నోవహు జల ప్రళయం ఎన్ని దినములు?
Duration of Noah Flood-Explained Telugu
విమర్శ: నోవహు కాలమందు జల ప్రళయము ఎన్ని దినములొచ్చెను? నలువది దినములొచ్చెనా? పెక్కు దినములు ఆ ప్రళయముండెనా? అసలు ప్రళయము అనగా నేమి?
జవాబు : అపొస్తలులు ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తు వచ్చారు. నేటి సేవకులు అది చేయటం లేదు. గనుకనే తప్పులు బోధిస్తున్నారు. బైబిలు గ్రంథాన్ని చక్కగా పరిశీలిస్తే సత్యమేదో తప్పక బయల్పడుతోంది. అ.కా. 7:12 లో “నలువది పగళ్ళును, నలువది రాత్రులును ప్రచండ వర్షము భూమి మీద కురిసెను” అని వ్రాయబడియున్నది. నలువది రాత్రింబగళ్లు ప్రచండ వర్షము కురిసెనని వ్రాయబడియున్నది కాని ప్రసంగీకులు వర్షమన్న, ప్రళయమన్న ఒక్కటే ననుకొని నోవహు కాలమందు నలువది దినములు జలప్రళయమొచ్చెనని ప్రసంగింప సాగారు. విశ్వాసులు ఆలాంటి ప్రసంగాలకే అలవాటు పడ్డారు. ప్రళయము అనగా కదులుట, ప్రవాహము (Moving Or Flow- ing) అని అర్ధము. 40 దినాలు వర్షము కురిస్తే ఎన్ని దినాలు మట్టుకు ఆ జలము ప్రవహించి యుంటాయి? దానిని పరిశీలించండి. సత్యాన్ని అన్వేషించండి. ఆది. కా. 7:11 చూచినచో నోవహు వయస్సు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. అని వ్రాయబడి యున్నది. ఆది. 8:14 చూచినచో “మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్ళు భూమి మీద నుండి యింకిపోయెను” అని వ్రాయబడి యున్నది. కావున దీనిని బట్టి ప్రళయము ఎన్ని దినాలని మీరే గ్రహించగలరు. నోవహు వయస్సు యొక్క 600 సం॥ 2 నెల 17వ దినమున ప్రారంభమైన ప్రళయం 1-1-601 కి పూర్తియైనది; అనగా ఒక నెల 16 దినాలు తక్కువ ఒక్క సంవత్సరము ఆ జలప్రళయము వచ్చియున్నది. యూదా క్యాలెండర్ ప్రకారము మాసానికి 30 దినాలు మాత్రమే. 12 మాసాలకు 12×30=360 దినాలలో ఒక నెల 16 దినాలను అనగా 30+16=46 దినాలను తీసివేసిన యెడల నోవహు దినముల్లో కురిసిన 40 దినాల ప్రచండ వర్ష ఫలితంగా ఎన్ని దినాలు జల ప్రళయముండెనని తీర్మానింప గలరు. 360-46=314 అనగా (ఆది కాండము 7:11, 8:13) ప్రకారము జల ప్రళయము 314 దినములని స్పష్టమగు చున్నది. తెలియని వారికి మీరు వెళ్ళి చెప్పండి. 40 దినాలు ప్రచండ వర్షము 314 దినాలు జలప్రళయమనే సత్యాన్ని అన్వేషించిన సద్విమర్శకులకు ప్రభు కృప సమాధానములు సదా తోడైయుండును గాక.
ఆధారం : Genesis Flood By Mr. HOVARD
మరిన్ని ప్రశ్నలు – జవాబుల కోసం.. click here