర్తి యొక్క రక్షకులపై అధికారిగా నుండెను. విగ్రహములకు మ్రొక్కనందున మైదానములోనికి కొనిపోయి బాణములతో కొట్టి హింసించిరి. ఈ హింసలు ఫ్రాన్స్ దేశానికి కూడా విస్తరించాయి. ‘విక్టర్’ అను గొప్ప వ్యక్తిని రాళ్ళను ముక్కలు చేయు యంత్రములో పడవేసి, ముక్కలు ముక్కలుగా చేసిరి. కొంతమంది కండరములను కత్తులతో కోసారు. ముఖములను చెక్కారు. పండ్లను పీకివేసారు. వెంట్రుకలను పూర్తిగా పెరికివేసారు. గొంతుకలను పిసికి చంపారు. కొంతమందిని పెనములపై పరుండబెట్టి సన్న సెగతో చనిపోవువరకు కాల్చిరి. ఈ కాలములో ఆఫ్రికాకు, గ్రీసుకు కూడా ఈ శ్రమలు విస్తరించెను. కొంత మందిని సీసపు గుండ్లు కట్టిన మరియు గాలపు ముళ్ళులు కట్టిన చబుకులతో కొట్టి హతమార్చిరి. AD 304 వ సం॥లో ‘తిమోతి’ అను సంఘ పెద్ద, అతని భార్య పరిశుద్ధ గ్రంథాలు కలిగియున్నారనే నేరము మోపబడి వారియొద్దనున్న పరిశుద్ధ గ్రంథాలను కాల్చుటకు, విరోధులు సిద్ధపడగా తిమోతి చూచి, “మేము బిడ్డలను కలిగియున్నాము. పరిశుద్ధ గ్రంథములకు ప్రతిగా వారిని కాల్చుడని” చెప్పిన మాటలను బట్టి తమ బిడ్డలకంటే దేవుని వాక్యమును ఎంత ఎక్కువగా ప్రేమించిరో గ్రహించగలము.
క్రైస్తవ్యమును భ్రష్టపరచి, వ్యర్థపరచనాలోచించి, విగ్రహార్పితమైన ద్రాక్షరసము, నీళ్ళు మొదలగు ద్రవములను సంత బజారులలో విక్రయింపబడు సరకులన్నిటిమీద చల్లించిరి. అట్లు అపవిత్రపర్చబడిన వస్తువులను కొని తినవలెను (లేక) మాని చావవలెను.
3) హింసల వలన కలిగిన మేలులు (లేక) స్థితి :
a) గాలి పొట్టును ఎగురగొట్టి గట్టిగింజలకు బయలు పర్చినట్లు, నిజ క్రైస్తవులును, వేషధారులును హింసల వలన బయలుపడిరి. హింసల కాలమందు పట్టబడిన క్రైస్తవులందరు స్థిరముగా నిలువలేదు. కొన్ని స్థలములలో క్రైస్తవ్యమును వదిలి మత భ్రష్టులైన వారి సంఖ్య ఎక్కువుగా ఉండెను. ఈ హింసలు నిశ్చయముగా మేలుల నిమిత్తమే కలిగెను.
b) నిజక్రైస్తవులు ఈ లోకపు వ్యర్థమైన వాటియందు కాక, నిత్యరాజ్యమందు తమ మనస్సంతయు నిల్పునట్లు నేర్పునుపొందిరి.
c) మోషే హోరేబు పర్వతారణ్యమందు చూచిన మండుచున్న పొద కాలిపోనట్లు సుమారు 250 సం॥లు సాగిన భయంకర హింసలలో క్రైస్తవ్యము నశించక స్థిరపడి, దైవబలమును పొంది శ్రమలలో నుండి నూతన ఉత్తేజము నొందెను.
d) క్రైస్తవ్యమును దృఢపర్చుటకు గొప్ప గ్రంథములను ఈ హింసల కాలమందు క్రైస్తవ పండితులు ప్రేరణ కలిగి వ్రాసిరి.
e) హింసలు గతించెనుగాని క్రైస్తవ్యము చిత్రవధ, ఖడ్గము, చెర, అగ్ని అనువాటికంటే మరి చెడ్డ శతృవులను ఎదురింపవలసి వచ్చెను. అనుభవించిన వాటికంటే అధికహాని కరమైన అహంకారము, డంబము, పాపము, ఐహికగర్వము, ఉన్నత స్థితిని కోరుట, ధనము, బలము, సుఖభోగములయందు అభిలాషను ఎదుర్కొనిరి.
4) హింసా కాలమందు క్రైస్తవ్యము ఆశ్చర్య కరముగా అభివృద్ధి నొందుట :
మొదటి శతాబ్దాంతమందు క్రైస్తవులు రెండు లక్షల మంది యుండిరనియు, మూడవ శతాబ్దాంతమునకు 60 మిలియన్లకు పెరిగినట్లు సంఘ చరిత్రకారులు అంచనా వేసిరి. క్రైస్తవ్యము మధ్యధరా ప్రాంతమంతట పర్షియా, ఇండియా, స్పెయిన్, బ్రిటన్, ఉత్తరాఫ్రికా అంతయు ఐరోపాలోని అనేక భాగముల వరకును వ్యాపించెను.
లోకములోని ఏ రాజ్యబలముగాని, సైన్యబలముగాని, ధనబలముగాని, ఏ గొప్పవాని సహాయము లేకయే రోమా రాజ్యము యొక్క ధనము, బలము, గ్రంథమూలమైన శక్తి తనకు కేవలము విరోధముగా నున్నను క్రైస్తవ్యము జయమొంది అభివృద్ధి నొందినది. ఇందులకు గల కారణములేమో!
a) ఇహలోక సంబంధమైనది కానట్టి ఏదో ఒక బలము క్రైస్తవ్యమునకు ఉండని పక్షాన ఇది సాధ్యమగునా! కాదుగదా! అదేమనగా, క్రీస్తు తన శిష్యులతో “ఇదిగో నేను యుగపర్యంతము మీతో కూడా నున్నానని” వాగ్దానము చేసిన ప్రకారము ఆయన వారితో కూడా నుండుట వలన క్రైస్తవ్యము అభివృద్ధి చెందెను. ఆయనెట్లు చిరంజీవియై యున్నాడో సంఘము కూడా అట్లే చిరంజీవియై యున్నది.
b) “హతసాక్షుల రక్తము సంఘమునకు విత్తనము” అని ‘టెర్తులియన్’ అను గొప్ప బోధకుడు చెప్పిన మాట యథార్థమని ఋజువాయెను.
5) రోమా పట్టణమందు భూమిలో తొలచబడిన సమాధుల సొరంగములు (Catacombs) :
ఇట్టివి ఆయా దేశాల్లో నున్నప్పటికి ఇచ్చట రోమాలోనున్న వాటినే పరిశీలిద్దాం. వీటిలో ఎక్కువ హింసాకాలమందు మృతులైన వారి శవములను ఉంచుటకు త్రవ్వబడిన సమాధి స్థానములు (సొరంగములు). క్రైస్తవులప్పుడప్పుడు భయంకర హింసలను తప్పించుకొని వాటిలో దాగిరి. అప్పుడప్పుడు ఆరాధనలను కూడా జరిగించుకొనిరి. సుద్దరాయి మొదలైన మెత్తని రాతిలో తొలచబడిన, పొడవైన, చీకటిగల ఇరుకు సొరంగములు.
వాటి ఇరుప్రక్కల ఒకదానిపై ఒకటి ఎన్ని సమాధులు తొలవవచ్చునో అన్ని సమాధులు తొలిసి వాటిలో క్రైస్తవ మృతులను ఉంచి, వాటిని పలుచని బండలతో మూసి, వాటిపైన చక్కని మాటలు వ్రాసిరి. క్రైస్తవులు సమాధానము, సంతోషము, ప్రేమ, నిరీక్షణ అను వాటితో నింపబడి యున్నట్లు ఆ వ్రాతలను బట్టి తెలియును. దేనిమీదనైనను వారు మరణము నొందినట్లు వ్రాయలేదు గాని వారు నిద్రించినట్లును, మరోలోకములో జీవించుచున్నట్లును వ్రాసిరి. ఇది ఆ నాటి క్రైస్తవుల అంతఃకరణము (లేక) మనో భావము లెట్లుండెనో స్పష్టముగా గ్రహించగలము. కొన్ని సమాధి రాళ్ళమీద మాటలకు బదులుగా కొన్ని గురుతులు (లేక) సూచనలను చెక్కిరి. సమాధానమునకు సూచనగా గువ్వరూపమును, నిరీక్షణకు సూచనగా లంగరురూపమును, జయమునకు సూచనగా ఖర్జూరపు మట్టల రూపమును మరియు నిత్యజీవమునకు సూచనగా కిరీటరూపములను చెక్కిరి.
