యిర్మీయా గ్రంధ వివరణ.
The Book of Jeremiah
యిర్మీయా పెద్ద ప్రవక్తలలో రెండవవాడు. పెద్ద ప్రవక్తలు నలుగురు ఉన్నారు. వారెవరనగా యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. వీరు పుస్తక పరిమాణములను బట్టి పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. యిర్మీయా కన్నీటి ప్రవక్త అనియు, విలపించు ప్రవక్త అనియు పిలువబడ్డాడు. క్రీ.పూ. 6వ శతాబ్దపు కన్నీటి ప్రవక్తగా ఇతడు ప్రసిద్ది చెందాడు. బైబిలులో 8 మంది యిర్మీయాలు కలరు.
1) పరాక్రమశాలియైన యిర్మీయా – 1 దిన 12:4; 2) గాదీయులలో పరాక్రమశాలియైన యిర్మీయా 1దిన 12:10; 3) గాదీయులలో మరొక పరాక్రమశాలియైన యిర్మీయా – 1 దిన 12:13; 4) మనషే గోత్రానికి చెందిన యిర్మీయా – 1 దిన 5:24; 5) యెహోయాహాజు యొక్క తాతగారైన యిర్మీయా – 2 రాజులు 23:31; 6) రేకాబీయుడైన యిర్మీయా – యిర్మీయా 35:3; 7) జెరుబ్బాబేలుతో బయలుదేరి వచ్చిన లేవీయుడైన యిర్మీయా – నెహెమ్యా 12:1; 8) మన కథానాయకుడైన యిర్మీయా . యిర్మీయా 1:1.
దేవుని ప్రజలు తమ పాపములను, చెడునడత విడిచి దేవునివైపు తిరుగుట అనే అంశము ఈ గ్రంథములో మనకు కనిపించే ప్రాముఖ్యమైన సంగతి.
యిర్మీయా యెరూషలేముకు రెండు మైళ్ళ దూరములో నున్న అనాతోతు గ్రామ కాపురస్తుడు. యాజకుడైన హిల్కీయా కుమారుడు. యిర్మీయా అనే పేరునకు యెహోవా విసర్జించును, లేదా యెహోవా హెచ్చించును అను భావములు కలవు. నిజానికీ ఈ గ్రంథములో మనకు కనిపించునది కూడా అదే – దేవుణ్ణి ఎవరు విసర్జిస్తారో వారిని దేవుడు విసర్జిస్తాడు అనేది ఈ గ్రంథ సారాంశము. యిర్మీయా తల్లి గర్భము నుండియే దేవుని చేత, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన ప్రవక్త.
యిర్మీయా దేవుని ప్రేమ రుచి యెరిగినవాడు. ప్రజల అవిధేయత, వారి పతనావస్థను చూచి గుండె పగిలినవాడై తన కన్నులను జలమయముగాను, కన్నీటి ఊటగాను చేసుకొనిన దైవజనుడు. యిర్మీయా, జెఫన్యా, హబక్కూకు, దానియేలు, యెహెజ్కేలు ప్రవక్తలందరు సమకాలికులు. పెందలకడనే లేచి ప్రకటించుటను గూర్చి యిర్మీయా గ్రంథంలో 11 సార్లు కలదు.
యిర్మీయా చెప్పుచుండగా బారూకు ఈ గ్రంథాన్ని రాసాడు. ఇతని ప్రవచనములు చాలా కఠినములే గాని హృదయము మాత్రము అతి కోమలముగా ఉండును. మెడవంచని యూదా ప్రజలకు కఠిన శిక్ష, కారాగారము పడబోవుచున్నదని నలభై సంవత్సరములు కఠిన శ్రమ, నింద, అవమానములను భరించి ప్రకటించిన ప్రవక్త. దేవుని ప్రజల భక్తిహీనమైన దుస్థితిని చూచి హృదయము పగిలిన వాడై వ్రాసిన వ్రాతలు కూడా ఒక వరుస క్రమములో లేకుండా చెల్లాచెదురుగా నున్నట్లు గ్రంథమంతా మనం చదివినప్పుడు మనకు అర్థం అవుతోంది.
