దేవుని హస్తం – God’s Protective Hands – Sunday School Story

దేవుని హస్తం

God’s Protective Hands – Sunday School Story

 పిల్లలూ, బావున్నారా? ఎలా ఉన్నారు? ఈ ఆర్టికల్  ద్వారా నేను మిమ్ములను పలకరించడం నాకెంతో సంతోషంగా ఉంది. మీ స్టడీ ఎలా వుంది? సండేస్కూలు మరియు వి.బి.యస్ లాంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? మీరు రాబోయే తరం యొక్క దేవుని చేతి సాధనాలు అని మరచిపోకండి. క్రమశిక్షణ కలిగి ప్రభువునందు విశ్వాసంతో సాగిపొండి. ప్రభువు మిమ్ములను ఆశీర్వదిస్తాడు. మంచిది! మనం కథ చెప్పుకుందామా?

 ద లెపర్డు అనే పేరు గల ఓడ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తూ ఉంది. ఇది బెల్జియం ఓడ. అందులో 9మంది సిబ్బంది, కెప్టెన్ సహా కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. అది ఫాల్క్ ల్యాండ్ ద్వీపాలకు సమీపించినప్పుడు గొప్ప తుఫాను చెలరేగింది. ఓడ అదుపు తప్పింది. సిబ్బంది తమ శాయశక్తులా ప్రయత్నించారు. కాని వారి వల్ల కాలేదు. 

 కెరటాల తాకిడికి ఓడ కొట్టుకొని పోతుంది. ఎటువైపు వెళ్తున్నారో వారికే అర్థం కావట్లేదు. పేటగోనియా తీరప్రాంతాలకు వచ్చేసరికి అది ఒక పెద్ద రాయికి గుద్దుకున్నది. అతి వేగంతో వెళ్లి గ్రుద్దినందువలన ఓడ ముక్కలు చెక్కలై నామరూపాల్లేకుండా పోయింది. 

 ఓడలోని సరుకులు, సిబ్బంది, ఆఫీసర్లు అందరూ నీటి పాలయ్యారు. చివరికీ ఏమీ మిగల్లేదు. అందరూ చనిపోయారని ఒడ్డునకు సమాచారమందింది. బంధుమిత్రులకు నిరాశే మిగిలింది. 

 కాని ఓడ సిబ్బందిలో ఒకరైన డెక్లర్కు మాత్రం చనిపోలేదు. అతడు మృత్యువుతో పోరాడాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి కృంగిపోలేదు. శక్తినంతటిని కూడదీసుకుని ఈదాడు. ఎన్ని గంటల సేపు ఈదాడో, ఎన్ని మైళ్ళ దూరము ఈదాడో అతనికే తెలీదు. బ్రతుకుతాననే నమ్మకం లేదు. అలాగని చావడానికీ సిద్ధంగా లేడు. మృత్యువుతో పోరాడుతున్నాడు. చివరికి ఎలాగోలా ఒక ద్వీపానికి చేరుకున్నాడు. 

 ద్వీపమంతా తిరిగి చూశాడు. కాని ఒక్క మనిషి కూడ కనిపించ లేదు. తాను భోజనం చేసి ఎన్ని రోజులైందో. ఆకలి దహించి వేస్తున్నది. సముద్రపు ఒడ్డుకు వచ్చాడు. ఓడ ప్రయాణీకులు పారవేసిన కొన్ని రొట్టె ముక్కలు ఒడ్డునకు కొట్టుకువచ్చాయి. వాటిని ఏరుకుని తిని ఆకలి మంటను చల్లార్చుకున్నాడు.  Sunday School Story Telugu

 రోజులు గడుస్తున్నాయి. మరల ఆకలి వేయసాగింది. ఈసారి రొట్టె ముక్కలు దొరకలేదు. వెంటనే తనకొక ఆలోచన వచ్చింది. ఒక కర్ర తీసుకున్నాడు. ఒక పక్షిని చంపాడు. తాను కొట్టుకుని వచ్చేటప్పుడు తన దగ్గర అగ్గిపెట్టెను మాత్రము జాగ్రత్తగా ఉంచుకున్నాడు. మంటవేసి పక్షిని కాల్చుకుని తన ఆకలి బాధను తీర్చుకున్నాడు. 

