ఆదికాండము – The Book of Genesis Explanation In Telugu

ఆదికాండము 

The Book of Genesis Explanation In Telugu

పరిచయం 

ఆదికాండము అంటే ‘మూలము’ లేక ‘ప్రారంభము’ అని అర్థం. బైబిల్లోని ఈ పుస్తకం సృష్టి, మానవుడు, మానవ పాపం, దేవుని రక్షణ మార్గాలు మొదలైనవాటి గురించిన ప్రారంభాన్ని వివరిస్తోంది గనుక దీనికి ఆదికాండమన్న పేరు సరైనదే. బైబిల్లో ప్రారంభ పుస్తకంగా (ప్రత్యేక పుస్తకంగా) ఉన్నప్పటికీ పంచకాండాలు లేక పంచ గ్రంథాలు అనే విస్తృతమైన మూల గ్రంథాల్లో ఇదొక భాగం మాత్రమే. 

పంచ గ్రంథాలు (కాండాలు) 

ఇశ్రాయేలీయులకు మాతృభాష, పాత నిబంధన గ్రంథానికి మూలభాష హెబ్రీ భాషే. హెబ్రీభాషలో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని క్రీ.పూ. 3వ శతాబ్దంలో గ్రీకు భాషలోనికి అనువదించారు. డెబ్బయిమంది పండితులు దీన్ని అనువదించారు గనుక ఇది ‘సెప్టువజింట్’ అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. దీన్ని LXX అని కూడా రాస్తారు. సెప్టువజింట్ అన్న గ్రీకు పదానికి ‘డెబ్బయిమంది అనువదించినది’ అని అర్థం. ఈ అనువాదకులనుండే మొదటి అయిదు పుస్తకాలకు పంచగ్రంథాలు అన్న పేరును గ్రహించారు. (“పెంటా” అనగా అయిదు, “ట్యూకోస్” అనగా సంపుటి అని అర్థం ఇచ్చే ఈ రెండు గ్రీకు పదాలనుండి పంచకాండాలకు పెంటా ట్యూక్ అనే పేరు పెట్టారు). 

ఈ అయిదు పుస్తకాలూ మూలంలో ఒకే గ్రంథమైనప్పటికీ ఈ ఐదూ, ఐదు వేర్వేరు చుట్టలుగా ఉండి పాఠకులకు అను కూలంగా ఉండడానికి ఇప్పుడున్న విధంగా దీనిని ఐదు పుస్తకాలుగా విభజించారు. ఈ పంచ కాండాలను “ధర్మశాస్త్రం” అని హెబ్రీయులు పిలుస్తారు (2దిన 17:9; నెహెమ్యా 8:1-3, 18; మత్తయి 5:17 – 19; 11:13; 12:5; లూకా 24:44). 

పంచ గ్రంథాల రచయిత ఎవరో ఆ గ్రంథాలు వివరించక పోయినా వీటి రచయిత మోషే అని అనాదిగా హెబ్రీ, క్రైస్తవ సంప్రదాయాల విశ్వాసం (2దిన 35:12; నెహెమ్యా 8:1; 13:1; దాని 9:11; మార్కు 12:26; లూకా 16:29 – 31; అపొ.కా. 15:21). ప్రజలు మరచిపోకుండా వంశపారంపర్యంగా మౌఖికంగా చెప్పుకోవడం ద్వారానూ, రాసుకొని పదిలపరచుకొన్న కుటుంబ వివరాలను, పురాతన కీర్తనలను, సాంప్రదాయ కథలను 

క్రోడీకరించడం ద్వారానూ మోషే దీనిని గ్రంథస్థం చేశాడనడంలో సందేహం లేదు (ఆది 5:1; 6:9; 10:1; 35:20; సంఖ్యా 21:14). ఇంతేగాక మోషే తరచుగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవుని ఆదేశాలను పొందాడు (నిర్గమ 33:11; ద్వితీ 34:10). వీటితో బాటు మోషే తన జీవితకాలంలో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా వీటికి జోడించి పదిలపరిచాడు (నిర్గమ 17:14:24:4; సంఖ్యా 33:2; ద్వితీ 31:22, 24). దేవుని నడిపింపు ద్వారా ఈ అంశాలన్నింటినీ ఒకటిగా క్రోడీకరించినదాన్నే మోషే పంచ కాండాలు అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం. 