యిర్మీయా దేవుని పనిలో ఎన్నో శ్రమలు-దెబ్బలు అనుభవించిన వాడు, బొండాలలో బిగించబడ్డాడు (20వ అధ్యాయం). హింసింపబడి చావునకు వదిలివేయ బడ్డాడు (26వ అధ్యాయం). అనేక సార్లు బందీ గృహశాలలో వేయబడ్డాడు (37, 38 అధ్యాయాలు). యూదావారికి ఒక క్రియా పూర్వకమైన పాఠముగా నెలకొనునట్లు దేవుని సంకల్పము ప్రకారం వివాహము చేసుకొనకుండా బ్రహ్మాచారిగానే ఉండిపోయాడు (16:2).
యిర్మీయా ఏలీయా యంతటి శక్తిగల ప్రవక్త కాకపోయినా, యెషయా వంటి వాగ్ధాటి గలవాడు కాకపోయినా, యెహెజ్కేలు వలె సెరాపులను చూచినవాడు కాకపోయినా – దీనుడుగాను, నిస్సహాయుడుగాను దేవుని మీద ఆధారపడి, దేవుని మాటలను నమ్మకంగా, ఎదిరింపులకు భయపడకుండా ప్రకటించాడు. రాజ్యచరిత్ర, స్వీయచరిత్ర మరియు ప్రవచనములు మిళితమైయున్న ఈ గ్రంథము కీర్తనల గ్రంథము యొక్క పోలికను తలపిస్తోంది.
యిర్మీయా యూదా రాజైన యోషీయా పరిపాలనలో 13వ సంవత్సరమున దేవుని పిలుపును పొంది దక్షిణ రాజ్యానికి ప్రవక్తగా నియమించబడటం దేవుని అనాది సంకల్పం. మొదట యిర్మీయా తన పిలుపును నిరాకరించాడు. మోషే చెప్పినట్లు సాకులు చెప్పాడు (నిర్గమ 3,4 అధ్యాయాలు). నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదు అన్నాడు యిర్మీయా (1:6). కాని దేవుడు అతనికి హామీని, నిశ్చయతను ఇచ్చాడు. ఈ దినాల్లో చాలామంది దేవుని పిలుపును పొందినపుడు తప్పించుకొనుటకు ప్రయత్నిస్తున్నారు. తమకు శక్తి సామర్థ్యాలూ, జ్ఞానం, ధైర్యం, డబ్బు, పలుకుబడి… ఇంకా ఏదేదో లేవని చెబుతారు.
మూడు విధాలైన పరిచర్య యిర్మీయా జరిగించాడు. 1. యూదయలో విడువబడిన అధిక సంఖ్యాకులను, రాబోయే బబులోను చెరను గూర్చి హెచ్చరించాడు. 2. అంతకు ముందే బబులోను చెరకు కొనిపోబడిన అల్ప సంఖ్యాకులను ఉత్తరం ద్వారా ప్రోత్సహించాడు. 3. అన్యదేశాలకు కలుగబోయే తీర్పును గూర్చి ప్రకటించాడు.
ఇతని సందేశం ఇతర ప్రవక్తల సందేశం వంటిది కాదు. అది ప్రజలకు ప్రతికూలమైనది, అయిష్టమైనది గనుక అనేకుల చేత తృణీకరించబడ్డాడు. ప్రజలు దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే బబులోను రాజుకు దాసులుగా ఉండాలని చెప్పాడు; అయితే అందువల్ల అతడు ప్రజల దృష్టిలో విశ్వాస ఘాతకునిగా ఎంచబడ్డాడు (34వ అధ్యాయం, 38:17-23). సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది.
యూదా ప్రజల మధ్య కొన్ని మత సంస్కరణలు జరిగించిన యోషీయా పాలనలో యిర్మీయా సేవ ప్రారంభమైంది. క్రీ.పూ. 638 – 608 మధ్య కాలంలో అన్నమాట. యిర్మీయా 1 నుండి 6 అధ్యాయాలలో బహుశ సంస్కరణకు పూర్వ స్థితిని యిర్మీయా వర్ణించి ఉండవచ్చు. యోషీయా తరువాత యెహోయాహాజు రాజయ్యాడు. ఇతనికి షల్లూము అనే పేరు కూడ ఉంది. ఇతన్ని ఐగుప్తుకు తీసుకుపోయారు.
