SAINT THOMAS – INDIAN APOSTLE – తోమా గారి జీవితం

తోమా గారి జీవితం

SAINT THOMAS – INDIAN APOSTLE

పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమా కూడా గలిలయ సముద్ర తీరాన చేపలు పట్టేవాడు! ఇతనికి ‘దిదుమ’ అనే పేరు కూడా కలదు. దిదుమ అనే పేరుకు గ్రీకు భాషలో ‘కవలలు’ అని అర్థ మున్నది! 

  తోమా అనగానే సామాన్యంగా అనుమానస్థుడని మనమందరము భావిస్తుంటాము! కాని, తోమా తన అనుమానాలను అనుమానములుగానే ఉంచు కొనక; ఆ అనుమానములను తీర్చుకొని దృఢమైన విశ్వాసమును పొందవలెనని ఆశించే వ్యక్తి! ఈ దినములలో అనేకులు అనేకమైన సందేహములతో నిండియుంటు న్నారు గాని, వారి సందేహములను తీర్చుకొని, విశ్వాస జీవితములో ముందుకు సాగకుంటున్నారు. యేసుక్రీస్తు యొద్ద ప్రతి సమస్యకు, ప్రతి సందేహమునకు జవాబున్నది!

  “లాజరు చనిపోయెను. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమా -ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను” (యోహాను 11:15,16). 

  ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము రండని తోమా చెప్పిన మాట ఇక్కడ లాజరుతో చనిపోవటము అను అర్థము కాదు; చనిపోయిన లాజరును ప్రభువు తిరిగి లేపలేడని నమ్మకపోవుట వలన కాదు గాని, యేసుప్రభువు యెరూషలేములో శ్రమపడి మరణించవలసియున్నదన్న మాట తోమా గుర్తు చేసుకొని, యేసుతో పాటు మనమును శ్రమ పొందుటకును, మరణించుటకును వెళ్ళుదము రండని చెప్పెను.

  క్రీస్తుతో పాటు శ్రమయైనను, నష్టమైనను, మరణమైనను అనుభవించుటకు సిద్దమే అన్న మనస్సు తోమాకుండెను. యోహాను సువార్త 14వ అధ్యాయములో ప్రభువు-నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి వచ్చెదననగా – ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే; నీ మార్గమును మాకు తెలియజెప్పుమనెను. ఇందులో ఆ మార్గమేదో తెలియని అవిశ్వాసమే కాక, ప్రభువు మమ్ములను విడిచిపెట్టి వెళ్ళిపోవుచున్నాడే! మేమేలాగు ప్రభువును చేరగలము? అనే దిగులు హృదయము కనిపిస్తున్నది. అందుకు “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే త న తండ్రి యొద్దకు రాడు” అని ప్రభువు చెప్పెను (యోహాను 14:6). అంటే, ‘తోమా! నేనే మార్గమును, నీవు భయపడనక్కరలేదు’ అని చెప్పెను. 

  సోదరుడా! సోదరీ!! నిన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళుటకు యేసుక్రీస్తు ఒక్కడే మార్గమని; నీవు ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా నీవు ఆయన బిడ్డగా మారి, ఆయన రాజ్య వారసుడవగుదువని నమ్ముచున్నావా? 

  యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు, తోమా – నేననుకొన్నట్లే అయ్యింది, ప్రభువు మరణించాడు అని దుఃఖముతో కృంగినవాడై ఒంటరిగా పోయి వేదనపడు చుండెను. అందుకే అతడు మిగిలిన శిష్యులతో కలవలేదు. అతడు ప్రభువునెంతో ప్రేమించాడు. గనుకనే ఎంతగానో కృంగిపోయాడు. తాను ప్రభువుతో చనిపోదామని అనుకొన్నాడే గాని, ప్రభువు తనను రమ్మనలేదే అని కృంగిపోవుచుండెను.

  కాని, తాను మరల శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు వారందరు మేము ప్రభువును చూచితిమని చెప్పిరి. అందుకతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి, నా వ్రేళ్ళు ఆ మేకుల గురుతులలో పెట్టి, నా చేయి ఆయన ప్రక్కలో యుంచితేనే గాని నమ్మనే నమ్మను అనెను. ఇది కేవలము అనుమానమే కాక, వేదనతో కృంగిపోయిన అతని హృదయములో నుండి వచ్చిన బాధాకరమైన మాటలు! 

