William Booth Biography In Telugu – విలియం బూత్ జీవిత చరిత్ర

విలియం బూత్ జీవిత చరిత్ర.

William Booth Biography In Telugu

విలియంబూత్ ఇంగ్లాండులోని “నాటింగ్ హామ్” లో ఒక సామాన్యమైన కుటుంబములో 1829 ఏప్రిల్ 10 వ తేదీన జన్మించెను. ఈయన తల్లి మంచి భక్తిపరురాలు. ఈయన తండ్రి కష్టపడి చాలా డబ్బు సంపాదించెను. గాని, దురదృష్ట వశాత్తు అది అంతా పాడైపోయినందున విలియంబూత్ పేదరికములోనే పెరిగెను. అతని చిన్న వయస్సులోనే అతని తండ్రి మరణించెను. అల్లరిగా పెరుగుచున్న విలియంబూత్ తన ఏడు సంవత్సరముల వయస్సులోనే పరిశుద్ధముగా ఉండాలని కొన్ని నిర్ణయాలు చేసుకొనెడివాడు. కాని, ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకొనలేక పోయేవాడు. తండ్రిలేనివాడిగా పెరుగుచున్న విలియంబూత్కు సరియైన విద్యాభ్యాసము కూడా దొరకలేదు. అయితే తన పదమూడవ యేట ఒకసారి దేవుని ఆలయంలో వాక్యం వింటూవుండగా, విలియం మనస్సాక్షి చేత గద్దింపబడి తన తల్లిదండ్రులకు అవిధేయుడైన విషయం, తన పాపముల విషయం పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందెను. 

 ఆలాగు తన యౌవన ప్రాయములోనే తన హృదయమును దేవుని కిచ్చెను. మోసం చేసి తెచ్చుకొన్న వస్తువులను తిరిగి ఇచ్చివేసి వారియొద్ద క్షమాపణ అడిగెను. అతని జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకొనెను. తాను రక్షింపబడిన క్రొత్తలో ‘జేమ్స్కగరీ’ అనే గొప్ప సువార్తికుడు చేసిన ప్రసంగాలను విన్న విలియంబూత్ లోతైన పరిశుద్ధత కొరకైన ఆకలి, ఆత్మల సంపాదన కొరకైన ఆరాటము పొందెను. అయితే, స్వతహాగా పిరికివాడైన బూత్ కూటములను జరిపించుటకు భయపడెను. అయినప్పటికి దేవుని వాక్యమును ఎక్కువగా పఠించుచు, ప్రార్థించుచు, దేవుని వాక్యము ప్రకటించుటకు సిద్దపడెను. వీథిమూలలో నిలువబడి వాక్యము చెప్పుచున్నప్పుడు మనుష్యులచే హేళన చేయబడెను. ఇటుకలతో కొట్టబడెను. అయినను నిరుత్సాహపడని విలియంబూత్ సువార్త సేవలో ఇతరులతో కలిసి ముందుకు సాగెను. 17 సంవత్సరముల వయస్సులోనే ప్రసంగీకునిగా పేరు పొందెను.
 విలియంబూత్కు పేద ప్రజలమధ్య సేవ చేయాలని గాఢమైన వాంఛ! విలియంబూత్ యొక్క జాలిగుండె, ఎంత ప్రయాస పడినా ఆకలి తీరని ఆ పేద ప్రజల పరిస్థితిని చూచినపుడు, భారముతో వారి కొరకు ప్రార్థించి, వారికి మంచి స్నేహితునిగా మెలిగెను. ఆ పేద ప్రజలు త్రాగుడు, వ్యభిచారము, జూదము వంటి దురలవాట్లకు బానిసలై మరింత పేదలగుట విలియంబూత్ గమనించి నప్పుడు వారికొరకు మరింత భారము కలిగి నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన యేసయ్య ప్రేమను వారిమధ్య చూపించుచు, వారిమధ్య ఒక ప్రత్యేకమైన సేవ చేయాలని వాంఛించెను. 

 విలియంబూతు అన్ని రీతులా తనతో సేవలో సహకరించే భక్తి కలిగిన కేథరిన్తో వివాహం ఆయెను. కేథరిన్, విలియంబూత్లు ఇద్దరూ జాన్వెస్లీ మొదలగు భక్తుల జీవితాలను చదువుచు, పరిశుద్ధ పరచబడిన జీవితము, హృదయశుద్ధి అను ప్రాముఖ్యమైన అంశములను ధ్యానించి, బోధించుచుండిరి. విలియంబూత్ పేద ప్రజలమధ్య సువార్తను ప్రకటించుటకు ఆసక్తి కలిగిన మరికొంత మంది క్రైస్తవులతో కలిసి మిషనెరీగా పనిచేయుటకు ప్రారంభించెను. 

