సామెతలు గ్రంధం వివరణ
Proverbs Best Explanation In Telugu
జ్ఞానము అనునది సామెతల యొక్క ముఖ్య పదము. జీవితం రమ్యంగానూ, సుఖంగానూ జరిగిపోవాలంటే – శక్తివంతమైనది జ్ఞానమే. మన అనుదిన జీవితంలో ఆచరణాత్మకమైన సమస్యలను విజయవంతమైన స్థితిలో సంధించాలంటే ప్రతీ విశ్వాసీ… ప్రతీ మానవుడు ఈ సామెతలు గ్రంథం చదవాల్సిందే!
హీబ్రూ భాషలోని బైబిల్ను మూడు తరగతులుగా విభజించవచ్చు. అవి – ధర్మశాస్త్రము, ప్రవక్తలు, జ్ఞాన రచనలు (కీర్తనలు)గా నున్నవి (లూకా 24:44తో పోల్చండి). ఈ మూడవ తరగతిలో కవిత్వ సంబంధమైనవి మరియు జ్ఞాన సంబంధమైనవి ఉన్నాయి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము వంటి గ్రంథాలున్నాయి.
హీబ్రూ బైబిల్లో మూడు తరగతులు ఉన్నట్లే, ప్రాచీన ఇశ్రాయేలులో మూడు రకాలైన దైవసేవకులు ఉండేవారు. వారు – యాజకులూ, ప్రవక్తలూ, జ్ఞానులు. ఈ జ్ఞానులూ జీవితానికి సంబంధించిన తాత్విక విషయాలలో ఆచరణాత్మకమైన ప్రత్యేకమైన దైవజ్ఞానం కల్గియుండేవారు.
ఈ జ్ఞానుల దైవావేశపూరిత జ్ఞానానికి ఋజువు సామెతల గ్రంథం నిలుస్తోంది.
ఇశ్రాయేలులో కీర్తనల సంప్రదాయానికీ దావీదు ఆద్యుడు అయినట్లే, ఇశ్రాయేలులో జ్ఞాన బోధనా సంప్రదాయానికీ ఆద్యుడు సొలొమోను (సామెతలు 1:1, 10:1, 25:1 చూడండి). 1రాజులు 4:32 ప్రకారం సొలొమోను 3000 సామెతలనూ, 1005 కీర్తనలనూ రచించాడు. సామెతల గ్రంథంలో మనకు ఆగూరు (30:1-33), రాజైన లెమూయేలూ (31:1-9) అనేవారు కూడా కన్పిస్తారు. వారిని గూర్చి మనకు తెలీదు.
సామెతలు 22:17, 24:23 వచనాల ప్రకారం ఇంకా యితర రచయితలు ఉన్నారని మనకు అర్థం అవుతుంది. ఎక్కువ సామెతలు క్రీ.పూ. 10 శతాబ్దంలో పుట్టినను, ఈ గ్రంథం కూర్పు పూర్తయిన కాలం మాత్రం హిజ్కియా రాజు పరిపాలనా సమయంలోనని చెప్పవచ్చు (అంటే సుమారు క్రీ.పూ. 700 ప్రాంతాలలో). యూదా రాజులలో దావీదు తర్వాత చెప్పుకోవాలంటే హిజ్కియాను గూర్చి మనం చెప్పుకోవచ్చు. ఇతడు దావీదు వలె దేవునికి భయపడువాడు. ఇతని కాలములో ఓ గొప్ప ఉజ్జీవ ప్రభంజనం లేచింది. క్రీ.పూ. 715 – 686 మధ్య కాలంలో యూదా రాజ్యం ఆత్మీయంగా చాలా ఉత్తేజింపబడింది. సరిగ్గా ఆ కాలంలోనే హిజ్కియా సేవకులు సొలొమోను సామెతలను ఎత్తిరాసారు (25:1-29:27).
ఈ సమయంలోనే ఆగూరు, రాజైన లెమూయేలుల రచనలు “జ్ఞానులు చెప్పిన సామెతల” సేకరణ కూడా జరిగి ఉంటుంది.
