ADVERTISEMENT

Medieval Church History Ch-4 (Telugu) |మధ్యకాల సంఘ చరిత్ర

మధ్యకాల సంఘ చరిత్ర

Medieval Church History Ch-4 (Telugu)

మధ్యకాల సంఘ చరిత్ర (Medieval Church History) : AD 590-1517.

ఈ భాగమును రెండు కాలములుగా విభజించ వచ్చును.

D) నాలుగవ కాలము : మొదటి గ్రెగొరి నుండి ఏడవ గ్రెగొరి (హిల్డెబ్రాండ్) వరకు (AD 590 – 1073).

ఇందు క్రైస్తవ్యము మరి అధికముగా వ్యాపించుట, మహమ్మదీయ మతోదయము, పరిశుద్ధ రోమకరాజ్యము, పోపుల అధికారము విస్తారముగా వృద్ధియగుటను చూచెదము.

1.) ప్రతిమార్చనను గూర్చిన గొప్ప వివాదము : ఈ కాలమందు క్రైస్తవ్యమును మిక్కిలి కలవర పరచినది, దీర్ఘకాలము నిలచిన వివాదము ప్రతిమార్చనను గూర్చినదై యున్నది.ఆరంభములో కొన్ని శతాబ్దాల వరకు ఆలయములలో ప్రతిమలను ఉంచుటగాని, వాటిని ఆరాధించుట గాని జరుగలేదు.ఆరాధన అతిసాధారణముగాను, ఆధ్యాత్మికముగాను ఉండి ఆచార కర్మకాండలుగాని, లౌకిక దర్పముగాని, డాంభికముగాని లేనిదైయుండెను.ఎప్పుడైతే క్రైస్తవసంఘము ఐహికమైనదో అప్పుడు భ్రష్టత్వమునొంది పగలు క్రొవ్వొత్తులు వెలిగించుట, ధూపము వేయుట, భక్తుల పటాలకు, ప్రతిమలకు నమస్కరించుట, గురువులు విలువైన వస్త్రములను ధరించుట మున్నగునవి ఆచరణలోనికి వచ్చెను.

క్రైస్తవులు తమ ఆరాధనలయందు పటములను, ప్రతిమలను వాడుకొనుటవలన ఐగుప్తు, సిరియా, చిన్నాసియా, తూర్పు సామ్రాజ్యము యొక్క ఇతర భాగములను జయించిన మహమ్మదీయులు వారిని విగ్రహారాధికులని నిందించి గేలి చేసిరి.

తూర్పు సామ్రాజ్య చక్రవర్తియైన ‘మూడవ లియో’ (AD 718-741) తన యావచ్చక్తితో ప్రతిమార్చనను ఎదిరించెను గాని అధ్యక్షులలోను, సన్యాసులలోను అనేకులు ప్రతిమార్చనను ఆమోదించినందున గొప్ప కలహము, తిరుగుబాటును జరిగెను.AD 731 లో పోప్ ‘మూడవ గ్రెగొరి’ ఆధ్వర్యములో 93 మంది బిషప్పులు సమావేశమై మరియమ్మ, క్రీస్తు మరియు భక్తుల ప్రతిమలను తీసివేయుటకైనను, పాడుచేయుటకైనను యత్నించు ఎవనినైనను వెలివేయ వలెనని నిర్ణయించిరి.చిలికి చిలికి గాలివానయైనట్లు ఈ ప్రతిమార్చన మరింత అధికమై సువార్త యొక్క పవిత్రతకును, సరళతకును కళంకము తెచ్చెను.ఆత్మనాధుడైన దేవున్ని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలసియుండగా ఇట్టివాటిని ఆరాధనలో ప్రవేశపెట్టుట ఎంతయో విచారకరము గదా!

2.) మహమ్మదీయ మతోదయము : మహమ్మదు (AD 570 – 632) ఆరంభించిన ‘ఇస్లాం’ మతం క్రైస్తవ్యానికి గొడ్డలి పెట్టువలె ఉండెను.వారు ఖడ్గమును చేతపట్టి మతమును వ్యాప్తిచేసిరి. కొద్ది సంవత్సరములలో పాలస్తీను, సిరియా, పర్షియా` దేశములు వారి వశమాయెను.ఉత్తరాఫ్రికా యందంతటను, ‘మొరాకో’ దేశమునుండి మధ్యధరా సముద్రము మీదుగా స్పెయిన్కు వ్యాపించెను. ఫ్రాన్స్ దేశములో ప్రవేశించి తదుపరి రోమా పట్టణములోని సెయింట్ పీటర్స్ ఆలయములో తమ గుర్రములను కట్టుదుమని బెదిరించిరిగాని చార్లెస్ మార్టెల్ AD 732 లో టూర్స్ పట్టణము దగ్గర వారిని సంధించి ఓడించెను.

ఐరోపా ఖండము యొక్క ఉత్తర, తూర్పు భాగములందు క్రైస్తవ్యము బహుగా విస్తరించుట : మొదటి శతాబ్దములో క్రైస్తవ్యము ఇంగ్లాండులో వ్యాప్తి చెందినట్లు, AD 449 లో దాన్ని బార్బేరియన్లు అణచివేసినట్లు మూడవ కాలమందు చూచాము.తిరిగి ఈ కాలములో (AD 596 నుండి) క్రైస్తవ్యము పునరుద్ధరింపబడెను. కాలక్రమమున అది రోమన్ కేథలిక్ మతముగా రూపొందెను.క్రైస్తవ్యము 9వ శతాబ్దములో డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశములకు వ్యాపించెను. ఫ్రెంచ్ సన్యాసియగు ‘ఆన్స్గర్’ మిషనరీగా విదేశములకు వెళ్ళి, బహు శ్రద్ధాసక్తులతో సువార్తను ప్రకటించెను.

ఇంగ్లాండ్ వాసియైన ‘ఆంగ్లో సాక్సన్’ సన్యాసి విన్ ఫ్రిద్ (మేలు చేయువాడను అర్థమిచ్చు ‘బోని ఫస్’ గా పిలువబడిన) AD 716లో జర్మనీ దేశమును క్రైస్తవ దేశముగా చేయుటకు ప్రాణమర్పించ సిద్ధపడి అచటి కేగెను.జర్మనీ పశ్చిమ భాగమున నున్న ఫ్రీజ్లాండ్లో ప్రభువు కొరకు హతసాక్షాయెను. ఇతనిని ‘జర్మని దేశ అపొస్తలుడని’ పిలిచిరి.

ఐరోపా ఖండ తూర్పుభాగాన నున్న స్లావోనియన్ జనాంగములు అనగా రష్యనులు, బల్గేరియన్లు, బొహీమియన్లు, మొరావియన్లు, పోలుల మధ్యకు తూర్పు (లేక) గ్రీకు సంఘమునకు చెందిన సిరిల్, మెథోడియస్ అను సోదరులు ఆ భాషకు లిపి ఏర్పరచి బైబిలును ‘స్లావ్’ (లేక) ‘స్లావోనిక్’ భాషలోనికి తర్జుమా చేసిరి.

4.) పోపుల యొక్క అధికార ప్రాబల్యము, దాని భయంకరమైన హీనస్థితి: ఈ కాలమంతటిలో పోపుల యొక్క మాట చెల్లుబడి మరియు వారి అధికారము హెచ్చయి, ప్రబలుచుండెను. ప్రపంచమంతట నున్న క్రైస్తవ సంఘము అన్నిటికి పోపు శిరస్సుగా ఉండవలెనని, లోకమందున్న సకల సామ్రాజ్యములపైన కూడా పోపులకు అధికారము ఉండవలెనని వారు ఉద్దేశించిరి.ఈ గొప్ప ఉద్దేశ్యమును నెరవేర్చుటకు పోపులు పట్టుదలతో పోరాడిరి. అట్టివారిలో మిగుల సమర్థులైన కొందరు :

a) మహా మొదటి గ్రెగొరి : (AD 550-604). ఒక భాగ్యవంతమైన కుటుంబంలో పుట్టి, మంచి రాజ్యోద్యోగమును సంపాదించాడు.తదుపరి సమస్తమును విసర్జించి సన్యాసత్వమును స్వీకరించాడు. AD 590 లో పోపుగా నియమింపబడ్డాడు.అప్పటినుండి మరణ పర్యంతము వరకు క్రైస్తవ్యము వృద్ధియగునట్లు అనేక కార్యములను నెరవేర్చుటయందు, రోమక సంఘాధికారమును స్థిరపర్చుటయందు తన యావచ్చక్తిని వినియోగించాడు.