సమాధులన్నిటి మీద వ్రాతలలో దేని మీదనైనను పోప్ యొక్క ప్రధానాధికారమును గూర్చిగాని, కన్యమరియను మ్రొక్కుటను గూర్చిగాని తరువాతి కాలంలో పుట్టుకొచ్చిన క్రైస్తవ్యమును పాడుచేసిన సిద్ధాంతములను గూర్చిగాని వాడుకలను (ఆచారములను) గూర్చిగాని ఏమియు కన్పించవు.
రోమా పట్టణము చుట్టు ప్రక్కల ఏబది నాలుగు ప్రత్యేక సొరంగములు కలవు. ప్రతిదియు భూగర్భమందలి పట్టణమువలె నుండును. ఈ సొరంగముల ఇరుకైన దారులన్నిటిని కొలిచినయెడల 187 మైళ్ళ పొడవని చెప్పిరి. వాటియందు సుమారు 60 లక్షల సమాధులుండెను. హతసాక్షులనేకులు అక్కడ ఉంచబడిరి.
6) మొదటి మూడు శతాబ్దాలలో రచించబడిన క్రైస్తవ గ్రంథములు :
హింసల కాలంలో క్రైస్తవ విద్యా సంబంధమైన పట్టుదల అధికమాయెను. ఆరంభములో అన్ని మతాల పండితులు క్రైస్తవ్యాన్ని అంతగా లక్ష్యపెట్టదగినదిగా ఎంచలేదు గాని క్రైస్తవ్యము త్వరితముగను, నిలకడగను వృద్ధినొందుట అనేక మంది పండితులు, గొప్పవారు దానినవలంభించుట చూచి క్రైస్తవ్యమునకు ప్రతికూలముగా తీక్షణమైన వాదనతోను, అపహాస్యపూరితమైన పదజాలముతో నిండిన గ్రంథములను వ్రాసిరి. ఇట్టివాటిని త్రిప్పికొట్టి, క్రైస్తవ ఉపదేశాన్ని మరింత పదిలపర్చనుద్దేశ్యముతో క్రైస్తవ పండితోత్తములు అనేక శ్రేష్టమైన గ్రంథములు వ్రాసిరి. ఈ క్రైస్తవ గ్రంథములను నాలుగు తరగతులుగా విభజించవచ్చును.
a) క్రైస్తవుల జ్ఞానాభివృద్ధి (లేక) వికాసము కొరకును, సంఘముల యొక్క నేర్పు మరియు ఆదరణలనుద్దేశించి వ్రాసిన గ్రంథములు.
b) సిద్ధాంత నిరూపణలని పిలువబడిన క్రైస్తవ మతాక్షేపణలకు ప్రత్యుత్తరములుగా వ్రాసిన గ్రంథములు క్రైస్తవుల మీద అన్యాయముగను, కార్పణ్యముగను నేరములను మోపుచూ, వారిని హింసించుచున్న కారణాన క్రైస్తవులు నిజదేవుని ఆరాధించువారనియు, నీతి, న్యాయము, నిర్మలత్వము కలిగి జీవించువారనియు, రాజద్రోహులుగాక చక్రవర్తియందు రాజభక్తి గలవారనియు తెలియజేయుటకు ఉద్దేశించినవి ఈ గ్రంథములు.
c) క్రైస్తవ విరోధుల గ్రంథమూలమైన ఆక్షేపణలను ఎదురించు నుద్దేశ్యముతో వ్రాసిన గ్రంథములు. క్రైస్తవ్యాన్ని మిక్కుటముగా ద్వేషించిన కొంతమంది క్రైస్తవ లేఖనాలలో వ్యతిరిక్తభావాలు, అసత్యపు మాటలు ఉన్నట్లు చూపాలని మరియు క్రీస్తు దైవత్వమును, కన్యాజననమును, అద్భుతాలు, పునరుత్థానములను త్రోసిపుచ్చుతూ కఠోరమైన దుర్భాషతో వ్రాయబడిన గ్రంథములకు జవాబుగా వ్రాయబడిన గ్రంథాలివి.
d) అవాంతర మతములను (లేక) వితండ వాదములను (Heresies) ఖండించుటకును, క్రైస్తవ్యాన్ని వివరించి నిరూపించుటకును వ్రాయబడిన గ్రంథములు. వీటిని వ్రాసిన వారిలో ముఖ్యులు ‘ఐరేనియస్’, ‘హిప్పోలైటస్’, ‘టెర్తులియన్’, ‘సిప్రియన్’, అలెగ్జాండ్రియా వాసియైన ‘క్లెమెంటు’ మరియు ‘ఆరిజన్’.
7) ఈ కాలమందు క్రైస్తవ్యానికి విరోధముగా లేచిన వితండ వాదములు :
ఈ వితండవాదములు (లేక) విమతములు సంఘమును తొందర పెట్టి కొన్నింటిని విభజించాయి. అట్టివాటిలో ముఖ్యమైనవి మూడు.
a) ఎబియోనీయులు – వీరు ముఖ్యముగా పాలస్తీను, చిన్నాసియా, కుప్ర ప్రాంతముల యందుండిరి. మోషే ధర్మశాస్త్రమును గొప్పదిగా నెంచి దానిని గైకొనవలెనని సున్నతి, సమస్తాచారములను పాటించనిదే రక్షణ లేదని బోధించిరి. క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరాకరించారు. క్రీస్తుజన్మ స్వాభావికమైనదనిరి. పౌలు స్వమత త్యాగియని, విమతస్థుడని ఎంచి అతని పత్రికలను పూర్తిగా విసర్జించిరి. వీరు యూధయ మతమునకు చెందినవారు.
b) జ్ఞాస్తికులు – వీరు జ్ఞానాతిశయ పూర్ణులు. మనుష్యజ్ఞానాన్ని ఆధారం చేసుకొని ప్రపంచము యొక్క ఉత్పత్తిని, కీడు యొక్క మూలాన్ని మానవాలోచనలకు అందని అనేక సంగతులను వివరించ ప్రయత్నించిరి. పదార్థము కేవలము చెడ్డదని, దేవుడు ఆత్మగనుక ఆయన పరిశుద్ధుడని, అట్టి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకమును సృష్టించలేదని, క్రీస్తు మానవావతారిగా వచ్చుట సాధ్యం కాదని బోధించిరి.
c) మానిఖీయులు – AD 215లో జన్మించిన ‘మాని’ ఈ ఉపదేశాన్ని దేవుని యొద్దనుండి నేరుగా తనకివ్వబడినదని, క్రీస్తు వాగ్దత్త ప్రకారం ‘వచ్చిన సహాయమును నేనే’ అని చెప్పుకొనెను. క్రీస్తు యొక్క దైవత్వమును పూర్తిగా నిరాకరించెను.
8) మూడవ శతాబ్దాంతమందు క్రైస్తవ్యము యొక్క స్థితి :
a) క్రైస్తవ్యము బహు దూర ప్రాంతాలకు వ్యాపించినది. రోమా సైనికులు వెళ్ళలేని స్థలములకు క్రైస్తవ్యం ప్రాకినది. రెండవ శతాబ్దాంతములో ‘టెర్తులియన్’ వ్రాస్తూ, “మేము నిన్న మొన్నటి వారమైనను పట్టణములు, ద్వీపములు, కోటలు, నగరములు, శిబిరములు మావారితో నిండి ఒక్కొక్క పరగణాలోని మా సంఖ్య మీ సైన్యము కంటే ఎక్కువై యున్నదని” చెప్పెను.
b) క్రైస్తవ్యము యొక్క గొప్పతనము మరియు ప్రభావము విస్తరించెను. క్రైస్తవ్యమునందలి సుగుణములను బట్టి లోకములో ఇది బ్రహ్మాండమైన శక్తిగా రూపొందెను.
c) క్రైస్తవ్యము లోకమునకు ఇచ్చిన గొప్ప వర్తమానము : దేవుని దయాళుత్వమును, కనికరమును, పాపవిమోచనమును, నిత్యజీవమును, అమరత్వమును, ఆనందమును గూర్చిన వర్తమానమును మానవజాతికి అందించెను. విసికి వేసారిన జనులకు ఇది గొప్ప ఆదరణను, నిరీక్షణను కలుగజేసెను.
d) క్రైస్తవ్యము లోకమునకు ఉప్పుగా నుండెను : రోమారాజ్యములోని ప్రజల స్థితి జారత్వములు, దుష్టపోకిరితనము, విడాకులు, మానవ ప్రాణాన్ని చులకనగా ఎంచుట, క్రూరమైన బానిసత్వము, నీతిహీనత, లంచముల నాశించుట, అమిత దుర్వ్యయము, రక్తసిక్తమైన వేడుకలు మున్నగు వాటితో బహుగా చెడియుండెను. ఇట్టి భ్రష్టత్వములో నున్న వారిని క్రీస్తు వర్తమానము సజ్జనులనుగా మార్చెను.