హీబ్రూ భాషలో “మాషాల్” అనే పదాన్ని “సామెత”గా తర్జుమా చేయవచ్చు. దీనికి – “దేవోక్తి”, “ఉపమానము”, “జ్ఞాన యుక్తమైన పలుకు” అనే అర్థాలున్నాయి. ఈ విధంగా సామెతల గ్రంథంలో కొన్ని సుదీర్ఘమైన సందేశాలు (దేవోక్తి) ఉన్నాయి. (ఉదాహరణకు 1:20 – 33, 2:1 – 22, 5:1-14)
అలాగే నీతివంతమైన, వివేకవంతమైన జీవితం సాగించడానికి అవసరమైన జ్ఞానంతో నిండిఉన్న సారభరితమైన చిన్న చిన్న ప్రకటనలూ ఉన్నాయి. ప్రాచీన తూర్పు దేశాలలో సర్వసాధారణమైన “సామెతల ద్వారా బోధన”కు తార్కాణంగా ఈ గ్రంథం నిలిచినప్పటికీ, దేవుని మరియు ఆయన నిబంధన జనులకై ఆయన నైతిక ప్రమాణాల నేపథ్యంలో ఈ గ్రంథ రచన జరిగింది. కాబట్టి ఇది విభిన్నమైనది. “సామెతల ద్వారా బోధన” అనే ప్రక్రియ ఎంతోప్రసిద్ధమైనది. వాటిలో ఉండే సుష్పష్టత తేలికగా జనులు వీటిని వల్లె వేయగలగడం, ఒక తరం నుంచి మరొక తరానికి వీటిని అందించగలగడం దీనికి కారణం.
కీర్తనల గ్రంథము వలె సామెతల గ్రంథమునకు కూడా గ్రంథకర్తలు అనేకులు ఉన్నారు. కాని ప్రధాన సంచాలకుడు సొలొమోనే.
ఈ గ్రంథం యొక్క ఉద్దేశ్యం 3 విధాలుగా ఉన్నది.
ఒకటి – జ్ఞానం లేనివారికి బుద్ధికలిగించడం (సామె 1:4)
రెండు – యువతకు తెలివి, వివేచన పుట్టించడం (సామె 1:4)
మూడవది – జ్ఞాని మరింత పాండిత్యం సంపాదించుకోవడం కొరకై వివేకం కలిగిన నడవడి, నీతి న్యాయాలూ, ధర్మాలను గూర్చిన వివేచన, జ్ఞానాలను కలిగించడం (సామె. 1:5,6)
సామెతల గ్రంథం సవ్యంగా, వివేచనతో జీవించడానికి ఒక మార్గదర్శక గ్రంథంగా ఉంటున్నది. అయితే ఆ జ్ఞానానికీ పునాది “దేవుని యందలి భయము” అని స్పష్టంగా ప్రకటిస్తోంది (1 :7).
కొందరు పెద్దలు సామెతల గ్రంథాన్ని – “యువకుల ఉత్తమ జీవిత మార్గదర్శిని” అంటూ పిల్చారు. లూథర్ – “మంచి కార్యముల గ్రంథం” అని పిల్చాడు. డీన్ స్టాన్లీ “అనుదిన జీవిత తత్వ శాస్త్రము” అని పిల్చాడు. కోల్డ్జ్ – “శ్రేష్టమైన రాజకీయ తంత్ర శాస్త్రము” అని పిలిచాడు. బ్రిడ్జెస్- బైబిల్లోని యితర గ్రంథములు మన పిలుపుయొక్క అమూల్యతను ప్రస్తావిస్తున్నాయి. అయితే సామెతలు దినములోని 24 గంటలు మన పిలుపునకు తగిన నడవడికను గూర్చి వివరంగా నేర్పిస్తుంది” అని చెప్పాడు. ఓటింగన్ అనే పండితుడు – “యేసును అతి తేటగా బయలు పరుస్తోంది ఈ గ్రంథం” అని చెప్పాడు.