అతని తరువాత రాజైన యెహోయాకీము పాలనలో కీలకమైన కర్కెమీషు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఐగుప్తురాజైన ఫరోనెకో, బబులోను రాజైన నెబుకద్నెజరుకు లొంగిపోయాడు. అంతటితో పశ్చిమ ఆసియా ప్రాంతం బబులోను అధికారంలోకి వచ్చింది. యెహోయాకీము బబులోనుపై తిరుగుబాటు చేసాడు. యిర్మీయా అతణ్ణి ఈ విషయంలో గద్దించినందువల్ల బాధల పాలయ్యాడు (11:18, 12:6, 15:15, 20:2, 26:10, 36:7). ఆ రాజు చివరికి దుర్మరణం పాలయ్యాడు. యిర్మీయా మాత్రం పట్టువిడువక తన సేవను కొనసాగించాడు. తర్వాత యెహోయాకీను రాజ్యానికి వచ్చాడు. ఇతణ్ణి కొన్యా, యెకొన్యా అని కూడా పిల్చారు. ఇతడు మూడు నెలలే ఉన్నాడు. యిర్మీయా ముందుగా ప్రవచించిన రీతిగా శత్రువులు అతణ్ణి బబులోనుకు తీసుకెళ్లారు (2రాజులు 24:8 – 12).
అప్పుడు నెబుకద్నెజరు యోషీయా చిన్న కొడుకైన సిద్కియాకు సింహాసనం అప్పగించాడు. అతడు కూడా తిరుగుబాటు చెయ్యాలని కోరగా యిర్మీయా వ్యతిరేకించాడు (యిర్మీయా 27 అధ్యా). అయినా వినకుండా ఐగుప్తు రాజైన ఫరోహోఫ్రాతో సంధి చేసాడు. ఫలితంగా బబులోను యెరూషలేమును ముట్టడించింది. బబులోనీయులకు లొంగిపొమ్మని ప్రోత్సహించిన యిర్మీయాను రాజద్రోహిగా ప్రకటించి చెరసాలలో వేయిచారు (34వ అధ్యాయం, 37:3, 11; 38:1). చివరకు క్రీ.పూ. 587లో బబులోను యెరూషలేమును ధ్వంసం చేసాక, నెబుకద్నెజరు యిర్మీయాను దయగా చూసాడు. కాని తిరుగుబాటు దారులు గెదల్యాను హత్యచేసిన తరువాత తక్కిన జనం యిర్మీయాను తమతోపాటు ఐగుప్తు రమ్మని బలవంతం చేసారు (42:44). యిర్మీయా ప్రవచించిన కాలం మరియు ఆ కాలంలోని పరిపాలకుల వివరాలు యిలా సాగిపోయాయి.
యిర్మీయా కాలం నాటి యూదయ పరిస్థితి కూడా మన చూద్దాం. యిర్మీయా ప్రవచించే కాలం నాటికీ అష్షూరు సామ్రాజ్యం విచ్ఛిన్నమైనది. ఆధిపత్యం కోసం పోరాడుతున్న బబులోను – ఐగుప్తు రాజ్యాల మధ్య యూదా చిక్కుబడింది. యిర్మీయాకు ఒక శతాబ్దము ముందు ప్రవచించిన యెషయా – బబులోనును ఎదిరించమన్న సందేశం ఇచ్చాడు. కాని యిర్మీయా ప్రజలకు లొంగిపొమ్మని సందేశమిచ్చాడు. ఎందుకీ మార్పు వచ్చింది? దేవుని జనాంగం విసర్జించబడి, విడిచిపెట్టబడే స్థితికి దిగజారిపోయింది. ఇక దేవుని తీర్పు తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి అప్పగించుకోవడం తప్పనిసరి అయింది. దేవుని లెక్క ప్రకారం ఇశ్రాయేలు జాతి సమయం అయిపోయింది (15:1).
అన్యజనుల కాలం ప్రారంభమైనది. కాబట్టి తీర్పు అనివార్యమైంది. దానియేలు 2వ అధ్యాయంలోని ప్రతిమ యొక్క బంగారు శిరస్సుకు చిహ్నంగా నున్న బబులోను అప్పటికే ఆధిక్యత వహించనారంభించింది. తద్వారా దానియేలు పలుకబడిన ప్రవచన నెరవేర్పు ప్రారంభమైనది. యూదావారు 70 సం॥లు బబులోను చెరలో ఉంటారని ముందుగానే చెప్పబడింది (25:9-12).
ఏది ఏమైనా ఈ చీకటి వెనుకనున్న వెలుగును గూర్చి కూడా యిర్మీయా ప్రవచించాడు. ఇశ్రాయేలుకు భవిష్యత్తులో కలుగబోయే మహిమాన్వితమైన స్థితిని గూర్చి యిర్మీయా చెప్పినట్లు మరి యే ప్రవక్త చెప్పలేదు.