ప్రతి విషయమందు తన మాట చెల్లుబడి యగునట్లు చేసాడు. సమస్త ఆరాధనా క్రమమును, సంఘనిర్ణయములను, అన్ని తరగతుల సువార్త సేవకులను సంఘమునకు శిరస్సు అయిన రోమా పోపు ఏర్పరచి స్థాపించిన రీతిని ఉండవలెనని ఉద్దేశించెను.సమస్త జనాంగములను క్రైస్తవ్యము వైపునకు త్రిప్పుటకు విదేశ పరిచర్య సంస్థలను అభివృద్ధి పరుచుటయందు ఉత్సాహము చూపెను. అనేక మత గ్రంథములను వ్రాసాడు.ఇతనికుండిన అధికారమువలన ‘పోపుల ప్రధానాధిపత్యము’ (The Supremacy of the Pope) ను స్థిరపరచెను. సంఘచరిత్రకారులు ఈయనను ఆంబ్రోస్, అగస్టీన్, జెరోమ్ వంటి గొప్పవారి ప్రక్కన చేర్చిరి గాని పాపశుద్ధి స్థానమని ఊహించబడిన ‘పర్గెటరి’ని గూర్చి, అచ్చటుండు ఆత్మల నిమిత్తం ప్రార్థించుట అను విశేష పూజ (Mass) ను గూర్చిన తప్పు సిద్ధాంతములను స్థాపించెను.

B.) మొదటి నికోలాస్ : పోపుల హక్కులను, అధికారమును బలపరచుటకు విస్తారముగా పనిచేసెను. ఇతడు AD 858-867 మధ్యలో పోపుగా నుండెను.తన ఆజ్ఞలకు అవిధేయులై, తన ఏర్పాటులకు వ్యతిరిక్తముగా చేయ ప్రయత్నించిన బలమైన ప్రధానాధ్యక్షులను, కొందరు రాజులను సహా తనకు లోబడి క్షమాపణ కోరునట్లు చేసెను.పోపులు తమ హక్కులను, అధికారములను బాగా స్థిరపర్చుకొనుటకు రెండు లిఖిత నిదర్శనములను వాడుకొన్నారు. ఇవి కేవలము కల్పిత పత్రములని తదుపరి కాలంలో ఋజువాయెను.

పోపుల ఐశ్వర్యాధిక్యత : పోపుల యొక్క అధికారము హెచ్చుటకు వారి ధనాధిక్యత ఒక కారణమైయున్నది. వీరు గొప్ప భూస్వాములైరి.దీనిని ‘పోపుల యొక్క లౌకికాధికారము’ అని (The temporal power of the Popes) పిలిచిరి. ఈ కాలంలోనే “పోపుల సంస్థానములు” (The papal states) అనబడిన వాటిని ఇతర భూరాజులవలె AD 755 నుండి ఏలనారంభించి AD 1870 వరకు కొనసాగించిరి.

పోపులలో అనేకులు జరిగించిన అతిభయంకరమైన అవమాన కార్యములు : పోపులలో అనేకులు చెప్పనలవి కానంతటి దుర్మార్గులై అదివరకు మనుష్యులలో జరిగింపబడియుండని దుష్కార్యములను సిగ్గు విడచి జరిగించిరి.సంఘమును దొంగల గుహగాను, పోపుల నగరును వేశ్యలకు ఉనికి పట్టుగాను చేసిరి. చరిత్రలో “వేశ్యల పాలన” (The reign of Harlots) అనునది AD 896లో “పోప్ మూడవ సెర్గియస్”తో ఆరంభమాయెను.రోమా పురిలో కులీనురాలైన ‘మరోజియా” అను వేశ్యను సెర్గియస్ ఉంచుకొనెను. ఆమె తన పలుకుబడి వలన పోపుయొక్క ప్రభుత్వమును ఏడు సంవత్సరములు నడిపించెను. ‘పదవ జాన్’ ధనవతి, సౌందర్యవతియైన థియొడొర అను వేశ్య యత్నము వలన పోపుగా నియమింపబడెను. పన్నెండవ జాన్” మత, నీతి సంబంధమైన ప్రతికార్యము మీరి దేవదూషణ, వ్యభిచారము, విధవలతోడి పొందు, తన తండ్రి ఉంపుడుకత్తెతో సాంగత్యము చేసి పోపుల నగరును కళంకపరిచెను.ఈ పోపులను నీరో చక్రవర్తి యంతటి, మించిన దుర్మార్గులని చెప్పవచ్చును. ఎందుకనగా వీరు క్రీస్తును వెంబడించు చున్నామని, ఆయన బోధలను గైకొనుచున్నామని చెప్పుకొనుచు క్రైస్తవులనేకులను దోచుకొనుచు, సంహరించుచు, భయంకరమైన వ్యభిచారములగు అస్వాభావికములగు ఘోరకృత్యములను హద్దు మీరుతూ వచ్చిరి.వీరిని (లేక) వీటిని గూర్చి ‘ప్రొటస్టాంట్’ సంఘ చరిత్రకారులు మాత్రమే గాక ‘కార్డినల్ బరోనియస్’ వంటి ప్రముఖ రోమన్ కేథలిక్ చరిత్రకారులు వ్రాసిరి.ఇవన్నియు ఇట్లుండ రోమన్ కేథలిక్ వారు ‘అపొస్తలుల వారసత్వ పరంపర’ (Apostolic Succession) ను గూర్చి మాట్లాడుట హాస్యాస్పదము కాదా!పైన పేర్కొనిన దుష్ప్రవర్తన, అరాచకము, అవివేకము, మూఢభక్తి మున్నగు వాటితో నిండియుండి 10వ శతాబ్దమంతయు మిగుల అంధకారముగా నుండెను.

మహాచార్లెస్ – పరిశుద్ధ రోమక సామ్రాజ్యము : మూడవ కాలమందు చదివినట్లుగా పురాతన రోమా సామ్రాజ్యము యొక్క పశ్చిమ భాగము AD 476 లో అంతమయ్యింది.సుమారు 300 సంవత్సరములకు ప్రసిద్ధులైన ఫ్రాంక్ల రాజైన ‘మహా చార్లెస్’ ప్రాచీన రోమా సామ్రాజ్యమువలె విస్తారమైన సామ్రాజ్యము స్థాపించవలెనని యోచించెను.

పశ్చిమ ఐరోపా ఖండ దేశములన్నియు బలమైన ఒకే ప్రభుత్వము క్రింద ఉండవలెనని అందులో పశ్చిమ క్రైస్తవ్యము చేరి క్రైస్తవ సంఘమును, ప్రభుత్వమును పూర్ణముగా కలసియుండవలెనని, చక్రవర్తియు పోపును కలసి సామ్రాజ్యమునకు ఐక్యత గల శిరస్సుగా ఉండవలెనని అతడు ఉద్దేశించెను.దీనికి ‘పరిశుద్ధ రోమక సామ్రాజ్యమ’ ని (The Holy Roman Empire) పేరు పెట్టెను. పోపు సమ్మతితో ఇతడు దీనికి మొదటి చక్రవర్తి ఆయెను.

ఇంగ్లాండ్ రాజైన ‘మహా ఆల్ ఫ్రెడ్’ (AD 849-901) క్రైస్తవ్యము యొక్క వ్యాప్తికి చేసిన కృషి : ఇతడు మిగుల భక్తిపరుడై యుండి సమస్త విషయముల యందు దేవునికి లోబడ యత్నించెను.మధ్యకాలంలో నిజమైన క్రైస్తవ్యమును నిలబెట్టుట యందును, దూరదేశములకు రాబోవు కాలంలో దానిని వ్యాపింప చేయుటకు మార్గమును స్థిరపరుచుట యందు ఇతడెక్కువగా ప్రయాసపడెను.భారతదేశ క్రైస్తవ సంఘములకు ధన సహాయము చేసినట్లు చెప్పబడెను.

తూర్పు – పశ్చిమ సంఘములు వేరగుట : ఆరంభములో కొన్ని శతాబ్దముల వరకు పాలస్తీను, సిరియా, ఐగుప్తు, చిన్నాసియా, గ్రీసు మొదలగు తూర్పు దేశములలోని సంఘములును, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ మొదలగు పశ్చిమ దేశములలోని సంఘములును సిద్ధాంతముల యందు, సహవాసమునందు ఏకమైయున్నవి.వారు గొప్ప ఆత్మీయ ఐక్యత వలనను, ప్రేమ వలనను బంధింపబడియుండిరి. అయితే కాలక్రమమున వారిలో భేదములు ఆరంభమాయెను.క్రైస్తవ్యము లౌకిక మనస్సును పొంది నాగరికత హెచ్చిన కొలది ప్రేమ, దీనత్వము తగ్గి అతిశయము, దురాశ అధికమాయెను.

ఈ సంఘములు రెండుగా విభజించబడుటకు గల కారణములు :

A) గొప్పదైన రోమా సామ్రాజ్యము తూర్పు- పశ్చిమ సామ్రాజ్యములుగా విభజింపబడెను.

B) మహా కాన్స్టాంటైన్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ నగరాన్ని నివాస స్థలముగా ఏర్పరచుకొని అచ్చట నుండి ఏలిన కారణమున దానికి, రోమా నగరానికి పోటీ హెచ్చెను.

C) తూర్పు సామ్రాజ్యములోని సంఘములు గ్రీకుభాష, పశ్చిమ సామ్రాజ్యములోని సంఘాలు లాటిన్ భాష  మాట్లాడేవారు.