బైబిలుకు సంబంధించిన పత్రాల్లోని వివరణలు, పదాలు, సమాసాలు, దేవుని పేర్లు, ఇశ్రాయేలీయుల మత విధాన వివరాలకు సంబంధించిన పోలికలు, సమాంతర భావాలు, వ్యతిరేకతలను గురించి బైబిలుకు సంబంధించిన పత్రాలను పండితులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. మోషే అనంతరం చాలా కాలానికి గాని మనం ఇప్పుడు చూస్తున్న పంచకాండాల సమగ్రరూపం ఏర్పడలేదని వీరు సూచించారు. అసలు వేటికవిగా ఉండే పత్రాలను తర్వాతి కాలంలో ఒకటిగా పొందుపరచారని కొందరు విశ్వసిస్తారు. 

ఈ అంశాలను గురించిన అనేక వాదోపవాదాల్లో పడి పంచ కాండాలు ఎలా రాశారు అన్నదానికంటే దాని అర్థం ఏమిటి అన్నది ప్రాముఖ్యమైన అంశమని చాలామంది మరచిపోతున్నారు. హీబ్రూ, క్రైస్తవ పరిశుద్ధ గ్రంథాలు రెండింటిలోనూ స్పష్టమైన సమగ్రత గలదిగాను, దేవుని సజీవవాక్య సందేశం గలదిగానూ ఆదికాండ గ్రంథం నిలిచి ఉంది (నెహెమ్యా 8:8,14;9:3; యోహాను 5:39, 45-47; అపొ.కా. 28:23). 

బైబిల్లోని మొట్టమొదటి పుస్తకానికి “ఆదికాండము” అని అనువాదకులు నామకరణం చేశారు. దీన్ని “ఆదిలో” లేక “ప్రారంభంలో” అని హెబ్రీయులు పిలిచారు. ప్రకృతి సంబంధమైన ప్రారంభంతో గాక మానవులతో దేవుడు కోరుకున్న సంబంధ బాంధవ్యాన్ని వివరించడమే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. 

దేవుడు నిష్కళంకునిగా సృజించిన మానవుడు, ఆ తర్వాత పాపంలో పడిపోయాడు. అతని పాప ఫలితం మానవులందరికీ 

సంక్రమించింది. దేవునిపై తిరుగుబాటు చేసిన మానవుడు దేవుని న్యాయవిమర్శకు పాత్రుడై ఆ తీర్పును పొందినా ఆయన న్యాయ విమర్శ సదా ఆయన కృపతో మిళితమై ఉంటుంది. దేవుడు మానవ జాతిని నాశనం చేయలేదు. అందరికీ అందుబాటులో ఉండే రక్షణ మార్గాన్ని ఇవ్వడానికి ఆ మానవజాతి ద్వారానే ఆయన పని చేశాడు. ఒక వ్యక్తిని (అబ్రాహామును) ఎంచుకొని, ఆ వ్యక్తి సంతానం (ఇశ్రాయేలీయులు) ద్వారా ఒక జాతిని నిర్మించి ఆ జాతి ద్వారా ఆయన తన ఉద్దేశాన్ని మానవులకు తెలియజేసి తద్వారా లోక రక్షకుని (యేసును) ఉద్భవింపజేయడమే ఆయన మార్గం. 

మానవుడెలా దేవునికి ఎదురు తిరిగి ఆయన న్యాయవిమర్శకు లోనైనాడో తెలియజేయడమే గాక మానవ రక్షణ కొరకు తన పథకాన్ని దేవుడెలా ప్రారంభించాడో ఆదికాండం తెలియజేస్తోంది. అబ్రాహాము నుండి ఒక జాతిని నిర్మించి వారికి కనానును స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు చేసిన వాగ్దానాలను వివరించడమే గాక ఆ దేశానికి, ప్రజలకు సంబంధించి ఆ వాగ్దానాలు ఏ విధంగా నెరవేరాయో కూడా వివరిస్తుందీ పుస్తకం. 