యిర్మీయా గ్రంథ విశిష్టత మరియు ముఖ్యాంశాలలోకి వెళితే…
యిర్మీయా గ్రంథ ప్రధాన సందేశం బబులోను చెరనుగూర్చినది. ప్రమాదకరమైన గందరగోళ పరిస్థితులలో యిర్మీయా ఈ దైవ వాక్కులు పలికాడు. నైతిక, ఆధ్యాత్మిక విధులు నెరవేరుస్తూ దేవునితో ఆత్మీయ సంబంధం కలిగి ఉండేదే సర్వశక్తిమంతుడైన దేవుడు కోరుచున్న జీవన విధానమని వక్కాణించడంలో యిర్మీయా ప్రాముఖ్యత, విశిష్టత కనిపిస్తోంది. యేసు ‘నీతి చిగురు” గా ఈ గ్రంథంలో పలుమార్లు ఉదహరింపబడ్డాడు (23:5, 33:15).
విశ్వాస భ్రష్టత్వం గూర్చి ఎక్కువ పర్యాయాలు నొక్కి చెప్పబడింది. ఈ అంశం సామెతల గ్రంథంలో ఒకసారి హోషేయలో 3 సార్లు, యిర్మీయాలో 13 సార్లు పేర్కొనబడింది.
బబులోను చెర ఈ గ్రంథం యొక్క ప్రధాన అంశం. 70 సం॥ల బబులోను చెరను గూర్చి యిర్మీయా చెప్పిన ప్రవచనం ఇశ్రాయేలు చరిత్రలో పలుమార్లు జ్ఞాపకం చేసుకోబడింది (దానియేలు 9:1, 2దిన 36:21, 22; ఎజ్రా 1:1).
బబులోను దేశమును గూర్చి బైబిలులోని ఇతర పుస్తకాలన్నిటిలో ఎక్కువసార్లు, అనగా 164 సార్లు ప్రస్తావించబడింది. ఆ కాలంలో చరిత్ర ప్రకారం భౌగోళికంగా ఉన్న రాజ్యమైన బబులోను గూర్చిన మరియు భవిష్యత్తులో సూచనగా ఉపయోగించబడిన బబులోనును గూర్చి (ప్రకటన 18:18) యిర్మీయా ప్రవచించాడు (యిర్మీయా 50,51 అధ్యాయాలు).
యిర్మీయా ప్రజలను ఎంతగా హెచ్చరించిన మారకపోగా, తిరుగుబాటు చేసారు. ఆ కాలంలో రాబోతున్న దేవుని తీర్పును గురించిన అతని ప్రవచనాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అందువల్ల యెరూషలేము, మందిరం మరియు యూదా రాజ్యం మొత్తం పూర్తిగా ధ్వంసం అయ్యింది.
యిర్మీయా యొక్క సౌమ్యత అతనికి కలిగిన శ్రమను మరింత ఎక్కువచేసింది. యిర్మీయా జీవితాన్ని ఫార్లేగారు రాస్తూ – “ఇంతవరకూ ఏ మానవ మాత్రుడూ యిర్మీయా వలె తీవ్రమైన వేదనను, భారాన్ని మోయలేదు. యూదా చరిత్ర అంతటిలో చూసినా యిర్మీయా ప్రవక్త జీవితంలో కనిపించే తీవ్రమైన నమ్మకత్వం, ఎడతెరిపిలేని శ్రమ, దేవుని సందేశాన్ని వినిపించడంలో నిర్భీతి, తన ప్రజల కోసం విరామం లేని విజ్ఞాపనలు మరెక్కడా కనిపించవు. అయితే అతని జీవితంలో విషాదకరమైన సంగతేమిటంటే అతడు చెవిటివారికి బోధించినట్లయింది. తన స్వంత ప్రజల పట్ల అతడు చూపిన ప్రేమకు బదులుగా కేవలం వారి తిరస్కారాన్ని, అసహ్యతను అతడు అనుభవింంచాడు”. అని అన్నాడు.