 ఆయన భార్య కేథరిన్ కూడా సేవలో తనకు సరైన సహకారిగా ఉండెను. వీరికి 8 మంది పిల్లలు. వారందరు క్రీస్తుచే వాడబడాలని ప్రార్ధించెడివాడు. ఈయన సేవలో మారుమనస్సు పొందినవారిలో అనేకులు విద్య లేనివారే గాని, వారి సాక్ష్యములు శక్తి కలిగినవై అనేకులను మార్చుచుండెను. ఆయనతో ఉన్నవారు వాయిద్యములు చక్కగా వాయించగలిగి యుండిరి. వారందరు క్రీస్తు సైన్యముగా బయల్దేరి వీథులలోనికి వెళ్ళి సాతాను హస్తాలలో ఉన్న ఆత్మలను విడిపించి తెచ్చుచుండిరి.

 విలియంబూత్ “రక్షణ సైన్యము” అను సంస్థను స్థాపించెను. ఈయన ఒకే ఆలయములో గాక ఆయా స్థలములకు తిరిగి సువార్తను విత్తుచుండెను. కొన్ని సార్లు గుడారములు వేసి ఉజ్జీవ కూటములు జరిపినప్పుడు అనేకులు రక్షింపబడు చుండిరి. “Soup-soap-salvation” (ఆహారము-శుభ్రత-ఆత్మరక్షణ) అనే ధ్యేయంతో ఆయన సువార్త చెప్పుటయే గాక ఆ ప్రజలపట్ల శ్రద్ధ చూపించి వారి దేహ అవసరతలను తీర్చవలసిన బాధ్యత కూడా మనకుంది అని నిరూపించాడు. విలియంబూత్ పేదలను గూర్చి ఆలోచిస్తూ, వారి అవసరతలను గూర్చి ప్రార్థించెడి వాడు. 

 ఈయన భార్య కేథరిన్ ఈయనకు సేవలో అన్ని విధములా సహకరించెను. వీథుల్లో బోధించుట, బహిరంగ కూటములు, స్త్రీల మధ్య పరిచర్య వీరి దినములలో బహుగా కొనసాగుచుండెడివి. తల్లి-తండ్రి అని పిలువబడే బూత్ దంపతుల ద్వారా వేల వేల ఆత్మలు రక్షణలోనికి నడిపించబడిరి. వీరు అనేక పట్టణములు, గ్రామములు తిరిగి ప్రభువును ప్రకటించిరి. వీథులలోను, ఫ్యాక్టరీలలోను, మురికి వాడలలోను వీరి పరిచర్యలు విస్తరించెను. ఈ గొప్ప సేవ నేటికిని 90 దేశాలలో కొనసాగుచున్నది. 

 విలియంబూత్ గొప్ప సువార్తికుడుగాను, దేవుని ప్రేమను ప్రకటించువాడు గానే కాక, దేవుని ప్రేమను క్రియలలో చూపించెను. 1890 అక్టోబరు 4 వ తారీఖున, సేవలో తనకు కుడిభుజమువలె ఉన్న కేథరిన్ తనను విడిచి ప్రభువు సన్నిధికి వెళ్ళినప్పటికిని, ప్రభువు సేవలో ముందుకు సాగుటకు నిశ్చయించుకొనెను. విలియంబూత్ తన వృద్దాప్యములో 1904 నుండి 1907 వరకు ఇంచుమించు 5 వేల మైళ్ళు ప్రయాణం చేసి 400 మీటింగులలో ప్రసంగించెను. అంతము వరకు ప్రభువు కొరకు జీవించెను. చివరిగా విలియంబూత్ తన 83 సంవత్సరముల వయస్సులో 1912 ఆగష్టు 20 వ తేదీన తనను ప్రేమించిన ప్రభువు సన్నిధికి వెళ్ళెను. ఇంచుమించు అరువది వేల మంది ఆయన శరీర భూస్థాపన కార్య క్రమములో పాలుపొందిరి.


 మరిన్ని విషయాల కోసం.. Click Here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!