ఆదికాండమును హిబ్రూ బైబిలులో ‘బెరెషిత్’ అని పిలుస్తారు. ‘బెరెషిత్’ అనగా ఆదియందు అని అర్ధం. ఆంగ్ల పదమైన Genesis గ్రీకు Lxx లోని ‘Genesios’ నుండి వచ్చింది. ఈ మాటకు ఆరంభము అని అర్ధము. పేరుకు తగినట్లుగానే ఆదికాండమును ఆరంభముల పుస్తకం అని అనవచ్చు. ఆదికాండములో తొమ్మిది’ ఆరంభములను చూడవచ్చు 

  •  మానవునికి నివాసయోగ్యమైనదిగా భూమియొక్క ఆరంభం 1:1-2:3 
  • మానవజాతి ఆరంభం 2:4-25 
  • మానవుని పాపము యొక్క ఆరంభము 3:1-7 
  • దేవుని విమోచనా ప్రణాళిక యొక్క ఆరంభము 3:8-24 
  • ఈ మానవ కుటుంబము యొక్క ఆరంభము 4:1-15 
  • నాగరికత ఆరంభము 4:16-9.29 
  • జాతుల ఆరంభము 10:1-32 
  • మానవ భాషల ఆరంభము 11:1-9 
  • హెబ్రీ జాతి ఆరంభము 11:10-50:28. 

మూల పురుషులు 

     అబ్రాహాము గుణ లక్షణాలు 

  • ఎ)దైవిక పిలుపు (అధ్యా: 12) 
  • బి) అబ్రాహాము, లోతు కథ (అధ్యా: 13,14) 
  • సి) అబ్రాహామునకు దైవిక వాగ్ధానములు, ముఖ్యంగా కుమారుని గూర్చిన వాగ్ధానం, పరిశుద్ధ భూమిని స్వతంత్రించుకొనుట, గొప్ప సంతతి (అధ్యా: 15-17). పుస్తకము యొక్క      మూలాధారము, లోతైన ఆత్మీయ అర్థములను బయలు పరచడమే దీని ముఖ్య ఉద్దేశమై ఉన్నది. 
  • డి) మైదాన పట్టణములు కొరకు అతని విజ్ఞాపన, ఆపట్టణముల నాశనం (అధ్యా:18-19) ఇ) గెరారులో అతని జీవితం, ఇస్సాకు జననం ద్వారా కుమారుడు కలుగునను వాగ్దానం  నెరవేర్పు (అధ్యా: 20:21) 
  • ఎఫ్) అతని విధేయతను పరిశోధించుటకు ఇస్సాకును బలిగా అర్పించుమని కోరబడిన దైవజనుడు(అధ్యా: 22) 
  • జి) అతని మరణం (అధ్యా: 25:8) 

ఇస్సాకు జీవిత చరిత్ర : 

  • ఎ) అతని జననం (అధ్యా: 21:2) 
  • బి) అతని వివాహం (అధ్యా:24) 
  • సి) అతని కుమారులైన యాకోబు, ఏశావుల జననం (అధ్యా 25:20-26) 
  • డి) అతని కడవరి సంవత్సరములు (అధ్యా: 26, 27) 

యాకోబు జీవిత చరిత్ర : 

  • ఎ) జేష్టత్వమును పొందిటలో అతని మోసం (27: 1-29) 
  • బి) అతని పరలోక నిచ్చెన దర్శనం (28:10-22) 
  • సి) పద్దనరాములో అతని వివాహం, అతని జీవితానికి సంబంధించిన సంఘటనలు ( అధ్యా:29-31)

ఏశావు జీవిత చరిత్ర: 

యోసేపు జీవిత చరిత్ర : 

యాకోబు కడవరి సంవత్సరములు, ఇశ్రాయేలు కుటుంబం ఐగుప్తుకు పయనం (అధ్యా: 37-50) ఆదికాండములో ప్రసిద్ధి చెందిన పేర్లు: 

  1. ఆదాము, హవ్వ కయీను, హేబేలు 
  2. అబ్రాహాము, లోతు 
  3. ఇస్సాకు, ఇష్మాయేలు 
  4. ఏశావు, యాకోబు 
  5. యోసేపు అతని సహోదరులు. 