నూతన నిబంధన యొక్క ప్రామాణిక గ్రంథముల కూర్పు : అపొస్తలులు గాని వారి సహవాసులు గాని వ్రాసిన గ్రంథములను పురాతన సంఘములు ప్రామాణిక గ్రంథములుగా అంగీకరించిరి. ఇవి దైవావేశము చేత వ్రాయబడెనని, దైవసంకల్పము వలన కలిగినవని, అధికారముతో కూడినవని తలంచిరి. AD 397 లో ‘కార్తేజ్’ పట్టణములో జరిగిన ఆలోచనా సభలో ఈ ప్రామాణిక గ్రంథముల కూర్పును పూర్తి చేసిరి. నేడు మనకు నూతన నిబంధనలో నున్న పుస్తకములు ఆనాడు నిర్ణయించినవే.
E. మూడవ కాలము : ‘కాన్స్టాంటైన్’ ప్రకటన మొదట పోప్ మొదటి ‘గ్రెగొరీ’ (AD 313 నుండి 590). ఇందు క్రైస్తవ్యము రాజకీయమగుట, మత సిద్ధాంత వివాదములు, మహాధ్యక్ష సభలు మరియు పోపుల యొక్క ఆధిపత్యారంభము గూర్చి నేర్చుకొందుము.
1) క్రైస్తవ్యము రోమా చక్రవర్తుల అనుగ్రహములోనికి వచ్చుట : AD 313 లో ‘మహా కాన్స్టాంటైన్’ చక్రవర్తి రాజ్యము తూర్పు భాగమును పాలించు ‘లైసినియస్’ తో కలిసి క్రైస్తవులకు తమదేవుని ఆరాధించుకొనుటకు పూర్ణస్వాతంత్ర్యము నొసంగు ప్రకటనను చేసిరి. దీనినే ‘మిలాన్’ ప్రకటన అంటారు. ఈ ప్రకటన చేయుటకు వెనుక ఉన్న ఉద్దేశ్యాలు – AD 312 లో పరరాజుతో యుద్ధము చేయవెళ్ళుచున్న ‘కాన్స్టాంటైన్’ కు ఆకాశమందు క్రీస్తు సిలువ రూపములో ఒక నిప్పుజ్వాల కన్పించెను. దానిమీద “దీని ద్వారా జయించుము” అను మాటలు వ్రాసియుండెనట. అప్పటినుండి అతడు యుద్ధమునకు పోవునప్పుడెల్లా సిలువ గుర్తుగల జెండాలు పట్టుకొని వెళ్ళెడివాడు. ఈ ప్రకటన స్వలాభాన్నపేక్షించి యుక్తితో చేయబడినదిగా పేర్కొందురు. నలుమూలలకు వ్యాపించుచున్న క్రైస్తవ సంఘము ఐక్యతకు నూతన కేంద్రముగాను, నాగరికతా సంస్కృతులను, రాజ్యాన్ని పరిరక్షించునదిగాను భావించియుండును. మరణసమయము వరకు బాప్తీస్మమును పొందకుండుట, తనకు అడ్డు అని భావించిన మంచి యౌవ్వనులను హత్యగావించుట, రాజ్యసంబంధమైన మతమునకు చెందిన ప్రధానయాజకునిగా కొనసాగించుటకు బట్టి ఇతనిని సంపూర్ణ క్రైస్తవుడు కాదందురు. ‘కాన్స్టాంటైన్’ అనేక విధములుగా దయచూపించెను. రాజ్యసంబంధమైన ఉద్యోగాలలో ప్రధానమైనవి క్రైస్తవులకిచ్చాడు. క్రైస్తవ అధ్యక్షులను దండుసేవ నుండి మినహాయించి, వారి ఆస్తులపై పన్ను లేకుండా చేసెను. క్రైస్తవ ఆలయములకు కట్టుటకు అధిక ద్రవ్యము ఇచ్చాడు. సబ్బాతును గైకొనాలని ఆజ్ఞనిచ్చాడు. మరెన్నో ప్రోత్సాహకాలను ప్రకటించాడు. AD 325 లో తన రాజ్యమందలి జనులు క్రైస్తవ్యాన్ని స్వీకరించాలని హెచ్చరికతో కూడిన ప్రకటనను జారీచేసెను.
250 సం॥లకు పైగా తృణీకారమును, వ్యతిరేకతను, క్రూరమైన హింసలను అనుభవించిన క్రైస్తవులు ఇట్టి సంపూర్ణమత స్వాతంత్ర్య ప్రకటనతో రాజ్యప్రజలందరిలో విశేషానుగ్రహము పొందినట్లాయెను.
2. క్రైస్తవ్యము రాజకీయ మగుట (లేక) రాజ్యముతో ఐక్యమొందుట : రాజ్యమందంతట క్రైస్తవ్యాన్ని ప్రజలు అధిక అభిమానంతో స్వీకరించి, దానిని రాజ్యము యొక్క మతముగా భావించిరి. ‘కాన్స్టాంటైన్’ “తాను సంఘమునకు శిరస్సు” అని ప్రచురము చేసెను. ఇట్టి ఐక్యత వలన కలిగిన మేలుకీడులను గూర్చి ఆలోచిద్దాం.
మేలులు :
- a) సర్వజనులకు సర్వత్రా క్రీస్తును గూర్చిన వార్తను ప్రకటించుటకు క్రైస్తవులకు పూర్ణ స్వేచ్ఛ కలిగింది.
- b) అనేక ఆలయములు కట్టుకొనుటకు ఎట్టి అవరోధములు లేకుండా ఇతర క్రైస్తవ కార్యములను నిర్భయముగా కొనసాగించుటకు అవకాశమేర్పడినది.
- c) క్రైస్తవ్యము యొక్క ప్రోత్సాహం వలన రాజ్యమందు జరుగు అతి దుర్మార్గ కార్యములను నిలిపివేయబడెను. అవేమనిన బానిసత్వము వలన కలిగిన అన్యాయములు, నాటకశాలలందు జరుగు బహుక్రూరమైన ఆటలు నిలిపివేయబడెను. వివాహబంధమును ఘనమైనదిగా ఎంచినందున పరిత్యాగములు (విడాకులు) తగ్గెను. వ్యభిచారములకు పాల్పడిన వారిని కఠినముగా శిక్షించిరి.
కీడులు :
- a) [లేమి] కంటే కలిమి తరుచుగా విశేష హాని కలిగించునని ఎరుగుదుము. దేవునియందెడతెగని విశ్వాసము కలిగియుండుట కష్టతరము.
- b) మారుమనస్సు పొందని వారనేకులు గుంపులు గుంపులుగా సంఘములో ప్రవేశించిరి. వారు క్రైస్తవ్యాన్ని లౌకికమైనదిగా చేసి చెరిపిరి. క్రైస్తవులగుట ఒక వాడుకాయెను.
- c) క్రైస్తవులలో గర్వము, ధనాపేక్ష విశేషముగా హెచ్చెను. ప్రస్తుత దుష్టలోకమును తమకు శత్రువుగా కాక మిత్రునిగా నెంచిరి. తద్వారా క్రైస్తవులలో ఆత్మీయత లోపించెను.
- d) శాశ్వతుడు, సర్వాధికారియైన దేవుని మీద ఆనుకొనుట కంటే ఎక్కువగా చక్రవర్తి మీద ఆనుకొనుట, దేవుని మెప్పు కంటే రాజుల మెప్పును వెదకుట, క్రైస్తవులకు శోధనలై నిలిచెను.
- e) క్రీస్తు రాజ్యము కొరకు ఎదురు చూచే క్రైస్తవులు ఇప్పుడు వారికి కలిగిన ఘనమును (లేక) స్వేచ్ఛను బట్టి ఇది క్రీస్తు రాజ్యము వచ్చుటయే అని అనేకులు నమ్మిరి.
