నిస్సీ విశ్వాసం.
Nissy Faith Inspiring Sunday School Story
పిల్లలూ, బావున్నారా?ఎలా ఉన్నారు? ఆరోగ్యం బావుందా? మరలా మీకొక కథ చెప్పడానికి ప్రభువువారు నాకు అవకాశం ఇచ్చారు. సరే మనం కథ చెప్పుకుందామా! ఇది కథకాదు, జరిగిన సంఘటన.
బెల్ఫాస్ట్ అనే పట్టణానికి దగ్గరలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో నిస్సీ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె మంచి భక్తిపరురాలు. వాళ్ల మమ్మీ డాడీ కూడ మంచి భక్తి పరులై యున్నారు. మన అమ్మ నాన్నలు భయభక్తులు కల్గియుండినట్లయితే మనమును భయభక్తులు కలిగియుంటాం కదా! అలాగే నిస్సీ, వాళ్ల మమ్మీ డాడీని పోలి దేవుని యందు గొప్ప విశ్వాసము కలిగి యుండింది.
ఒక దినము నిస్సీ ఆటపాటలలో మునిగియున్నప్పుడు కాలి బొట్టన వ్రేలికి గాయమయ్యింది. నిస్సీ దానినేమి పట్టించుకోకుండా అలా వదిలేసింది. రెండు మూడు రోజులకు ఆ గాయం పెద్దదైపోయి కాలంత వాచిపోయింది. ఆ వాపు నెమ్మది నెమ్మదిగా పాదానికీ, కాలికీ ప్రాకింది. తర్వాత అది పగిలిపోయి చీము కారటం ప్రారంభించింది. ఆ గాయం కాస్త పెద్దదైపోయి బొట్టనవ్రేలి యొక్క గోరు ఊడిపోయింది. నొప్పి అధికముగా నున్నందున నిస్సీవాళ్ళ మమ్మీ డాడీ డాక్టర్ దగ్గరికి తీసికొని వెళ్లారు.
డాక్టర్ గాయాన్ని నిశితంగా పరిశీలించి – “ఇప్పటికే ఆలస్యమైంది. సెప్టిక్ అయిపోయింది ఆపరేషన్ చేసి బొట్టనవ్రేలును తీసెయ్యాలి. లేకపోతే కాలుమొత్తానికే తీసివేయ్యాల్సి వస్తుంది” అని హెచ్చరించాడు.
డాక్టర్ గారి మాటలు నిస్సీ తల్లిదండ్రులకు భయాన్ని పుట్టించాయి. బొట్టన వ్రేలు తీసివేయడానికి వారెంత మాత్రమును అంగీకరించలేదు. వారు ఇంకొక డాక్టర్ను సంప్రదించారు. ఆయన కూడా బాగా పరీక్షించి – “తప్పకుండా బొట్టన వ్రేలు తీసివేయాలి. ఆలస్యమైతే కాలికే ప్రమాదం” అన్నాడు.
చివరికి కొంతమంది డాక్టర్లు సమావేశమై చర్చించుకొని తెల్లవారే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆ రోజు రాత్రి నిస్సీకి నిద్రపట్టలేదు. తెల్లవారితే తనకు ఆపరేషన్ జరుగుతుంది. అలా చాలాసేపు వేచియున్న తర్వాత మగత నిద్ర పట్టినది. అప్పుడామెకి ఒక కల వచ్చింది. ఆ కలలో -” ఆమె తల్లిదండ్రులతో కలిసి బెల్ఫాస్ట్ పట్టణంలోని డా॥ బెన్ గారు అనే ఒకతను ఉన్నారట. అక్కడకు వెళ్లింది. వారు ఆయన ఇంటికి వెళ్లేసరికి ఆయన తన గదిలో నిలువబడి కోటును తీసివేసి చొక్కా చేతులను మడుచుకుంటూ ఉన్నారు. ఆయన తల వెంట్రుకలు ఎర్రగా ఉన్నాయి. ఆయన నల్లని ఏఫ్రన్ క్లాతుకట్టుకొని యున్నారు. ఆయన ఆపరేషన్ చేయకుండానే బొట్టనవ్రేలిని తొలగించకుండానే నిస్సీని బాగుచేసాడు” ఇదీ, కల.
ఇంచుమించు ఒక గంటసేపటి తరువాత నిస్సీకి మెళకువ వచ్చింది. ఆమె ముఖంలో సంతోషం పొంగిపొర్లింది. తన కల అంతటినీ తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు గాని ఏమి చేయను తోచలేదు. ఆమె కల అద్భుతముగా నున్నది. ఎందుకంటే నిస్సీ ఎన్నడు డా॥ బెన్ గారిని గూర్చి వినలేదు, ఎన్నడును ఆయన్ను చూడలేదు. ఆ పేరుగల డాక్టర్ ఒకరు బెల్ఫాస్ట్ పట్టణంలో నున్నారని అస్సలు తల్లిదండ్రులకే తెలియదు.
వారు బెల్ఫాస్ట్ పట్టణానికి వెళ్లి విచారణ చేయగా ఫలానా వీధిలో ఆ పేరుగల సర్జన్ వున్నారని తెల్సింది. వారు ఆయన ఇంటికి వెళ్లి ఆయన రూమ్లో ప్రవేశించారు. అక్కడ వున్న సన్నివేశానికి వారు ఆశ్చర్యపోయారు. సరిగ్గా నిస్సీ కలలో ఏమి చూసిందో అలాగే ఆయన ఉన్నారు. ఆ తరువాత తమ కుమార్తె యొక్క పరిస్థితిని చెప్పి దేవుడెలా నడిపించాడో వివరించినప్పుడు డా॥ బెన్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన కూడ భక్తిపరుడే.
తరువాత నిస్సీ గాయమును పరీక్షించి గాయాన్ని శుభ్రం చేసి మందులేసి కట్టు కట్టారు. రెండు మూడు దినముల తరువాత కట్టు మార్చుకోవడానికి రమ్మన్నారు. అలా మొత్తము మూడు సార్లు కట్టు మార్చిన తరువాత నిస్సీ గాయము మానిపోసాగింది. ఒక నెల లోపలే పూర్తిగా ఆ గాయము మానింది. మరల యథావిధిగా నడువసాగింది.
విన్నారా పిల్లలూ! మన ప్రభువు ఎంత గొప్పవాడో! ఆయన మాటలాడే దేవుడు! ఆయన మన అక్కరలు ఎరిగిన దేవుడు! కర్ర, రాయి, చెట్టు పుట్టలాంటివాడు కాడు!
నిస్సీ విశ్వాసమును ప్రభువు ఎంతగా ఘనపర్చాడో చూసారా? మీరును ప్రభువు నందు భయమునూ, భక్తినీ కలిగి యుండండి. అప్పుడు నిస్సీని నడిపించి తోడైయున్న దేవుడు మీకును తోడైయుంటాడు.
బైబిలు సెలవిస్తుంది “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము చేయుదును? నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును” అంటూ ప్రభువు చెబుతున్నారు (యెషయా 48:17).
ప్రత్యక్ష గుడారం మేటీరియల్ కొరకు.. click here
PRAISE THE LORD 🙏