గొప్ప ఆత్మీయ గుణ లక్షణములు గల ఐదుగురు వ్యక్తులు 

  1. హనోకు – దేవునితో నడచిన మనుష్యుడు (ఆది 5:24) 2. నోవహు – ఓడ నిర్మాణకుడు (ఆది 7:1)
  2. అబ్రాహాము – విశ్వాసులకు తండ్రి (ఆది 12:1)
  3. యాకోబు – ప్రార్ధన వలన జీవిత రూపాంతరం పొందిన మనునష్యుడు (ఆది 32:24)
  4. యోసేపు – బానిసత్వం నుండి ఐగుప్తు దేశాధిపతిగా హెచ్చించబడిన యాకోబు కుమారుడు (ఆది 39:1)

ఆదికాండము యొక్క ఉద్ధేశ్యము : 

ఆరంభము నుండి ఒక మతపరమయిన రాజ్యముగా ఏర్పడుటకు సిద్ధమయ్యేంత వరకు మానవులతో దేవుడు వ్యవహరించిన తీరును క్లుప్తముగా వివరించుటకు ఆదికాండము వ్రాయబడినది. ఆదికాండములోని వృత్తాంతములు వాటి చారిత్రక ప్రాముఖ్యతను బట్టి కాక తన విమోచనా ప్రణాళికలో భాగముగా దేవుడు తన ప్రజలతో వ్యవహరించిన తీరుతో వాటికున్న సంబంధమును బట్టి ఎంపిక చేయబడినాయి. 

ఆదికాండము యొక్క విభజన: 

ఆదీకాండములోని 50 అధ్యాయమును రెండు ముఖ్య భాగములుగా విభజించవచ్చు. అవి. 

  • * 1-11 అధ్యాయములు సృష్టినుండి అబ్రహాము పిలుపు వరకు 
  • * 12-50 అధ్యాయములు – మూలపురుషుల వృత్తాంతములు 

మొదటి భాగములో: నాలుగు ముఖ్య సంఘటనలను గూర్చి మనం నేర్చుకొనవచ్చు. అవి : 1. సృష్టి (1-2), 2. సతనము (3), 3. జలప్రళయము (4-9), 4.జాతులు (10-11). 

రెండవ భాగములో:  నలుగురు ముఖ్య వ్యక్తుల వృత్తాంతములు ఉన్నాయి. 

అవి : 1. అబ్రహాము (12-24), 2. ఇస్సాకు (25-26), 3. యాకోబు (27-36), 4. యోసేపు (37-50) 

మొదటి భాగము : 1-11 అధ్యాయములు : నాలుగు ముఖ్య సంఘటనలు. 

బైబిలులోని మిగతా 1178 అధ్యాయములను సరియైన రీతిలో అర్ధం చేసుకొనుటకు ఈ 11 అధ్యాయములను గ్రహించుట ఎంతో ప్రాముఖ్యము. ఈ అధ్యాయములలోని విషయములను ఉన్నవాటిని ఉన్నట్లుగా నమ్మగలిగితే మిగిలిన పాత, క్రొత్తనిబంధనలను నమ్ముటకు ఎట్టి సమస్య ఉండదు. ఈ అధ్యాయములు 2000 సం॥లు చరిత్రను వివరిస్తాయి. 

ఎ) సృష్టి (1-2) : ఆదికాండము 1,2 అధ్యాయములలోని 56 వచనములలో సృష్టి క్రమమును గూర్చిన సంక్షిప్తమైన మరియు సంపూర్ణమైన వివరణ ఇవ్వబడినది. మొదటి వచనము దేవుడు ఏమి చేసారో తెలియచేస్తే మిగిలిన 55 వచనములు దేవుడు తాను సృజించిన దానిని ఎలా సృజించారో తెలియజేస్తాయి. (First verse tells us what He did and the remaining 55 verses informs us hey He went about doing ( all He did). అంతేకాక 1వ అధ్యాయము సృష్టి అంతటి యొక్క నిర్మాణమును గూర్చి తెలియజేస్తే 2వ అధ్యాయము 6వ రోజున దేవుడు

  • మానవుని ఏవిధంగా సృజించారో ప్రత్యేకంగా తెలియజేస్తుంది. 

దేవుడు ఆరు రోజులలో భూమ్యాకాశములను, సముద్రములను అందున్న సమస్తమును సృజించారు. 

  • మొదటి రోజు – వెలుగును కలుగజేసి, వెలుగును చీకటిని వేరుపరచారు. 
  • రెండవ రోజు – భూమికి ఆకాశమునకు మధ్య వాతావరణము (విశాలము)ను కలుగజేసారు. 
  • మూడవ రోజు -భూమిని సముద్రములను వేరుచేసి, సమస్త వృక్ష జాతులను కలిగించారు.  
  • నాల్గవ రోజు – జ్యోతులను చేశారు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు 
  • ఐదవ రోజు – జలచరములను, పక్షులను సృజించారు. 
  • ఆరవ రోజు – అడవి జంతువులను, పశువులను, పురుగులను చేసారు. మానవుని సృజించారు.  