D) మూడవ కాలంలో మనము చదివినట్లుగా రోమా నగర సంఘాధ్యక్షులు ఇతర బిషప్పుల కంటే ఎక్కువ వారని  ప్రపంచ మందంతట ఉన్న క్రైస్తవ సంఘములపై అధికారము చేయు హక్కు తమ కున్నదని వాదించ సాగిరి.ఈ హక్కు వారికి లేదని తూర్పు సంఘాధ్యక్షులు ఎదిరించిరి.

E) సంఘాచారములు (గ్రీకు సభవారు బాప్తీస్మమును ముంచడము వల్లనే జరిగింతురు. లాటిన్ సభవారు చిలకరింపు, క్రుమ్మరింపులను ఆచరించిరి. గ్రీకు సభవారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల పేరట మూడు సార్లు ముంచెడి వారు. గ్రీకు సభలో గురువులు పెండ్లి చేసుకొనవచ్చును. గాని లాటిన్ సభలో గురువులు వివాహాన్ని నిషేధించిరి. గ్రీకు సభలో ప్రభురాత్రి భోజనము ఇచ్చునపుడు ప్రజలందరికి రొట్టెయు, ద్రాక్షారసమును ఇత్తురు. లాటిన్ సభలో ప్రజలకు ద్రాక్షారసము నీయక గురువులు మాత్రమే దానిని పుచ్చుకొందురు.

క్రైస్తవ జీవిత విధానము మరియు ఆరాధన :

A.) గొప్ప పట్టణములలో విశాలమైన, శృంగారమైన దేవాలయములు కట్టబడెను.

B.) సంఘముల బహిరంగారాధనలు బహు గంభీరమైనవిగా ఉండెడివి. ఆ కాలపు క్రైస్తవులు అంతర్య సారము కంటే బాహ్యాచారములను ఎక్కువగా మనస్కరించిరి.

C) క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి విశేష దినముల యందు, హత సాక్షులు మరణము నొందిన దినముల యందు గొప్ప ఉత్సవములు చేసిరి.

d) సంఘము మొట్టమొదటి బోధయందు, ఆచారము యందు చాలా మట్టుకు తప్పినను క్రైస్తవ్యము లోకమునకు ఉప్పై ఉండెను.ఏలాగనగా (i) దీన స్థితిగల సామాన్య జనులలో అనేకులు నిజ భక్తిని చక్కగా కాపాడిరి (ii) ఆ కాలమందు సమాజములో బానిసత్వ విధానము దారుణముగా నుండెడిది.క్రైస్తవ్యము దాని నడ్డగించి క్రమక్రమముగా దాని రూపుమాపుటకు ప్రయత్నించెను. అనేక మంది యజమానులు తమ ఆధీనంలో ఉన్న బానిసలను క్రైస్తవ ప్రేమచేత విడుదల చేసిరి.(iii) ఆ నాటి గొప్ప కీడులలో కామాతురత ఒకటి. అయితే క్రైస్తవ్యము నీతిని, పరిశుద్ధతను నేర్పుచుండెను. (iv) క్రైస్తవ్యము మనుష్యులందరికీ కనికర, ఔదార్యములు కలిగియుండవలెనని నేర్పుచుండెను.దీనిని బట్టి రోగులకు వైద్యశాలలు, వృద్ధులకు, అనాధలకు ఆశ్రయములు నెలకొల్పటము జరిగింది. భాగ్యవంతులు బీదలకు తమ ఆస్తిని పంచిపెట్టిరి. (v) ఈ అజ్ఞానాంధకారములో విద్యను కాపాడింది.

అజ్ఞానము, బాహ్యాచారములు, లౌకిక మనస్సు, భ్రష్టత్వము అంతటా ప్రబలియున్నను సత్యమతోద్ధరణ కాలము వచ్చువరకు అంధకార కాలము లందంతట నిజ క్రైస్తవ్యము నిలచియుండెను.అన్యులైన రోమా చక్రవర్తులు ఏలిన సుమారు 250 సంవత్సరములలో క్రైస్తవ సంఘమునకు కలిగిన భయంకర హింసల వలనగాని, మహా కాన్స్టాంటైన్ అనుగ్రహమువలన వరదవలె కొట్టుకు వచ్చిన లౌకిక మనస్సు అహంకారము వలనగాని, పోపుల యొక్క అధికారము, గర్వము, దురాశ, ధనము, భోగముల వలన గాని, అంధకార కాలమందలి అజ్ఞాన, మూఢభక్తి వలనగాని, క్రైస్తవ్యము సమూల నాశనము కాలేదు.క్రైస్తవ్యము సజీవుడైన నిజదేవుని యొద్దనుండి వచ్చినది గనుక అది తన్నెదిరించిన శక్తులను జయించి నేటికిని విజయ దుందుభి మ్రోగించు చున్నది.

E) ఐదవ కాలము : ఏడవ గ్రెగొరి నుండి లూథరు వరకు (AD 1073-1517). ఇందు సిలువ దండయాత్రలు, పోపులకు లోకాధికారులతో కలిగిన గొప్ప పోరాటములు,గురువులు, సన్యాస మఠములు, విమత శిక్షాసభ, పోపుల అధికార క్షీణత, నాగరికతోద్ధారణ మరియు సత్యమతోద్ధారణమునకు సూచనలు, ముంగుర్తులను గూర్చి నేర్చుకొనెదము.

సిలువ దండయాత్రలు (The Crusades) : సిలువ దండయాత్రలు మతము పేర చేయబడిన యుద్ధపరంపర.

పరిశుద్ధ దేశమని పిలువబడు పాలస్తీను దేశమును జయించుటకును, యెరూషలేము, బెత్లెహేము, నజరేతు మొదలగు స్థలములు పరిశుద్ధమైనవని ఎంచబడినందున కొన్ని వందల సంవత్సరముల నుండి తురుష్కుల ఆధీనము నందున్న వాటిని స్వాధీనపరచుకొనుటకును క్రైస్తవ నామము వహించిన రాజులు పశ్చిమ ఐరోపా జనాంగములును దండయాత్రలను చేసిరి.ఇవి మొదటి సిలువ దండయాత్రలో AD 1096లో ఆరంభమై కడపటిది AD 1291లో అంతమాయెను.

సిలువ దండయాత్రల క్లుప్త చరిత్ర :

‘పీటర్ ది హెర్మిట్’ అనునొక ఏకాంతశీలుడు పాలస్తీనుకు యాత్ర చేసివచ్చి ఐరోపా ఖండ మంతట సంచరించి తురుష్కుల క్రౌర్యమును గూర్చియు, యాత్రికులు ఎదుర్కొనుచున్న గొప్ప శ్రమలు, హింసలను గూర్చియు గుండెలు బ్రద్దలై పోవునట్టి వార్తలను చెప్పెను.ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ మున్నగు దేశములలోని సంఘములకు అతడు వెళ్ళి క్రైస్తవులు పడుచున్న హింసలను గూర్చి చెప్పుటకును, పరిశుద్ధ స్థలములను, యాత్రికులను విడిపించుటకు యుద్ధము చేయవలసిన అవసరతను గూర్చి బోధించుటకును పోపు అతనికి అధికారము నిచ్చెను. ఇతడు చేసిన పనికి ఫలితముగా పరిశుద్ధ దేశమును విడిపించు నిమిత్తమై యుద్ధము చేయవెళ్ళుటకు ప్రజలలో గొప్ప కోరిక కలిగి ముందుకొచ్చిరి.

పోప్ ‘రెండవ అర్బాను’ సిలువ దండయాత్రను బహుగా ప్రోత్సహించెను. పరిశుద్ధ స్థలములను తిరిగి సంపాదించుటకు యుద్ధము చేయుట అవశ్యకమని ప్రజలను ప్రేరేపించుచు ఇది మిగుల పుణ్యమైన, దివ్యమైన కార్యమని చెప్పి ఈ యుద్ధమును చేయువారందరికి ‘వారి పాపములన్నిటిని క్షమింతున’ని వాగ్దానము చేసెను.

అట్టి పరిశుద్ధ కార్యము నిమిత్తము తమ ప్రాణములను కోల్పోవు వారికి పర్గెటరితో నిమిత్తము లేకుండా నేరుగా మోక్ష ప్రవేశము కలుగునని అతడు దృఢముగా చెప్పెను.పోపు బహు వాక్చాతుర్యముతో ప్రసంగించినందున ప్రజలు ఉద్రేక భరితులై “ఇది దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తము” అని కేకలువేయుచూ స్పందించిరి.