సామెతల గ్రంథంలోని శ్రేష్టత ఏమిటంటే – నీతిని మరియు నిజమతమును కలిపి దైవభక్తి జ్ఞానములను చూపిస్తుంది. యూదేతర మరియు క్రైస్తవేతర మతములలో కొన్ని – మామూలు నీతిని, మత భక్తిని వేరుచేసి చూపిస్తాయి. కాని హెబ్రీయులు నీతిని మత భక్తిని కలిపి అభివృద్ధి చేసుకున్నారు.
ప్రస్తుత ప్రపంచ సామాజిక అవసరత ఏమిటంటే నీతి అభివృద్ధి కావాలి. మరి ఇది ఎలాగు జరుగుతుంది? సత్యమత ఉజ్జీవం అత్యవసరం! దేవుని మనస్సులో నుంచి వచ్చిందే సత్యమతం. అది ఉజ్జీవింపబడితే తప్ప నేటి మన సామాజిక అవసరత తీరదు!
సామెతల గ్రంథాన్ని ఐక్యంగా ఉంచే అంశం – జ్ఞానం. ఈ జ్ఞానం కూడా “సరైన జీవితం కొరకైనటువంటిది”. ఈ జ్ఞానం దేవునికి విధేయతతో లోబడటంతో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన జ్ఞానమూ జీవితంలోని అన్ని రంగాలకూ వ్యాపిస్తోంది.
సామెతలలోని జ్ఞానం మొదటిగా- కుటుంబ విషయాలలో బుద్ధి చెబుతున్నది. “కుటుంబం, యౌవనం, లైగింక పవిత్రత, వివాహసంబంధాలలో నమ్మకత్వం, నిజాయితీ, కష్టించి పని చేయడం, దాతృత్వం, స్నేహం, న్యాయం, నీతి, క్రమశిక్షణ మొదలుగునవి.
రెండవదిగా– పాపంలోని మూర్ఖత్వం, విరోధం, నాలుకతో చిక్కులు, అపాయాలు, బుద్ధిహీనత, మద్యపానం, తిండిబోతుతనం, కాముకత్వం, లైంగిక అవినీతి, కృత్రిమత్వం, సోమరితనం, చెడ్డస్నేహాలు – వీటిని గూర్చి హెచ్చరిస్తుంది.
మూడవదిగా – వివేచనకూ – మూర్ఖత్వానికీ, నీతికీ దుర్మార్గానికీ, గర్వానికి- వినయానికీ, సోమరితనానికీ – చురుకుదనానికీ, పేదరికానికీ – ఐశ్వర్యానికీ, ప్రేమకూ – కాముకత్వానికీ, మంచికీ – చెడుకూ, జీవానికీ – మరణానికీ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపెడుతున్నది.
సామెతలు ఎంతో ఆచరణాత్మకమైన పుస్తకమైనా, దేవుని గూర్చిన గంభీరమైన దృక్పధం ఇందులో ఉంది. ఇందులో “క్రీస్తు” జ్ఞానానికీ ప్రతిరూపముగా, అసలు ఆయనే జ్ఞానముగా కనిపిస్తారు (8:22 – 31), ఆయన సృష్టికర్త (ఉదా: 3:19-20, 8:22-31, 14:31, 22:2), సర్వజ్ఞుడు (ఉదా: 5:21, 15:3,11; 21:2), నీతిమంతుడు (ఉదా॥ 11:1, 15:25-27, 29; 19:17, 21:2-3), సార్వభౌముడు (ఉదా॥ 6:9, 33, 19:21, 21:1)
ఉత్తమ నడవడిక కల్గిన భార్యను ప్రశంసించడంతో సామెతల గ్రంథం ముగుస్తున్నది (31:10-31)
8వ అధ్యాయంలో జ్ఞానం వ్యక్తిత్వం దాల్చడానికీ, యోహాను సువార్తలో వాక్యం శరీరధారిగా అవతరించడానికీ సామ్యముంది (యోహాను 1:1-18). జ్ఞానం సృష్టికార్యంలో పాలు పంచుకుంది (3:19-20, 8:22 – 31). భౌతిక ఆత్మీయ జీవితాల ఆరంభంతో సంబంధం కలిగియుంది (3:19, 8:35). నీతి, నైతిక జీవితాలకు జ్ఞానం అన్వయమైనది (8:8-9). తనను వెదికేవారికి అది దొరుకుతుంది (2:1 – 10, 3:13 – 18, 4:7-9, 8:35-36).
బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తమైయున్నవి (కొలస్సీ 2:3)
ఆయన మనకు జ్ఞానమును… ఆయెను (1 కొరింథీ 1:31)
సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తులో సామెతలలో ఉన్న ఈ జ్ఞానం అంతిమంగా ప్రకటించబడింది (లూకా 11:31)
సామెతలలో కుటుంబానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు చాలా ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే మీ బైబిలు ముందుంచుకుని చూడండి (ఉదా॥ 10:1; 12:4; 17:21, 25; 18:22;19:14,26; 20:7; 21:9,19; 22:6,28; 23:13-14, 22,24,25; 25:24; 27:15-16; 29:15-17; 30:11; 31:10-31). ప్రభువు కుటుంబానికి ప్రధమ, ప్రముఖ స్థానమును ఇచ్చారు. ఇశ్రాయేలీయులతో దేవుడు చేసుకున్న నిబంధనలో వలెనే సామెతలలో కూడా కుటుంబం ప్రముఖ స్థానం పొందింది (నిర్గమ 20:12,14,17, ద్వితీ. 6:1-9తో పోల్చి చూడండి).
కీర్తనలూ, ఇంకా బైబిల్లోని ఇతర పుస్తకాలకు వలె సామెతలకు కూడా సారాంశం చెప్పడం సులభం కాదు. కాని సామెతల గ్రంథానికీ కొంత పైకి కన్పించే నిర్మాణం ఉంది
కౌమార దశను చేరుకున్న కుమారునికి ఒక తండ్రిలా బోధించిన 13 ప్రసంగాలు 1నుంచి 9 అధ్యాయాల వరకూ ఉన్నాయి. వీటిలో స్పష్టమైన రచనా ఆకృతి కన్పిస్తుంది. వీటిలో మూడు ప్రసంగాలు (1:30, 8:1, 9:1 చూడండి) తప్పించి మిగిలిన ప్రతీ ప్రసంగమూ “నా కుమారుడా” లేక “నా కుమారులారా” అనే సంబోధనతో మొదలౌతుంది. ఈ 13 ప్రసంగాల లోనూ యువకుల కొరకు ప్రాముఖ్యమైన ధర్మసూత్రాలు చాలా ఉన్నాయి.
సామెతల గ్రంథంలో 8 ప్రధానమైన అంశాలున్నాయి. అవి ఏమిటంటే…
- జ్ఞానం. ఈ జ్ఞానానికీ తెలివితో గానీ, “అధిక తెలివి” తో గానీ సంబంధం లేదు. దీనికి “దేవుని యందలి భయం”తో సంబంధం ఉంది (1:7). అంటే దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు గైకొనేవారు జ్ఞానులు అన్నమాట. “దేవుని భయం”అనేది ఈగ్రంథంలో మనకు పదే పదే కనిపిస్తుంది. (బైబిలు తెరచి చూడగలరా? అయితే– 1:7, 29, 2:5, 3:7, 8:13, 9:10, 10:27, 14:26,27, 15:16, 33; 16:6, 19:23, 22:4, 23:17, 24:21
- సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానోపదేశం ఎక్కువ భాగం ఒక తండ్రి తన కుమారునికీ లేదా కుమారులకు బోధిస్తున్నట్లు ఉంటుంది.
- పాత నిబంధనలో ఇది ఎక్కువ ఆచరణాత్మక పుస్తకం. మన అనుదిన జీవితంలో సరైన సంబంధాల కొరకూ, మంచి నడవడి కొరకూ అనేకమైన మూల సూత్రాలను ఈ గ్రంథం ప్రస్తావిస్తున్నది. ఈ సూత్రాలను అన్ని తరాలవారునూ, అన్ని సంస్కృతులకు సంబంధించిన వారునూ తమకు అన్వయించుకోవచ్చు.