 ఈ విధంగా ఆకులూ అలములూ పక్షులూ చేపలూ ఏవి దొరికితే అవి కాల్చుకుని తినసాగాడు. 

 సముద్రంలో తమ ఓడలాగానే ప్రమాదాలకు గురైన ఓడల యొక్క చెక్కలు ఒడ్డుకు కొట్టుకొని వచ్చాయి. వాటన్నిటినీ సేకరించాడు. తన దగ్గరనున్న అగ్గి పుల్లలన్నీ అయిపోయాయి. నిప్పుకూడ ఆరిపోతే తనకు ఆహార సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మంట వేసి ఎప్పుడూ ఆ మంట రగిలేటట్లు చేసాడు. 

 తాను సముద్రం నుంచి సేకరించిన చెక్క పలకలను ఆ మంట చుట్టూ ఉంచాడు. ఆ మంటకు అతి సమీపంలోనే రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. 

 కాని అంతలోనే పెద్దగాలి వచ్చింది. తాను మంటకు అడ్డంగా పెట్టిన చెక్కలు గాలి తాకిడికి మంటలో పడి కాలిపోయాయి. అతనికి మెళకువ వచ్చేసరికి పెద్దమంటలు చెలరేగి చెక్కలన్నీ అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఇంక మంటను కాపాడటానికీ తన దగ్గర ఏమీ లేదు. ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదనుకున్నాడు. 

 దేవుడే తనకు విరోధంగా పోరాడుతున్నట్లనిపించింది. ఎంతో నిరాశతో కృంగిపోయాడు. 

 అంతలోనే ఆ ద్వీపానికీ రెండు మైళ్ల దూరంలో ప్రయాణం చేయుచున్న ఒక అమెరికా ఓడలోని సిబ్బంది మనుష్య సంచారం లేని ఈ ద్వీపంలో నుండి దట్టమైన పొగలేవడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ వింత ఏమిటో తెలుసుకుందామని తమ ఓడను అటువైపు నడిపించారు. 

 మంట ప్రక్కనే కూర్చుని విలపిస్తున్న డెక్లర్కుని చూసి జాలిపడ్డారు. తరువాత అతని కథను విని అతణ్ణి తమ ఓడలో ఎక్కించుకుని వెళ్లారు. ఏ పరిస్థితైతే తనకు కీడుగా భావించుకున్నాడో, అదే తనను రక్షించడానికీ దేవుడు వాడుకున్న సాధనమని తెలుసుకున్నాడు. అతడు ఒడ్డునకు వెళ్ళిన తర్వాత బెల్జియంలోని తన బంధుమిత్రులకు ఉత్తరం రాసాడు. యింకా తాను బ్రతికే ఉన్నానని, దేవుడు ఏ విధంగా తనను కాపాడాడో అన్ని వివరములు చదువుకొని తన బంధుమిత్రులు ఎంతో సంతోషించారు.  

 పిల్లలూ, వింటున్నారా? మనకు సంభవించే ప్రతీ పరిస్థితిలోను మనం దేవుని హస్తాన్ని చూడాలి. అది మనకు కీడు అనిపించినప్పటికీ, దాని విషయంలో ప్రభువు యొక్క కార్యము ఏదో జరుగబోతుందని మనం విశ్వసించాలి. దేవుని పిల్లలమైన మనకు సంభవించే ప్రతి దానిలో మనకు మేలును దాచిపెడతాడు. 

నిరాశ వదిలేయండి! నిస్పృహను జయించండి!! 

“మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును” (రోమా 8:28) అంటూ బైబిలు సెలవిస్తోంది. 


ప్రత్యక్ష గుడారం కొరకు.. click here 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!