- f) సంఘము తన ఇచ్చలను నెరవేర్చుకొనుటకు ఐహికబలమును ఉపయోగించు కొనునంతటి ఉన్నత స్థితికి ఎదిగెను. అధికార బలములు హెచ్చుకొలది సంఘాధికారులు హింసకులై జనులను నిర్బంధ పెట్టిరి.
- g) సంఘ విషయములలో చక్రవర్తి జోక్యమధికమాయెను. ముఖ్యస్థానములందు బిషప్పులను నియమించుట, సంఘ సంబంధమైన వ్యవహారములను విచారించి తీర్మానించుట, ఆలోచనా సభలను ఏర్పరచి సిద్ధాంతపరమైన విషయాలను తీర్మానించుటలో చక్రవర్తి సర్వాధికారమును వహించెను. వాస్తవానికి సంఘస్వతంత్రతకు భంగమేర్పడెను.
3) క్రైస్తవమత సిద్ధాంత వివాదములు : కాలక్రమమున క్రైస్తవ పండితుల వ్రాతలు అధికమైన కొలదీ క్రైస్తవ ఉపదేశములలోని క్రీస్తు మానవావతారము, ఆయన స్వభావము, త్రిత్వము మొదలగు వాటిని వివరించి భావము చెప్పుటకు ప్రయత్నించిరి. ఈ ప్రయత్నములు వెవ్వేరు అభిప్రాయములను పుట్టించిన కారణాన గొప్ప వివాదములు చెలరేగి సంఘములందంతట అధిక కలవరము ఏర్పడెను. వాటిని క్రమపరచుటకు అనేక మహాధ్యక్షసభలను ఏర్పాటుచేసిరి. క్రైస్తవ నమ్మికకు గొప్పహాని కలిగించిన ముఖ్య వివాదములను చూద్దాము.
- a) ఏరియన్ వివాదము : AD 318 లో ‘ఏరియస్’ (అలెగ్జాండ్రియా సంఘాధ్యక్షుడు) క్రీస్తుకు దైవత్వమును, నిత్యత్వమును లేవని, దేవుని కుమారుడు సృష్టింపబడిన వాడని, తండ్రి కేవలము వేరైన వాడని ప్రకటింప నారంభించెను. ఈ అభిప్రాయమును అనేక స్థలములందు క్రైస్తవ విద్యావంతులు బలముగా ఎదిరించినందున వాదము తీక్షణమై అంతట వ్యాపించెను. దీన్ని బట్టి ‘కాన్స్టాంటైన్’ బహుగా దుఃఖించి, వివాదములను తీర్చుకొని సమాధానముతో జీవించుడని ముఖ్యాధ్యక్షులకు [లేఖ] వ్రాసెను గాని ఫలితము లేకపోయెను. అందును బట్టి గొప్ప సభను ‘నైసియా’ పట్టణములో AD 325 లో ఏర్పరచెను. ఇందు ‘ఏరియన్’ బోధను తీవ్రముగా ఖండించినవాడు ‘అతనేషియస్’. ఇందు ప్రసిద్ధమైన విశ్వాస ప్రమాణమును రచించి సభాధ్యక్షులందరు స్థిరపరచిరి.
b) నెస్టోరియన్ వివాదము : క్రీస్తునందలి దైవత్వము, మానవత్వము అను రెండు స్వభావములు వెవ్వేరుగా నున్నవి. అయినను అవి పూర్ణముగా పరస్పర సంబంధము కలిగియుండెనని ‘కాన్స్టాంట్ నోపుల్’ సంఘపితరుడైన ‘నెస్టోరియస్’ నమ్మి ప్రకటించెను. ఎఫెసు పట్టణములో AD 431 లో సమకూర్చబడిన మహాధ్యక్షసభ ఈ [బోధను] ఖండించెను. గాని ‘నెస్టోరియస్’ బోధ సిరియా మరియు ఆసియా ఖండములోని అనేక దేశాలలో నేటికిని వ్యాపించియున్నది. మన దేశంలోని ‘మలబార్’ ప్రాంతమందున్న సిరియన్ క్రైస్తవులు నెస్టోరియస్ మతస్థులే.
c) యూటికియన్ వివాదము : క్రీస్తు మానవావతార మెత్తుట వలన ఆయనయందు దైవమానవ స్వభావములు సంపూర్ణముగా ఒకదానికొకటి లీనమైపోయెననియు, అందువలన ఆయనలో ఒక స్వభావము కలదనియు, క్రీస్తు శరీరము నిజముగా మానవ శరీరము కాదనియు AD 448 లో ‘యూటికెస్’ ప్రకటించెను. ఈ [బోధ] రాజ్యమందంతటను విశేష వాగ్వాదము రేపినందున AD 451 లో ‘చాల్cedon’ (చాల్సిడాన్) లో జరిగిన మహాధ్యక్షసభ ఈ బోధను నిషేధించెను.
d) ఫిలేజియన్ వివాదము : ఆదాము యొక్క అతిక్రమములోను, పతనములోను మనుష్యులందరు భాగస్తులు కారని, మనుష్యులు స్వయముగా చేయు అతి క్రమములే పాపములనియు, పరిశుద్ధత నొందుటకు స్వాభావిక మానవచిత్తము చాలునని, దైవకృప అగత్యము లేదని AD 400 లో బ్రిటీష్ సన్యాసియైన ‘పిలేజియస్’ బోధించెను. ‘పిలేజియస్’ బోధను ఎదిరించిన ముఖ్య ప్రతివాది ‘అగస్టీన్’ భక్తుడు. మనుష్యులు పాపస్వభావముతో జన్మించారని దేవుడు బుద్ధిపుట్టింపని యెడల వారు పరిశుద్ధతను వెదకి వెంబడింపలేరని, దేవుని కృపయే మనుష్యుల రక్షణకు ముఖ్యకారణమని స్పష్టముగా ఇతడు నిరూపించెను. మనుష్యులు తమంతటతాము దుర్నీతిని వెంబడింతురుగాని సునీతిని వెదకరు. పాపులను పశ్చాత్తాపమునకు, విశ్వాసమునకు నడిపించుటకు దైవకృప అత్యవసరమని ‘అగస్టీన్’ తన స్వానుభవము నుండి చెప్పెను.
4) కొద్దిగానో (లేక) గొప్పగానో క్రైస్తవ్యముపై ప్రభావము చూపిన రాజకీయ సంఘటనలు :
a) ‘కాన్స్టాంట్నోపుల్’ ను తూర్పు రాజ్య రాజధానిగా చేయుట: రోమా సామ్రాజ్యము తూర్పుననున్న ఐగుప్తు, చిన్నాసియా, సిరియా, మెసపుటోమియా, పర్షియా వరకు బహుగా వ్యాపించెను. రాజధానియైన రోమానుండి వీటితో (పై దేశాలతో) రాజ్యవ్యవహారములను నెరపుట కష్టతరముగా నుండెను. ఆ కారణాన సామ్రాజ్యాన్ని రెండుగా విభాగించి తూర్పు భాగానికి AD 330 లో కాన్స్టాంట్నోపుల్ ను ముఖ్యపట్టణముగా ఏర్పరచిరి. AD 1453 లో ‘టర్కీ’ వారు దీన్ని జయించి తమ రాజ్యానికి ముఖ్యస్థానముగా చేసుకొనిరి.
b) మతభ్రష్టుడైన ‘జూలియన్’ చక్రవర్తి : AD 337 లో కాన్స్టాంటైన్ మరణించాడు. అతని మేనల్లుడైన ‘జూలియన్’ AD 361 లో చక్రవర్తి అయ్యాడు. ఇతడు క్రైస్తవ విరోధి. విగ్రహారాధన సంబంధమైన అన్నిమతములను పునురుజ్జీవింపచేయ అన్నివిధముల సమకట్టెను. క్రైస్తవ్యాన్ని దూషించుతు, విమర్శించుచు గ్రంథములను వ్రాసెను. క్రైస్తవ్యాన్ని బొత్తిగా నిర్మూలించ పట్టుపట్టి (పాడుబడిన యెరూషలేము దేవాలయమును కట్ట యూధులకు పురుకొల్పెను) రెండు సం॥ల కంటే తక్కువుగా రాజ్యము చేసిన జూలియన్ పారసీకులతో యుద్ధము చేయుచు (గాయమొంది మరణించెను) మరణిస్తూ, “ఓ గలిలయుడా! నీవే గెలిచితివి” అని పలికి తుదిశ్వాస విడిచినట్లు చరిత్రకారులు పేర్కొనిరి. క్రైస్తవ్యమును అణగద్రొక్కుటకును, అన్యమతాలను పునరుద్ధరించుటకును అతడు చేసిన ప్రయత్నములన్నియు అతనితోనే అంతరించెను.