* దేవుడు తన స్వరూపమందు, తనపోలిక చొప్పున మానవుని చేసి 

  • ఏదేను తోటలో వారిని ఉంచారు.
  • భూమి మీద సమస్త అధికారమును ఇచ్చారు.
  • తోటను సేద్యపరిచే, కాచే పని అప్పగించారు.
  • గొప్ప స్వేచ్ఛ నిచ్చి, ఒకే ఒక పరిమితిని విధించారు.
  • సాటియైన సహాయమును సృజించి, వివాహముతో వారిరువురిని ఒకటి చేసారు.
  • అతనితో సహవాసమునకు అంకురార్పణ చేసారు.

1వ అధ్యాయములో దేవుని పేరు ‘ఎలోహిమ్’ గా బయలు పరచబడినది. ఎలో హిమ్ అనగా ‘సర్వోన్నతుడు’. 2వ అధ్యాయములో ‘దేవునికి’ ‘యెహోవా’ అన్న పేరుకూడా జతచేయబడినది. 2:4 దేవుడైన యెహోవా (Lord God). ఇది దేవుని నిబంధనా నామము.  

బి) పతనము (3వ అ.) : 3:1లో పేర్కొనబడిన యుక్తిగల సర్పము’ (సాతాను) ఆదాము హవ్వలు దేవుని వాక్యమును (మాటను) సందేహించునట్లు చేసింది.” తద్వారా వారు దేవుడు చెయ్యవద్దని చెప్పిన దానిని చేసి దేవుని కవిధేయులైనారు. 

దేవుని మాటను నమ్ముటలో ఆత్మీయ, నైతిక బలముంది. అయితే దేవుని మాటలను సందేహించుట ఆత్మీయ, నైతిక బలహీనతను కల్గిస్తుంది. దేవుని మాటలను సందేహించిన హవ్వకు ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనపడుటలో ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతో పాటు ఆదాముకు కూడా ఇవ్వగా అతడు కూడా తినెను. 

కన్నులు తెరువబడిన వారిద్దరు దేవుని నుండి దాగుకొని, తమ దిగంబరత్వమును కప్పుకొని, తమ అపరాధమునకు ఇతరులను నిందించినప్పటికి వెంటనే దేవుని తీర్పు దిగి వచ్చింది. సర్పము, భూమి, స్త్రీ పురుషులు- వారి సంతానము శపించబడ్డారు. 

అయితే తన స్వరూపంలో చేయబడిన మానవుని పక్షంగా కృప చూపి రక్షణ కొరకైన ఏర్పాటును దేవుడు చేసారు (3:15)

సి) జలప్రళయము (4-9) 

కయీను హేబేలును చంపాడు. దేవునిచే శిక్షింపబడిన కయీను, అతని సంతతి దేవుడు లేని ప్రజలుగా (నిర్దేవులుగా) చెడుతనము జరిగించారు.. అయితే ఆదాము, హవ్వలకు మరొక కుమారుని (షేతు) ఇచ్చుట ద్వారా దేవుడు, మెస్సియా రాక కొరకైన మార్గమును ఏర్పరచారు. షేతు ఆదాము పోలికగా, ఆదాము స్వరూపమున జన్మించుటను, దేవుడు చెప్పినట్లు మనుష్యులు మృతినొందుటను 5వ అధ్యాయములో గమనించవచ్చు. 

