డేవిడ్ బ్రెయినార్డ్ – David Brainard Biography Telugu

డేవిడ్ బ్రెయినార్డ్

David Brainard Biography Telugu

డేవిడ్ బ్రెయినార్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 1718 వ సంవత్సరము ఏప్రిల్ 20 వ తేదీన జన్మించెను. చిన్న వయస్సు నుండి ఆత్మను గూర్చి, మరణానంతర జీవితమును గూర్చి ఆలోచించెడివాడు. తన హృదయంలో నిత్య సంతోషము ఉండవలెనని, మరణిస్తే పరలోకము చేరవలెనని ఆశించెడివాడు. 

తొమ్మిదేండ్ల వయస్సులో తన తండ్రిని, పదునాల్గేండ్ల వయస్సులో తన తల్లిని పోగొట్టుకొని అనాథ అయిన డేవిడ్ నిరాశ్రయుడై కృంగియుండెను. కాని చెడు స్నేహమునకు దూరముగా ఉండి రహస్య ప్రార్థనలో, బైబిలు చదవడంలో ఎక్కువ సమయం గడపటం అలవాటు చేసుకొనెను. తన 21వ ఏట లోతైన మారుమనస్సు పొంది తన స్వనీతిని బట్టికాక దేవుని కృపవల్లనే రక్షింపబడితినని చెప్పుచుండెడివాడు. 

డేవిడ్ బ్రెయినార్డ్ మంచి ప్రార్థనా పరుడు, అత్యంత ప్రతిభావంతుడు. ప్రార్థనాపరుడైన బ్రెయినార్డిని కాపరిగా ఉండమని అనేక సంఘాలు ఆహ్వానించాయి. గాని తాను రెడ్ ఇండియన్స్కు యేసుక్రీస్తు ప్రేమను తెలియ పర్చాలని నిశ్చయించుకొని, కీకారణ్యాల్లో జొరబడి ప్రయాణము చేస్తూ ఎంతో ప్రయాసతో వారిని చేరుకొన్నాడు. నరమాంస భక్షకులైన ఆ అనాగరికులను యేసువైపు త్రిప్పుటకు అమెరికా కీకారణ్యాల్లో ఏకైక విశ్వాస వీరుడుగా వెళ్ళి, రేయింబగలు వారి కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ, సువార్త ప్రకటించ పూనుకొన్నాడు. 

తన భాష వారికి, వారి భాష తనకు తెలియక పోయినను దిగులుపడక ప్రార్థించెను. (అప్పుడు బ్రెయినార్డ్కు త్రాగుబోతు, విగ్రహారాధికుడైన ఒకడు అనువదించుటకు దొరికెను. అతని సహాయంతో యేసు ప్రేమను గురించి బోధించు చుండగా కొన్ని దినములలోనే ఆ త్రాగుబోతు, తాను పాపినని పశ్చాత్తాపపడి మార్పు చెందెను) ఆ తరువాత అనేకులు క్రీస్తు ప్రేమను గుర్తించి మారిరి. వారి కౄర స్వభావాలను, నీచాతి నీచమైన కార్యాలను విడిచిపెట్టి యేసు ప్రభువును నమ్ముకొనిరి. 

కీకారణ్యములో నివసిస్తున్న బ్రెయినార్డ్ ఒక రొట్టెముక్క కోసం పది లేక పదిహేను మైళ్ళు గుఱ్ఱంపై ప్రయాణం చేయవల్సి వచ్చేది. అనేకసార్లు ఆ రొట్టెలు బూజు పట్టో, గట్టి పడిపోయో ఉండేవి. (క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకొనిన బ్రెయినార్డ్ అటువంటి రొట్టెలతో కాలం గడుపుకొని సరైన మంచినీళ్లు కూడా దొరకనందున గుంటలలోని మురికినీళ్ళే త్రాగుచు, చిన్న బల్లచెక్కపై గడ్డిపరుచుకొని పండుకొనేవాడు) అచ్చట తన్ను అర్ధం చేసుకొనే స్నేహితులు, బలపరచే మిత్రులు లేనందున కొన్నిసార్లు ఎంతో కృంగిపోయేవాడు. గాని దేవుని సన్నిధిలో నాకు ఆదరణ ఉన్నదని తన సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు. ఇలాంటి శ్రమల మధ్యలో ఆయన చేసిన పరిచర్య ఫలించెను. అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. డేవిడ్ బ్రెయినార్డ్ తన డైరీలో, ఆత్మలకొరకు తాను పడిన వేదన, దేవుని సన్నిధిలో చేసిన ఉపవాస ప్రార్థనలు, దేవుడు చేసిన అద్భుతములను గురించిన అనేక సంగతులను వ్రాసి ఉంచుకొన్నాడు. 