c) రోమారాజ్యము యొక్క ఉత్తర సరిహద్దునకు ఆవలనున్న మోటు తెగలవారు (Barbarians) దండెత్తి రాజ్యమును ఆక్రమించుట : ఇప్పటి రష్యా, జర్మనీ, స్కాండినేవియా దేశములందు రోమీయులచే ‘బార్బేరియన్స్’ అని పిలువబడిన బలిష్టులైన తెగలవారు అప్పుడు నివసించుచుండిరి. వీరిలో ముఖ్యులు గోథీయులు, ఫ్రాంక్లు, హన్స్, లాంబార్డు, వాండల్స్. వీరు బహుధైర్యస్తులును, దేహదారుఢ్యము గలవారును, యుద్ధశూరులైయుండి విశేష స్వేచ్ఛాభిలాష, ఉత్సుకత గలవారు. వీరు గ్రీసు, ఇటలీ, స్పెయిన్, మధ్యధరా సముద్రమునకు ఆవలనున్న ఉత్తరాఫ్రికాలను ఆక్రమించుకొనిరి. వీరు పలుమార్లు దండెత్తి కొల్లపెట్టిన కారణాన, అమిత డంబము, మితిమీరిన సుఖభోగముల వలనను లోకమునకు రాణిగా పిలువబడిన రోమా పట్టణము AD 476 లో గోథీయుల వశమై పశ్చిమరాజ్యము అంతమాయెను. తూర్పురాజ్యము మరికొన్నివందల సంవత్సరముల వరకు నిలిచియుండెను.
5) క్రైస్తవ్యము మరింత దూరముగను, విస్తారముగను వ్యాపించుట : రోమాసామ్రాజ్యపు సరిహద్దులకు ఆవలినున్న జనములు, జనాంగముల మధ్యకు సువార్త చొచ్చుకొనిపోయెను. బార్బేరియన్ల మధ్యకు కూడా ఇది వ్యాపించి వారికి జ్ఞాన, నాగరికతోదయమును కలిగించెను. ఆయా దేశాలలో, జనాంగాలలో సువార్తభేరి మ్రోగిన తీరును పరిశీలిద్దాం. AD 300 సం॥లో ‘ఆర్మేనియా దేశమంతయూ గ్రెగొరిది ఇల్ల్యూమినేటర్’ పరిచర్యాఫలితముగా ప్రభువు వైపు త్రిప్పబడెను. ఇది ప్రపంచములోని మొట్టమొదటి క్రైస్తవ దేశము. AD 410 నాటికి 25 లక్షలమంది ప్రభువు కొరకు పట్టబడిరి. క్రొత్త నిబంధన ఆర్మేనియా భాషలోనికి కూడా తర్జుమా చేయబడింది.
‘ఫ్రుమెంటియస్’ (AD 300-380) ఇతియోపియాలో సువార్తను ప్రకటించెను.
మొదటి శతాబ్దంలోనే క్రీస్తువార్త బ్రిటన్ (ఇంగ్లాండ్) దేశమునకు చేరినట్లు సంఘ చరిత్రకారులు తెలియజేసిరి. హతసాక్షియైనపుడు అరిమతయియ యోసేపు పాలస్తీను నుండి ఇంగ్లాండ్కు పారిపోయి సువార్తను ప్రకటించి, AD 63 లో పెద్ద చర్చి కట్టించెను. రోమునుండి ఇంగ్లాండ్కు అనేక మంది సైనికులు, అధికారులు, వ్యాపారస్థులు వచ్చుచు పోవుచునుండిరి. వారిలో చాలమంది క్రైస్తవులైయుందురు. ఆరంభకాలమందలి బ్రిటీష్ క్రైస్తవులు (a) లేఖనములను శ్రద్ధగా చదువుట యందును, దానికొరకు అనేక గొప్పపాఠశాలలను స్థాపించిరి. ఈ పాఠశాలలకు యూరప్ లోని అనేక దేశముల నుండి విద్యార్థులు వచ్చేవారు. (b) విదేశములలో సువార్తను ప్రకటించుటయందు విశేషాసక్తి చూపిరి. సంఘ చరిత్రకారుడగు న్యూమన్ ‘ఏ దేశమందేగాని, ఏ కాలమందేగాని విదేశములకు సువార్తను పంపు విషయములలో బ్రిటీషువారి కున్నంత చురుకుదనముగాని, కొనసాగించు పట్టుదలగాని మరెక్కడను కనబడ’ దనెను. AD 449 లో అన్యజాతుల వారు ముఖ్యముగా ఆంగల్స్, సేక్సన్స్, జూట్స్ ఇంగ్లాండ్పై దండెత్తి వచ్చి, బాధించి, హింసించి, ఎక్కువమందిని హతమార్చిరి. మిగిలివున్న క్రైస్తవులను ‘వేల్స్’ దేశపర్వతములలోనికి తరిమిరి.
‘ఐర్లాండ్’ ద్వీపానికి ‘పాట్రిక్’ అను ప్రసిద్ధికెక్కిన మిషనరీ బహుప్రయాసపడి AD 405 నుండి సువార్త ప్రకటించెను. అన్ని తరగతులవారిని చేరి, సంఘమును స్థాపించి, సువార్త సేవకులను అభిషేకించి, క్రైస్తవ పాఠశాలలను స్థాపించెను. అనేక తొందరలు, హింసలు కలిగినను ఏ మాత్రం వెనుతీయక పనిని కొనసాగించి గొప్ప ఫలితాన్ని చూచెను. పాట్రిక్ ను ‘ఐర్లాండ్కు అపొస్తలుడు’ అని పిలిచిరి.
AD 563 లో ఐర్లాండ్ వాసియైన ‘కొల్లంబా’ తనవలె ఇతరులను క్రీస్తు శిష్యులనుగా చేయ గొప్ప ఆశకలిగిన 12 మంది స్నేహితులతో ‘స్కాట్లాండ్’ కు వెళ్ళి సన్యాసుల మఠమును స్థాపించెను. ఈ ‘కెల్టిక్’ మఠమునందు విశేష దైవభక్తి నలవర్చుకొని వాక్యమును అధ్యయనం చేసినవారు స్కాట్లాండ్లోని వివిధ భాగములకు, సమీప ద్వీపములకు, ఇతర దేశములకు వెళ్ళి, తాము వెళ్ళిన ప్రతిస్థలములో సువార్త అగ్నిని రగులుకొల్పిరి.
‘ఉల్పిలాస్’ (310-380) గోథీయుల మధ్య గొప్ప సువార్త పనిని చేసెను. ఇతడు గ్రీకుల పాండిత్యాన్ని, గోథీయుల భాషను ఎరిగినవాడు. గోథీయుల పట్ల గాఢమైన ప్రేమను కలిగినవాడు. ఆయన నూతన నిబంధన అంతయు పాత నిబంధనలోని చాలా భాగములను గోతీయుల భాషలోనికి తర్జుమాచేసెను. విచారమేమనగా ఇతడు ఏరియస్ ప్రకటించిన దురుపదేశములను గోథీయులకు అవలంభింపజేసెను. తర్వాత కాలంలో ప్రామాణికమైన (లేక) ‘అతనేషియస్’ స్థిరపరచిన నమ్మికననుసరించిన రాజ్యములోని జనాంగములతో గోథీయులు పోరాడినప్పుడు గొప్ప కలహములకిదే కారణమాయెను.
AD 496 లో ఫ్రాంక్లు (ప్రస్తుతం ఫ్రాన్స్) క్రైస్తవ్యము వైపునకు ఆకర్షింపబడిరి.
AD 52 లో క్రీస్తు శిష్యులలో ఒకడైన ‘తోమా’ భారతదేశములోని కేరళ రాష్ట్రమందలి ‘మలబారు’ తీరంలో మొట్టమొదటిగా క్రీస్తువార్తను ప్రకటించెను. అగ్రజాతీయులనేకమంది ప్రభువు నంగీకరించిరి. వీరిని సిరియన్ క్రైస్తవులుగా పిలిచిరి. కొచ్చిన్ పట్టణములో క్రైస్తవులైన యూదుల కాలని, సమాజమందిరము ఉండెను. అప్పటినుండి క్రైస్తవ్యము పలుప్రాంతాలలో వ్యాపించెను.