మానవుని పతనం తరువాత మరియు జలప్రళయం రాక మునుపు మానవులు సంఖ్యాపరంగా అభివృద్ధి చెందారు. వారు దేవునికి దూరంగా జీవిస్తూ, జీవితమునకో అర్ధాన్ని, ఉద్దేశ్యమును దేవునికి వెలుపల వెదుకుతూ పాపమును కూడా వృద్ధిచేసారు. మానవుని చెడుతనము ఎంత ఎక్కువైందంటే భూమి అంతటిని జలప్రళయంతో ముంచి చేయుట ద్వారా మానవుని పాపమునకు తీర్పు తీర్చాలని దేవుడు. నిర్ణయించారు. నీతిపరుడు, తన తరములో నిందారహితుడైన నోవహు, అతని భార్య, ముగ్గురు కుమారులు, కోడండ్రును దేవుడు తాను నోవహుతో తయారు చేయించిన ఓడద్వారా రక్షించారు (6-7) ఈ ఓడ శాపము, పాపశిక్ష నుండి (ఆత్మీయ, శారీరక మరణము) దేవుని కృపాభరిత రక్షణ ఏర్పాటుకు సూచనగా ఉంది. జలప్రళయం తరువాత నోవహు ముగ్గురు కుమారుల ద్వారా దేవుడు మానవునికి ఓ నూతన ఆరంభమునిచ్చారు. నోవహుతో నిత్య నిబంధన చేసారు. జలప్రళయంతో మరల భూమిని నశింపచేయనన్న ఆ నిత్య నిబంధనకు గురుతుగా దేవుడు ఇంద్ర ధనుస్సునుంచారు (8-9). 

డి) జాతులు (10-11) 

జలప్రళయంతో నరుల పాపమును దేవుడు శిక్షించినప్పటికీ పాపము నశించలేదు. మానవులు దేవుని మీద తిరుగుబాటు చేసి తమను తాము హెచ్చించుకొనుటకు ఆరంభించారు. బబులోను ప్రాంతములో సాతాను ప్రేరేపితుడైన నిమ్రోదు నాయకత్వములో బాబేలు గోపురమును కట్టనారంభించారు. వారి గర్వము, నిర్లక్ష్యమును బట్టి దేవుడు మానవులకు తీర్పు తీర్చి ఒకటైయున్న వారి భాషను తారుమారు చేసి భూమి యందంతట వారిని చెదర గొట్టారు. ప్రపంచములోని వివిధ జాతులకు బహుశా మూలం/ఆరంభం ఇదే అయుంటుంది. 

రెండవ భాగము : 12-50 అధ్యాయములు : నలుగురు పితరుల వృత్తాంతము 

ఆదికాండము యొక్క మొదటి భాగములోని 11 అధ్యాయములు 2000 సంవత్సరముల ప్రపంచ చరిత్రను వివరిస్తే, ఈ రెండవ భాగములోని 39 అధ్యాయములు అబ్రహాము, అతని సంతతిని గూర్చిన 350 సంవత్సరముల చరిత్రను తెలియచేస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, సృష్టి ఆరంభమును గూర్చిన వివరణకంటే అబ్రహాము కుటుంబమును గూర్చి దేవుడు ఎక్కువ వివరణ ఇచ్చారు. 

ఈ భాగములో నలుగురు ముఖ్యులను గూర్చి చదువుతాము – అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, అబ్రహాము యొక్క పిలుపు, అతనితో దేవుడు చేసిన నిబంధన, అతని విశ్వాసము, దేవునితో మరియు మనుష్యులతో యాకోబు యొక్క పోరాటములు, యోసేపు యొక్క అదర్శప్రాయమైన జీవితము, దేవుని వాగ్దానములు నెరవేర్పు మొదలుగు ముఖ్యమైన అంశములను ఈ భాగములో మనము చదువవచ్చు. పితరుల జీవితములలోని కొన్ని. సంఘటనలు యేసుక్రీస్తుకు, ఆయన విమోచనా కార్యమునకు. ముంగుర్తులుగా ఉన్నాయి. పితరుల జీవితములు నమ్మకత్వం, విశ్వాసము, మోసము, విదేయత, దేవుని సంరక్షణ మొదలగు అంశములను గూర్చిన పాఠములను బోధిస్తాయి. వీటిని చదువుతూ ఉండగా ధ్యానిస్తూండగా దేవుని స్వరమును విని, మీ వ్యక్తిగత జీవితములకు, పరిచర్యకు ఆ మాటలను, పాఠమును అన్వయించుకోగలరు. 

