ఫ్రాన్సిస్ – Francis Missionary Life History Telugu

ఫ్రాన్సిస్

Francis Missionary Life History Telugu

ఫ్రాన్సిస్ 1181వ సంవత్సరములో ‘పీటర్ బర్నాడ్’ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్థునికి ఇటలీలోని ఉంబ్రియా ప్రాంతమునకు చెందిన ‘అసిస్సీ’ పట్టణములో జన్మించెను. అతని తండ్రి చాలా మూర్ఖత గలిగిన, కఠినుడైన వ్యక్తి! ఫ్రాన్సిస్ పెద్దవాడగు చుండగా, తన తండ్రిని ద్వేషించుట మొదలుపెట్టెను. గాని, అతని వ్యాపారమును, ధనమును ప్రేమించెను. 14 సంవత్సరముల వయస్సులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకొని, డబ్బు సంపాదించుట మొదలుపెట్టెను. 

      తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా; ఫ్రాన్సిస్ చేతినిండా డబ్బుతో, విపరీతమైన విలాసాలతో, అడంబరము లతో, అహంభావముతో, ఆటలతో తన యౌవన జీవితమును గడుపుచుండెను. ధనవంతులతో సహవాసము చేయుచు, తన జీవితమును వ్యర్థపరచుకొనుచుండెను. ఒకసారి రోమా పట్టణమునకు యాత్రకు వెళ్లెను. అక్కడ కుష్ఠురోగులను, పేదలను చూచినపుడు అతని హృదయము ద్రవించెను. 

     ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరములో ఒక భయంకరమైన వ్యాధికి గురై, బహు బలహీనుడాయెను. ఆ వ్యాధిలో దేవుని స్వరమును వినెను. ‘నీవు యజమానిని సేవించటం మేలా? లేక దాసుని సేవించటం మేలా? యజమానుడనైన నన్ను విడిచి, లోకభోగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావా?’ అను పలుకులు తన ‘ పాప జీవితము కొరకై లోతుగా పశ్చాత్తాపపడునట్లు చేసెను. ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్లోలో ఒక మార్పు కలిగెను. ఏకాంతముగా వెళ్ళి ప్రార్ధన చేసుకొనుటకు, క్రీస్తు వలె జీవించుటకు అధికముగా ఆశించెను. 

      ఒకరోజు ‘సాండిమెన్’ అనే ఆలయమునకు వెళ్ళి, అక్కడ మోకాళ్ళూని ప్రార్థించుట మొదలుపెట్టెను. అలా ప్రార్థించుచుండగా, ‘ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయి యుండుట చూచితివా? వెళ్ళి బాగుచేయి’ అను ఒక మెల్లని స్వరమును వినెను. ఆశ్చర్యపడ్డ ఫ్రాన్సిస్ సంతోషముతో ‘తప్పకుండా చేయుదును ప్రభువా’ అనెను.  తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయ కట్టడములను బాగుచేయ మొదలు పెట్టెను. అతని తండ్రి ‘నా డబ్బు వాడుచున్నావే’ అని ఫ్రాన్సిస్తో తగాదాపడి, అతనిని కోర్టుకు లాగెను. ‘నీవు దేవుని సేవ చేయవలెనన్నచో, నీ తండ్రి డబ్బును తిరిగి యిచ్చివేయవలెను’ అని ఆనాడు న్యాయాధిపతిగా ఉన్న బిషప్పు చెప్పెను. అప్పటికే ‘పిచ్చివాడు’ అన్న పేరు తెచ్చుకొన్న ఫ్రాన్సిస్, బహు చల్లటి వాతావరణములో కూడా తాను వేసుకొన్న వస్త్రములను, ఆభరణములను, తన దగ్గర ఉన్న డబ్బంతటిని అప్పటికప్పుడే తీసి తండ్రికి యిచ్చివేసెను. 

      ఆశ్చర్యపోవుచున్న జనసమూహముతో, ‘నేనిక స్వేచ్ఛగా దేవుని సేవ చేసెదను. నా అవసరతల కొరకు పరలోకమందున్న నా తండ్రికే ప్రార్థించి, పొందెదను’ అనెను. చేతిలో డబ్బులేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలగు కట్టడ అవసరతలను అడుగుకొనుచు, పాడుబడిన ఆలయములను కట్టుచుండెను. ధనవంతుని కుమారుడై యుండియు, ఆహారము కొరకు ఇతరులను అడుక్కొనుచున్నందున కుటుంబమునకు సిగ్గు తెచ్చెను. 