6) పోపుల అధికారము ఆరంభమై అభివృద్ధి నొందుట : సంవత్సరములు గతించుచుండగా రోమాసామ్రాజ్య మంతటను క్రైస్తవ సంఘములు విస్తరించి సంఖ్యయందును, సామర్థ్యమందును హెచ్చినకొలది క్రైస్తవ్యమునకు ముఖ్యస్థానము లేర్పడెను. అవి : యెరూషలేము, అంతియొకయ, రోమా, అలెగ్జాండ్రియా, కాన్స్టాంట్నోపుల్. ఈ పట్టణములందుండు సంఘాధ్యక్షులలో ఎవడు గొప్ప వాడను ప్రశ్న ఆరంభమాయెను (లూకా 22:24-26; మత్త. 23:10-12). ప్రాధాన్యము నిమిత్తమైన ఈ పోరాటము ముఖ్యముగా రోమా, కాన్స్టాంట్నోపుల్ అధ్యక్షులకు కలిగెను.
రోమాలోని సంఘాధ్యక్షుని ఆధిపత్యాన్ని చూపుటకైన హేతువులు :
a) క్రీస్తు సంఘమునకు ఈ భూమిమీద ఒక దృశ్యమైన శిరస్సు ఉండవలయునను నమ్మకము. లోకంలో గొప్పదియు లోకమునకు రాణిగా ప్రసిద్ధి చెందినదియునైన ముఖ్య పట్టణమునందుండు అతి పెద్దదైన, విశేషాధికారము కలిగిన సంఘమునకు అధ్యక్షునిగా నుండినవాని కంటే ఎవడు ఘనమైన ఆ స్థానమును వహించగలడు?
b) రోమాపట్టణములోని సంఘమును పేతురు స్థాపించెననియు, ఆయన దానికి మొదటి బిషప్పు అనియు రెండవ శతాబ్ద మధ్యనుండి తలంచిరి. దీన్ని బట్టి పేతురు వారసులే ఇతరపట్టణ సంఘాధ్యక్షుల కంటే పైవారై యుండాలనేది వాదన.
ఈ వాదనలకు ప్రత్యుత్తరములు :
a) సంఘమునకు ఐహిక ప్రధానత్వము క్రొత్తనిబంధన ప్రకారము అంగీకారమైనది కాదు.
b) ఏ బండమీద క్రీస్తు తన సంఘమును కట్టుదునని సెలవిచ్చెనో ఆ బండ పేతురు కాదు, నరుడు ఏలాగున క్రీస్తు సంఘమునకు ఆధారభూతుడై యుండగలడు?
c) రోమా పట్టణములోని సంఘము పేతురు స్థాపించి దానికి మొదటి బిషప్పుగా నుండెననుటకు వాస్తవమైన [ఆధారము లేదు].
d) ఆత్మీయ అధికారాన్ని మరొకరికి బదిలీ చేయుటకు మనుష్యునికి ఆస్కారమెక్కడిది?
e) క్రీస్తురాజ్యము ఈ లోక సంబంధమైనది కానందున ఆయన దృష్టిలో రోమాపట్టణము ఇతరమైన వాటికంటే గొప్పదైయుండ నేరదు. ఒక వేళ దేవుడు ఒక పట్టణమును ఏర్పరచుకొంటే అది యెరూషలేము అయ్యుండవలెను గాని రోమా పట్టణ మెట్లయ్యుండును?
మూడవ కాలమందు పోపుల అధికారమును ఉన్నత స్థితికి తేబూనిన వారిలో మిక్కిలి సమర్థులైన వారు AD 440 -461 వరకు రోములో బిషప్పుగా నుండిన ‘మొదటి లియో’, AD 590-604 వరకు బిషప్పుగా నుండిన ‘మొదటి [గ్రెగొరీ]’.
7) ఈ కాలమందు ఆరంభమై విస్తరించిన కొన్ని దురుపదేశాలు :
a) బాప్తీస్మము గూర్చి : బాప్తీస్మము ఆరంభములో ముంచడమే. కొన్ని స్థలాల్లో ముమ్మారు ముంచుట వాడుకను ఆచరించిరి. రెండవ శతాబ్దపు మధ్యలో చిన్న బిడ్డలకు బాప్తీస్మమిచ్చుట ఆరంభమయ్యెను. అది సాధారణ వాడుకగా పరిణమించెను. బాప్తీస్మము పాపములను కడిగివేయునను నమ్మకమును ప్రజలలో కలిగించిరి. బాప్తీస్మము లేనిదే రక్షణ లేదని బోధించిరి. బాప్తీస్మము పొందిన తర్వాత చేసే పాపములకు క్షమాపణ లేదని బోధించిన కారణాన అనేకులు మరణము సమీపించువరకు బాప్తీస్మము పొందకుండిరి. రోగులు మంచము మీదనే క్రీస్తును విశ్వసిస్తే, క్రమమైన బాప్తీస్మంనకు బదులుగా అట్టి సమయమందు నీళ్ళు క్రుమ్మరించిరి.
b) ప్రభురాత్రి భోజనమును గూర్చి : ప్రభుభోజనమునకు రక్షించు మర్మమైన శక్తిగలదనియు, అది అర్పణ అనియు, దానినుంచు బల్ల బలిపీఠమనియు, దానిని పంచి పెట్టు బోధకుడు అర్చకుడనియు బోధించిరి. రొట్టెయును, ద్రాక్షారసమును యాజకుడు పలుకు మాటలవలన నిజముగా క్రీస్తు రక్తమాంసములుగా మార్చబడునని నేర్పించిరి. (Transubstantiation). ప్రభుభోజనము అర్పణము కాదుగాని నిజమైన అర్పణను జ్ఞాపకము చేసుకొనుటకైన ఆచారమైయున్నది.
c) పర్గెటరి (Purgatory) : ఇహ పరలోకములకు మధ్యన ‘పర్గెటరి’ అను స్థలమొకటి ఉన్నదని నమ్మిరి. క్రైస్తవులలో అతిపరిశుద్ధులు తప్ప మిగిలినవారు చనిపోయిన వెంటనే పరలోకమునకు వెళ్ళక తమతమ అయోగ్యతలకు తగినట్టు అగ్నిచేత పాపమును, కల్మషమంతటినుండి పరిశుద్ధపర్చబడు నిమిత్తము పర్గెటరికి వెళ్ళుదురని, అక్కడ వారివారి అపాత్రతలకు తగినట్టు కాలము గడిపిన పిమ్మట పరలోకమునకు చేరుదురని జనులకు బోధించిరి. క్రీస్తు రక్తము తప్ప పాపములను కడిగి వేయునదేదియు లేదని దేవుని వాక్యము బోధించుచున్నది.
d) చనిపోయిన వారికొరకు ప్రార్థనలు : పర్గెటరిని గూర్చిన నమ్మకము ఈ వాడుకకు దారితీసెను. చనిపోయిన వారికొరకు గురువులు ప్రార్థించుట వలన వారు పర్గెటరి నుండి త్వరగా విడుదల పొంది పరలోకమునకు చేరుదురని ఊహించిరి.
e) చనిపోయిన పరిశుద్ధులను ప్రార్థించుట (Invocation of Saints): వీరెవరనగా అపొస్తలులు, హతసాక్షులు, శ్రేష్టులనబడిన బిషప్పులు, మిషనరీలు, సన్యాసులు. ఆరంభములో వీరిని జ్ఞాపకము చేసుకొనుటకై సం॥రమునకు ఒకసారి క్రైస్తవులు సమావేశ మయ్యెడివారు. అయితే కాలక్రమమున మనుష్యులకును, దేవునికిని వారు మధ్యవర్తులని నమ్మి…
f) యేసు తల్లియైన మరియను పూజించుట : మరియ పాపస్వభావము ఏ మాత్రము లేకుండా జన్మించెననియు, ఏ పాపము చేయలేదనియు చెప్పిరి. చివరకు ఆమెను క్రీస్తుకును, మనుష్యులకును మధ్యవర్తినిగా భావించుకొని తమ నిమిత్తము ఆమె క్రీస్తును వేడుకొనునట్లు ఆమెను ప్రార్థించనారంభించిరి.
g) ప్రతిమలను వాడుక చేయుట : క్రమక్రమముగా క్రీస్తు, అపొస్తలులు, పరిశుద్ధుల యొక్క ప్రతిమలను నిలిపి, ఆరాధించిరి.
h) మరణించిన శ్రేష్టుల వస్తువులను పూజించుట (Veneration of Relics) : పరిశుద్ధులు, హతసాక్షులు ఉపయోగించిన వస్తువులను, వారి వారి అవశేషాలను మిగుల ఘనముగా ఎంచి, వాటిని భద్రముచేసి, పూజించిరి.
i) గురువులు అవివాహితులుగా నుండుట (Celibacy of the Clergy) : గురువులు అవివాహితులుగా నుండుటలో విశేషమైన పరిశుద్ధత కలదని వారు సామాన్య క్రైస్తవుల కంటే ఎక్కువ పరిశుద్ధులై యుండవలెనని ఎంచి వివాహము చేసుకొనకూడదనే ఏర్పాటును చేసిరి.