మొదటి సిలువ దండయాత్ర : ఇది AD 1096లో ఆరంభమై పిల్లలు, స్త్రీలు గాక సుమారు 60 వేల మంది పురుషులు ఐరోపా ఖండములోని వివిధ ప్రాంతముల నుండి కూడివచ్చి ‘పీటర్ ది హెర్మిట్’ తమ్మును యెరూషలేముకు నడిపించుమని కోరిరి.తాము చేయుచున్న దానిని గూర్చిన సరియైన అవగాహన, క్రమము, క్రమశిక్షణ, తగినట్టి సిద్ధపాటు, తర్ఫీదు జనులకు లేదు. కేవలము మూర్ఖపు భక్తియుత్సాహము, తొందరపాటు ఉండెను.వారు కాలి నడకన ఐరోపా ఖండమంతట తూర్పుదిశన చేసిన దీర్ఘప్రయాణములో చాలా శ్రమనొందిరి. శ్రమల వలనను, వ్యాధుల వలనను బహు జనులు నశించిరి.యెరూషలేములో 40 వేల మంది మాత్రమే ప్రవేశించిరి. వీరిలో కొందరు ధైర్యముగల శూరులే గాని వారిలో వారికి తరచుగా అసూయలు, కలహములు కలిగినవి.

వారు చిన్నాసియా సమీపించినప్పుడు తురుష్కులతో యుద్ధము ఆరంభమయ్యెను. సిలువ సైనికులలో అనేకులు హతులైరి. వర్ణింపశక్యము కాని శ్రమలు సహించుచు శతృవులతో పోరాడుచు ముందుకు సాగిరి.8 మాసములు పోరాడి సిరియా రాజధానియైన ‘అంతియొకయ’ను తదుపరి ‘ఎడెస్సా’ను పట్టుకొనిరి. AD 1099 జూన్ 15న యెరూషలేమును పట్టుకొనిరి.సిలువ సైనికులు తమ శతృవులను భయంకరముగా హత మార్చి తీతు (టైటస్) ను జ్ఞప్తికి తెచ్చిరి.వారొక రాజ్యమును స్థాపించి ‘యెరూషలేము రాజ్యమ’ని పేరు పెట్టి, 88 సంవత్సరములు పరిపాలన సాగించిరి.

రెండవ సిలువ దండయాత్ర : ఇది AD 1147లో ఆరంభమాయెను. మహమ్మదీయులు క్రైస్తవుల యొద్దనుండి ‘ఎడెస్సా’ ను పట్టుకొనిరనియు, పట్టణము వెంబడి పట్టణమును జయించుచు యెరూషలేము వైపు గొప్ప సైన్యముతో వెళ్ళుచుండిరనియు ఐరోపాకు వర్తమానము వచ్చుటయే ఈ రెండవ దండయాత్రకు కారణము.దీనికి ప్రజలను పురికొల్పినది ‘క్లైర్వాక్స్’ వాసియైన ‘బెర్నార్డ్’ అను సుప్రసిద్ధ సన్యాసి. జర్మనీ, ఫ్రాన్స్ రాజులు గొప్ప సైన్యముతో బయలుదేరిరి.యుద్ధముల వలనను, క్షామముల వలనను, తమలోతమకు రేగిన కలహముల వలనను సైన్యము క్షీణించెను. హతశేషులు అపజయము నొందిన సిగ్గుతో ఐరోపాకు వెనుదిరిగిరి.

మూడవ సిలువ దండయాత్ర : యెరూషలేము మహమ్మదీయుల చేతులలోనికి వెళ్ళిపోయినదనే వార్త విని ఇది చేయబడెను.సుప్రసిద్ధ మహమ్మదీయ సేనానియగు ‘సలా ఉద్దీన్’ AD 1189 అక్టోబరు 3న యెరూషలేమును సంపూర్ణముగా జయించి ‘ఓమార్ మసీదు’ను శుద్ధి చేసి మహమ్మదీయ మతారాధనలను పునరుద్ధరించిరి.(AD 637లో తురుష్కులు యెరూషలేమును పట్టుకొని పూర్వము యూదులు దేవాలయ ముండిన చోట ‘ఓమార్ మసీదు’ను కట్టిరి. AD 1099 లో క్రైస్తవులు దానిని స్వాధీనపరచుకొని దాని శిఖరము పైనున్న అర్ధ చంద్రాకార చిహ్నమును తొలగించి సిలువ నుంచిరి).ఈ సమాచార మంతటిని విని ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ రాజులు AD 1190లో లక్షమందితో పాలస్తీనుకు బయలుదేరిరి.గాని మూడవ సిలువ దండయాత్ర వలన అపజయమును, నష్టమును, అపరిమిత గర్వభంగము తప్ప మరేమియు కలుగలేదు. మిగిలిన సిలువ దండయాత్రలను గూర్చి ప్రస్తావించవలసినంత ప్రాముఖ్యత లేదు.’ఏకర్’లో 60 వేల మంది క్రైస్తవుల వధతో AD 1291లో సిలువ దండయాత్రలు ముగిసాయి.

సిలువ దండయాత్రల చరిత్రలో పిల్లల సిలువ దండయాత్ర మిగుల దుఃఖాక్రాంత మైనది. ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు చెందిన కొన్నివేల మంది పిల్లలు (ఒక్క ఫ్రాన్స్ నుండే 30 వేలమంది పిల్లలు) సిలువ దండయాత్ర చేయవలెనని కుతూహల పడి స్తెఫను, నికోలాస్ అను పిల్లల నాయకత్వంలో AD 1212లో బయలుదేరిరి.నిరాధారులైన ఈ పిల్లలు తమ తల్లితండ్రుల ఆజ్ఞలనుగాని, విన్నపములను గాని వినక తెల్లని దుస్తులను ధరించుకొని, ధ్వజములను పట్టుకొని, కీర్తనలు పాడుచు సాగిరి.అయితే వీరిలో అనేకులు ఆకలి బాధ వలనను, వ్యాధుల వలనను మరికొందరు పట్టుబడి ఐగుప్తు మున్నగు దేశాలకు బానిసలుగా అమ్మబడిరి.

సిలువ దండయాత్రలను గూర్చిన విశ్లేషణ : మనము గమనించినట్లుగా ఇవి అంధకార యుగపు మిగుల అజ్ఞాన మూఢభక్తిగల కాలంలో జరిగినవి.

ఇవి క్రైస్తవ చరిత్రకు కళంకము తెచ్చిన బుద్ధిహీనమైన క్రైస్తవులకు తగని వినాశన కరమైనవి.

a) ఇవి మూఢభక్తితో కూడినవి. ఏలయనగా ఇతర స్థలములలో చేయు ప్రార్ధనల కంటే క్రీస్తు సంచరించిన స్థలాలలో (బెత్లెహేము, కల్వరి గిరి, క్రీస్తు సమాధి మున్నగునవి) చేయు ప్రార్ధనలు దేవునికి ఎక్కువ అంగీకార యోగ్యములని, యొర్దాను, గలిలయలో స్నానము చేసిన యెడల విశేష ఆశీర్వాదములు కలుగునని నమ్మిరి.

b) వీటిలో సరియైన ఏర్పాట్లును, క్రమశిక్షణయు లేకుండెను. ముందాలోచన లేకుండెను.

c) తాము ప్రయాణించిన దేశములలో దోచుకొనుటకును, హత్యచేయుటకును, మితిమీరిన దుష్టకార్యములు చేయుటకు వారు వెనుదీయ లేదు.

కారణం సిలువ సైన్యములో చేరిన యెడల సమస్త పాపములు క్షమించ బడునని బోధింపబడిరి. దీనిని బట్టి క్రీస్తు నామమునకు గొప్ప అవమానము కలిగెను.

d) వీరి అపజయానికి, వేల కొలదిగా ప్రాణ నష్టము సంభవించడానికి గల ముఖ్య కారణము నాయకుల మధ్య కలిగిన అసూయలు, కలహములు.

e) తూర్పు ఖండ వాసుల విద్య, నాగరికతలను గూర్చి ఐరోపా వాసులకు పూర్ణముగా తెలిసినందు వలనను;

వర్తకము వృద్ధియైనందునను సిలువ దండయాత్ర వల్లన లాభము చేకూరెనని కొంతమంది చరిత్ర కారుల అభిప్రాయము.

ఐరోపా ఖండములోని ఇస్లాం (మహమ్మదీయ) మతము (Islam in Europe) : సిలువ దండయాత్రలు తురుష్కుల ద్వేషమును పెంచెను.ప్రతీకారము తీర్చుకొనవలె ననెడి కోర్కెతో తురుష్కులు ఐరోపాలో ప్రవేశించి తూర్పు రోమా సామ్రాజ్యములోని అధిక భాగమును ఆక్రమించుకొనిరి.AD 1453లో ‘రెండవ ముహమ్మదు’ కాన్స్టాంటినోపుల్ను స్వాధీనము చేసుకొనెను. దీనితో కాన్స్టాంటైన్ సామ్రాజ్యమంతా తురుష్కు సామ్రాజ్యము ఆయెను.తురుష్కు సామ్రాజ్యములో రుమేనియా, బల్గేరియా, సెర్వియా, అల్బేనియా, మెకదోనియా, త్రేస్, గ్రీస్ అని ఇప్పుడు పిలువబడుచున్న దేశములు ఉండెను.