      అయితే 1208వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభువు సువార్తను చదువుచుండగా, పరిశుద్ధాత్మ వలన ముట్టబడెను. యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు; వారితో డబ్బునైనను, సంచినైనను తీసుకొని వెళ్ళవద్దని; సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగజేసెను. అతడు తన దట్టీని, చెప్పులను, కర్రను తీసివేసి; సామాన్యమైన ఒక అంగీని ధరించి, నడుము చుట్లూ ఒక త్రాడు కట్టుకొనెను. దేవుని సంఘమును కట్టుట అంటే కట్టడములు కాదు, ఆత్మలను సంపాదించుట అని గ్రహించుకొనెను. అప్పటి నుండి పడిపోయిన చర్చి గోడలు కట్టుట మాని, సువార్తను ప్రకటించుట ద్వారా ఆత్మలను రక్షణలోనికి నడిపించుట మొదలుపెట్టెను. 

      ‘ప్రభువు నీకు సమాధానమిచ్చును గాక’ అని ఇతరులను పలుకరిస్తూ, క్రీస్తు ప్రేమను ప్రకటించుచుండెను. అంతవరకు పిచ్చివాడనుకొన్న మనుష్యులు అప్పటి నుండి అతనిని ఘనునిగా యెంచి, అతని మాటలు వినుచుండిరి. మరనేక మంది ధనవంతులైన యౌవనులు కూడా వారి ధనమును విడిచిపెట్టి, ఫ్రాన్సిస్తో కలిసి దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెదకుచుండిరి. ఒక సంవత్సరములో 12 మంది సహోదరులు ఫ్రాన్సిస్తో చేరిరి. వారందరు కలిసి అర్థరాత్రి లేచి ప్రార్థించుచు, ఉదయము నుండి సువార్తను ప్రకటించుచుండిరి.

      ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా శరీరేచ్ఛలను జయించెడివాడు. తన శరీరమును ‘గాడిద’ అని పిలుచుకొంటూ, క్రీస్తు కొరకు లొంగదీసుకొనెడివాడు. ఒకప్పుడు సుఖభోగాల యందు జీవించుచు, బీదలను తృణీకరించెడి ఫ్రాన్సిస్ ఇప్పుడు దారిద్ర్యమును ప్రేమించుచు; పేదలకు, వ్యాధిగ్రస్థులకు, కుష్ఠురోగులకు సేవ చేయుటయే తన జీవిత ధ్యేయముగా భావించెను. సేవ అక్కరలకై దేవుని వైపు చూచుచుండెను. ఈయన బోధ మిక్కిలి సూక్ష్మమైనదిగాను, మనస్సాక్షిని కదిలించి మారుమనస్సులోనికి నడిపించునదిగాను ఉండెను. ఈయనను సమీపించుట తోడనే భయంకరమైన దొంగలు మార్చబడిరి. కుష్ఠురోగులను ప్రేమించి, వారి పుండ్లను కడుగుచుండగానే వారు పూర్తి స్వస్థత పొందుచుండెడివారు. ఇతడు దేవుడు చేసిన జంతువులను, పక్షులను బహుగా ప్రేమిస్తూ; వాటికి కూడా సువార్తను ప్రకటించుచూ, ప్రభువును స్తుతించమని పక్షులతో పలికినప్పుడు అవి పాటలు పాడుచుండెడివి! 

       ఇతడు చాలాసార్లు ఇటలీ సరిహద్దులను దాటి సువార్తను ప్రకటించెను. 1214లో మొరాకో ప్రాంతానికి వెళ్ళి అచ్చటి ప్రజలను రక్షించాలని, అవసరమైతే అచ్చట హతసాక్షిగా మరణించాలని ప్రయాణమయ్యెను. కాని అనారోగ్యము వలన తిరిగి రావలసి వచ్చెను. 1219లో పాలస్తీనాకు వెళ్ళి, అచ్చట ముస్లిమ్లకు సువార్తను ప్రకటించెను. అయితే అతని ఆరోగ్యం మరింత క్షీణించగా, అతని కనుదృష్టి తగ్గిపోగా తిరిగి అసిస్సీకి వచ్చెను. 1224 సెప్టెంబరు నెలలో అతని కాళ్ళలో, చేతులలో గాయములు ఏర్పడినందున నడవలేని స్థితిలో గాడిదపై మాత్రము ప్రయాణము చేసెను. ఒక చిన్న గుడిసెలో తన చివరి దినములు గడిపెను. 

       ఈయన మరణ సమయంలో, ‘ప్రేమ అను ఆయుధము కలవాడే ఈ సేవ కొనసాగించుటకు తగినవాడు’ అని చెప్పి; 1226 అక్టోబరు 13వ తేదీ రాత్రి, తన 45వ యేట ప్రభువు నొద్దకు వెళ్ళెను 


For More Stories….Click Here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!