ఈ దురుపదేశములను ఖండించుచు ప్రతి కాలమందును, ప్రతి స్థలమందును అనేకులు గ్రంథ మూలముగను, వాఙ్ముఖముగను మిగుల ఆసక్తితో పోరాటము సల్పిరి. వీరే ఆ కాలమందుండిన ‘ప్రొటెస్టాంటు’ లనవచ్చును.
8) క్రైస్తవ సన్యాసము (Monasticism) :
a) సన్యాసత్వము యొక్క ముఖ్య ఉద్దేశ్యము : ఏ దేశమందైనను, ఏ కాలమందైనను, ఏ మతమందైనను సన్యాసత్వము యొక్క ఉద్దేశ్యము మనుష్యుడు తన అనుదిన వ్యాపార వ్యవహారములను చాలించి, మనుష్యనివాసములను విడచి, ఏదో ఒక ఏకాంత స్థలమునకేగి, అక్కడ ఉపవాసముండి ప్రార్థించుచు తన దేహమును కృషింపజేసుకొనుట వలన విశేష పరిశుద్ధతను సాధించవచ్చునను నదియే. ఇది కేవలము తప్పు. కారణం పాపము మానవుని హృదయములోనున్నది. లోకుల సహవాసము విడచి ఏకాంతవాసం చేసినను, అరణ్యమందలి ఏ గుహలో దాగినను తన హృదయమును తనవెంట తీసుకొని పోవుచున్నాడు. శోధకుడగు సాతాను ఎక్కడనున్నను అక్కడకు వచ్చును.
b) క్రైస్తవ సన్యాసత్వము యొక్క ఆరంభము మరియు అభివృద్ధి : క్రైస్తవ సన్యాసత్వము మొట్టమొదట ఐగుప్తునందు ఆరంభమాయెను. అచ్చటనుండి తూర్పుననున్న పాలస్తీను, సిరియా, మెసపుటోమియా దేశముల యందు బహుగా వ్యాపించెను. తదుపరి పశ్చిమ దేశాలకు ప్రాకెను. నాలుగవ శతాబ్దమందు సన్యాసి బ్రతుకు బ్రతకవలెనను ఆశ అనేకులలో పుట్టి సంఘములో ఇది ముఖ్యమైన వాడుకయ్యెను.
మొదట్లో సన్యాసులలో ప్రతివాడు తనకిష్టము వచ్చిన ఏదో ఒక స్థలములో చేరి తన ఇష్ట ప్రకారముగా ఒంటరిగా జీవించెను. వారిపై అధికారులు లేరు. చేయవలసిన అధికార పద్ధతులు లేవు. గాని అనతికాలంలోనే ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో సన్యాసులు సమూహములుగా నేర్పడిరి. ఒక సమూహము ఒక స్థలము నేర్పరచుకొని, అచ్చట నివసిస్తూ తమలో ఒకనిని అధికారిగా నియమించి వారందరు పరస్పర సంబంధము కలిగి ఆయా చట్టములకు బద్ధులై జీవించిరి. ఇటువంటి సన్యాసి సమూహములు (లేక) గురుమఠములు క్రైస్తవ్యము వ్యాపించిన అన్ని దేశములయందు ప్రబలమాయెను. సన్యాసులలో అనేకులు సంఘకార్యములను జరిగించుట యందును, క్రైస్తవ్యాన్ని వ్యాపింపజేయుట యందును చాలా కీర్తిని గడించిరి.
పురుషులలోనేగాక స్త్రీలలోను అనేకులు సన్యాసులైరి. వీరు ప్రత్యేక మఠములుగా ఏర్పడిరి. ఇటువంటి బ్రతుకు బహుమెచ్చదగినదని ఎంచి రాజులు, రాణులు సహితము తమ రాజ్యమును, ఘనమును విడిచి సన్యాసులైరి. మధ్యకాలమందు సన్యాసత్వము ఉన్నత దశకెక్కెను. ప్రస్తుత కాలమందు అది నానాకీడులకు మూలమైయున్నందున అనేక దేశముల యందు దీనిని తూలనాడిరి.
c) సన్యాసుల జీవన విధానము, వారి పద్ధతులు : సన్యాసులగు వారు మూడుముఖ్య విషయములను ఒప్పుకొనవలెను. వాటి ప్రకారము చేయుదుమని ప్రమాణము చేయవలెను. అవేమనగా (1) ఏ సొత్తును స్వంతమనుకొనకూడదు. (2) పెండ్లాడకూడదు. (3) పై అధికారులు, ఆజ్ఞలకు పూర్ణవిధేయతతో లోబడవలెను.
సన్యాసమును క్రమపరచి, స్థిరపరచిన వారిలో మిక్కిలి ప్రసిద్ధుడు ‘బెనిడిక్ట్’ (Benedict). సన్యాసులకు సోమరితనం మిక్కిలి హానికరమని తెలుసుకొని వారందరు పాటుపడవలెనని ఆయన స్థిరమైన ఆజ్ఞనిచ్చెను. పద్ధతుల ప్రకారము వారు యావత్తుపనులను నిర్ణయింపబడిన కాలమందే చేయవలెను. ఉదయమందు లేచుట, ప్రార్థించుట, చదువుట, భోంచేయుట, పొలంలో పని చేయుట, రాత్రులందు పరుండుట. దాదాపు అన్ని గురుమఠముల యందును వ్రాతపని కొరకై ఒక గదియుండెడిది. సన్యాసులు ప్రతి దినము కొంత సమయము ఆయా గ్రంథప్రతులు వ్రాయుచుండవలెను.
d) సన్యాసమందలి మేలులు :
i) గ్రంథములు రచించుట, ప్రతులు వ్రాయుట : అంధకార కాలములో (AD 500-1000) గురు మఠముల యందే శాస్త్రవిద్య కాపాడబడెను. లాటిన్, గ్రీకు మొదలగు ఆదిమ భాషలలోని పురాతన గ్రంథములకు అనేక ప్రతులు వ్రాసి భద్రము చేసిరి. సన్యాసులలో అనేకులు విద్యావంతులైయుండి తామే గ్రంథములను రచించిరి. ముఖ్యమైన గ్రంథములను భాషాంతరము చేసిరి. ఉదా : ‘జెరోమ్’. బెత్లహేములో ఒక గుహలో చాలా సంవత్సరములు నివసించి బైబిలును లాటిన్ భాషలోనికి భాషాంతరము చేసెను. దీనినే ‘వల్గేట్’ అని పిలిచిరి.
ii) సువార్త వ్యాపకములో కృషి సల్పుట : అన్యదేశముల యందు సత్యసువార్తను విస్తారముగా ప్రకటించిరి. గోథీయులు, ఫ్రాంక్లు మున్నగు వారి మధ్యకు, ఇంగ్లాండ్ మరియు జర్మనీ మున్నగు దేశములలోనికి మొట్టమొదట పంపబడిన మిషనరీలు సన్యాసులే. వీరు మిక్కిలి భక్తి తాత్పర్యము కలిగి, పనియందు మిక్కిలి ఆసక్తిగలవారై ఎన్ని అపాయములు కలిగినను నిలబడి ప్రకటించిరి.
iii) ఆతిధ్యము : బాటసారులకు అన్నపానాదులిచ్చి పరామర్శించుట, సన్యాసులకు మిక్కిలి ఇష్టమైన కార్యమైయుండెను.
e) సన్యాసమందలి కీడులు :
i) సన్యాసము యొక్క ముఖ్యోద్దేశ్యమే మంచిది కాదు. ఏకాంతము పరిశుద్ధతకు మార్గముకాదు. స్వహింస నీతిని కలిగించక అతిశయమును అధికము చేయును. లోకమునకు మేలు చేయుటకు లోకములో నుండుట అగత్యము. చెడకుండా కాపాడబడవలసిన వస్తువుతో ఉప్పుచేరి ఉండవలెను. వేరుగా వెళ్ళివుండుట సాధారణ క్రైస్తవులకును, సన్యాసులకును మధ్య అస్వాభావిక భేదమును కలిగించెను.
ii) కుటుంబ జీవితమునుండి, ప్రజల సహవాసము నుండి అస్వాభావికముగా వేరుపడుట అతివిస్తారమైన అపకీర్తిని తెచ్చు అనీతి కార్యములకు పలుమార్లు నడిపించెను. అందుకేగదా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని దేవుడు సెలవిచ్చినది!
iii) అనేక దేశములందు అధికారులు ఏమాత్రం సహింపలేనంతగా సన్యాసుల సమాజములు రాజు కార్యములలో విశేషముగా ప్రవేశించిరి. ఉదా : ‘జెసూట్స్’ (Jesuits) ఎప్పుడు రోమన్ కేథలిక్ సంఘ పక్షాన రాజ్యాధిపతులను త్రిప్పయత్నించిరి. ఇది సహింపవీలుకాని దైనందున ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ దేశములు తమలోనున్న సన్యాసుల మఠములను, పాఠశాలలను మూసివేసి, సన్యాసులను ఇతర దేశములకు పారదోలిరి.
