యెహోయాషు
Story of King Joash in the Bible Telugu
యెహోయాషు అనగా ‘యెహోవా యిచ్చెను, యెహోవా బలము గలవాడు’ అని అర్థము! యెహోయాషు ఇశ్రాయేలు రాజగు యెహోయాహాజు కుమారుడు. ఇతడు తన తండ్రితో కలిసి ఏలనారంభించి తన తండ్రి మరణానంతరం సంపూర్ణాధికారం పొంది, షోమ్రోనులో రాజుగా పదహారు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇతని ఏలుబడి ఆరంభములో అష్షూరు రాజు సిరియా దేశముపై దండెత్తుట వలన ఇశ్రాయేలీయులకు సిరియనుల బెడద తొలగి ప్రశాంతముగా ఉండిరి.
యెహోయాషు తన తండ్రి కాలములో జరిగిన సంగతులను ఎరిగిన యెహోవా ప్రవక్తయైన ఎలీషాను ఘనపరచినట్లు తెలియుచున్నది. “ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడై యుండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు – నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను” (II రాజులు 13:14). ఈ యెహోయాషు దైవజనుని యొక్క విలువ ఎరిగినవానిగా కనబడుచున్నాడు. ఆయనను ‘నా తండ్రీ’ అని సంబోధించుచున్నాడు. అహాబు అయితే ‘నా పగవాడా’ (1 రాజులు 21:20); ‘ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడా’ (1 రాజులు 18:17) అని ఏలీయాను సంబోధించాడు. యెహోరాము కూడా ఇశ్రాయేలీయుల శ్రమలకు ఎలీషాయే కారణమని పగపట్టి అతని తల నరికించాలని ఆలోచన చేసెను (II రాజులు 6:31).
ఈనాడనేకులు గద్దించేవారిని, బుద్ధి చెప్పేవారిని శత్రువులుగా భావిస్తున్నారు. తమ పాపముల వలన తెచ్చుకొన్న శ్రమలకు ఇతరులను నిందింస్తున్నారు. నిజమైన దైవజనుడు తండ్రివంటివాడే! “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది” (II తిమోతి 3:16-17).
“శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయిన వారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందని యెడల దుర్భీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైయుండిరి. వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రతుకవలెను గదా! వారు కొన్ని దినములు మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” (హెబ్రీ 12:7-11). పరిశుద్ధుడైన పౌలు “క్రీస్తునందు మీకు పలు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని” (1 కొరింథీ 4:15) అనెను.
యెహోయాషు రౌతులను నీవే అని ఏడ్చెను. ఎన్ని ఆయుధములును, రథములును ఉన్నను దైవజనుల ప్రార్ధన వలన కలిగే సహాయము లేనిచో జయము లేదని గ్రహించెను. దేవుడనేకసార్లు దైవజనుని నోటిమాట ద్వారా తన శక్తిని, తన ఆశీర్వాదాలను, తన ఉద్దేశ్యాలను బయలుపరచును. ఈ వర్తమానమును చదువుచున్న పాఠకా! నీ జీవితములో నీవెంత గొప్ప వ్యక్తివైనా; దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళి దేవుని వాక్యపు గద్దింపులను, దేవుని సేవకుల సలహాలను, ప్రార్థనా సహాయాన్ని – నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలు వారికి రథములును, పొందుచుండవలెను.
తన తండ్రి కాలము నుండి సిరియనుల మీద జయము పొందుటకు ఎలీషా ప్రార్థనా సలహాలే కారణమని గ్రహించిన యెహోయాషు మరణపడక పైనున్న ఎలీషాను చూచి – ‘అయ్యో నీవు లేనిచో మాకు జయము లేదే’ అన్నట్లుగా ఏడ్చెను. అయితే ఎలీషా ఇశ్రాయేలు రాజైన యెహోయాషును బాణము పట్టుకొనుమని చెప్పి తన చేతులను రాజు చేతుల మీద ఉంచి – ‘ఇది యెహోవా రక్షణ బాణము; సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము అని చెప్పి తూర్పుననున్న కిటికీ నుండి బాణము వేయుమని చెప్పెను. ఆ తరువాత నేలను కొట్టుమని చెప్పినప్పుడు, యెహోయాషు ముమ్మారు కొట్టి మానెను. అందుకు దైవజనుడు – నీవు అయిదు మారులైనను, ఆరు మారులైనను కొట్టిన యెడల సిరియనులు నాశనమగువరకు హతము చేసియుందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను’ (II రాజులు 13:14-19). దైవజనుని మాట ప్రకారమే యెహోయాషు ముమ్మారు జయము పొందెను.
ఈనాడనేకులు దేవుడు సంపూర్ణ జయమిచ్చుటకు ఆశించినను, కొందరు కొన్ని జయములు సంపాదించినందుకే సంతోషించుచున్నారు. ఒకని జీవితములో బయట శత్రువులను జయించుట ఎంత అవసరమో, అతని అంతరంగములోని శత్రువులను జయించుట అంతే అవసరము! సాతాను ప్రేరితమైన లోకాశలను జయించుట ఎంత అవసరమో, మోసకరమైన హృదయములో నుండి వచ్చు శరీరాశలను జయించుట అంతే అవసరము!
యెహోయాషు యూదా రాజ్యముపై దండెత్తి, యూదా రాజును పట్టుకొని, యెరూషలేమును ముట్టడించి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, మందిరమందున్న వెండి బంగారాలను కొల్లగొట్టెను. అయితే ఇతడు కూడా ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యరొబాము పాపముల ననుసరించుట మానలేదు. ఇతని మరణానంతరం ఇతని కుమారుడైన యరొబాము రాజాయెను.
యెహోయాషు చరిత్రలోని పాఠాలు
- మంచి మార్గదర్శకత్వం ఎంత ప్రాముఖ్యమోయెహోయాషుజీవితం చెబుతుంది.
- ధేవుని మీద నమ్మకం కోల్పోతే రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా సమస్తం కోల్పోతామని తెలియజేస్తుంది.
బైబిల్ ప్రశ్నలు – సమాధానాల కోసం .. click here