ఎ) అబ్రహాము (12-24) 

కల్దీయుల ఊరను పట్టణస్థుడైన అబ్రహామును దేవుడు విలువగా అతడు విశ్వాసముతో దేవుని పిలుపునకు స్పందించి, లోబడి తాను స్వాస్యముగా పొందనైయున్న ప్రదేశమునకు – అది ఏదో ఎరుగనప్పటికి – బయలుదేరాడు. (హెబ్రీ 11:8) అబ్రహామును పిలచుటలో సర్వమానవాళి కొరకైన విమోచనా ప్రణాళికను సిద్ధింప చేయు నిమిత్తము దేవుడు ఒక వ్యక్తిని మరియు జనాంగమును (యూదులు) ఎన్నుకున్నట్లయ్యింది. దేవుడు అబ్రహాము తో నిబంధన చేసారు. ఈ నిబంధనలో ఏడు వాగ్దానములు ఉన్నాయి (ఆది. 12:2-3). అవి : 

  • – నిన్ను గొప్ప జనముగా చేస్తాను 
  • – నిన్ను ఆశీర్వదిస్తాను 
  • – నీ నామమును గొప్ప చేస్తాను 
  • – నీవు ఆశీర్వాదముగా నుందువు 
  • – నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను 
  • – నిన్ను దూషించువారిని శపించెదను 
  • – భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును 
  • మరోవిధంగా చూస్తే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో, 
  • – వ్యక్తిగతముగా అబ్రహాము కియ్యబడిన వాగ్దానము (నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేయుదును. ఆది. 12:2). 
  • – ఒకజాతిగా ఇశ్రాయేలుకియ్యబడిన వాగ్దానము (నిన్ను గొప్ప జనముగా చేసి (ఆది 12:2) కనానును వారికి స్వాస్థ్యముగా ఇస్తానన్న వాగ్దానము. ఆది. 15:7, నెహెమ్యా 9:7,8). 
  • – ఆత్మీయ ఆశీర్వాదములు / రక్షణను గూర్చిన సార్వత్రిక వాగ్దానము (భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. ఆది 12:3) ఉన్నాయి. 

అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు సూచనగా సున్నతి పొందవలెనని దేవుడు ఆజ్ఞాపించారు (ఆది. 17) అబ్రహాము విశ్వాసంతో జీవించాడు. దేవునితో కూడ నడిచాడు. వాగ్దాన ప్రకారం దేవుడు అతనిని గొప్ప చేసారు. దేవుని యందు విశ్వాసముంచి, అది అతనికి నీతిగా ఎంచబడుట ద్వారా అబ్రహాము రక్షింపబడినాడు. (ఆది 15:6; రోమా 1:3, గలతీ 3:6). అబ్రహాము, అతని భార్యయైన శారా అవిశ్వాసంతో దాసియైన హాగరు ద్వారా కుమారుని పొందారు. (ఆది 16) అతని. పేరు ఇష్మాయేలు. ఇతడే అరబ్బుల పితరుడు. తరువాత దేవునియందు విశ్వాసముంచి, అబ్రహాము, శారాలు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును కన్నారు. అబ్రహాము విశ్వాసమునకు చిట్టచివరి పరీక్షగా దేవుడు ఇస్సాకును ‘బలి అర్పించమని అడిగారు (ఆది. 22). కుమారుని బలిగా అర్పించుటకు అబ్రహాము సిద్దపడినప్పటికి చివరి క్షణంలో దేవుడు. పొట్టేలును ఏర్పరచారు. మన పక్షముగా, మనపాపముల ప్రాయశ్చిత్తార్ధమై తండ్రియైన దేవుడు కుమారుడైన క్రీస్తును బలి అర్పించుటకు ఇది ముంగుర్తుగా ఉన్నది. 

బి) ఇస్సాకు (25-26) 

ఇస్సాకును గొప్ప తండ్రి (అబ్రహాము) యొక్క సామాన్య కుమారునిగాను, గొప్ప కుమారుని (యాకోబు) యొక్క సామాన్య తండ్రి గాను వర్ణిస్తారు. (Isaac has been described as the mediocre son of a great father (Abraham) and mediocre (సామాన్య సామర్ధ్యం కల) father of a great son (Jacob). అతని జీవితంలోని ముఖ్య సంఘటనలు క్రింది ఐదు ప్రాంతములలో జరిగాయి. 