కాన్స్టాంటినోపుల్ నేటి వరకు తురుష్కుల రాజధానిగా నున్నది. AD 532-557 లో జస్టీనియన్ చక్రవర్తి కట్టించిన మిగుల సొగసైన ‘సెయింట్ సోఫియా’ ఆలయము మసీదుగా మార్చబడినది.గ్రీకు సంఘమును కొల్లగొట్టి బానిసగా చేసిరి. గ్రీకు విద్వాంసులలో అనేకులను వారి గ్రంథములతో పశ్చిమ ఐరోపా దేశాలకు తరిమివేసిరి.

3) పోపుల అధికారము హెచ్చుగా నుండుట, పోపునకు లోకాధికారులతో కలిగిన గొప్ప పోరాటము : భూలోకములో నున్న సమస్త జనాంగములపై, రాజులపై, ప్రభుత్వములపై మత విషయములో ‘నే గాక లౌకికాధికార విషయముల యందును రోమా సంఘమునకు సర్వాధికారము ఉండవలెననెడి దృఢనిశ్చయము గల ‘హిల్డెబ్రాండ్’ AD 1073లో పోపై ‘ఏడవ గ్రెగొరి’గా పేరొందెను.అతని జీవితము యొక్క మహదుద్దేశ్యము సంఘమునకు ఉన్నతాధికారమును, రాజ్యమును కలిగించుట.

దీని నెరవేర్చుటకై ‘గ్రెగొరి’ చేయనారంభించిన కార్యములు :

a) గురువుల బ్రహ్మచర్యమును అమలులోకి తెచ్చుట.

b) సైమొని (Simony) ని, లౌకిక నియామకమును సంఘము నుండి తీసివేయుట, ‘సైమొని’ అనగా సంఘోద్యోగములను క్రయవిక్రయములు చేయు అపరాధము (అపొ॥ 8:18,19).

c) అమిత అవినీతిపరులు సువార్త పరిచర్యలోని మిగుల గొప్ప ఉద్యోగములను విస్తారమైన ధనము చెల్లించి సంపాదించుకొని లౌకిక దుర్మార్గులుగా జీవించుచుండిరి.

సహజముగా రాజులు, ప్రభువులు, ఇతర లౌకికాధికారులు ఇచ్చుచుండిన ఇట్టి ఉద్యోగములు అక్రమములు, న్యాయ విరుద్ధములు అనియు, సంఘోద్యోగములు పోపువలన గాని, సంఘమునకు అతడప్పగించిన అధికారము వలన గాని ఇయ్యబడవలెనని గ్రెగొరి చెప్పెను.పోపు అయినను, సంఘమయినను నియమించని గురువుల నందరిని మత భ్రష్టులను చేయనారంభించెను.

ఇందు విషయములో పోపునకు, ఆయా దేశముల రాజులతో ముఖ్యముగా జర్మనీ చక్రవర్తియైన ‘నాలుగవ హెన్రీ’తో గొప్ప బహిరంగ తర్కములును, కలహములును ఆరంభమాయెను.చరిత్రలో ఈ కలహములను ‘నియామకమును గూర్చిన యుద్ధమ’ని (The war of investiture) పిలిచిరి.మొదట్లో హెన్రీ, పోపును గట్టిగా ప్రతిఘటించినప్పటికి పోపుయొక్క వెలివేతలు, శాపములు, ఆంక్షలకు, ఆగ్రహములకు జర్మనీ ప్రజలు తనపై తిరగబడుచున్న కారణమున హెన్రీ మనోక్షోభకు గురై పోపునకు లోబడ సిద్దపడెను.

ఆ మూడవ కాలంలో ప్రజలు భయపడుచుండిన మూడు బలమైన ఆయుధములు పోపు వశములోనుండెను.

a) వెలివేయుట (Excommunication) : క్రైస్తవ సంఘములో పాలుపంపులును, పేరు లేకుండ చేయబడి త్యజించబడి అన్యునిగా నెంచబడుట.

b) శాపము (Anathema) : దేవుని పేరను, పరిశుద్ధుల పేర్లను నేరస్తునిపై బహిరంగముగా భయంకర శాపమును పెట్టుట.

c) ఆంక్ష (Interdict) : ఒక దేశము గాని, పట్టణముగాని ఈ విధమైన శిక్ష క్రింద నున్నంత కాలము అందలి దేవాలయము లన్నియు మూసివేయబడును.ఆచారము లన్నియు మాని వేయబడును. బాప్తిస్మము ఇవ్వకూడదు. వివాహము, భూస్థాపనల యందు జరగవలసిన కార్యములను జరిపించకూడదు. దరిదాపుగా వ్యాపారముకూడా ఆగిపోయెడిది. ప్రజలు జీవించుటయే కష్టమయ్యెడిది.

ఏడవ గ్రెగొరి కోరిన అమితాధికారమును ఇతర పోపుల కన్న అధికముగా పోప్ ‘మూడవ ఇన్నోసెంట్’ (AD 1198-1216) పొంది వినియోగ పరచెను.’సంఘము సూర్యుడనియు, సామ్రాజ్యము తెచ్చుకొన్న వెలుగుతో ప్రకాశించు చంద్రుడనియు’ ఇతడు వర్ణించెను.

అజ్ఞానము, మూఢభక్తి, విద్యావిహీనత గల కాలములో మాత్రమే రోమా పోపులు రాజులు తమకు లోబడునట్లు నిర్బంధింప గలిగిరి.AD 11వ శతాబ్దములో చక్రవర్తి కుండినట్లు పోపునకు పరివార ముండెడిది. రాజులకు, చక్రవర్తులవలె సెనెట్ (లేక) మంత్రి వర్గము ఉండెడిది.దీనిని ‘కాలేజ్ ఆఫ్ కార్డినల్స్’ అని పిలిచిరి.

గురువులు, సన్యాస మఠములు (The Clergy and the monastic orders) : 4వ శతాబ్దంలో పాదుకొని (వేళ్ళూని) మధ్య శతాబ్దాలలో కొద్దిగానో, గొప్పగానో శిథిలముగా నుండిన సన్యాసత్వము ఈ కాలంలో పునరుజ్జీవింప బడెను.కొన్ని క్రొత్త సన్యాస తరగతులు స్థాపించబడెను. అనేకమంది మహాభక్తులు, మేధావంతులు వీటిలో నుండినందున వీటి తట్టు అనేకమంది ఆకర్షింపబడిరి. సన్యాసులు పోపులకు సైన్యము వంటి వారనిరి.

పోపులను సర్వాధికారులనుగా చేయుటలో గొప్ప పాత్రను పోషించిరి. మఠాధిపతికి బిషప్పుతో సమానమైన అంతస్తుండెడిది.రాజు మొదలు సామాన్యుని వరకు వీరిని పూజ్య భావముతో చూచుచు, అనేక విలువైన కానుకలిచ్చెడివారు. వేర్వేరు తరగతుల వారు తమ దుస్తుల భేదముల వలన గుర్తింపబడుచుండిరి.

సన్యాస తరగతులలో బెనెడిక్టెన్స్, కార్థూసియనులు, సిస్టెర్సియనులు, ట్రాపిస్టులు, కార్మెలైట్లు, డొమినికన్లు మరియు ఫ్రాన్సిస్కన్లు సుప్రసిద్ధులు.

విమత శిక్షాసభ (The Inquisition) : మత సత్యములను బోధించు అధికారము, అందరు తన మాట వినునట్లు మరియు తాను బోధించు సిద్దాంతముల ప్రకారము నడచునట్లు చేయు అధికారము తనకు గలదని రోమా సంఘము నొక్కి చెప్పుచూవచ్చెను.దీనిని అమలులోకి తెచ్చుటకు విమత వాసన ఏదైన నున్నయెడల దానిని జాగ్రత్తగా కనిపెట్టి వెంటనే అణచివేయవలెనని అధ్యక్షులు కోరబడిరి. దీని ఫలితముగా దీర్ఘకాలముగా క్రూరహింసలు జరిగెను.12 మరియు 13వ శతాబ్దాలలో క్రైస్తవ సమూహములు రోమా సంఘము యొక్క ఆగ్రహమునకు గురయ్యెను.విమత మనునది వృద్ధి కానారంభించి సర్వదేశములకు వ్యాపించు చున్నందున రోమా సంఘ ప్రభుత్వమునకు భయము కలిగి అట్టి విమతములను కనుగొని అణచివేయుపని నిమిత్తమై విమత శిక్షాసభ పేర ఒక దానిని ఏర్పరచిరి.దీని బాధ్యతను డొమినికన్ సన్యాసులకు అప్పగింపగా వారు తమ పనిని బహు యుక్తితోను, నేర్పుతోను, మిగుల క్రూరత్వముతోను, మోటుతనముతోను చేసిరి.

విమత శిక్షాసభను మొదట AD 1233లో పోప్ ‘తొమ్మిదవ గ్రెగొరి’ స్థాపించెను. ఇవి ఇటలీ, జర్మనీ, స్పెయిన్లో స్థాపించిరి.AD 1483లో విమత శిక్షాసభ యొక్క ముఖ్య విచారణకర్తగా నియమింపబడిన ‘టోర్క్విమాడ’ తో ఇది మహాభయంకరమైనదిగా రూపుదాల్చెను.’టోర్క్విమాడ’ రోమన్ మతస్థులు కాని వారిని బహు క్రూరముగా హింసించి నందున టోర్క్విమాడ అను పేరు మహా క్రూరత్వమునకు పర్యాయ పదముగా నేటివరకు ఉన్నది.