  తోమా నమ్మలేదని మనము చెప్పడానికి ముందు ప్రభువు శిష్యులందరును ఆయనను చూచువరకు ఆయన పునరుత్థానుడై యున్నాడని నమ్మలేదని గ్రహించాలి! మన ప్రభువు మన సందేహములను తీర్చడానికి ఆశ కలిగినవాడు! కాబట్టి ఎనిమిదవ దినమున శిష్యులందరు కూడియుండగా ‘మీకు సమాధానమని చెప్పి, తోమాను చూచి – నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను’ (యోహాను 20:27). అంతే, ప్రభువును చూచిన తోడనే తోమా అనుమానములు ఎగిరిపోయెను. 

  తన చేయి చాచి ఆయన గాయములలో ఉంచకముందే, ‘నా ప్రభువా, నా దేవా’ అనెను. తండ్రి యొద్దకు వెళ్ళు మార్గము తెలియదే అనిన తోమా ఆయనే తండ్రి; ఆయనే ప్రభువని నమ్మెను. అందుకు ప్రభువు – నీవు చూచి నమ్మితివి గాని, చూడక నమ్మినవారు ధన్యులని చెప్పెను (యోహాను 20:27-29). ప్రియ మిత్రమా! పునరుత్థానుడైన యేసుప్రభువును నీవు నమ్ముచున్నావా? లేనిచో మోకరించి ప్రార్థించి, నీ సందేహములను ప్రభువు సన్నిధిలో తీర్చుకో! 

  తోమా మెసపొతోమియా యందున్న ‘ఏడేస’ పట్టణములో తన సేవను ప్రారంభించెను. బబులోను, పారశీక దేశములలో కూడా అతడు కొంతకాలము సేవ చేసి, తరువాత మన భారత దేశమునకు క్రీ.శ. 49లో చేరెను. ఇచ్చట మరణించనైయున్న ఒక యువరాజును యేసు నామములో బ్రతికించినందున తోమా సేవ చేయుటకు అవకాశము దొరికెను.

  ఆ తరువాత క్రీ.శ. 52వ సంవత్సరములో మలబారు సముద్ర తీరమున నున్న ‘గిరంగనూర్’ వచ్చెను. ఇది కేరళ రాష్ట్రములోని కొచ్చిన్కు సమీపములో నుండెను. ఆ తరువాత అతడు చైనా దేశమునకు వెళ్ళి, కొంతకాలము సేవ చేసి తిరిగి మన దేశమునకు వచ్చి, మద్రాసు పట్టణములో సేవ చేసెను. 

  మద్రాసులోని మైలాపూర్ లో  సేవ చేస్తుండగా, సువార్త విరోధులు అతనిని చంపుటకు ఆలోచన చేసిరి. లిటిల్ మౌంట్ అనే స్థలములో గుహ లోనికి వెళ్ళి ప్రార్థించుట తోమాకు వాడుక! ఆలాగు ప్రార్థించుకొను చుండగా అతనిని బల్లెములతో పొడిచిరి. గాయపడిన తోమా, నేను ఆయన గాయములలో నా వ్రేలును యుంచితేనే గాని నమ్మనన్న మాటను జ్ఞాపకం చేసుకొంటూ నేడు ‘సెయింట్ థామస్ మౌంట్’ అని పిలువబడుతున్న స్థలము వరకు వెళ్ళి, అచ్చట నాటబడియున్న సీలువను హత్తుకొని ప్రాణమును విడిచెను. 

  క్రీ.శ. 72వ సంవత్సరములో జూలై 3వ తేదీన ఇతడు మరణించె నని చెప్పుదురు. సువార్తను మన దేశమునకు తెచ్చి, ప్రస్తుతం చెన్నై అని పిలువబడుచున్న మద్రాసులో హతసాక్షిగా మరణించిన వ్యక్తి ఈ తోమాయే! 


For More Stories……Click Here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

1 thought on “SAINT THOMAS – INDIAN APOSTLE – తోమా గారి జీవితం”

  1. Praise the Lord,
    మిషనరీస్ జీవిత చరిత్ర చదివినప్పుడు నేను ఎంతో త్యాగముతో జీవించాలని సవాల్ చేయబడుతుంటాను. సేవలో ఎదుర్కొనే సమస్యల్లో ధైర్యం కలుగుతుంది. నా శ్రమలు చిన్నవిగా కన్పిస్తాయి.

    నా ఆత్మకు జీవహారము ఈ పాఠాలు.
    నేను ఏ విధమైన వేదాంత విద్య తర్ఫిదు పొందలేదు, మీ వాట్సాప్మీ గ్రూప్రు ఫాలో అవ్వడం వలన మీరు పంపించే ప్రతి పోస్ట్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను.

    వందనములు

    Reply

Leave a Comment

error: Content is protected !!