  • మోరియా- పర్వతం మీద (ఆది. 22:1-14) – విధేయతగల కుమారుడు (submissive son)
  • హెబ్రోను పొలములో 24:61-67, 25:9-11, 19-26 – సౌమ్యుడైన వరుడు (Gentle groom)
  • ఫిలిష్తీయుల దేశములో (26:1-14) తండ్రిని అనుసరించిన కుమారుడు (the copycat)
  • అరణ్యములోని బావులవద్ద 26:15-34 – కష్టించుటకు సిద్ధపడిన పనివాడు (the willing worker)
  • స్వంత ఇంటిలోని భోజనపు బల్లవద్ద 27:1-45 నిస్సహాయుడైన తండ్రి (frustrated father)

సి) యాకోబు (27-36) 

అబ్రహాముతో తాను చేసిన నిబంధనలోని వాగ్దానముల కొనసాగింపు నిమిత్తము దేవుడు ఇస్సాకు ఇద్దరు కుమారులలో యాకోబును యాకోబు జీవితంలోని అతి ప్రాముఖ్యమైన సంఘటన యబ్బోకు నదీ తీరమున జరిగింది. అక్కడ యాకోబు దేవునితో ఎంచుకున్నారు. పెనుగులాడాడు. నీవు దేవుని తోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి కనుక ఇకమీదట నీపేరు ఇశ్రాయేలేగాని యాకోబు అసబడడని దేవుడు యాకోబుతో చెప్పారు (32:28). యాకోబు అనగా మోసగాడు మాత్రమేకాక మనుష్యులతో పోరాడి గెలుచువాడు అని అర్ధం కూడా వుంది. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలుచువాడు అని అర్ధం. స్వంత ప్రయత్నంతో ఆశీర్వదింపబడదామని భావించిన యాకోబు, నిజమైన దీవెన దేవుని నుండి వస్తుందన్న పాఠమును యబ్బోకు రేవు వద్ద ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నేర్చుకున్నాడు. దేవునితో జరిగిన పోరాటములో తనని తాను దేవునికప్పగించుకుని ఆత్మీయంగా బలవంతుడయ్యాడు. యాకోబుకు లేయా, రాహేలు ద్వారా 12 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. – ఈ పండ్రెండు మంది ఇశ్రాయేలు 12 గోత్రములయ్యారు. యాకోబు బేతేలుకు తిరిగివచ్చిన తరువాత అతని నూతన నామము ఇశ్రాయేలును, దీవెనలను దేవుడు స్థిరపరచారు. (35:6-15) 

డి) యోసేపు (37-50) 

యాకోబు యొక్క పదకొండవ కుమారుడైన యోసేపుకు కలలకు అర్ధము చెప్పు వరమును దేవుడనుగ్రహించారు. సహోదరులు యోసేపును మిద్యానీయులైన వర్తకులకు అమ్మివేయగా, వారు అతనిని ఐగుప్తుకు తీసికొని పోయి, ఫరో యొక్క ఉద్యోగస్థుడును, రాజ సంరక్షక సేనాధిపతియైన ప్రోతీఫరునకు అమ్మి వేస్తారు..(37). అయితే సార్వభౌముడైన దేవుడు యోసేపును ఐగుప్తులో వర్ధిల్లచేసి కరువు కోరలనుండి యాకోబు కుటుంబమును (హైబ్రి జాతిని విడిపించుటకు యోసేపును వాడుకున్నారు. యోసేపుతో కలిసి 70మంది ఐగుప్తుకు తరలివచ్చారు. అక్కడ వారు 400 సం॥లు ఐగుప్తీయులకు బానిసలుగా జీవించారు. 

యోసేపు మరణించి సమాధిచేయబడుటతో ఆదికాండములోని పితరుల వృత్తాంతములు ముగించబడ్డాయి. దేవునిచే ఏర్పరచబడిన జనాంగమైన అబ్రహాము సంతానము ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పటికి తమపితరుడైన అబ్రహామునకు వాగ్దానము చేసిన దేశమునకు దేవుడు తమను తీసుకువెళ్లు సమయం కొరకు వారు నిరీక్షిస్తూ ఉన్నారు. ఈ నిరీక్షణ ఎలా ఫలించిందో నిర్గమ కాండంలో చదువుతాము. 

ప్రసంగ శాస్త్రం meteriyal కొరకు .. click here 


Disclaimer:
The content on biblesamacharam.in website  is for educational purposes only. We do not claim ownership or authorship of material gathered from external sources or the internet. Our use of such information is intended solely for learning and is in line with the fair use provisions under the Indian Copyright Act, 1957.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!