సంఘ పితరులు (Church Fathers) :
ఈ కాలమందు విద్యాప్రవీణులైన వేదపండితులు, బోధకులు అనేకులు లేచిరి. వారిలో చాలమంది గ్రంథములు వ్రాసి ప్రసిద్ధికెక్కిరి. క్రైస్తవ సిద్ధాంతముల సత్యతను తేటపరచి దృఢపరచవలెనని, క్రీస్తు దైవమానవ స్వభావములను గూర్చిన, త్రిత్వమును గూర్చిన విషయములను, పాపపరిహార పద్ధతి మొదలగు విషయములను గూర్చిన గ్రంథములు వ్రాసిరి. అనేక బైబిలు వ్యాఖ్యానములు కూడా వ్రాసిరి. వారిలో ప్రముఖులను పేర్కొందాము.
a) తూర్పు సంఘానికి చెందిన గ్రీకు భాషాపండితులైన సంఘపితరులు :
i) కైసరయ వాసియైన యుసీబియస్ (AD 265-339). ఇతనిని ‘సంఘచరిత్ర పితామహుడు’ అనిపిలిచిరి. అబ్రహాము మొదలుకొని AD 323 వరకు గల చరిత్రను వ్రాసాడు.
ii) అతిఘనుడైన ‘అతనేషియస్’ (AD 298-373). ఏరియన్ల దురుపదేశాన్ని ఎదిరించెను. క్రీస్తు యొక్క దైవత్వమును గూర్చి బోధించుటయును, దాని సత్యతకు భంగము కలుగకుండా కాపాడుటయు చేసెను. క్రీస్తు దైవత్వమును కాపాడుటకు పోరాడుటలో ఈయన కంటే గొప్ప వారెవ్వరు లేరు.
iii) జాన్ క్రిసోస్తం(AD 347-407). ఇతడు గొప్ప వ్యాఖ్యానకర్త మరియు వక్త. కాన్స్టాంట్ నోపుల్ “సంఘపితరుడయ్యాడు”. మిక్కిలి ఆశ్చర్యకరమైన వాక్చాతుర్యమును బట్టి ఇతనికి ‘బంగారు నోరు’ అని అర్ధము గల ‘క్రిసోస్తం’ అను బిరుదు నిచ్చిరి.
iv) థియొడోర్ (AD 350-428). ఇతడు బైబిలు గ్రంథమును బాగా అధ్యయనం చేసాడు. గొప్ప వివరణ కర్త. ‘పురాతన వ్యాఖ్యానకర్తలకు రాజు’ అని పిలువబడెను.
b) పశ్చిమ సంఘానికి చెందిన లాటిన్ భాషాపండితులైన సంఘపితరులు :
i) జెరోమ్ (AD 331-420). గొప్ప వ్యాఖ్యానకర్త మరియు బైబిలు అనువాదికుడు.
ii) ఆంబ్రోస్ (AD 340-397). గొప్ప బోధకుడు. సంఘకార్య నిర్వాహకుడు. గ్రంథకర్త. చక్రవర్తిని సహా ఎదిరించి, గద్దించి 8 నెలలపాటు సంఘాచారములకు దూరముగా నుంచెను.
iii) అగస్టీన్ (AD 354–430). గొప్ప క్రైస్తవ వేదాంతి, తత్వవేత్త మరియు గ్రంథకర్త. ఇతడు సంఘపితరులందరిలో గొప్పవాడుగా ఎంచబడెను. నూరు గ్రంథములు, ఐదు వందల ప్రసంగములు, రెండు వందల ఉత్తరముల కంటే ఎక్కువ వ్రాసెను. వీటన్నిటిలో ప్రసిద్ధిగాంచిన గ్రంథములు రెండు. అవి : (1) ఒప్పుకోలులు (Confessions) – ఇందు మారు మనస్సు నొందక ముందున్న జీవితమును, మారుమనస్సుకు నడిపించిన సంభవములు మరియు మారుమనస్సు నొందిన తదుపరి జీవితమును గూర్చి కనిపించును. (2) దేవుని పట్టణము (City of God) – ఇందు క్రైస్తవ సంఘము నిజముగా దేవుని పట్టణమని చూపించెను. అపొస్తలుడైన పౌలు, మార్టిన్ లూథర్ల మధ్యకాలంలో అగస్టీన్ వంటి గొప్ప నైతిక, ఆత్మీయ స్థితి కలిగిన మరొక ఉన్నత వ్యక్తి లేరు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఆదిమ సంఘ చరిత్రలో పాలికార్ప్ ఎవరు? పాలికార్ప్ స్ముర్న సంఘానికి అధ్యక్షుడిగా ఉండిన ఒక కురువృద్ధుడు. క్రీ.శ. 155లో చక్రవర్తి ఆజ్ఞ మేరకు ఆయనను బంధించినప్పుడు, ‘నేను 86 ఏళ్ళ నుండి క్రీస్తును సేవించుచున్నాను, ఆయన నాకు ఏ కీడు చేయలేదు’ అని సాక్ష్యమిచ్చారు. చివరికి, ఆయనను మంటల్లో కాల్చి, కత్తితో పొడిచి హతమార్చారు.
రోమ్ నగరంలోని ‘కాటకోమ్స్’ (Catacombs) అంటే ఏమిటి? కాటకోమ్స్ అనేవి రోమ్ నగరంలో భూమి లోపల త్రవ్వబడిన సొరంగ సమాధులు. హింసల కాలంలో క్రైస్తవులు వీటిని సమాధులుగా మాత్రమే కాకుండా, దాక్కునేందుకు మరియు రహస్యంగా ఆరాధనలు జరుపుకునేందుకు ఉపయోగించేవారు. రోమ్ చుట్టూ సుమారు 54 సొరంగ మార్గాలున్నాయి.
కాన్స్టాంటైన్ చక్రవర్తి జారీ చేసిన ‘మిలాన్ ప్రకటన’ ప్రాముఖ్యత ఏమిటి? క్రీ.శ. 313లో కాన్స్టాంటైన్ జారీ చేసిన ‘మిలాన్ ప్రకటన’ ద్వారా క్రైస్తవులకు ఆరాధనా స్వేచ్ఛ లభించింది. దాదాపు 250 ఏళ్ళ హింసల తర్వాత క్రైస్తవ్యానికి రాజ్యాదరణ లభించి, అది ప్రజలలో విశేష అనుగ్రహం పొందేందుకు ఇది పునాది వేసింది.
ఆదిమ సంఘాన్ని కుదిపేసిన ముఖ్యమైన వితండ వాదములు (Heresies) ఏవి? ఆ కాలంలో సంఘాన్ని ఇబ్బంది పెట్టిన ముఖ్యమైన వితండ వాదాలు మూడు: 1) ఏరియన్ వివాదము (క్రీస్తు దైవత్వాన్ని నిరాకరించుట) , 2) నెస్టోరియన్ వివాదము (క్రీస్తు స్వభావాల విభజన) , మరియు 3) ఫిలేజియన్ వివాదము (మానవ ప్రయత్నం ద్వారానే రక్షణ సాధ్యమనుట).
సంఘ పితరులలో అగస్టీన్ ఎందుకు గొప్పవానిగా పరిగణించబడతాడు? అగస్టీన్ (AD 354–430) గొప్ప క్రైస్తవ వేదాంతి. ఆయన ‘ఒప్పుకోలులు’ (Confessions) మరియు ‘దేవుని పట్టణము’ (City of God) వంటి గొప్ప గ్రంథాలను రచించారు. పౌలు మరియు లూథర్ల మధ్య కాలంలో ఈయన అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి.
ధేవునికి సమస్త మహిమ కలుగును గాక
సంఘ చరిత్ర చాప్టర్ 2 కొరకు… CLICK HERE