యూదాకు దాదాపు 20 సంవత్సరాలు ప్రవచించిన తర్వాత ఈ సందేశాలను గ్రంథ రూపంలో పెట్టవలసిందిగా దేవుడు ప్రవక్తను ఆదేశించాడు. తన ప్రవచనాలను నమ్మకమైన తన పరిచారకుడు బారూకు చేత యిర్మీయా గ్రంథస్థం చేయించాడు (36:1-4). రాజు ఎదుటికి రాకుండా యిర్మీయా పై నిషేధం ఉంది కనుక యిర్మీయా ప్రవచనపు చుట్టను రాజమందిరంలో చదవడానికి బారూకును పంపించాడు. ఆ తరువాత రాజైన యెహోయాకీము ఎదుట దాన్ని ఎహూది చదివి వినిపించాడు. రాజు – యిర్మీయా పట్ల, దేవుని లేఖనాల పట్ల తన తిరస్కారాన్ని వ్యక్తం చేస్తూ ఆ పుస్తకపు చుట్టను ముక్కలుగా కోసి దాన్ని కాల్చివేశాడు (36:22-23). యిర్మీయా దాన్ని బారూకు చేత మళ్లీ వ్రాయించి మొదటి చుట్టలోని ప్రవచనాలకంటే మరి ఎక్కువ కలిపాడు. బహుశ ఈ బారూకే యిర్మీయా చనిపోయిన కొద్దికాలం తర్వాత ఈ గ్రంథాన్ని దాని చివరి రూపంలోకి తెచ్చి ఉంటాడు.
యెహెజ్కేలులాగా యిర్మీయా కూడా తన సందేశాన్ని వివరించడానికి అనేక రకాల దృష్టాంతాలను, రూపకాలను, అలంకారాలను వాడాడు. ఉదాహరణకు…
పనికిరాని నడికట్టు (13:1-14)
కరువు కాలం (14:1-9)
పెండ్లి గూర్చిన నిషేధం (16:1-9)
కుమ్మరి మన్ను (18:1-11)
పగిలిపోయిన కూజా (19:1-13)
రెండు గంపల అంజూరపు పండ్లు (24:1-10)
తన మెడపై నున్న కాడి (27:1-11)
తన స్వగ్రామంలో భూమిని కొనడం (32:6-15)
పెద్ద రాళ్లను పాతి పెట్టడం (43:8 – 13)
ఈ గ్రంథం ప్రాముఖ్యంగా యూదాను గూర్చి (2-29) అధ్యాయాలు, ఇంకా 9 అన్య దేశాల గూర్చి (46-51 అధ్యాయాలు) యిర్మీయా పల్కిన ప్రవచనాల కూర్పు.
దేవుడు అంతరంగమందు విధేయతను కోరునని యిర్మీయా ధృఢముగా బోధించాడు. అర్పణలు కాక విధేయత చూపుట దేవునికి ఇష్టమైనట్లు మిగతా ప్రవక్తల వలె ఇతడు కూడా బోధించాడు (యిర్మీయా 11:1-8, 1సమూ 15:22, యెషయా 1:11-17, ఆమోసు 5:21-24, మీకా 6:6-8).
- యిర్మీయాకును క్రీస్తుకును ఉన్న పోలికలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 1. యిర్మీయా ప్రవక్త (యిర్మీయా 1:5) – యేసుక్రీస్తు శక్తిగల ప్రవక్త (లూకా 24:19).
- యిర్మీయా యాజకుడు (యిర్మీయా 1:1) – యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు (హెబ్రీ 4:14).
- యిర్మీయా కన్నీటి ప్రార్థనా జీవితం గలవాడు (యిర్మీయా 9:1-2) – యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఉన్న దినములలో కన్నీటితోను మహా రోదనముతోను ప్రార్ధించాడు (హెబ్రీ 5:7).
- యిర్మీయా వాక్యం ప్రకటించేవాడు (యిర్మీ 1:9) – ప్రభువు సువార్త ప్రకటించాడు (లూకా 20:1).
- యిర్మీయా నిరపరాధి (యిర్మీయా 26:15) ప్రభువు నిరపరాధి (యోహాను 8:46).
- యిర్మీయా గోతిలోంచి తీయబడ్డాడు (యిర్మీయా 38:12) – యేసుక్రీస్తు సమాధి లోంచి లేపబడ్డాడు (మార్కు 16:9).
- కొట్టబడి శ్రమలు అనుభవించాడు యిర్మీయా (యిర్మీయా 20:2, 37:15) క్రీస్తును కొరడాలతో కొట్టి హింసించారు (మత్తయి 27:26).
ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి click here