అవి చదివిన వారికి ఈనాటికి ఆయన సేవా జీవితం సవాలుకరంగా ఉన్నది. ఈయన సేవ యుద్ధం లాంటిది. (సాతాను ఉచ్చుల్లో ఉన్న మనుష్యులను విడిపించుటకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధ వీరుడిలా పోరాడెను. ఈయన మాటలలో; చేతలలో బహిరంగంగాను, వ్యక్తిగతంగాను రాత్రింబగళ్లు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడెను.) 

జోనాతాన్ ఎడ్వర్డుగారు ఆయన్ని గూర్చి ఇలా అన్నారు. “విజయవంతమైన సేవను ఆశించే వ్యక్తులకు ఆయన మార్గదర్శి. యుద్ధభూమిలో విజయం కోసం అందుకోవడానికి పోరాడే యోధుడిలా ఆయన పోరాడాడు; గొప్ప బహుమానాన్ని శాయశక్తులా పరుగెత్తే ఓ పందెగాడిలా ఆయన పరుగెత్తాడు; క్రీస్తు కోసం, ఆత్మల కోసం తపించిపోయి, ఆయన చేసిన కృషి, ప్రయాసలు ఇంతంతా అని చెప్పలేము! మాటలలో, చేతలలో బహిరంగంగా, వ్యక్తిగతంగానే గాక రాత్రింబవళ్ళు ప్రార్థనలో పోరాడేవాడు. ఆయన ఆశయమంతా తాను ఎవరి వద్దకయితే పంపబడ్డాడో వాళ్ళు క్రీస్తు రూపంలోనికి మార్చబడాలని! పట్టువిడువని ప్రార్ధనాపరుడైన యాకోబుకు వారసుడిలా రాత్రంతా పట్టువిడువకుండా అనేక రాత్రులు పోరాడిన మహానీయుడు డేవిడ్ బ్రెయినార్డ్!” 

తన ఆరోగ్యముకన్నా అన్యజనుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చి శరీర ఆరోగ్యము విషయమై జాగ్రత్త తీసుకొననందున అసలే బలహీనుడైన బ్రెయినార్డ్ వ్యాధిగ్రస్థుడయ్యెను. అయినను ఆత్మలను రక్షించాలనే భారముతో పరిచర్యను కొనసాగించుచు- “అయ్యో నేను దేవునికొరకు ఎక్కువ సేవ చేయలేక పోతిని; నాకు వెయ్యి ఆత్మలుండినచో వాటిని దేవుని కొరకై సమర్పించి యుందును” అని విలపించెను. అయితే బ్రైనార్డ్ తన 29 సంవత్సరముల వయస్సులోగా చేసినది నాలుగు సంవత్సరముల సేవయే అయినా, డెబ్భై సంవత్సరములు జీవించి చేసిన సేవకంటె ఎక్కువ సేవ చేసెనని అంచనా వేయబడినది. డేవిడ్ బ్రెయినార్డ్ “నేనెంత బలహీనుడనైనా, ఎన్ని శ్రమల నెదుర్కొన్నా, నా మరణము వరకు అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించగలిగితే అదే నాకు పది వేలు” అని తన డైరీలో వ్రాసుకొన్నాడు. తరువాత బ్రెయినార్డ్ మరణ పడకపై యున్నపుడు తన దగ్గరున్న వారిని పిలిచి, 122వ కీర్తన చదివించుకొనెను. 

చివరికి బ్రెయినార్డ్ 1747 వ సంవత్సరము అక్టోబర్ 9వ తేదీ శుక్రవారము నాడు సరిగ్గా సూర్యుడు ఉదయించువేళకు – ‘యేసు వచ్చును, ఆయన ఆలస్యము చేయడు, నేను త్వరలో మహిమలో నుందును; దేవదూతలతో కలిసి దేవుని మహిమ పరతును” అని పలుకుచు తన 29వ యేటనే పరమ ప్రభువు సన్నిధానానికి వెళ్ళిపోయెను. ఈయన జీవితకాలము కొద్దియైనప్పటికి తన జీవితములో గొప్ప సేవను చేసెను. ఆ తరువాత అనేకులు ఆయన డైరీ చదివి ప్రేరేపించబడి, రెడ్ ఇండియన్ల మధ్య పరిచర్య చేసిరి. కాబట్టి బ్రెయినార్డ్ రెడ్ ఇండియన్ల రక్షణ విషయంలో ఒక పునాది రాయిగా చరిత్రలో మిగిలిపోయాడు. 


For More Stories….Click Here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!