టోర్క్విమాడ కూడ ఏర్పరచిన ఈ సభ చట్టములలో కొన్ని :

a) ప్రతికూల సిద్ధాంతములను అనుసరించిన వారిని గూర్చి తెలిసియు పై అధికారులకు తెలియజేయని యెడల వారిని అపరాధులతో సమానులుగా ఎంచుదురు.

b) విమతస్తులుగా అనుమానింపబడిన వారికి ఎన్నడైనను, ఏ విధ సహాయమెవరు చేసినను వారిని అపరాధులతో సమానులుగా ఎంచుదురు.

c) ఎవరైనను విమత గ్రంథములను గాని బైబిలును గాని తమ యొద్ద ఉంచుకొనిన యెడల అట్టివారు అపరాధులు.

d) విమత సిద్ధాంతి దాగిన (లేక) దాచబడిన గృహమును నేలమట్టము చేయవలెను.

e) రెండు సంవత్సరముల కొకసారి ప్రజలందరు సంఘాధ్యక్షుని యొద్దకు వచ్చి రోమన్ సంఘ సిద్ధాంతములను మాత్రమే వెంబడించు చున్నామని ప్రమాణము చేయవలెను.

f) ఎవరైనను పాప సంకీర్తన కొరకు సంవత్సరమున కొకపర్యాయము రానియెడల విమతస్తులని అనుమానించబడుదురు.

g) దేశ విచారణాధికారులలో ఎవరైనను విమతస్థులను శిక్షింపని యెడల వారు తమ ఉద్యోగములను మాత్రమే గాక తమ యావదాస్తిని పోగొట్టుకొందురు.విమతస్తులని భావించిన వారిని శిక్షించిన విధము :

a) దహింపబడుట వలన మరణము నొందుట.

b) దుర్గంధ భరిత, ఏ మాత్రము గాలి రాని, నిలుచుండుటకైనను సరిపడనంత ఇరుకైన చెరసాలలలో వేయబడుట.

c) చెరసాలలో ఖైదీలుగా పనిచేయుట.

d) పౌర హక్కులు, ఇతర ఆధిక్యతలను పోగొట్టుకొనుట.

e) నానా విధములుగా బాధించు యంత్రసాధనములతో చిత్రహింసలు పెట్టిరి. ఏలయనగా చేతులను, కాళ్ళను యంత్రములకు కట్టి త్రిప్పుట ద్వారా చేతులు, కాళ్ళ కీళ్ళు బెణుకునట్లు, స్థానము తప్పునట్లు చేసి సాగదీసిరి. పెడరెక్కలు విరిచికట్టి గూడులు తప్పిపోవునట్లు వ్రేలాడదీసిరి.

f) వారి అరకాళ్ళను నిప్పులపై పెట్టించి, తైలము రాసి, మాంసము ఉడుకునట్లు చేసిరి.

g) అనేక చెరసాలలు భూమి క్రింద నుండుట వలన క్రూరులు పెట్టిన బాధలకు ఓర్వజాలక వారు ఎంత ఏడ్చినను, మూల్గులిడినను శబ్దము బయటకు వినబడేది కాదు.

h) యావజ్జీవ కారాగారం విధించెడి వారు.

విమతస్తులను శ్రమపెట్టు (లేక) హతమార్చు సమయాలు ప్రజలకు ఉత్సవ దినములుగాను, విందు దినములు గాను ఉండెడివి.AD 1808లో ‘ఫ్రెంచి’ వారు ‘టొలెడో’ (Toledo) అను స్పెయిన్ దేశ పట్టణమును పట్టుకొని విమత శిక్షాసభ చెరసాలలో ప్రవేశించినపుడు ఆ సభవారు చేసిన ఘోర, క్రూరకృత్యములకు సాక్ష్యముగా నిలచిన, చక్కని పట్టు వస్త్రములు తొడిగిన కన్య మరియ కర్ర విగ్రహమును చూచిరి.చాచిన చేతులతో నున్న విగ్రహము ఎదుట మనిషిని నిలువబెట్టి యంత్రమును త్రిప్పినపుడు విగ్రహము యొక్క రొమ్మునకు ఆ వ్యక్తి గట్టిగా హత్తుకొనునట్లు ఆ చేతులు చేసెడివి.ఆ విగ్రహము యొక్క రొమ్ము ఉక్కుతో చేయబడినదై మూడు అంగుళముల పొడవు గల సూదిమేకులు, కత్తి మొనలు గలదిగా అమర్చబడి యుండెను. ఇదంతయు పట్టుదుస్తుల క్రింద ఉండెను.ఒక స్పెయిన్ లోనే 32 వేల మందిని దహించి, 3 లక్షల మందిని చిత్రహింసల పాల్జేసిరి. ఇతర దేశముల యందు అనేకులను ఈ విధముగా శిక్షించి హత మార్చిరి.రోమన్ కేథలిక్ చరిత్రకారులే ఈ విషయాలను వ్రాసిరి. విమత శిక్షాసభ యొక్క ఘోరములు స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశములయందు అధికముగా సుమారు ఏడు వందల సంవత్సరములు సాగెను.

వీటి వలన కలిగిన ఫలితములు :

a) మనుష్యునిలోని పశుబుద్ధి వికసించి వృద్ధియాయెను.

b) రోమన్ కేథలిక్ మతముపై ద్వేషము అధికమాయెను.

c) అన్యులు క్రైస్తవ సత్యము యొక్క నిజత్వాన్ని ప్రశ్నించ సాగిరి.

d) రహస్య సువార్త ప్రకటన సభలు ఐరోపా యంతటా లేచినవి.

e) అవిశ్వాసమును, నాస్తికత్వమును వృద్ధియాయెను.

f) పోపుల అధికారము క్షీణించెను.

పోపుల అధికార క్షీణత (The decline of the papacy) : పోపుల అధికార క్షీణతకు కారణములనేకములు.

a) దేశీయాభిమానము అధికమగుచుండెను. పరుల యొక్క అధికారము పట్ల అయిష్టత,

b) పోపుల నిరంకుశత్వముపై తిరుగుబాటు, ప్రజల మనస్సులను, మనస్సాక్షులను పోపులు బంధించి ఏలుటకు ప్రయత్నించిరి.

c) పోపుల పరిపాలన యొక్క మిగుల దుర్మార్గమైన స్థితి, హద్దును, సిగ్గును లేని దుబారా ఖర్చులు, సమస్త విధములైన దుర్మార్గములు, లోక భోగములు, లోక డంబముల కొరకు అమిత ధనవ్యయము, పోపుల జార సంతానమును భాగ్యవంతులుగా చేయుట మున్నగునవి ప్రజలలో సంక్షోభమును కలుగజేసెను.

d) డబ్బును గుంజుకొనుట. పై పేర్కొన్న వాటికి కావలసిన ధనమును కూర్చుటకు మిగుల అక్రమమైన, బాధకరమైన పద్ధతులను అవలంభించిరి.

నిర్బంధ దశమభాగము, యాజకులు చేసెడి ప్రతిపనికి, ప్రార్థనలకు, మాస్లకు పెద్ద మొత్తములలో మూల్యమును నిర్ణయించిరి. అన్నిటికంటే ఘోరమైనది పాప పరిహార పత్రముల విక్రయము.

క్రొత్తగా నియమింపబడిన బిషప్పులు, మఠాధిపతులు మొదటి సంవత్సరపు రాబడిని పోపుల కియ్యవలెను. చివరకు అధికారము విషయములో పోపులలో అంతఃకలహములు ఆరంభమాయెను.

7.) పాండిత్యము (Scholasticism) : గ్రీకు, లాటిన్ భాషలలో ప్రాచీన కాలములలో వ్రాయబడిన గ్రంథములను చదువుట, వాటియందున్న తాత్వికమును మధ్యకాలమందలి క్రైస్తవ థియాలజీకి సంధానము చేయుటయే స్కొలాస్టిసిజమ్.ఇది అంత ప్రయోజనకరముగా లేకపోయినను, తదుపరి వచ్చిన నాగరికోద్ధరణమునకు మానసిక సిద్ధపాటైయున్నది.

నాగరికోద్ధరణము (The Renaissance) : మనుష్యులకు ఆత్మ, జ్ఞానోపదేశినిగా, మార్గదర్శినిగా దేవుని వలన లోకమునకు వెలుగుగా నియమింపబడిన సంఘము పూర్ణముగా భ్రష్టమై, సకల విధములైన దుర్మార్గముతోను, ఏహ్యమైన కార్యములతోను నిండియుండినట్లు మానవుని మనస్సాక్షి బంధింపబడి ఆలోచించుటకును, క్రియ జరిగించుటకును అతనికున్న స్వేచ్ఛ అపహరింపబడినట్లు గమనించితిమి.మనుష్యులు జ్ఞానము వెదకనారంభించి ప్రభుత్వములోను, మతములో నుండిన నియమములను గూర్చి ప్రశ్నించుచు, ఖండించుచు క్రొత్త స్థితులను మరిమంచి మార్గములను యోచించు చుండిరి.