- యువకులు తమ జీవితాలకు మార్గదర్శకాలుగా వీటిని కంఠస్తం చేసి గుర్తుంచుకోవడానికీ వీలుగా ఆచరణాత్మక జ్ఞానమూ, దేవుని సూత్రాలూ, జీవితం కొరకైన మౌలిక సూత్రాలూ చిన్న చిన్న ప్రటకనల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త ద్వారా ఇచ్చారు.
- సామెతల గ్రంథంలో కుటుంబానికి ప్రముఖ స్థానం ఉంది. కుటుంబం విషయంలో దేవుని ఉద్దేశాన్ని భంగపరిచే పాపాలను వెలికి తీసి వాటికి వ్యతిరేకంగా అనేక హెచ్చరికలను సామెతల గ్రంథం చేస్తూంది.
- సామెతలలోని సాహిత్యపరమైన ప్రధాన విశేషతలేమిటంటే రచయితలు ఉపయోగించిన స్పష్టమైన అలంకారిక భాష, పోలికలు, వైరుధ్యాలు, క్లుప్తంగా ఉండే ధర్మసూత్రాలూ, పునరుక్తీ మొదలైనవి.
- ముగింపులో (31వ అధ్యాయం) వివేకవతియైన భార్యను, తల్లిని గూర్చి వర్ణించడం ప్రాచీన సాహిత్యంలోనే ఒక మంచి స్త్రీని వర్ణించే విషయంలో ఎంతో ప్రత్యేకమైనది.
- పాత నిబంధనలోని సామెతలలో ఉన్న జ్ఞాన బోధ నూతన నిబంధనలోని పత్రికలలో ఆచరణాత్మక బోధకు సూచికగా పనిచేస్తుంది.
సామెతల గ్రంథంలో కనిపించే జ్ఞానం ఆచరణాత్మకమైనదైనా అది లౌకికమైనది కాదు. అది దేవున్నుంచి వచ్చే జ్ఞానం. లౌకిక జ్ఞానమైతే ఇతరుల ఆసక్తులను పట్టించుకొనక స్వార్థపూరితమైన ఆశలను ప్రోత్సహిస్తుంది. దైవభక్తిగల జ్ఞానం దేవుని నీతిని అవగాహన చేసుకొని దానిపై ఆధారపడి అనుసరణీయమైన నీతిని ప్రోత్సహిస్తుంది (యాకోబు 3:13 – 18తో పోల్చి చూడండి)
గ్రంథశైలి అద్భుతం! సామెతల గ్రంథంలోని అధిక భాగం పద్యరచన శైలి. సామెతల్లోని పద్యం ఎక్కువగా ద్విపదశైలికి చెందినది. ఈ రెండు పాదాలు స్పష్టమైన సామ్యం కలవి. ఒకే భావాన్ని ఆరెండు పాదాలు వేవ్వేరు పదాల్లో (16:16) ఒకే మూల భావాన్ని బలపరుస్తూ ఒక విషయాన్ని అభ్యర్థిస్తూనో, హెచ్చరిస్తూనో (16:21) ఉంటాయి. కొన్నిసార్లు ప్రాథమికమైన వివరణకు పర్యవసానాన్ని తెలియజేస్తాయి (3:6), లేదా రెండు పాదాలలో ఒక దానికొకటి వ్యతిరేకమైన సత్యాలను వివరిస్తాయి (11:5)
సామెతలను గద్యంలా, లేక ఒక నవల చదవినట్టు చదవకూడదు. సామెతల గ్రంథాన్ని ఆదినుంచి అంతం వరకు ఒకేసారి చదవకుండా ఉండటం మంచిది. దీనిలోని ఉపదేశం చిన్నదిగా, సరళమైన న్యాయచింతన గలిగి పాఠకుడు ఆగి ఆలోచిస్తూ మళ్లీ చదివే విధంగా రూపించబడ్డాయి. పరిశుద్ధాత్మ ప్రభువు – ఈ జ్ఞాన బోధకులను పాఠకుడు వీటిని కంఠస్థం చేసి వివిధ సందర్భాల్లో వాటిని అనుసరించేలా, అతణ్ణి ప్రోత్సహించే విధంగా పద్యరూపంలో రాయించారు. రచయిత:డేవిడ్ పాల్ గారు.
ప్రత్యక్ష గుడారం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. click here