ఈ విధానములో మిగుల ప్రధానమైనవి ఏవనగా – విద్య పునరుజ్జీవింపబడుట, కళలు నూతనోజ్జీవము నొందుట, క్రొత్త విషయములను కనుగొనుటలో ముందంజ, మత, రాజ్య సంబంధమైన స్వేచ్ఛ కొరకైన పోరాటం మున్నగునవి.

a) విద్యా పునరుజ్జీవము : ఈ ఉజ్జీవము ఇటలీలో ఆరంభమాయెను. విద్య బహుకాలము నుండి అలక్ష్యము చేయబడి యుండెను.సామాన్య జనులలో మాత్రమే గాక యాజకులలో చాలామంది విద్యావిహీనులై యుండిరి. ఈ కాలమందు పురాపండితులు గ్రీకు, లాటిన్ భాషలలో వ్రాసిన శాస్త్ర గ్రంథములను పరిశోధించుటకు అనేకులు ప్రయత్నించిరి.ఈ గ్రంథములను చదువుటకును, ప్రతులు వ్రాయుటకును, భద్రపరచుటకును పుస్తక శాఖలను స్థాపించెను. పాత, క్రొత్త నిబంధనలను ఆదిమ భాషలలో చదువ నారంభించిరి.గ్రీకు విద్యకు ముఖ్యస్థానమైన కాన్స్టాంటినోపుల్ను AD 1453లో తురుష్కులు పట్టుకొన్నప్పుడు అచ్చట నున్న పండితోత్తములు వారి శాస్త్రగ్రంథములను పట్టుకొని ఐరోపా దేశములన్నింటికి పారిపోయిరి.ఈ సంఘటన ఆయా దేశాల్లో విద్య వ్యాపించటానికి గొప్ప సహాయకారి ఆయెను. ఆ కాల పాండిత్యము చాలా వరకు సంఘ బోధనలకు సంబంధించినది.క్రొత్త విద్య అనుదిన జీవితపు విషయములతోను దాని ఆచరణ సంబంధ విషయములతోను కూడియుండెను.

b) విశ్వవిద్యాలయముల స్థాపన : ఈ కాలమందు ఆరంభించబడినవి ప్రస్తుత కాలం వరకు కూడా ఉన్నవి.

13వ శతాబ్దములో 8, 14వ శతాబ్దములో 20, 15వ శతాబ్దములో మరో 20 స్థాపించబడినవి.

c) క్రొత్త విషయములు (The Inventions) : ఖగోళ సంబంధమైన విషయములను కనిపెట్టుటకు ‘గలిలియో’ వినియోగించిన ‘టెలిస్కోప్’ (దూరదర్శిని), నావికులు ఉపయోగించు ‘దిక్సూచి’ ఇతర శాస్త్ర సంబంధమగు సాధనములు, అన్నిటికంటే మిగుల గొప్పదైన ‘ముద్రణాయంత్రము’ ఈ కాలంలోనే కనుగొనబడెను.

జ్ఞానమును, విద్యను, నాగరికతను వ్యాపింప జేయుటకు ముద్రణా యంత్రము మిగుల ఉపయుక్తముగా నుండెను.

d) చిత్ర కళలు (The Fine Arts) : ఇవి ముఖ్యముగా శిల్పము, చిత్ర లేఖనము, వాస్తు శాస్త్రమునైయున్నవి.

ఇప్పుడు బహుగా మెచ్చుకొనబడుచు వస్తుప్రదర్శన, చిత్రశాలల కొరకు రాచనగరు, ధనవంతుల భవంతుల కొరకు బహుగా వెదకబడుచున్న గొప్ప చిత్తరువులును, ప్రతిమలును నాగరికోద్ధరణ కాలమందు రూపించబడినవే.

గొప్పవైన, గంభీరమైన అధిక ధనము వెచ్చించి ఐరోపాలో అనేక క్రైస్తవ దేవాలయములు కట్టిరి. కొన్నింటిని ఆరంభించిరి…

e) భూగోళ సంబంధమైన విషయములను కనుగొనుట : ఈ కాలంలో మనుష్యులు సముద్రములను దాటి ఇంతకు ముందెవరికిని తెలియని దేశములను కనుగొనిరి.

ఇటలీ నావికుడైన ‘క్రిస్టఫర్ కొలంబస్’ భూమి గుండ్రముగా నున్నదని గ్రహించినందున పశ్చిమ దిశగా అట్లాంటిక్ మహా సముద్రమున ప్రయాణించి ఇండియా చేరదలచెను.

AD 1498లో పోర్చుగల్ దేశస్థుడైన ‘వాస్కోడిగామా’ హిందూ మహాసముద్రము గుండా ప్రయాణించి కేరళలోని ‘కాలికట్’ చేరెను.

f) ఖగోళ సంబంధమైనవి కనుగొనుట (Astronomical Discovery) : భూమి బల్ల పరుపుగాను, నిలకడగాను సూర్యకుటుంబము మధ్యనున్నదనియు, సూర్యుడును, ఇతర గ్రహములును దాని చుట్టు తిరుగుచుండెనని ప్రాచీనులు నమ్మిరి.అయితే గలిలియో, కొపెర్నికస్ ప్రాచీనుల నమ్మిక తప్పని ఋజువు పరచుచు ఖగోళ శాస్త్రములో కొన్ని క్రొత్త సంగతులను కనుగొనిరి.

g) స్వేచ్ఛ : నాగరికోద్ధరణ కాలంలో మానవ కోటికి లభించిన గొప్పవరము స్వేచ్ఛ.

తలంచుటకును, తదనుగుణంగా కార్యములు చేయుటకు స్వేచ్ఛయు, తమకు తోచిన రీతిని మనస్సాక్షికి లోబడి ఆరాధించుటకు స్వేచ్ఛయు లభించ నారంభించెను.

అంధకార కాలములలో ఆదిమ క్రైస్తవ్యమును నమ్మకముగా కాపాడినవారు : మధ్యకాలములో ‘మత ద్వేషులు’, ‘భిన్నాభిప్రాయులు’ అని భ్రష్ట సంఘముచే పిలువబడిన వారిలో ముఖ్యముగా నిజక్రైస్తవులు ఉండి రోమన్ కేథలిక్ సంఘము క్రమక్రమముగా క్షీణించి పోవుచున్న అజ్ఞానాంధకార కాలములన్నిటిలో ఆదిమ సంఘము యొక్క ప్రథమ సత్యమును, దాని పవిత్రతను గట్టిగా పట్టుకొని పోరాడినందున విమతస్థులని కొన్నితెగల వారుండిరి.వీరు పలు దేశములకు చెందినవారు. వీరందరిని రోమన్ కేథలిక్ సంఘము తిరస్కరించి, హింసించి, కొందరిని హతమార్చిరి.

ఇట్టి తెగలలో బొగొమిలులు, ఆల్బిజెన్సులు, వాల్డెన్సిస్లు, సాధారణ జీవిత సహోదరులు, లొల్లార్డులు, బొహీమియ సహోదరులు ముఖ్యులు. వీరందరు సహజముగా సంఘ యాజకత్వమును, కన్య మరియ ఆరాధనను, ప్రతిమల ఆరాధనను, పర్గెటరీ, చనిపోయిన పరిశుద్ధులకు ప్రార్థించుట, గురువుల ఎదుట పాప సంకీర్తన చేయుట, ప్రభుభోజన, బాప్తీస్మమును గూర్చిన భిన్న బోధలు మున్నగు వాటిని నిరాకరించుచు బైబిలు చదువుట, నేర్పుట, ఆరాధించుట, పలువిధ భాషలు ఉపయోగించుట చేసిరి.ప్రతి గురువు, సామాన్య క్రైస్తవుడు, స్త్రీలు సువార్త ప్రకటించ బాధ్యులై యున్నారని విశ్వసించిరి.ఈ తెగల వారిని గూర్చి వీరి శతృవులు వ్రాసిన వాటి వలన మనకెక్కువ తెలియుచున్నది.

10) సత్య మతోద్ధారణమునకు ముందుండిన సంస్కర్తలు : ప్రజలు దేవుని వాక్యమునకు భిన్నముగా నుండిన సిద్ధాంతములను అవలంభించుటయు, సంఘము బహుగా భ్రష్టత్వము నొందుటయు తేటగా గ్రహించిన ఘనులగు క్రీస్తు సేవకులు ఆయా విషయములను గూర్చి ఆసక్తితో ఖండించుట గొప్ప సంగతి.

అట్టివారిలో ముఖ్యులు.

a) పీటర్ డి బ్రయ్స్ : AD 1104-1125 లలో ఇతడు నమ్మకముగా సువార్తను ప్రకటించిన పిదప విమతస్థుడని AD 1126 లో ఫ్రాన్స్లో దహింపబడెను.

b) లుసాన్ వాసియైన హెన్రీ : ఇతడు AD 1116-1148 వరకు సువార్త ప్రకటించెను. ‘ఇతని మాటలకు రాతి హృదయములు కరుగున’ ని చెప్పునంతటి వాగ్ధాటి గలవాడు.

చెరసాలలో వేయబడి చనిపోయెను.

c) బ్రెషియా వాసియైన ఆర్నాల్డ్ : యౌవ్వన బోధకునిగా AD 1130లో సువార్త ప్రకటన ఆరంభించాడు.

ఇతడు ముఖ్యముగా సంఘము యొక్క భ్రష్టస్థితిని, సంఘ యాజకుల సుఖభోగములను, చెడు నడతలను మిక్కిలి చాతుర్యముగా, అత్యాసక్తితో ఖండించెను. AD 1155లో పోపు ఇతనిని ఉరి తీయించెను.

d) పీటరు వాల్డో : AD 1150-1197 మధ్య కాలంలో సువార్త ప్రకటించుచు రోమన్ కేథలిక్ సంఘము యొక్క భ్రష్టత్వమును, దానిలోక సంబంధాధికారమును ఖండించెను.

ఇతడు బైబిలులోని సువార్తలను, మరికొన్ని భాగములను ఫ్రాన్స్ దేశపు భాషలోనికి తర్జుమా చేయించెను.

e) జాన్ విక్లిఫ్ : ‘సత్య మతోద్ధరణమునకు వేకువ చుక్క’యని పేరొందెను. AD 1324లో ఇంగ్లాండ్ దేశములో పుట్టెను. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయములో థియాలజీ పండితుడాయెను.రోమన్ కేథలిక్ సిద్ధాంతాచారములలో అనేకములు వేద విరుద్ధములై యున్నవని నిర్భయముగా తెలిపెను. ఇతడు చేసిన ఘనకార్యములలో అతి శ్రేష్టమైనది బైబిలును లాటిన్ నుండి ఇంగ్లీషుకు తర్జుమా చేయుటయై యుండెను.భయభక్తులు గలవారిని ప్రోగుచేసి, ప్రోత్సహించి, వారికి సహాయము చేసి దేశమందంతట సువార్త సత్యమును ప్రకటించుటకు పంపెను. ఇతనిని రోమన్ కేథలిక్ సంఘము బహుగా ద్వేషించెను.AD 1384లో నెమ్మదిగా నిద్రించెను.

f) జాన్ హస్ : AD 1369లో ‘బొహీమియా’ దేశములో జన్మించాడు. గొప్ప విద్యాధికుడు, నమ్మిన సత్యమును బలముతో ప్రకటించాడు. విక్లిఫ్ రచించిన గ్రంథాలను ఎడతెగక చదివేవాడు.కేథలిక్ సంఘ సిద్ధాంతములను, అధికారమును బహిరంగముగా ఖండించెను. 50 వేల మంది సంఘనాయకులు సమావేశమైన గొప్ప ఆలోచనా సభలో హస్ విమతస్థుడని తీర్పు చెప్పి మరణ శిక్షను విధించిరి.AD 1415 లో ‘విమతస్థుల ప్రధాని’ అని వ్రాసిన పొడవైన టోపీని తలపై పెట్టి, మరణ స్థానమునకు నడిపించి, మెడను ఇనుప గొలుసులతో ఒక స్తంభమునకు కట్టి, చుట్టును కట్టెలు పేర్చి నిప్పంటించిరి.ఈ ఘనుడు రక్షణానంద భరితుడై నిప్పుమంటలు తన కంఠస్వరమును ఆపువరకు దేవునిని గానము చేయుచు పరలోకగతుడాయెను.

g) సావోనరోల : AD 1452లో ఇటలీలో జన్మించాడు. డొమినికన్ సన్యాసి. ఇతడు బైబిలును, అగస్టీన్ రచించిన గ్రంథాలను చదువుట వలన సువార్త సత్యములను తెలుసుకొన్నాడు.

తన సువార్తా ప్రసంగములతో ప్రజలను అత్యధికముగా ఆకర్షించాడు. సంఘాధికారుల దుర్మార్గతను, తప్పు సిద్ధాంతములను బహిరంగముగా వెల్లడి చేస్తాడు.రక్షణకు పశ్చాత్తాపము అవసరమని, మనుష్య మధ్యవర్తిత్వము లేకుండా క్రీస్తుద్వారా దేవుని యొద్దకు వెళ్ళగలమని నొక్కి చెప్పాడు. AD 1498లో ఉరి తీయబడెను.


FAQ: మధ్యకాల సంఘ చరిత్ర (Medieval Church History)

FAQ

1. మధ్యకాలంలో ప్రతిమార్చన (Iconolatry) పై వచ్చిన వివాదం ఏమిటి మరియు దాని పర్యవసానం ఏమిటి?

ఆరంభంలో క్రైస్తవ ఆరాధన విగ్రహాలు లేకుండా చాలా సాధారణంగా ఉండేది, కానీ కాలక్రమేణా కొవ్వొత్తులు వెలిగించడం మరియు పటాలకు లేదా ప్రతిమలకు నమస్కరించడం వంటి ఆచారాలు సంఘంలో ప్రవేశించాయి. దీనిని తూర్పు సామ్రాజ్య చక్రవర్తి అయిన మూడవ లియో తీవ్రంగా వ్యతిరేకించాడు, కానీ పోప్ మూడవ గ్రెగొరి ఆధ్వర్యంలో 93 మంది బిషప్పులు సమావేశమై, ప్రతిమలను తీసివేయుటకు లేదా పాడుచేయుటకు యత్నించు వారిని వెలివేయాలని నిర్ణయించారు.

2. తూర్పు మరియు పశ్చిమ సంఘాలు (East and West Churches) విడిపోవడానికి గల ప్రధాన ఆచార భేదాలు ఏమిటి?

తూర్పు (గ్రీకు) మరియు పశ్చిమ (లాటిన్) సంఘాల మధ్య ఆచారాలలో చాలా తేడాలు ఉండేవి. గ్రీకు సభవారు బాప్తిస్మమును నీటిలో ముంచడం ద్వారా ఇస్తే, లాటిన్ సభవారు నీళ్లు చల్లడం లేదా క్రుమ్మరించడం చేసేవారు. గ్రీకు సభలో గురువులు వివాహం చేసుకోవచ్చు, కానీ లాటిన్ సభలో గురువుల వివాహం నిషేధించబడింది. అలాగే, ప్రభు రాత్రి భోజనంలో గ్రీకు సభవారు రొట్టె మరియు ద్రాక్షారసం రెండూ ప్రజలకు ఇస్తారు, కానీ లాటిన్ సభలో ప్రజలకు ద్రాక్షారసం ఇవ్వరు.

3. సిలువ దండయాత్రలు (Crusades) ఎందుకు జరిగాయి మరియు వాటిలో పాల్గొన్న వారికి పోపులు ఏమని వాగ్దానం చేశారు?

తురుష్కుల ఆధీనంలో ఉన్న యెరూషలేము, బెత్లెహేము వంటి పరిశుద్ధ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి AD 1096 నుండి AD 1291 వరకు మత యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధం దేవుని చిత్తమని, ఇందులో పాల్గొనే వారి పాపాలన్నీ క్షమించబడతాయని పోప్ రెండవ అర్బాను ప్రజలను ప్రేరేపించాడు. ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారు పర్గెటరీతో పనిలేకుండా నేరుగా మోక్షానికి వెళ్తారని పోపులు నమ్మించారు.

4. విమత శిక్షాసభ (Inquisition) చరిత్రలో “టోర్క్విమాడ” (Torquemada) పాత్ర ఏమిటి?

విమత శిక్షాసభ అనేది రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నవారిని (విమతస్థులను) కనుగొని శిక్షించడానికి ఏర్పాటు చేయబడిన సభ. AD 1483లో స్పెయిన్ దేశంలో దీనికి ముఖ్యాధికారిగా నియమితులైన టోర్క్విమాడ అత్యంత క్రూరుడిగా పేరు పొందాడు. ఇతని నాయకత్వంలో స్పెయిన్‌లోనే సుమారు 32,000 మందిని దహించి చంపారు మరియు 3,00,000 మందిని చిత్రహింసల పాలు చేశారు.

5. “సత్య మతోద్ధారణమునకు వేకువ చుక్క” (Morning Star of Reformation) అని ఎవరిని పిలుస్తారు మరియు ఎందుకు?

ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ విక్లిఫ్ (John Wycliffe) ను సత్య మతోద్ధారణమునకు వేకువ చుక్క అని పిలుస్తారు. రోమన్ క్యాథలిక్ సంఘంలోని అనేక ఆచారాలు వేద విరుద్ధంగా ఉన్నాయని ఆయన నిర్భయంగా ఖండించారు. ఆయన చేసిన అత్యంత గొప్ప కార్యము బైబిలును సామాన్యులకు అర్థమయ్యేలా లాటిన్ భాష నుండి ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేయడం.


సంఘ చరిత్ర మరిన్ని భాగాల కోసం.. CLICK HERE

ADVERTISEMENT

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!